విప్లవ వీరుల వదిన దుర్గావతీ దేవి

3
13

[dropcap]మ[/dropcap]నకు భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ మొదలయిన విప్లవయోధులు, వారి వీరమరణం గురించి తెలుసు. వారి వెనుక వారి బాభీ (వదిన) ఉన్నారు. ఆమె వివిధ సందర్భాలలో వీరందరికీ వెన్నుదన్నుగా నిలిచారు. విప్లవ కార్యక్రమాలలో, బాంబుల తయారీలో, పోలీసుల కనుసన్నల నుండి తప్పించుకునేందుకు సాయం చేయడంలో ముందున్నారు. ఆ ప్రయత్నంలో అరెస్టయి జైలుశిక్షని అనుభవించారు.

ఈమె యునైటెడ్ ఫ్రావిన్స్ లోని అలహాబాద్‌లో ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి బంకా బిహారీ అలహాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారిగా పనిచేసేవారు.

ఈమెకి పదకొండేళ్ళ వయస్సులో భగవతీ చరణ్ వోహ్రాతో వివాహమయింది. భగవతీచరణ్ గొప్ప విప్లవకారుడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌తో సంబంధ బాంధవ్యాలు నెరపారు. ప్రచార కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించారు.

విప్లవసంస్థ నౌజవాన్ భారత సభకు ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ‘సేవ, బాధ, త్యాగం’ ఈ  సంస్థ యొక్క నినాదం.

1929లో లాహోర్‌లో ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు. ఈ గదిని బాంబుల తయారీ కర్మాగారంగా ఉపయోగించుకున్నారు. ఈ అన్ని కార్యక్రమాలతో దుర్గావతీ దేవీ భర్తకి చేదోడు వాదోడుగా ఉన్నారు ‘MEDE FOR EACH OTHER’ అన్నచందాన ఈమె భర్తతో కలసి, ఆయన నడిపిన అనుబంధ సంస్థలలో విప్లవ కార్యక్రమాలను నిర్వహించారు. భర్తకు తగ్గ భార్యగా ముఖ్యంగా విప్లవ పంథాలో నడవడం చాల గొప్ప విశేషం, కష్టం కూడా! అయినా ఈమె ‘ఈ క్లిష్ట మార్గంలో పయనించి, సంక్లిష్ట సమయాలలో ఆచరించి చూపి హింసావాదయుగంలో అగ్రస్థానాన నిలిపారు’. ఇందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. జతిన్‌దాస్ జైలులో నిరాహరదీక్ష చేసి మరణించారు. ఆయన అంత్యక్రియలకు ఈమె నాయకత్వం వహించారు. లాహోర్ నుండి కలకత్తా వరకు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

1926లో ప్రముఖ విప్లవ యోధుడు కర్తార్ సింగ్ 11వ బలిదానోత్సవాన్ని లాహోర్‌లో నిర్వహించారు. ఈమె ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రను నిర్వహించారు. లాహోర్‌లో జాన్. పి. సాండర్స్‌ను భగత్‌సింగ్, సహచరులు హత్య చేశారు. ఈ సమయంలో ఈ వీరులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈమె సాయం చేశారు.

1929లో అసెంబ్లీలో బాంబు విసిరిన సంఘటన భారతీయ విప్లవాత్మక హింసావాద కార్యక్రమాలలో ప్రసిద్ధి పొందింది. ఈ సంఘటన జరిగిన తరువాత భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్ గురులను అరెస్టు చేశారు. కేసు విచారణ తరువాత వీరికి ఉరిశిక్షను విధించారు. వీరిని విడుదల చేయించడం కోసం ఈమె 3000 రూపాయల విలువైన ఆభరణాలను అమ్మి వినియోగించారు. కాని ఫలితం దక్కలేదు.

దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆకాంక్షించారు. పంజాబ్ మాజీ గవర్నర్ లార్డ్ హేలీని హత్యచేయడానికి ఈమె వ్యూహరచన చేశారు ఈ ప్రయత్నంలో హేలీ తప్పించుకున్నారు. కాని ఆయన తోటి బ్రిటిష్ అధికారులు మరణించారు. పోలీసులు ఈమెను అరెస్టు చేశారు మూడు సంవత్సరాల పాటు జైలుశిక్షను విధించారు.

ఈమె నిర్వహించిన గొప్ప పని మరొకటి వుంది. ఈ భార్యభర్తలు ఢిల్లీ నగరంలోని కుతుబ్ రోడ్ లోని ఇంట్లో అద్దెకుండేవారు. ఆ ఇంట్లో విమల్ ప్రసాద్ జైన్ బాంబుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. పిక్రిక్ యాసిడ్, నైట్రోగ్లిజరిన్, పుల్మినేట్ ఆఫ్ మెర్క్యురీలని ఉపయోగించేవారు. అయితే బాంబుల తయారీ కార్యక్రమం బయటి ప్రపంచానికి తెలియకూడదు కాబట్టి ‘హిమాలయన్ టాయిలెట్స్’ పేరుతో బోర్డుని ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప కార్యక్రమం రహస్యంగా నిర్వహించాలంటే ఎంత ధైర్యసాహసాలు కావాలో మనం ఊహించుకోవచ్చు, ఈ బాంబుల తయారీ, ప్రయోగాలలోనే భర్తని పోగొట్టుకున్నారు. మళ్ళీ జైలులో నిర్బంధించబడ్డారు. 1935 లో విడుదలయ్యారు.

ఈ దంపతులకు ఒక కుమారుడు. అతని పేరు సచీంద్ర వోహ్రా. భారతదేశంలో విప్లవాత్మక హింసాయుగం ముగిసిన తరువాత తన కుమారునితో సహా ఘజియాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మెట్రిక్యులేషన్ చదివి ఉత్తీర్ణులయ్యారామె.

బాలికల విద్య కోసం ప్యారేలాల్ బాలికా పాఠశాలను నడపడం మొదలు పెట్టారు. కొంతకాలం భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు.

చివరకు అజ్ఞాతంగా ప్రశాంత జీవనాన్ని గడిపారు. 1999వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఘజియాబాద్ లోనే మరణించారు.

ఈ విధంగా ఒక విప్లవకారుడి భార్యగా, మిగిలిన విప్లవకారులకు వదినగా, విప్లవకార్య కలాపాలలో పాలుపంచుకున్న గొప్ప ధైర్యశాలిని దుర్గావతీ దేవి అలియాస్ దుర్గాబాభీ.

ఈమె జ్ఞాపకార్థం 17-10-2022 వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన స్టాంపుల ప్రదర్శనలో ఒక ప్రత్యేక కవర్‌ని విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ. ఈ కవర్ మీద ఈమె ముఖచిత్రాన్ని ముద్రించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here