రాచరికపు మర్యాద, ప్రజాస్వామిక ప్రవర్తన అచ్యుతరామరాజు గారి విశిష్టత

9
11

[కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుతరామరాజు సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 5-3-23న నిర్వహించిన గణపతిరాజు అచ్యుతరామరాజు శత జయంతోత్సవ ప్రారంభ వేడుకలలో మల్లాప్రగడ రామారావు గారు చదివిన ప్రసంగపాఠం.]

[dropcap]గ[/dropcap]ణపతిరాజు అచ్యుతరామరాజు గారిని (ఇకపై రాజుగారిని వ్యవహరిస్తాను) తలచుకుంటే పిల్ల తెమ్మెర సోకుతున్నట్టు ఉంటుంది నాకు.

నా పరిచయం మొదట రాజు గారి పేరుతో. అప్పట్లో అంటే 70 దశకంలో విశాఖ జిల్లా న్యాయస్థానం ఎదురుగా ఉండిన ఒక ఇంట్లో నా బంధువు ఒకరు కాపురం ఉండేవారు. మొదటిసారి వారింటికి నడుస్తూ వెళ్తుంటే, ఆ దారిలోనే ఉన్న ఒక ఇంటి గోడకు తగిలించిన నామఫలకంపై నా చూపు నిలిచింది. అందులో ‘గణపతిరాజు అచ్యుతరామరాజు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, అడ్వకేట్స్’ అని వ్రాసి ఉంది. అప్పటికే ‘అల్పజీవి’ చదివి ఉన్నాను. కానీ రాజు గారి పేరు ఎరుగను. విశాఖ రచయితల సంఘంలో సభ్యుడిగా కొన్నాళ్ళు ఉన్నప్పటికీ శాస్త్రి గారితో సాన్నిహిత్యం ఏర్పడలేదు గాని తరువాత కాలంలో రాజుగారి ఆప్తులలో ఒకడిని కాగలిగాను. అందుకు ఆరంభం ఎలాగంటే..

ఒక సిద్ధాంతానికే బద్దులై రచయితలు ఉండనవసరం లేదని భావించిన విశిష్ట రచయిత అంగర వెంకట కృష్ణారావు గారు ‘విశాఖ రచయితల సంఘం’ నుండి విడివడి 1971లో ‘విశాఖసాహితి’ ఏర్పరిచారు. వరిష్ఠ రచయిత ఘండికోట బ్రహ్మాజీ రావు గారిని అధ్యక్షులుగా, కొత్తగా రచనలు చేస్తున్న మమ్మల్ని, అంటే నన్ను, అంగర వెంకట శివప్రసాదరావు గారిని, ‘శివ్రాజు’ కలం పేరు గల వై.యస్ నూకరాజు గారిని, వరుసగా కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా నిర్ణయించారు.

రాజు గారిని గౌరవాధ్యక్షుడుగా అనుకుని, వారి సమ్మతి కోరుతూ ఒక లేఖ రాసి, అది రాజు గారికి అందజేయవలసిన బాధ్యత మా ముగ్గురికీ అప్పగించారు.

అప్పటికి మా ముగ్గురి వయస్సు పాతిక లోపే. మిగతా ముగ్గురూ నలభై దాటిన వారు. ప్రసిద్ధులు. పైగా రాజుగారు రాష్ట్ర శాసనమండలి సభ్యులు. బిక్కుబిక్కుమంటూ డాబా తోటలో ఉన్న రాజు గారి ఇంటికి ఒక సాయంకాలం మేం ముగ్గురం వెళ్ళాము.

రాజు గారిది గంభీర విగ్రహం.

ముఖమెత్తి మమ్మల్ని చూసి, మా వందనాలు స్వీకరించి ప్రసన్నంగా “రండి. కూర్చోండి” అన్నారు. నవ్వుతో విప్పారిన రాజు గారి ముఖం చూడగానే మా బితుకు పరుగో పరుగు.

మా పరిచయాలు చెప్పుకుని, విషయం వివరించి, ఉత్తరం అందించాము.

అచిరకాలం లోనే మేము స్నేహితుల మయ్యాము. ఒకటి రెండు సార్లు కలిస్తే, ఏ వయసు వారైనా, రాజుగారికి స్నేహితులు కాక తప్పదు. కవులు, కళాకారులు రాజు గారిని కలవడానికి వస్తే, అప్పటికే అక్కడ వేచి ఉన్న కక్షిదారులకు పడిగాపులు తప్పవు.

కృష్ణారావు గారి మరణానంతరం ‘విశాఖసాహితి’ బాధ్యతలు రాజుగారు పూర్తిగా చేపట్టారు. అందుకని వారిని మరింత తరచుగా కలిసేవాళ్ళం.

“సార్” అని వారిని పిలిచే పాపం మమ్మల్ని ఎవరిని చెయ్యనిచ్చేవారు కాదు రాజుగారు. కొత్తగా రాసే వారిని, ఏ కొంచెం ప్రతిభ కనబరిచినా, నెత్తికెత్తు కునేవారు. లోపాలుంటే నొచ్చుకోని రీతిలో చెప్పి ఒప్పించేవారు.

ఒక పరుషవాక్యం రాజు గారి నోట నేను వినలేదు. ఒక సందర్భంలో ప్రఖ్యాత రచయిత నవులూరి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు, పరుల విషయంలో రాజుగారు ఎప్పుడూ ఒక చెడ్డ మాట అనడం మేము ఎరగం.

రాచరికపు మర్యాదలు మాత్రం ఉండేవి. లోకానికి నేను మల్లాప్రగడని. రాజుగారికి మాత్రం మల్లాప్రగ్గడ. ఇంకా మాట్లాడితే, రామారావునీ కాదు. రామారాయని.

ఇతరుల పట్ల పట్ల రాజు గారి ప్రవర్తన అలా ఉండేది. ఇతరుల నుంచి అట్టి మర్యాదలు ఏనాడు ఆశించలేదు. భేషజాలు ఉండేవి కావు.

వారి స్వదస్తూరితో ‘విశాఖసాహితి’ సమావేశానికి హాజరుకమ్మని సభ్యులకి పోస్ట్ కార్డులు రాసేవారు.

మొక్కవోని ధైర్యం ఉండేది. అర్ధాంతరంగా ఒక కుమారుడు మరణించినా, క్యాన్సర్ బారిన పడినా, మేఘనిస్వనం లాంటి కంఠం గుసగుసగా మారినాన, ఎన్నికలలో ఓడినా, ఏమాత్రం తగ్గని జీవితోత్సాహం రాజు గారిది.

Sense of humour కీ తక్కువ లేదు.

సార్వత్రిక ఎన్నికలలో విశాఖ శాసనసభ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. ఎప్పటిలాగే ఫలితాలు తెలిసిన సాయంకాలమో, ఆ మర్నాటి సాయంకాలమో మిత్రులు కొందరం రాజు గారి ఇంటికి వెళ్ళాము. వారు గెలుస్తారని మేము అనుకోలేదు కానీ, ఏదో చెప్పబోయేటంతలో “నేనెలా గెలుస్తానండి, మా ఆవిడే నాకు ఓటు వేయలేదు” అన్నారు తెచ్చి పెట్టుకోని నవ్వుతో.

ఇంకో విషయం చెప్పాలి.

తన భావజాలాన్ని గాని రాజకీయ సిద్ధాంతాలను కానీ మాపై రుద్దే ప్రయత్నం రాజుగారు ఎప్పుడూ చేయలేదు. ‘విశాఖసాహితి’ ప్రారంభించిన కొత్తలో రచయితల వెంటబడి సంస్థలో చేరమనే వాళ్ళం. ఆ క్రమంలో ఒకసారి హిందూ రీడింగ్ రూమ్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్ మీద భమిడిపాటి రామగోపాలం గారు తారసపడ్డారు. నా సోదికి మొదట్లోనే అడ్డు తగిలి “రాజుగారు మీ సంస్థ అధ్యక్షుడు కదా. ఆ రంగు నేను రాసుకోలేను” అన్నారు. కొన్నాళ్ళకి ‘విశాఖసాహితి’ ఏ రంగూలేని సాహిత్య సంస్థ అని వారికే నిర్ధారణై రామగోపాలం గారు ‘విశాఖసాహితి’ తీర్థం పుచ్చుకున్నారు. రాజు గారికి అండా, దండా అయ్యారు. మళ్లీ విశాఖలో జరగని విధంగా రాష్ట్రం ఇంటా, బయటా ఉన్న ప్రముఖ రచయితలతో మూడు రోజుల సభలు విశాఖపట్నం సాంబమూర్తి కళామందిరంలో 1977 ఆగస్టు నెలలో నిర్వహించారు.

రాజు గారితో బంధం నేను విశాఖలో ఉన్నన్నాళ్ళు, అంటే 1978లో కార్మిక విద్యాధికారిగా రాజమహేంద్రి బదిలీ మీద వెళ్లే వరకు సాగింది. తర్వాత ఆ ఉద్యోగమూ వదలి యుపిఎస్‌సి ద్వారా ఎన్నికై కార్మిక రాజ్య బీమా సంస్థలో చేరడంతో దేశాలు పట్టవలసి వచ్చింది. మధ్య, మధ్యలో విశాఖపట్నం వచ్చినా, కొన్నిసార్లు మాత్రమే వారిని కలవడం కుదిరేది.

మళ్లీ 2009లోనే విశాఖ రాగలిగాను. 2004 లోనే రాజుగారు పరమపదించారు.

రాజమండ్రి నుంచి ప్రత్యేకం రెండు సార్లు రాజు గారి ఆహ్వానం మీద విశాఖపట్నం వచ్చాను.

ఒకసారి వారి షష్టిపూర్తి సంబరాలలో పాల్గొనడానికి. రెండోసారి.. ఇది ఎందుకు చెప్తున్నానో తరువాత మీకే తెలుస్తుంది.

ఒక రోజు రాజుగారి నుండి ఫోనాదేశం వచ్చింది వెంటనే విశాఖపట్నం రమ్మని.

విషయం కొంత తెలుసు నాకు. అంచేత ఆ సాయంకాలానికే విశాఖ చేరాను.

వేదిక మీద ఉన్నవారు: శ్రీ డివి సూర్యారావు, విమర్శకుడు, రచయిత శ్రీ జి ఎస్ ఎన్ రాజు, ఉపకులపతి, సెంచూరియన్ విశ్వవిద్యాలయo శ్రీమతి లలిత వాసిష్ట, కవి, అచ్యుతరామరాజు గారి కుమార్తె శ్రీ జె.వి అప్పారావు, పాత్రికేయుడు, రచయిత

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి ‘విశాఖసాహితి’ ప్రతినిధిగా ఎవరిని ప్రతిపాదించాలన్న అంశంపై ‘విశాఖసాహితి’లో అభిప్రాయ భేదం వచ్చింది. ఒక బృందం వారి ప్రతిపాదన రాజుగారు. రెండో బృందం వారి ఎన్నిక రామగోపాలం గారు. సభ్యులందరి సహృదయత కారణంగా, నా ప్రయత్నం ఫలించి, అకాడమీ వారికి రాజుగారి పేరే ప్రతిపాదించాలని ఏకగ్రీవంగా నిర్ణయించబడింది.

మరి కొన్నాళ్ళకి విశాఖపట్నం వచ్చినప్పుడు రాజుగారి కలిసాను. మాటలలో రామగోపాలం గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన విషయము వచ్చింది. అందుకు దోహదపడిన వారు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్‌గా గతంలో పనిచేసిన బి. కె. రావు గారు అనుకున్న నేను అదే మాట రాజు గారితో అన్నాను. బహుమతి పొందిన ‘ఇట్లు మీ విధేయుడు’ పుస్తకం రామగోపాలం గారు బికే రావు గారికే అంకితం ఇచ్చారు.

రాజుగారు చిరునవ్వుతూ, “కాదులెండి. వసంతరావు వెంకట్రావు గారి ద్వారా మనం ప్రయత్నించాం” అన్నారు. వెంకట్రావు గారు అప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు. ఇది ఎందుకు చెప్పానంటే నాకు తెలిసి కక్షలు, కార్పణ్యాలు లేని మనిషి రాజుగారు. తాత్కాలిక కోపావేశాలు ఉండొచ్చు.

రాజు గారి మీద ‘సంప్రదాయవాది’ అన్న ముద్ర ఉంది. కొంతవరకు నిజమే. కానీ మానవీయ విలువలున్న మనిషి రాజుగారు.

రాజుగారు మంచి కథకుడు. కవి. నాటక కర్త. నటుడు. న్యాయవాది. కార్మిక సంఘ నాయకుడు. రాజకీయవేత్త. పలు కళా సాహిత్య నాటక సంఘాలకు అధ్యక్షులు లేదా గౌరవాధ్యక్షులు. ఈ బహుపత్రాభినయం వలన ‘ఏ రంగంలోనూ రాణించ వలసినంత రాణించలేద’ని నా అభిప్రాయం. ఇవే మాటలు ‘విశాఖసాహితి’ కథా సంకలనం, ‘ప్రతిరూపాలు’ లో అనుకుంటాను, రాజు గారి గురించిన పరిచయ వాక్యాలలో రాశాను. ఆ మాటలు నాకు చదివి వినిపించిన రాజుగారు. “అలాగంటారా” అని మాత్రం అన్నారు. ఎలా చూసినా రాజుగారు సహృదయులు.

నేను రాజమహేంద్రవరంలో ఉన్న 8 ఏళ్లలో ఆరు సంవత్సరాలు చాలా విలువైనవి. అందుకు బీజం రాజుగారు వేసినదే.

ఆ విషయం, రాజు గారి మాటల్లో, ‘మనవి చేసి’ ఈ ప్రసంగం విరమిస్తాను.

విశాఖపట్నంలో ‘విశాఖసాహితి’ కార్యక్రమాలలోనూ, నా ఉద్యోగ జీవితం ప్రారంభించిన విశాఖ రేవులో గల విశాఖ రేవు కార్మిక సంఘంలోనూ, నా ఉద్యోగ వీధి అయిన కార్మిక విద్యా కార్యక్రమాలలోనూ అవిరామంగా పనిచేసిన నేను రాజమహేంద్రవరంలో ఉద్యోగానికే పరిమితమయ్యాను. కీర్తిశేషులు యాతగిరి శ్రీరామ నరసింహారావు గారు రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి చెందిన సాంఘిక సేవకులు. ‘ఆంధ్రకేసరి యువజన సమితి’ వ్యవస్థాపకులు. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలల స్థాపకులు నిర్వహకులు. రాజు గారిని అభిమానించడమే కాక వారి అభిమానాన్ని పొందినవారు. 1980 మొదటి అర్ధ సంవత్సరంలో వారిద్దరూ విశాఖలో కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో రాజుగారు “మల్లాప్రగడ రామారావు గారు కార్యదక్షుడు. మీకు ఉపయోగపడతారు. వీలైతే కలవండి” అన్నారట. రాజాజ్ఞ కదా. అలాగే తనకి వీలు కుదిరినప్పుడు నరసింహారావు గారు వారి స్కూటర్ మీద మా ఇంటికి వచ్చారు. నరసింహారావు గారి ప్రోత్సాహంతో నేను మళ్ళీ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో తలమునకలయ్యాను. ముఖ్యంగా చెప్పవలసింది 7, 8 ఏళ్లు వైభవంగా మనుగడ సాగించిన, ఇవాళ సాహిత్య గగనంలో ధ్రువతారలుగా వెలుగుతున్న ఎందరికో స్ఫూర్తినిచ్చిన, ‘సాహితీవేదిక’ ఆవిర్భావానికి, నిర్వహణకు అది దారి తీసింది. ఈ విధంగా ఆ తిలాపుణ్యంలో కళాప్రపూర్ణుల పిడికెడు కూడా ఉంది.

స్వస్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here