అద్భుత గాయని గీతాదత్

5
6

[dropcap]న[/dropcap]వంబర్ 23వ తేదీ  గీతాదత్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

హిందీ చిత్రసీమలో స్వర్ణయుగంలో విభిన్న వైవిధ్యభరితమైన పాటలను ఆలపించి ఆయా సినిమాలను సుసంపన్నం చేసిన నేపథ్య గాయని, కుటుంబ కలతలతో అనారోగ్యం పాలయి 41 ఏళ్ళ వయసులోనే మరణించినా, ఈనాటికీ ఆమె ఆలపించిన నవరసరాగాల గానాలు ప్రేక్షక శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆ తరపు జాజ్ సంగీతం, క్లబ్, క్యాబరే డ్యాన్స్‌ల పాటలు ఆమె స్వరంలో చిందులు వేసి, ప్రేక్షకుల చేత గెంతులు వేయించాయి. ఆమె దుర్గామాత భక్తి పాటలు భక్తిలో ముంచెత్తేవి. ఆ అమరగాయని గీతాదత్.

ఈమె 1930 నవంబర్ 23వ తేదీన నాటి బెంగాల్ ప్రెసిడెన్సీ నేటి బంగ్లాదేశ్‌లో ఫరీద్‌పూర్ జిల్లాలోని ఇదిలల్‌పూర్ ధనిక జమీందారీ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అమియాదేవి, దేబేంద్రనాథ్ ఘోష్ రాయ్ చౌదరి.

గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. అయితే పాఠాల పట్ల అంత శ్రద్ధ ఉంచేవారు కాదు. నది అలల పైన తేలియాడుతూ ప్రయాణీకులను పరవశింపజేసే పడవ సరంగుల హైలెస్స పాటలు, జానపద గేయాలు, ఈమెకు వంటబడ్డాయి. ఆ పాటలను కూని రాగాలు తీస్తూ ఆనందించేవారు. తరువాత సినిమా గ్రామఫోన్ రికార్డులను విని పాటలను రాగాలాపన చేసేవారు.

కుమార్తె సంగీతం పట్ల గల ఇష్టాన్ని గ్రహించారామె తల్లిదండ్రులు. తమ బంధువు హరేంద్రనాథ్ నంది వద్ద సంగీత పాఠాలు నేర్పించారు. అయితే బెంగాల్‌లో పరిస్థితులు తారుమారయ్యాయి. వీరి కుటుంబం 1942లో ముంబైకి తరలివచ్చింది. దాదర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

తమ ఇంటి బాల్కనీలో రాగాలాపన చేసేవారు గీత. ఈమె స్వరరాగాలాపనను ఆలకించారు కె.హనుమాన్ ప్రసాద్. ఆమెకి సంగీతంలో శిక్షణను అందించారు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న సినిమా పరిశ్రమకు ఆమెని పరిచయం చేయాలని సంకల్పించారు. తను సంగీత దర్శకత్వం వహిస్తున్న సినిమా పాటల ద్వారా ఆమెని హిందీ చిత్రసీమకి పరిచయం చేశారు.

1946లో ఐతిహాసిక కథా చిత్రం ‘భక్త ప్రహ్లాద’లో బృంద గీతంలో రెండు పాదాలు పాడించారు. ఇవే ఈమె హిందీ సినిమా రంగంలో ఎదగడానికి నాంది పలికాయి. “సునో సునో హరి కీ లీల”, “బాగ్ ఉఠే హమ్ జాగ్ ఉఠే”, బృంద గీతాలను కూడా ఈ సినిమా కోసం ఆలపించారు.

‘రసీలి’ సినిమా కోసం “ఆజారే నిందియా ఆజా” అనే జోల పాటని ఆలపించారు.

శ్రీ హనుమాన్ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఈమె ఆలపించిన ఈ చిన్ని చిన్ని పాటలే ఆమెని హిందీ చిత్రసీమలో నేపథ్య గాయనిగా స్థిరపడేందుకు, ఎదిగేందుకు దోహదం చేశాయి.

అదే సంవత్సరంలో బైరాంఖాన్ సినిమాలో “జబ్ చాంద్ జవాన్ హోగా తబ్ ఛాందినీ రాతోం మేఁ జన్నత్ కా సమా హోగా” పాటని షంషాద్ బేగంతో కలిసి ఆలపించారు. అప్పటి నుండి వారిద్దరి స్నేహం కొనసాగింది.

దిలీప్ కుమార్ నటించిన ‘మిలన్’ సినిమాలో “ఛాన్ మేఁ బజేగి బన్సూరియా”, “తుమే సాజన్ మనాయే తుమ్ రూఠ్ జానా” పాటలు ఈమె స్వరం నుండి పల్లవించాయి.

1947లో విడుదలయిన ‘దో భాయ్’ సినిమా ఈమె జీవిత గమనాన్ని మార్చింది. ఈ సినిమాలోని “మేరా సుందర్ సప్నా బీత్ గయా” పాట ఈమెని హిందీ సినిమా నేపథ్య గాయనిగా అంబరాన నిలిపింది. ఈ సినిమా ఈమె సినీ జీవితంలో గొప్ప మలుపు.

‘కాగజ్ కే ఫూల్’ సినిమాలోని “వక్త్ నే కియా క్యా  హసీన్  సితమ్ — తుం రహే న తుం, హం రహే న హం” పాటలోని ఆవేదనని బాధాతప్త స్వరంలో అలవోకగా వెలువరించారు. ప్రముఖ గజల్ గాయకులు శ్రీ జగ్జీత్ సింగ్ ‘Close to my heart’ అనే తన కార్యక్రమంలో ఈ పాటని ఆలపించి ప్రేక్షకులని అలరించడం ఈ పాట గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఈ పాటలు ఇప్పటికీ అజరామరాలే!

1947-1949 సంవత్సరాలలో హిందీ నేపథ్య గాయనిగా నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు భక్తి, విషాద, కరుణ రసాత్మక గీతాలను ఆలపించారు.

1951లో దేవానంద్ నిర్మించగా, గురుదత్ దర్శకత్వం వహించిన ‘బాజీ’ సినిమా విడుదలయింది. ఈ సినిమాలో “తద్బీర్ సే బిగ్డీ హుయ్ తక్‌దీర్ బనాదే” పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దేవానంద్ ఈ పాట గురించి, “ఈ పాట కోసమే ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువసార్లు చూశారని” గీతాదతను ప్రశంసించారు. క్లబ్ డ్యాన్స్ లేదా కాబరే డ్యాన్స్ పాటలు పాడే అవకాశాన్ని ఈ పాట ద్వారానే గీత దక్కించుకోగలిగారు.

‘హౌరా బ్రిడ్జ్’ సినిమాలోని క్లబ్ డ్యాన్స్ పాట “మేరా నామ్ చిన్ చిన్ చు—” పాట ఈ నాటికి కుర్రకారుతో గెంతులు వేయిస్తుంది.

‘ఆనందమఠ్’ సినిమాలో ఈమె ఆలపించిన జయదేవుని అష్టపది “జై జగదీష్ హరే” విష్ణుమూర్తి దశావతారాలని మన కళ్ళ ముందు నిలుపుతుంది.

“బాబూజీ ధీరే చల్‌నా” (ఆర్‌పార్), “ఠండీ హవా కాలి ఘాటా” (మిస్టర్ అండ్ మిసెస్ 55),  “జానే క్యా తూనే కహీ” (ప్యాసా), “పియా ఐసో జియామే సమాయే  గయేరే (సాహిబ్ బీబీ ఔర్‌ గులామ్), “హవా ధీరే ఆనా” (సుజాత), “ఆజ్ సజన్ మోహ్ అంగ్ లగాలో (ప్యాసా), “ఏ దిల్ హై ముష్కిల్ జీనా యహాన్ “(C.I.D) మొదలయిన గీతాలను తన సుస్వరం నుండి అలవోకగా ఆలపించి ప్రేక్షకుల మనసులను రంజింపజేశారు. ఈ పాటలు ఈ నాటికీ ప్రేక్షకశ్రోతలను అలరిస్తూ అజరామరంగా నిలిచాయి.

ఈమె బెంగాలీ భాషలో పాడిన పాటలు బెంగాలీ సినిమాలని సుసంపన్నం చేశాయి. 1967లో ‘బదుబరన్’ బెంగాలీ చిత్రంలో నటించారు. 1971లో ‘అనుభవ్’ సినిమాలో పాటలు పాడారు. ఇదే ఈమె చివరి సినిమా.

1972లో ‘అర్థరాత్రి’ అనే (విడుదల కాని) సినిమాలో తలత్ మొహమ్మద్‌తో కలిసి రెండు యుగళగీతాలు పాడారు.

నేపాలీలో విజయవంతమయిన మెయిలీఘర్ (Mailighar) సినిమాలో ఈమె గీతాలాపన చేశారు. ‘అనుభవ్’ కోసం “మేరీ జాన్ ముఝే జాన్ నా కహో మేరీజాన్”, “మేరా దిల్ జో మేరా హోతా” పాటలను అత్యుత్తమంగా ఆలపించి బెంగాలీ ప్రేక్షకులను అలరించారు.

ఈమె 1200 హిందీ సినిమా పాటలు పాడినట్లు అంచనా. బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, భోజ్‌పురి, మైథిలీ భాషా చిత్రాలు ఈమె గానామృతంతో పరిఢవిల్లాయి. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు గురుదత్ సినిమాలలో ఈమె పాటలు పాడారు. వీరిద్దరూ ఒకరిపట్ల ఒకరు మక్కువ పెంచుకున్నారు. ప్రేమ పరిణయంగా మారింది. 1953లో వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు.

గురుదత్ మరొక నటితో ప్రేమ కలాపాలు సాగించడం గీతాదత్ సహించలేకపోయారు. వారిద్దరి మధ్య ఘర్షణ మొదలయింది. ముఖ్యంగా గీతాదత్ మానసిక క్షోభని అనుభవించారు. తన సినిమాలకి మాత్రమే పాడాలని అనేవారు గురుదత్. అతనికి తెలియకుండా పాడడానికి వెళ్ళేవారు. ఆ టెన్షన్ ఆమెను ఆరోగ్య ఇబ్బందులకు గురి చేసింది. 1964లో గురుదత్ ఆత్మహత్యతో గీత కునారిల్లిపోయారు. ఆమె నరాల బలహీనతకు లోనయ్యారు. కోలుకోవడానికి 6 నెలల కాలం పట్టింది. ఈ పరిస్థితులకు తట్టుకోలేక మద్యానికి బానిసయ్యారు.

ఆర్థిక బాధలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి (స్టేజి షోలు) సంగీత కచేరీలలో దుర్గాపూజకు సంబంధించిన పాటలు పాడేవారు. దుర్గామాత పాటలను రికార్డులుగా విడుదల చేశారు. ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి. ఆమె బొంబాయికి వచ్చినపుడు ‘బొంబాయి బెంగాలీ పాఠశాల’లో చదివారు. ఆ పాఠశాలలో దుర్గాపూజకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. చనిపోవడానికి ముందు 1971లో కూడా హాజరయ్యారు. ఇది ఈమెకు పాఠశాల, దుర్గాపూజల పట్ల గల భక్తిని తెలియజేస్తుంది.

గీతాదత్ అంటే లతామంగేష్కరికి గౌరవం. ఆమెతో కలిసి పాటలు పాడడానికి భయపడేవారట.

ఆమె ప్రేమమూర్తి. గురుదత్ ఇంట్లో అందరూ ఆమెను ప్రేమాభిమానాలతో చూసేవారు. ఆమె గొప్ప నేపథ్య గాయని అయినప్పటికీ గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించేవారు కాదు. పూర్తిగా కుటుంబంతో కలిసిపోయారు. ఆప్యాయత, నిష్కపటత్వాలతో వారందరి హృదయాలను మెప్పించారు. గురుదత్ ప్రవర్తనే ఆమెను బాధించింది.

గురుదత్ గీతను నాయికగా చూపించడం కోసం ‘గౌరి’ సినిమాను మొదలు పెట్టారు. గీత పాటల రికార్డింగ్ జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇది పూర్తయి ఉంటే ఇదే మనదేశంలో తొలి సినిమా స్కోప్ సినిమా అయి ఉండేది.

చివరి రోజులలో రికార్డింగ్‌లకు హాజరవలేకపోయారు. లివర్ సిరోసిస్‌తో చాలా బాధను అనుభవించి 1972 జులై 20వ తేదీన హాస్పిటల్‌లో మరణించారు.

ఈమె జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ 2 స్టాంపులను విడుదల చేసి గౌరవాన్ని ప్రకటించింది. 2016 డిశంబర్ 30వ తేదీన 5 రూపాయల విలువగల స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు మీద గీతాదత్ చిత్రం ఎదురుగా మైక్ కనిపిస్తాయి.

2013 మే 3వ తేదీన శతవత్సరాల ఇండియన్ సినిమా సందర్భంగా 5 రూపాయల స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు మీద కుడివైపున మైకు ముందున్న గీత చిత్రం, ఎడమ వైపున హార్మోనియం వాయిస్తూ నేల మీద కూర్చున్న గీత కనువిందు చేస్తారు.

నవంబర్ 23వ తేదీ గీతాదత్ జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here