అభినవ శ్రీనాథుడు, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారి కవిత్వస్మృతి పరిమళాలు

3
8

[box type=’note’ fontsize=’16’] మే 30న శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. [/box]

[dropcap]తె[/dropcap]లుగు వారు గర్వించతగిన కవి, ప్రాతఃకాల స్మరణీయులు, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారి వర్ధంతి సందర్భంగా వారి కవిత్వపు మాధుర్యాన్ని, లోతును, జనరంజకత్వాన్ని, సామాజిక బాధ్యతను, నిర్భయత్వాన్ని ఒకసారి స్మరించుకుందాం.

ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడులో పుట్టారు. ఆయన మరణించలేదు. ఎందుకంటే మహా కవులకు జయంతులే గాని వర్ధంతులుండవు! వారు అమరులు!

వృత్తిరీత్యా మున్సిపల్ కమిషనరైనా ప్రవృత్తి ద్వారా లబ్ధప్రతిష్ఠుడైనారు శేషేంద్ర. అలంకారశాస్త్రాన్ని మథించిన వాసుకీసముడు. ఛందోబద్ధ వచన కవిత్వాలను అలవోకగా రచించ జాలిన సవ్యసాచి. సంప్రదాయ ఆధునిక తత్వాల మేళవింపు ఆయన కవిత్వంలో గోచరమౌతుంది. ఒక రకంగా ఆయనను విశ్వనాథ – శ్రీశ్రీల మేలు మేళవింపు అని చెప్పవచ్చును.

ప్రపంచ సాహిత్యం మీద సాధికారత అయిన సొంతం. భారత ప్రభుత్వం నుంచి ‘రాష్ట్రేంద్రు’ బిరుదు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఆయన కీర్తీ కిరీటంలో కలికితురాయిలు.

ఆయన వ్రాసిన కవిత్వం గురుతరమైంది. దాని నుండి కొంత వరకైనా కవితా సార్థకత పొందడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రయత్నం ఎలాంటిదంటే కాళిదాసుల వారన్నట్లు ‘తితీర్షుః దుస్తరం మోహత్ ఉడుపేనాస్మి సాగరమ్’ (రఘువంశం- అవతారిక).

కావ్య రచనా ప్రక్రియను సారంగా, ప్రతి ఇతిహాసానికి అనుబంధంగా ఒక కావ్యం ఉంటుంది. వాల్మీకి రామాయణానికి ఉత్తరకాండము, వ్యాస భారతానికి హరివంశము, హోమర్ ఇలియడ్‌కు ఒడిస్సీ… ఈ విధంగా!

శేషేంద్రుని ‘జనవంశము’ ఆధునిక మహాభారతానికి అనుబంధకావ్యమని అనుకోవచ్చు. దానిలో దేశ సమస్యలు, సంక్షోభాలు, సాధారణ, సామాజిక సమస్యలు, నిరసనలు, పరిష్కరాలు, అన్ని గోచరిస్తాయి.

కావ్వాలంకార చూడామణిలో కావ్య ప్రయోజనాన్ని ఇలా చెప్పారు.

కావ్యం యశసే అర్థకృతే, వ్యవహారవిదే

కాంతాసమ్మితయోపదేశ యజే

“కావ్యము కవికి యశస్సును కలిగించాలి. ‘అర్థం’ అంటే ఇక్కడ సామాజిక ప్రయోజనాన్ని సాధించాలి అని గ్రాహ్యం. వివిధ వ్యవహారాలను తెలపాలి. సామాన్యులకు కూడ సులభంగా అర్థమయ్యేరీతిలో ఉండాలి.”

ఈ కావ్య లక్షణాలన్నీ మనకు శేషేంద్ర కవిత్వంలో అమరి ఉంటాయి.

ఆయన అంటారు –

నా గొంతు నా ప్రజలకు దానం చేసాను

నా జాతే నా భాషకు ప్రాణ వాయువు

నేను రక్త ప్రవక్తను!”

ఈ మాటల్లో ఆయనకు సమాజం పట్ల కమిట్‌మెంట్, ప్రజలు స్వీకరించగలిగే భాష, అవసరమైతే పోరాటానికైనా వెరవని విప్లవస్ఫూర్తి అగుపిస్తాయి.

‘జనవంశమ్’ ఒక మల్టిపుల్ జోనర్‌లో ఉంటుంది. చంధోబద్ధ, గేయ, వచన, చాటు, చమక్కులన్నీ తళుక్కుమని మెరుస్తూంటాయి.

ఇందులో భావ తీవ్రత, అభివ్యక్తి తీవ్రత పోటీ పడుతూ ఉంటాయి. రూపకాలంకారాన్ని ఈయనలాగా పలికించగలవారు లేరు. చూడండి.

రుతువులు చెట్ల సుఖదుఃఖాలు!”

వసంతం, గ్రీష్మం, అలా… అతి తక్కువ పదాలు! అనల్పమైన భావం. నాకందుకో పిల్లలమర్రి పిన వీరభద్రుడు గుర్తొస్తాడు. ఈ వాక్యాన్ని మనం మానవ జీవితానికి అన్వయించుకుని విశ్లేషిస్తే, ఒక వ్యాసమే కాగలదు.

రచిత అక్షరం కంటె రాయే శ్రేష్ఠము

సగటు మనిషి గతి చూస్తే అది స్పష్టము

దీని లోతుల్లోకి వెళ్లడం సాహసమే అవుతుంది. రెండు రకాలుగా అన్వయించ వచ్చును. రచన నారికేళపాకంలో ఉంటే నిష్ప్రయోజనమనీ, అక్షరాలకంటి ఆయుధాలే మేలనీ… ఎన్ని రచనలు చేసినా సాధారణ, మానవుని స్థితిగతులు మారకపోతే ప్రయోజనం ఏముంది?

‘స్వర్ణహంస’ అనే కావ్యం పూర్తి వచనం. శ్రీహర్షుని శృంగార నైషధ కావ్యంపై ఆయన రాసిన వ్యాసపరంపర. నైషదం మీద ఒక అపవాదు ఉన్నది ‘నైషధం విద్యదౌషదమ్!’ అని. అంటే కేవలం పండితులకు మాత్రమే అది మందు! శ్రీనాథుడు దానిని తెనిగించినపుడు మూలములోని స్వారస్వం భంగం కాకుండా, సుదీర్ఘ సంస్కృత సమాసాలకు చివర తెలుగు ప్రత్యయాలు చేర్చి కూర్చాడు. అప్పుడు సంస్కృత పండితులన్నారట –

“మీ ‘డు, ము, వు, లు’ మీరు తీసుకొని మా నైషధాన్ని మాకిచ్చేయండి.”

నలదమయంతుల చరిత్ర లోని, ఆధ్యాత్మిక, మంత్రయోగ, వేదాంత రహస్యాలను శేషేంద్రుడు శోధించి, అధ్యయనం చేసి, ఆలోచనా మథనం చేసి, చక్కని వచనంలో మనకందించారు. ‘శ్రీ రాజశుక’ ఇలా అన్నారు –

‘స్వర్ణహంస’, రాజహంస పాలను నీళ్లను వేరు చేసినట్లుగా, నైషధంలోని మంచిని, చెడును, విడదీసి మనకు చూపుతుంది.”

గద్యం వ్రాయడం కత్తిమీద సాము లాంటిది. కవిత్వానికున్న లయ, బీట్, చెవి కింపుగా ఉండడం ఇవేమి ఉండవు. అందుకే పెద్దలు “గద్యం కవీనామ్ నికషం వదన్తి” అన్నారు. అంటే ఒక కవి ప్రతిభకు గీటురాయి గద్యమే… అని… అవునని నిరూపించారు దశకుమార చరిత్రలోని పదలాలిత్యం ద్వారా దంతి; కాదంబరి ద్వారా బాణభట్టు, పంచతంత్రం ద్వారా చిన్నయసూరి; ‘సాక్షి’ ద్వారా పానుగంటి వారు, వేయి పడగల ద్వారా విశ్వనాథ వారు.

“పద్యానికి నన్నయ గద్యానికి చిన్నయ” అంటారుగాని మన శేషయ్య రెండింటిలో మొనగాడే.

అన్నట్లు ‘జనవంశమ్’ను ప్రచురింపజేసి నటులు పవన్ కల్యాణ్, ధర్శకులు త్రివిక్రమ్ గారలు తమ జన్మలను సార్థకం చేసుకున్నారు.

‘నగరం ఒక చంబల్ వ్యాలీ’ అన్న కవితలో ప్రజాస్వామ్యంలో ప్రజల నిస్సహాయతను, చర్యారాహిత్యాన్ని ఎత్తిచూపుతారు శేషేన్.

మీరెగరేసే జెండా మీకే మిచ్చింది?

ఐదేళ్లకొకసారి ఓట్లు

ఆమధ్యలో కునికిపాట్లు!”

ఇందులో మేధావి వర్గం ‘apathy’ ని కూడా target చేసినట్లు అనిపిస్తుంది.

గంగానది ఫ్యాక్టరీల శౌచాలయం

గోదావరి కులపిశాచాల లావానలం అనే మాటల్లో కాలుష్య కాసారాలవుతున్న నదులు, నదీ జలాల కోసం తన్నుకునే ప్రభుత్వాలు, వెరసి శేషేంద్రుని కున్న సామాజిక బాధ్యత అగుపిస్తుంది. విప్లవ మార్గం అవశ్యమని ఎలా నినదిస్తున్నాడో చూడండి.

అందుకే చెట్లతో మొరపెట్టుకుంటున్నాను.

ఆకులు కాదు తుపాకీలు కాయండని

‘ఆకులు కాదు తుపాకులు’ అనే పద బంధంలోని ఛేకానుప్రాసం చాలా శక్తివంతమైనది. ఎన్నికలు ఒక ఫార్స్ అని, ఒక రొటీన్ తంతు అని, వీటి వల్ల అధికార మార్పిడే తప్ప, ప్రజల జీవితాల్లో ఏ మార్పూ ఉండదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు కవి.

ఎన్ని రోగాలైనా సరే,

ఎన్నికల మందుతోనే

నయం చేస్తామనే భూతవైద్యులు

బాబూ దేశం నెత్తిన పెట్టారు

శుష్క ప్రజాస్వామ్య శూన్యహస్తం!”

రాజకీయ నాయకులను భూతవైద్యులతో పోల్చడంలో ఎంతో ఔచిత్యం ఉంది. లేని దయ్యాన్ని పట్టిందని చెప్పి వారు ప్రజలను తాడిస్తారు. ‘శుష్క’ అన్న పదం ‘కుహానా’ అన్న పదం కంటే చక్కగా సరిపోతుంది.

క్షేవేంద్రుడు, తన ‘ఔచిత్య విచార చర్చ’ అనే లాక్షణిక గ్రంథంలో చెప్పాడు.

అనౌచిత్యాదృతే కావ్యం

రసభంగస్య కారణమ్‌

శేషేన్ గారికి కవిత్వంలో అనౌచిత్యమనేది దుర్భిణీ వేసుకొని వెతికినా కనబడదు.

‘షోడశి’ కావ్యంలో రామాయణ రహస్యాలను విప్పి చెప్పారు. వాల్మీకి హనుమత్ సందేశాన్ని కాళిదాసు మేఘదూతాన్ని చక్కగా సమన్వయం చేశారంటారు డా. ఏల్చూరి. ‘కవిసేన మ్యానిఫెస్టో’ కాల దోషం పట్టని ఒక సూచిక. ‘రక్త రేఖ’ లోని ప్రశ్నలు, సమాధానాలు అలంకార ప్రస్థానాన్ని పునరుజ్జీవింప చేస్తాయి, “వర్తమాన భావ పరిపుష్టిని స్పష్టం చేస్తుంది” అంటారాయన.

అశుకవిత్వంలో ఛందస్సు తప్ప భావ సంపద ఉండదని ఎగతాళి చేశారు శేషేంద్ర, ఇలా…

శార్దూలం:

ఏమయ్యా, పదియైనదింక, పడుకో!

ఏడ్చావులే, ఊరుకో!”

శేషేంద్రుని పద్య శిల్పంలో సమాధిగుణం ఉందన్నారు డా.ఏల్చూరి. మేథ్యూ ఆర్నాల్డ్ రచనను స్ఫూర్తిగా తీసుకొని రాసిన ‘సొరాబు’లో దూవ్వూరి రామిరెడ్డి, ఉమ్రాలీషాల శైలి బాగా పండింది. రూపకాలు ఉత్ప్రేక్షలు కావ్యాన్ని సుసంపన్నం చేశాయి. సినిమా పాటలు ఆయన రాసింది అతి తక్కువనుకుంటాను. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో ఆయన రాసిన

నిదురించే తోటలోకి

పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచి

కమ్మని కల ఇచ్చింది

అనే పాట సినిమా పాటల్లో సాహిత్య విలువలుండవన్న దాన్ని పూర్వపక్షం చేసింది. ఈ నాటికీ ఆ పాట మన మనసు తోటలోకి వచ్చి, మన కలత దీర్చి వెళుతూ ఉంది.

మనిషికంటే ప్రకృతే అన్నిరకాలా ధన్యం. ప్రతిఫలాపేక్ష లేకుండా మానవునికి సాయం, జీవితాన్ని’as it is’గా స్వీకరించడం లాంటి గుణాలు మనకేవీ? అందుకే శేషేంద్ర అంటారు –

చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక

వసంతమన్నా దక్కేది

మనిషినై పుట్టి అదీ కోల్పోయాను!”

దీనినే శ్రీశ్రీగారు “మాకు ఉగాదులు లేవు. మాకు ఉషస్సులు లేవు” అని చెప్పారు. ఇది ‘personal pessimism’ లా కనిపిస్తుంది కాని, ధామస్ హర్డీ రచనలాగా దీనిలో అంతర్లీనంగా ‘impersonal optimism’ ఉంది. చెట్టులా ఉండండి నిత్యనూతనంగా, సంతోషాలను కోల్పోకండి… అని!

శృంగారం కూడా రసాలలో ఒకటి. పైగా ఎక్కువ మందిని అలరించేది సరసమే కదా! ‘చంపూకాండ’ లోని ఈ పద్యాన్ని చిత్తగించండి. శేషేంద్రుడు రసికుడు కూడా అని తెలుస్తుంది. అభినవ శ్రీనాథుడు కదా మరి!

కం.

కన్నుల్ గావవి నన్ను లాగెడు నయస్కాంతమ్ములేగాని, యాచన్నులున్

చన్నుల్ గావవి నన్ను మిన్నులకు చేర్చంజాలు నిశ్శ్రేణులే

వన్నెల్ గుల్కి హొయల్ బయల్పడు నడల్ భాసించు నిన్గన్నచో

భిన్నంచేమియు గావు నీవును అరబ్బీజాతిగుర్రానికిన్!

‘హోయల్ బయల్పడు నడల్’ అను ప్రయోగం శిరీష కుసుమ సంకాశం!

శ్రీనాథుని వలె చాటువులను పటుతరంగా పలికించగల దీటుగాడు శేషకవి. ‘సాహిత్యఖండం’లో ఎంతో casual గా వ్రాసిన ఈ పద్యాన్ని చూడండి.

కం.

పోలింగు లేని ఎన్నిక

ఆలింగన సుఖము లేని అంగన పొందున్

రేలంగి లేని చిత్రము

ఏలింగము లేని గుడియు ఎందుకో మహిలో

సెప్టెంబరు 2016లో ‘ది హిందూ’ దినపత్రిక తన Friday Reviewలో ఇలా వ్రాసింది శేషేంద్రుని గూర్చి.

“The Erudite poet, who was widely feted and awarded, is the second person to have been nominated for the Nobel literature prize for his contribution to literary field from India, after Rabindranath Tagore.”

చలం అంటారు…

బాధపడాలి, నలగాలి జీవితరధ

చక్రాలక్రింద, కలంలోంచి నెత్తురు ఒలకాలంటే…

ఆ బాధ, మథనం శేషేంద్ర అనుభూతి చెంది వ్రాశారు తన కవిత్వాన్ని. విశ్వనాథ, పుట్టపర్తి లాంటి దిగ్దంతులు ఆయన కవిత్వాన్ని శ్లాఘించారు. ఆయనలో సౌందర్యం, తత్త్వాన్వేషణ, తిలక్ కవిత్వంలో లాగా కలగలిసి ఉంటాయి. ఈ వాక్యాలు చూడండి.

ఒక్కపువ్వు రంగును చూస్తూ

శతాబ్దాలు బ్రతుకగలను!”

శాంతి యాత్ర: ‘మండే సూర్యుడు’ లో ఇలా అంటారు.

ఎక్కడ ముద్దుగా ఇంటిమీదికి జరిగిన జాబిల్లి

ముద్ద చేతి కందుతాడని పిస్తూందో…

అక్కడికి పోదాం పదమంటుంది ఆత్మ!”

“Truth is Beauty, Beauty is Truth” అన్న జాన్ కీట్సు మాటలు మనకు గుర్తొస్తాయి. ఇక్కడ పువ్వు, జాబిలి ఎప్పటి నుండో నిసర్గ సౌందర్యానికి ప్రతీకలు! వాటిని imagery గా వాడుకొని తత్త్వాన్వేషణ చేసిన ‘కవిఋషి’ శేషేంద్రులు. “నానృషిః కురుతే కావ్యమ్.”

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంత లోతుగా ఉన్నా అస్పష్టత (obscurity) ఉండదు ఆయన కవిత్వంలో. ‘Obscurity for obscurity’s sake’ అనే ఏకసూత్రం అధారంగా కవిత్వాలు వ్రాస్తున్న ఎందరో అధునిక కవులకు ఆయన కరదీపిక కావాలి.

“You cannot just sit back in a relaxed manner and enjoy my poetry. You have to read between the lines and behind the lines to make out my sense.” అన్నాడు Robert Browning. Obscurityకి ఆయనే పితామహుడు. కాని మన శేషన్న మనకు అంత ఇబ్బంది రానివ్వడు. ‘తమంత తావిడు’ అత్యంత నిగూఢ భావాలను అతి సులంభంగా, అందంగా, గుండెకు మెత్తగా తాకేట్టు చెప్పగల పదాల జాదూగర్ ఆయన.

చివరగా, మనకు అన్నీ ప్రసాదించిన భగవంతునికి కృతజ్ఞత చూపాలనే భావాన్ని అద్వితీయ రమణీయంగా అక్షరీకరించిన శేషేంద్రునికి అంజలి ఘటిస్తూ, ఈ పంక్తులు మీ కోసం.

చిన్ననక్షత్రం చేత్తో పట్టుకొని, అంతరాత్మ సందుల్లో

ఒక రహస్యాన్ని తవ్వుతున్నాను.

బయటపడింది మనిషి కోల్పోయిన మోహం!”

ఇక్కడ ‘నక్షత్రం’ మనలోని ఆశ, విశ్వాసానికి ప్రతీక. ఆత్మశోధనను ఇంతకంటే గొప్పగా ఎవరూ వివరించగలరు చెప్పండి! అట్లే.

చిన్నారి గింజ, మెడను బయటపెట్టి,

మొదట వచ్చిన రెండాకులను చేతులుగా

జోడించింది కృతజ్ఞతతో!”

ఎంత రమ్యమైన భావన! వడ్డాది పాపయయ్యగారైతే ఈ పదచిత్రాన్ని అద్బతంగా కాన్వాస్‌పై అద్దేవారేమో! సెలవు!

‘కవితాయద్యస్తి రాజ్యేన కిమ్’ – భోజరాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here