నిజమైన సంపద బాలలు అని గుర్తు చేసే కవిత ‘హాస్టల్ బాల్యం’

1
10

[శ్రీమతి నాంపల్లి సుజాత గారి ‘హాస్టల్ బాల్యం..!’ కవితని విశ్లేషిస్తున్నారు నరేంద్ర సందినేని.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవయిత్రి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు, నాంపల్లి సుజాత కలం నుండి జాలువారిన ‘హాస్టల్ బాల్యం’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది. ‘హాస్టల్ బాల్యం’ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. హాస్టల్ అంటే విద్యార్థులు నివసించే వసతి గృహం అని అర్థమవుతుంది. హాస్టల్ జీవితం ఉదయం 5 గంటలకు ప్రార్థనల తర్వాత జాగింగ్, గేమ్స్ మరియు వ్యాయామాలతో మొదలవుతుంది. దీనికి తోడు బోధనకు ఒక సమయం ఉంటుంది. పిల్లలందరు కూర్చుండి చదువుకుంటారు. రాత్రి బసకు వసతి ఉంటుంది. విద్యార్థులు ఇంటి ధ్యాస నుండి హాస్టల్‌కు అలవాటు పడిపోతారు. హాస్టల్ బాల్యం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. హాస్టల్లో కూడా బాల్యం నలిగిపోతున్నది. హాస్టల్లో మెదులుతున్న పిల్లలు ఎలా ఉన్నారు. మన తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు అయ్యాయి. గురుకుల పాఠశాలలో బోధన మరియు వసతి గృహం ఉంటుంది. వసతి గృహంలో ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఒకరోజు పాఠశాల ఉపాధ్యాయురాలిగా విధుల్లో భాగంగా కవయిత్రి సుజాత వసతి గృహమును సందర్శించడం జరిగింది. ఆ రోజు అంతా పిల్లలతో ఆనందంగా గడిపారు. వసతి గృహంలో ఉన్న పిల్లలతో గడిపిన మధుర క్షణాలను మర్చిపోకుండా నెమరు వేసుకుంటూ ఆమె కవయిత్రి కనుక అక్షరాలతో రూపం ఇచ్చి ‘హాస్టల్  బాల్యం’ కవితకు ప్రాణం పోశారు. ‘హాస్టల్ బాల్యం’ కవిత ప్రముఖ దినపత్రిక నవ తెలంగాణలో అచ్చు అయింది.

“ట్రిమ్మింగ్ చేసిన మొక్కల్లా

వీళ్ళెంత ఒద్దికగా ఉన్నారు..!?”

ప్రకృతి మన చుట్టు ఉన్న అందమైన వాతావరణం. ప్రకృతి జీవరాశికి తల్లి. ప్రకృతి మనల్ని పోషిస్తుంది. ప్రకృతి మన మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది. మనం తినే ఆహారం, మనం పీల్చేగాలి, మనం ధరించే బట్టలు, మనం నివసించే ఇల్లు, ఇవి అన్ని మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు అని చెప్పవచ్చు. ప్రకృతి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. ప్రకృతి అనగా మనకు గుర్తు వచ్చేది అందమైన పచ్చని చెట్లు, కొండలు, కోనలు,   సూర్యుడు, చంద్రుడు, పక్షుల కిలకిలా రావాలు. ప్రకృతి శక్తివంతమైనది మరియు జీవ మరియు నిర్జీవ వస్తువులను కలిగి ఉంటుంది. ట్రిమ్మింగ్ చేసిన మొక్కలను గార్డెన్‌లో మరియు పార్కులో మనం చూస్తాం. ట్రిమ్మింగ్ చేయడం వల్ల ఆ మొక్కలు ఎంతో సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. హాస్టల్‌లో ఉన్న పిల్లలు కూడా ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లాగా ఎంతో అందంగా మరియు ఒద్దికగా ఉన్నారు. పిల్లలు తమ బోసి నవ్వులతో కర్తవ్యం బోధిస్తారు. పిల్లలు తీపి మాటలతో అనుగ్రహ భాషణం చేస్తారు. పిల్లలు తమ బుడిబుడి నడకలతో అలరిస్తారు. ఆ పసి పిల్లల బాల్యమే మనకు సందేశం అని చెప్పవచ్చు. పిల్లల మాటలు, పిల్లల ఆటలు, పిల్లల నవ్వులు, పిల్లల చేష్టలు చూస్తే బాల్యమంతా విజ్ఞాన సర్వస్వం అని చెప్పడానికి సందేహం లేదు.

“దారం పట్టి నాటుపెట్టిన

వరి నారులా

వీళ్ళెంత క్రమశిక్షణగా ఉన్నారూ..!?”

రైతులు పొలాన్ని పొతం చేసి నాలుగు ఐదు సార్లు మడి చెక్కను దున్నుతారు. పొలాన్ని సాగు చేసి వరి నాటుతారు. వరి నాటుపెట్టిన పొలాన్ని చూడండి. వరి నాటుపెట్టిన పొలాన్ని చూస్తే అబ్బురం వేస్తుంది. దారం పట్టి నాటు పెట్టిన వరి నారులా హాస్టల్‌లో ఉన్న పిల్లలు ఎంతో క్రమశిక్షణగా ఉన్నారు. పొలంలోని వరి నారుతో హాస్టల్  పిల్లలను పోల్చడం చక్కగా ఉంది.

“పరీక్ష నాళికల్లో మొలకెత్తిస్తున్న

అంకురాల్లా

ఎంత పారదర్శకంగా ఉన్నారు..”

పరీక్ష నాళిక అనగా ఒక సామాన్యమైన గాజు పరికరం. ఇది ఒక వేలు ఆకారంలో ఉండిన గాజు లేదా ప్లాస్టిక్‌తో చేయబడుతుంది. అంకురాలు అనగా విత్తనాలు నాటగా వచ్చే మొలకలు. ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. పారదర్శకత అనేది కొన్ని వస్తువులు లేదా పదార్థాలు కలిగి ఉన్న ఒక గుణం. దీని ద్వారా కాంతి వెళుతుంది మరియు దాని ద్వారా బయట ఉన్న దానిని చూడవచ్చును. వ్యక్తుల యొక్క సానుకూల ప్రవర్తనను సూచించడానికి పారదర్శకత అనే పదాన్ని ఉపయోగిస్తారు. హాస్టల్‍లో ఉన్న పిల్లలు చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా ఉంటారు. వాళ్ళలో అబద్ధం ఉండదు. రహస్యాలు ఉండవు. కల్లాకపటం లేకుండా వాళ్ళ మాటలు చేష్టలతో పారదర్శకతతో నిండి ఉంటారని చెప్పడానికి పరీక్ష నాళికల్లో మొలకెత్తుతున్న అంకురాల్లా ఉన్నారు అని వర్ణించారు. హాస్టల్ పిల్లల యొక్క సానుకూల ప్రవర్తనను సూచించడానికి పారదర్శకంగా ఉన్నారని చెప్పడం చక్కగా ఉంది. గాజు సీసాను చూస్తే బయటకు తేటగా కనబడుతుంది. పిల్లలు ప్రయోగశాలలోని మొక్కల్లా ఉన్నారని చెప్పిన కవయిత్రి భావన చక్కగా ఉంది.

“వీళ్లు గాజు సీసాల్లో

ఒదిగిన రంగుల దృశ్యపటాలే

ఉన్నదానికన్న మరింత మెరిసిపోతున్నారు”

పిల్లలు గాజు సీసాల్లోకి దించిన రంగుల దృశ్య పటాలను సైన్స్ ఎగ్జిబిషన్‌లో మనం చూసి ఉన్నాం. గాజు సీసాల్లో మంచం, చీర, అగ్గిపెట్టె, తయారు చేసి అద్భుతాలు సృష్టిస్తారు. హాస్టల్‌లో ఉన్న ఆ పిల్లలు గాజు సీసాలోకి చేర్చిన రంగురంగుల దృశ్యపటాలుగా కనపడుతున్నారు. హాస్టల్ పిల్లలు గాజు సీసాల్లో కంటే మరింతగా మెరిసిపోతున్నారని చెప్పడం కవయిత్రి సుజాత భావం చక్కగా ఉంది.

“వీళ్లు చెంగున

దుంకే బుజ్జి ల్యాగలు కదా

ఇంత పద్ధతిగా ఉన్నాయంటే

వీళ్ళ మెడలకి కనబడని

లెంక పీట లేవో

వేలాడ కట్టినట్టున్నారు..”

హాస్టల్లో ఉన్న పిల్లలను వీళ్లు చెంగున దుంకే బుజ్జి ల్యాగలు కదా అంటున్నారు. ఆవు పిల్లలను ల్యాగలు అంటారు. ల్యాగలు కూడా ముద్దుగా ఉంటాయి. ల్యాగలు కూడా చెంగుచెంగున ఎగురుతాయి.  వ్యవసాయదారులైన రైతుల ఇంట్లో పాడి కొరకు పశువులైన ఆవులు, బర్రెలు అన్నీ ఉంటాయి. సుజాత కవయిత్రి వ్యవసాయ కుటుంబ నేపథ్యం కల వ్యక్తి అని అర్థమవుతుంది. సుజాత పల్లె జ్ఞాపకాలతో హాస్టల్‌లో ఉన్న ఆ పిల్లలను ల్యాగలతో పోల్చడం చక్కగా ఉంది. ఆ ల్యాగలు ఇంత పద్ధతిగా ఉన్నాయని ఆ ల్యాగల మెడలకి కనబడని లెంక పీటలేవో వేలాడ కట్టినట్టున్నారు అనడం చక్కగా ఉంది. దూకుడుగా ఉండే ల్యాగలకు లెంక పీటలు కడతారు. అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంత పద్ధతిగా క్రమశిక్షణగా మెలగడం చూసి వీళ్ళ మెడలకి ల్యాగలకు కట్టినట్టు కనబడకుండా లెంక పీటలేవో వేలాడ కట్టినట్టున్నారు అనడం అద్భుతంగా ఉంది.

“ఈ బుడ్డోళ్ళని..

ఉరుములు మెరుపులు

చిచ్చర పిడుగులూ

దూకుడు పిల్లలు అని కదా

కీర్తిస్తూ ఉంటాం..!”

చిన్న పిల్లలను ఉరుములు, మెరుపులు, చిచ్చర  పిడుగులు, దూకుడు పిల్లలు అని  వివిధ రకాలుగా వాళ్ళ చేష్టలని చూసి పొగుడుతూ ఉంటాం. కొందరు పిల్లలు ఉరుముల్లాగా ఉరుముతూ ఉంటారు. కొందరు పిల్లలు గర్జించే మేఘాల్లా ఉంటారు. కొందరు పిల్లలు చిచ్చర పిడుగుల్లా ఉంటారు. కొందరు పిల్లలు దూకుడుతనాన్ని ప్రదర్శిస్తారు. పిల్లలను వివిధ రకాల పేర్లతో పిలుస్తూ పొగుడుతూ ఉంటాం అని గుర్తు చేయడం చక్కగా ఉంది.

“ఇప్పుడు మాత్రం

గంప కింది కోడి పిల్లల్లా

బుద్ధిమంతులే..”

గంప కింది కోడి పిల్లలు ఎలా బుద్ధిమంతులు? అనే ప్రశ్న మనలో తలెత్తవచ్చు. నిజంగానే గంప కింది కోడి పిల్లలు గంప కిందనే కమ్మబడి ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళలేవు. కాబట్టి గంప కింది కోడి పిల్లలు బుద్ధిగా ఉంటాయి అని అర్థమవుతుంది. ఇప్పుడు మాత్రం అంటే ఈ పిల్లలు హాస్టల్లో ఉన్నారు. కాబట్టి వాళ్లందరిని గంప కింది కోడి పిల్లలతో పోల్చడం జరిగింది. గంప కింది కోడి పిల్లలను వదిలిపెడితే మన చేతికి దొరకవు. కోడి పిల్లలు ఎక్కడెక్కడో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి అని అర్థమవుతుంది. కవయిత్రి సుజాత భావన అద్భుతం.

“కొండ అంచుల్లోంచి రాలిపడే

ఈ జలపాతాలని

కోన గుండెల్లోంచి ఎగసిపడే

ఈ సెలయేరులని

స్టాప్ డోంటాక్ అన్నారెవరో

ఉన్న పళంగా  ఆగి

అదో రకం ముచ్చట గొలుపుతున్నారు”

కొండ అంచుల నుంచి అంటే మనకు నయగరా జలపాతం గుర్తుకు వస్తుంది. హాస్టల్లో ఉన్న పిల్లలను జలపాతాలు అనడం చూస్తే సుందరమైన జలపాతాలు గుర్తుకు వస్తాయి. కోన గుండెల్లోంచి ఎగసిపడే ఈ సెలయేరులతో హాస్టల్ పిల్లలను పోల్చడం అద్భుతంగా ఉంది. హాస్టల్ పిల్లలు జలపాతాలు సెలయేరులు. అలాంటి పిల్లలను నిశ్శబ్దంగా ఉండండి అన్నారెవ్వరో. వెంటనే ఆ హాస్టల్ పిల్లలు అంతా సంయమనంతో ఒక్కసారిగా సర్దుకున్నారు. హాస్టల్ పిల్లలు ముచ్చట గొలుపుతున్నారు అనే భావం చక్కగా ఉంది.

“గుడ్డు పెంకులోంచి

తొంగి చూస్తున్న ఈ బుడ్డోడు ‘సచిన్’

ఎంత ముద్దొస్తున్నాడో

వీడిప్పుడు ఐదోదే..

రేపు ఆర్మీ పాయిలెట్ అవుతాట్టా..

కొమ్మా  ఉయ్యాలా…

కోనా జంపాలా.. అంటూ నన్నేదో

ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాడు..!”

గుడ్డు పెంకులోంచి ఏం తొంగి చూస్తుంది? అప్పుడే పుట్టిన కోడి పిల్ల. ఆ కోడి పిల్ల ముద్దుగా చక్కగా ఉంటుంది. కవయిత్రి సుజాత గుడ్డు పెంకులోంచి తొంగి చూస్తున్న ఆ పిల్లవాని పేరు సచిన్. సచిన్ కూడా కోడి పిల్ల మాదిరిగా ఎంతో ముద్దుగా ఉన్నాడు. సచిన్ ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్నాడు. సచిన్ నీవు చదువుకొని భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నావు అని అడిగింది. ఆ పిల్లవాడి సమాధానం నేను ఆర్మీలో చేరి యుద్ధ విమానాలు నడిపే ఆర్మీ పైలట్ అవుతానని ఎంతో గట్టి సంకల్పంతో చెప్పాడు. సచిన్ చక్కగా పాడుతాడు. కమ్మనైన గొంతు ఉంది. కొమ్మా  ఉయ్యాలా..    కోనా జంపాల.. అమ్మ ఒడిలో నేను రోజు ఊగాలా.. అనే అద్భుతమైన పాటను పాడి వినిపించాడు. ఆ పాట వినగానే ఎవరికైనా కళ్ళలో కన్నీరు ఉబికి వస్తుంది.. బాల్యం ఎంత మధురమైనది. బాల్యం ఎంత బందీ అయిపోయింది అనిపిస్తుంది. ఆ పాట వినగానే కవయిత్రి సుజాతకు ఏదో తెలియని పారవశ్యం. ఆమె తల్లిని గుర్తు చేసేటట్లు చేసిన ఆ పిల్లవాని  అపారమైన ప్రజ్ఞకు అబ్బురం వేసింది.

“బాలల హక్కులూ

స్వేచ్ఛా పక్షులంటూ

స్పీచ్ లిస్తావుగా..

వీళ్ళని చూడు..

ఎంత అందంగా అణకువగా

చెప్పినట్టు వింటున్నారో నంటూ..

నన్నాడి పోసుకుంటోంది

నా బడి దోస్త్..!!”

బాలలు కష్ట సుఖాలు ఎన్నున్నా సంపూర్ణ ఆరోగ్యంతో విజ్ఞానవంతులు కావాలి. బాలలు దేశ భవితకి ఆశా దీపాలు. బాలల శ్రేయస్సు దేశ అభివృద్ధికి మూలం అని చెప్పవచ్చు. మనిషి వ్యక్తిత్వం బాల్యంతో పెనవేసుకుని వికసిస్తుంది. మనిషి ఎంత ఎదిగినా బాల్యపు జ్ఞాపకాలు అనుభవాలు ఎప్పటికీ గుర్తుకు వస్తాయి. అమ్మా నాన్న ప్రేమానురాగాల మధ్య బాల్యం ఆనందంగా గడిచిపోతుంది. బాల్యం అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నిజమే, బాలలకు హక్కులు ఉన్నాయి. బాలల హక్కులు హరించే యాజమాన్యాలు కూడా ఉన్నాయి. కొందరు బాలల శ్రమను దోచుకుంటున్నారు. బాలలు స్వేచ్ఛా పక్షులు. కాని తల్లిదండ్రులకు సరియైన ఆదాయం లేక ఇరుకు ఇళ్లలో.. పలకరింపులు కూడా లేకుండా దయనీయమైన స్థితిలో కాలం గడుపుతున్నారు. చిట్టి చిట్టి చేతులతో బాల కార్మికులు అవుతున్నారు. ఆడి పాడాల్సిన వయసులో నాలుగు గోడల మధ్య బందీలు అవుతున్నారు. హాస్టల్లో చదువుకుంటున్న ఈ పిల్లలను చూడు ఎంత అందంగా ఎంత అణకువగా ఉన్నారో వారు అక్కడ ఉపాధ్యాయులు చెప్పినట్టు వింటున్నారు. ఈ విధంగా కవయిత్రి సుజాతను ఆమె స్నేహితురాలు ప్రశ్నిస్తున్నదని అర్థమవుతున్నది. ఒక సమూహంలో హాస్టల్లో చేరిన విద్యార్థులు అలా బుద్ధిగా మెదులుతారనే విషయంలో సందేహం లేదు. అక్కడ చదువు నేర్చుకోవడం కొరకు వసతి గృహంలో చేరారు. అక్కడ హాస్టల్ పిల్లల ధ్యేయం చదువు. హాస్టల్ పిల్లలు అల్లరి చేష్టలు మాని బుద్ధిగా చదువు అనే వ్యాపకంలో మునిగితేలుతున్నారని అర్థమవుతుంది.

“ఈకలు పీకి

రెక్కలు కత్తిరించి పౌల్ట్రీఫామ్‌ల్లో

పెంచితే..

బాల్యం విరబూస్తుందంటారా..!?”

పిల్లలను స్వేచ్ఛగా ఉండనివ్వాలి, ఇలా పౌల్ట్రీ ఫామ్‌ల్లా ఎందుకు పెంచుతారు? కంట్రీ కోళ్లకు ఉన్న స్వేచ్ఛ పౌల్ట్రీ ఫామ్‌లో పెరిగే  కోళ్లకు ఉండదు.  పౌల్ట్రీ ఫామ్ దాటి కోడి పిల్లలు బయటికి వెళ్లే అవకాశం లేదు. పౌల్ట్రీ ఫామ్‌లో దాణా వేసి పెంచుతారు. వాటిలో ఎదుగుదల సరిగా ఉండదు. అలాగే పిల్లలను హాస్టల్లో బందించి చదువు నేర్పిస్తే బాల్యం విరబూస్తుందంటారా అని ప్రశ్నించడం కవయిత్రి సుజాతకు పిల్లల పట్ల గల అపారమైన ప్రేమకు నిదర్శనంగా చెప్పవచ్చు.

“యేమి..

యే ప్రయోగాలు

తప్పుటడుగులు

వేయకుండా

వాడు సృజన కారుడు ఎట్లా

అవుతాడో నాకైతే అర్థం కాలేదు.

యేమో”

అని అంటున్నారు.

పిల్లలు ఎన్నో ప్రయోగాలు చేయాలి. పిల్లలు ఎన్నో తప్పుటడుగులు వేయాలి. థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టడానికి 999 సార్లు ప్రయత్నించారు. 1000 సారికి విజయం సాధించాడు. ఎడిసన్ పాఠశాలలో విద్యార్థిగా చదువులో రాణించలేదు. ఎడిసన్ జీవితమనే పాఠశాలలో పెరిగి తన సృజన శక్తికి పదును పెట్టి బల్బును కనుగొన్నాడు. ఇవాళ మనమంతా వెలుగుల లోకం చూస్తున్నాం అంటే ఎడిసన్ చలవ అని చెప్పవచ్చు. హాస్టల్లో పెరిగిన పిల్లలు సృజనకారులు ఎట్లా అవుతారు అన్న వాక్యాల్లో నిజం ఉందనిపిస్తుంది. బాల్యం అంటే రంగురంగుల అనుభూతులు ఉంటాయి. బాల్యంలో కూడా మింగుడు పడని విషాదాలు కూడా ఉంటాయి. బాల్యంలో కూడా పిల్లలు తమ ప్రమేయం లేకపోయినా అనుభవించక తప్పని కష్టాలు కూడా ఉంటాయి. బాల బాలికలకు ఉచితంగా చదువు నేర్పాలి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేట్లు చేయాలి. సుహృద్భావ వాతావరణంలో పిల్లలు చక్కగా ఎదిగేలా ప్రోత్సాహం అందించాలి. చిన్నారి బాలలు బాగుంటేనే దేశం బాగుంటుంది. నిజమైన సంపద బాలలు అని గుర్తు చేసేలా హాస్టల్ బాల్యం కవిత మనలని బాలల లోకంలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతంగా ఉంది. సుజాతను అభినందిస్తున్నాను. కవయిత్రి సుజాత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


నాంపల్లి సుజాత తేదీ 07-11-1964 న జన్మించారు. సుజాత  పోతారం (ఎస్) గ్రామం, మండలం హుస్నాబాద్, జిల్లా సిద్దిపేటకు చెందినవారు. సుజాత తల్లిదండ్రులు కేదారమ్మ, దశరథం. సుజాత తండ్రి దశరథం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. దశరథం తేది 11-9-2015 రోజున అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడి పోయారు. సుజాత ప్రాథమిక విద్య పోతారు (ఎ‌స్) గ్రామం, ప్రభుత్వ పాఠశాలలోనూ; మాధ్యమిక విద్య హుస్నాబాద్ గవర్నమెంట్  హైస్కూల్ లోనూ పూర్తి చేశారు. సుజాత దూరవిద్య ద్వారా డిగ్రీ మరియు పిజీ, ఎం.ఏ బీఈడీ పూర్తి చేశారు. సుజాత 2002 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కోహెడ మండలం బస్వాపూర్ పాఠశాల సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నారు. సుజాత ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. సుజాత భర్త రాములు హెచ్ఎంటి కంపెనీలో సీనియర్ సూపర్‍వైజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సుజాతకు ఇద్దరు అబ్బాయిలు. సుజాత వెలువరించిన రచనలు: 1) నెమలీకలు నానీల సంపుటి (2009), 2) మట్టి ఆలాపన వచన కవితా సంపుటి (2015), 3) మట్టి నానీలు ఏక వస్తు నానీల ప్రక్రియ (2018), 4) జొన్న కంకి కవితా సంపుటి (2021), సుజాత కథలు, కవితలు, వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

సుజాత తాను పని చేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు కవిత్వం కథలు రాయడంలో మెలుకువలు నేర్పుతూ ప్రోత్సహిస్తున్నారు. సుజాతకు మహాకవి శ్రీశ్రీ  కవిత్వం అంటే ఇష్టం. సుజాత నాన్నగారి మార్గదర్శకత్వంతోనే నేను ఈ రోజున నిలబడగలిగాను అని గుర్తు చేశారు. సుజాత అన్నయ్య అన్నవరం దేవేందర్ ప్రముఖ కవి మరియు మండల ప్రజాపరిషద్ ఆఫీస్ ముస్తాబాద్‌లో సూపరింటెండెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. వదిన ఏదునూరి రాజేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఈమె కథా రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్‌లో ఉంటున్నారు. సుజాత తమ్ముడు అన్నవరం శ్రీనివాస్ ప్రముఖ చిత్రకారుడు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు, కరీంనగర్‌లో ఉంటున్నారు. సుజాత చెల్లెలు మణిమాల గృహిణి, మరిది రాజమల్లు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యారు. కరీంనగర్లో ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here