ఉద్యమ నాయకురాలు శ్రీమతి జె. ఈశ్వరీబాయి

1
8

[dropcap]త[/dropcap]రతరాలుగా బానిసత్వంలో, వెట్టిచాకిరిలో మగ్గుతూ బాధలనుభవిస్తున్న బలహీన వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షించి ఉద్యమాలలో పాల్గొని విజయవంతం చెయ్యడానికి చాలా మంది పూనుకున్నారు. కుల, మత, స్త్రీ, పురుష బేధాలు లేకుండా పాల్గొన్నారు.

వారిలో హైదరాబాద్, సికింద్రాబాద్ లోని బలహీన వర్గాల అభివృద్ధి కోసం, కృషి చేసి, కార్పొరేషన్ సభ్యురాలు, శాసన సభ్యురాలు, మహిళా సంక్షేమ శాఖ అధ్యక్షురాలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలిగా సామాజిక, రాజకీయ రంగాలలో సేవలను అందించారామె. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధ్యక్షురాలిగా, తొలిదశ తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన తెలంగాణ పోరాట సమితి ఉపాధ్యక్షులుగా పనిచేసి జైలు శిక్షననుభవించిన మహామహిళ ఆమె. ఆమె శ్రీమతి జెట్టి ఈశ్వరీబాయి.

ఈమె 1918 డిసెంబర్ 1వ తేదీన నాటి నిజాం సంస్థానం (నేటి తెలంగాణ రాష్ట్రంలోని) సికింద్రాబాద్ లోని చిలకలగూడలో జన్మించారు. బల్లెపు రాములమ్మ, బలరామస్వామిల కుమార్తె ఈమె. బలరామస్వామి ‘నిజాం స్టేట్ రైల్వేశాఖ’లో పనిచేశారు. తను చేసేది చిరుద్యోగమైనా పిల్లలను కష్టపడి చదివించారు రామస్వామి. అప్పటికీ చదువుకునే బాలికలు తక్కువే. అయినప్పటకీ కుమార్తె ఈశ్వరీబాయిని విద్యావంతురాలిని చేశారాయన. యస్.పి.జీ. మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, కీస్ హైస్కూలులో మాధ్యమిక విద్యను అభ్యసించారు.

బాల్య వివాహాలు సర్వసాధారణమయిన ఆ రోజులలో 13వ ఏటనే పూనాలోని దంత వైద్యుడు జెట్టి లక్ష్మీనారాయణ గారితో ఈమె వివాహం జరిగింది. ఈ దంపతులకి ఒక కుమార్తె. చిన్న వయస్సులోనే భర్త అకాల మరణం ఈమెను కష్టాల పాల్జేసింది. అయినా మొక్కవోని ధైర్యస్థయిర్యాలతో జీవనాన్ని కొనసాగించి ధైర్యంగా నిలిచారు. పుట్టింటి మీద అధారపడదలుచుకోలేదు.

కుమార్తెతో కలిసి సికింద్రాబాద్ చేరారు. జీవనోపాధి కోసం ఉపాధ్యాయునిగా విధులను నిర్వహించారు. ‘పరోపకారిణి’ అనే ప్రైవేటు పాఠశాలలో పంతులమ్మగా పనిచేశారు. అక్కడితో ఆగలేదు. ధనవంతుల పిల్లలకు ఇళ్ళ దగ్గర ప్రైవేటుగా పాఠాలు చెప్పేవారు.

సికింద్రాబాద్ లోనే పెరగడం, రైల్వే ఉద్యోగి కుటుంబం కావడంతో వివిధ భాషల ప్రజలతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు మిషనరీ పాఠశాలలో చదవడం, మరాఠీ ప్రాంత కోడలు కావడం వివిధ భాషలను నేర్వడానికి దోహదం చేసింది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, మరాఠా భాషలలో పరిజ్ఞానాన్ని సంపాదించారు. ఈమె బహుభాషా కోవిదురాలవడం వివిధ రంగాలలో ఎదగడానికి దోహదం చేసింది.

ఉపాధ్యాయ వృత్తితో సమాంతరంగా సామాజిక సేవనూ కొనసాగించారు. సమాజంలోని వివిధ రంగాల వ్యక్తులు, సంస్థలతో సత్సంబంధాలను ఏర్పరుచుకున్నారు. ముందు మహిళలను విద్యావంతులను చేయాలని కంకణం కట్టుకున్నారు.

బాలికల కోసం తన కుమార్తె గీత పేరుతో గీతా ప్రాథమిక పాఠశాల, గీతా మాధ్యమిక పాఠశాలలను స్థాపించారు. మహిళలకు సాధారణ విద్యతో పాటు చేతి పనులు, టైలరింగ్, పెయింటింగ్, నర్సింగ్ వంటి పనులు చేయడం కోసం శిక్షణా కేంద్రాలను స్థాపించారు. చేతి పనులను నేర్చుకుంటే ఆయా మహిళలు తద్వారా వారి వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్ని గ్రహించిన ఈశ్వరీబాయి మహిళల అభివృద్ధి కోసం పై విధంగా కృషి చేశారు. ఈ విధంగా మహిళా సాధికారతను సాధించేందుకు ఈమె చేసిన కృషి అసామాన్యం.

రాజకీయాలలో ప్రవేశించి తద్వారా సామాజికాభివృద్ధి సాధించాలని ఆమె ఆశయం. అణగారిన వర్గాల వారి జీవితంలో నిత్యం ఎదురయ్యే సమస్యలని మూలాలకు వెళ్ళి అవగాహన చేసుకున్నారు.

1942లో ‘అఖిల భారత నిమ్నకులాల సభ’కి హాజరయ్యారు. అప్పుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రసంగం విని మిక్కిలి ప్రభావితులయ్యారు. సాంఘికోద్యమాలకి సంబంధించిన అనేక గ్రంథాలను ఔపోసన పట్టారు.

మరాఠాసీమలోని బలహీన వర్గాల వారిని అభివృద్ధి పథం వైపు పయనింపజేసిన సావిత్రిబాయి, జ్యోతిరావుపూలే దంపతుల జీవితానుభవముల నుండి స్ఫూర్తిని పొందారు.

రాజకీయధికారం లభించినప్పుడే సంక్షేమం కోసం పని చేయడానికి అవకాశం లభిస్తుందని అర్థం చేసుకున్నారు. ఆ దిశగా ప్రస్థానాన్ని ఆరంభించారు.

1951లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో తను పుట్టి పెరిగిన చిలకలగూడ వార్డు నుంచి పోటీ చేశారు. రాజకీయ పార్టీల తరుపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సభ్యురాలిగా గెలిచారు. ఈమెకి ఈ ప్రాంతపు బలహీన వర్గాల వారి ఆదరణ ఎక్కువగా లభించింది. ఈమె రెండు సార్లు ఈ పదవిని నిర్వహించారు. ఈ సమయంలో, ఈ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం, వీధిదీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అత్యవసర సౌకర్యాలను కల్పించి అభివృద్ధికి దోహదం చేశారు.

‘షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫేడరేషన్’ (SCF)లో పనిచేశారు. ఇది 1958లో ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’గా మారింది. తర్వాత ఈమె ఈ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వహించారు. తెలుగు నాట రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే జె. ఈశ్వరీబాయి/జె.ఈశ్వరీబాయి అంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా ప్రాచుర్యం పొందింది.

1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంతో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. నియోజక వర్గాల పునర్విభజన కూడా జరిగింది. అలా ఏర్పడిన కొత్త నియోజక వర్గాలలో నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి ఒకటి. 1962లో ఈ నియోజక వర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు ఈశ్వరీబాయి. అయితే 1967, 1972 లలో జరిగిన ఎన్నికలలో ఇదే నియోజక వర్గం నుండి పోటీచేసి గెలిచారు.

ఆమె పదవిలో ఉన్నా లేకపోయినా నాలుగు దశాబ్దాల పాటు బలహీన బడుగు వర్గాల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేశారు.

మహిళా సంక్షేమ బోర్డు అధ్యక్షురాలిగా స్త్రీ విద్యాభివృద్ధి కోసం శాయశక్తులా చేయూతనందించారు. బాలికలకు ఉచిత విద్యా చట్టం కోసం కృషిసలిపారు. Indian Conference of Social Welfare కార్యదర్శిగా, Indian Red Cross Society సభ్యురాలిగాను పని చేసి సేవలను అందించారు.

తెలంగాణ ఉద్యమ తొలిదశలో ‘తెలంగాణ పోరాట సమితి’ స్థాపించబడింది. ఈ సమితికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఈ సమితి కార్యకలాపాలలో, ఉద్యమ కార్యక్రమంలో ఈమె పాత్ర ఎన్నతగ్గది. ఈ సమయంలోనే చంచల్‌గూడ జైలులో శిక్షననుభవించారు.

ఈనాటికీ ఈమె కుమార్తె స్థాపించిన జె. ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్, జె.ఈశ్వరీబాయి మెమోరియల్ సెంట్రల్ హాస్పిటల్, ఈశ్వరీబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఈశ్వరీబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ సంస్థలు పనిచేస్తూనే ఉన్నాయి.

1991 ఫిబ్రవరి 24వ తేదీన క్యాన్సర్ వ్యాధితో హైద్రాబాద్‌లో మరణించారు.

ఈమె గౌరవార్థం 23-2-2021వ తేదీన ఒక ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసింది భారత తపాలాశాఖ. కవర్ ఎడమ వైపున, కౌన్సిలేషన్ ముద్రలోను కాంతులీనుతున్న ఈశ్వరీబాయి కనిపిస్తారు.

కుడివైపున ఈమె జ్ఞాపకార్థం విడుదలయిన MY STAMP (SETENANT) కూడా కనిపిస్తుంది. క్యాన్సిలేషన్ ముద్రలోను, ఆమె చిత్రం కింద ‘DALIT ICON’ అని వ్రాసి ఉంది.

ఈశ్వరీబాయి గారికి నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here