జడ భరతుని కథ

0
12

[dropcap]దే[/dropcap]ని మీదా అతిగా వ్యామోహం పెంచుకోకూడదు. తమ పిల్లల మీద గానీ, మనవలూ, మనవరాళ్ళ మీద  గాని అతి ప్రేమ పెంచుకొని దైవారాధన మరిచి, వాళ్ళే సర్వస్వమని ఎక్కువ మమకారాన్ని పెంచుకోకూడదు. తామరాకు మీది నీటి బొట్టు వలె వుండాలి. ఎక్కువ మమకారం చూపించే వాళ్ళను  పెద్దవాళ్ళు “వీడేమిరా జడ భరతుడి లాగ అయిపోయాడు” అనేవాళ్ళు. యిప్పటి వాళ్లకు జడ భరతుని విషయము తెలియదు. ధనం మీదా, పిల్లల మీదా, వేరే దేని మీద అయినా సరే విపరీత వ్యామోహం (ఇష్టం, ప్రేమ వేరు, వ్యామోహం వేరు) వుండకూడదని జడ భరతుని వృత్తాంతము తెలియ జేస్తుంది.

జడ భరతుని కథ గురించి తెలుసుకుందాము. ఇది పోతన భాగవత కథ. పూర్వము అగ్నీధ్రుడు అనే రాజు జంబూద్వీపాన్ని పరిపాలించాడు. ఆయనకు పూర్వాచిత్తి అనే అప్సరస వలన నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రంయకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే తొమ్మండుగురు పుత్రులు కలిగారు. జంబూ ద్వీప వర్షాలను (దేశాలను) ఈ తొమ్మిది మందికీ పంచి యిచ్చాడు తండ్రి అగ్నీధ్రుడు. తమ తమ పేర్లతో వున్న వర్షాలను పరిపాలిస్తూ వచ్చారు. పెద్ద కొడుకు నాభి భార్య మేరుదేవి ఇతని రాజ్యము పేరు అజనాభము. వారికి విష్ణువు కుమారుడిగా జన్మించాడు. అతని పేరు ఋషభుడు, ఇతని భార్య జయంతి. ఇతను తన శక్తి సామర్థ్యాలతో ఇంద్రుడిని అణిచి వేశాడు. ఈయనకు నూరుగురు పుత్రులు. వీరందరు అన్నివిధాలుగా తండ్రికి తగ్గవారు. వీరిలో పెద్దవాడు భరతుడు. అతను సుప్రసిద్ధుడై ఘనమైన కీర్తి గడించాడు.

పరమ భాగవోత్తముడైనా భరతుడు విశ్వరూపుని కుమార్తె పంచజనిని వివాహమాడి అన్ని విధాలా తనతో సమానమైన ఐదుగురు కుమారులను కన్నాడు. భరతుడు తన తండ్రి తాతల వాలే పదివేల సంవత్సరాలు భూమండలాన్ని ప్రజానురంజకముగా పరిపాలించాడు. ఆ పరిపాలన సమయంలో ఎన్నోయజ్ఞాలు, యాగాలు చేసాడు. తన మనస్సులో శ్రీమన్నారాయణుని ప్రతిష్ఠించుకొని పూజిస్తూ కాలము గడిపి కొంతకాలానికి రాజ్యాన్ని కుమారులకు అప్పగించి సర్వము త్యజించి విరక్తుడై పులహ మహర్షి ఆశ్రమమైన సాలగ్రామ క్షేత్రానికి వెళ్లి అక్కడ ప్రశాంతమైన వాతావరణములో ఒక పర్ణశాల నిర్మించుకొని భగవంతుడిని ఆరాధిస్తూ కాలము గడపసాగాడు. లేడి చర్మాన్ని వస్త్రముగా ధరించి రకరకాల పుష్పాలతో, తులసి దళాలతో భగవంతుడిని పూజిస్తూ గొప్పభక్తుడై బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అన్నిటీకి అతీతుడై జడత్వంతో మెలగటం వల్ల ఆయనకు జడ భరతుడు అనే పేరు వచ్చింది.

ఇలా కొంతకాలము గడిచాక జడ భరతుడు పవిత్రమైన చక్రనదికి స్నానానికి వెళ్లి స్నానము చేసిన తరువాత నిత్యము చేసే అనుష్ఠానం పూర్తి చేసుకొని దైవ నామాన్ని జపిస్తూ ఆ నది ఒడ్డున కూర్చున్నాడు. ఆ సమయంలో నిండు గర్భిణి అయిన  ఒక లేడి మంచి నీళ్లు త్రాగటానికి అక్కడికి వచ్చింది. నీళ్లు త్రాగుతుండగా సమీపం నుండి ఒక సింహ గర్జన వినిపించింది. సహజంగానే పిరికిది అయిన లేడి బెదిరి, నదికి అడ్డము పడి నదిని దాటే ప్రయత్నములో గర్భస్రావము జరిగి దాని బిడ్డను నదిలో వదిలేసి ఆ లేడి అక్కడే చనిపోయింది. ఇదంతా గమనిస్తుస్తున్న భరతుడు ఆ లేడి కూనను తీసుకొని శుభ్రముగా కడిగి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి కన్న బిడ్డ వలే చూసుకుంటూ చివరకు ఆ లేడి కూనను వదలి  ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చాడు. ఆ లేడి కూన తోటిదే ఆయనకు లోకం అయింది. అంతవరకూ ఏ విధమైన భవబంధాలు పెట్టుకోని భరతుడు ఆ లేడి కూన పై విపరీతమైన బంధాన్ని పెంచుకొవటము వలన క్రమముగా పూజలు, అనుష్ఠానాలు, దేవతార్చనలు అన్ని గంగలో కలిసిపోయినాయి.

తన పూజ పునస్కారాలు వెనుకబడినందుకు ఏ మాత్రం చింతించకుండా పైగా పరోపకారం, శరణాగత రక్షణ తన కర్తవ్యంగా భావించాడు. అలాగే కొంతకాలానికి అవసాన దశకు చేరుకున్నాడు. చివరకు అంత్య దశలో భగవంతుడి నామాన్ని స్మరించకుండా ఆ లేడిని తలుస్తూ ప్రాణాలు విడిచాడు.

ఫలితముం మరుజన్మలో లేడిగా జన్మించాడు. కానీ పూర్వ జన్మలో ఆతను చేసిన పుణ్యం వలన పూర్వ జ్ఞానము కలగటం వలన ఆ విషయాలను తలచుకొని బాధపడ్డాడు. యోగి అయినా తాను అవివేకంతో ఒక లేడి పిల్లను చేరదీసి దాని పట్ల విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకొని చివరకు భ్రష్టుడిని అయినానని వాపోయాడు. ఆ విధంగా విరక్తి చెందిన జడ భరతుడు కాలాంజనము అనే పర్వతము నుండి సాలగ్రామ క్షేత్రమైన పూలహా ఆశ్రమానికి వెళ్లి ఈ మృగ జన్మ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఆహారాన్ని త్యజించి చివరకు తన మృగ దేహాన్ని నదిలో విడిచి పెట్టాడు. ఆ విధముగా జడ భరతుని కథ ముగిసి పుణ్యలోకాలకు చేరుతాడు.

ఆ విధముగా ఎవరి మీద, వేటి మీద వ్యామోహం పెంచుకోకూడదని జడ భరతుని కథ మనకు చెపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here