వివిధ రంగాలలో నిష్ణాతురాలు శ్రీమతి కమలాదేవి ఛటోపాధ్యాయ

3
9

[dropcap]ఆ[/dropcap]మె స్వాతంత్ర్య పోరాట యోధురాలే కాక వివిధ హస్తకళలు, చేతివృత్తులు, వివిధ కళారూపాలయిన నృత్య, నాటక, రంగస్థల, తోలుబొమ్మలాటల రంగాలను అభివృద్ధి చేశారు. మహిళాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టారు.

హస్తకళలు, చేతివృత్తుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను సాధించి, దేశ ఆర్థికాభివృద్ధికి, పునర్నిర్మాణానికి దోహదం చేశారు. నటిగా, నాట్య కళాకారిణిగా కూడా రికార్డును సృష్టించారు.

గాంధీజీ కొన్ని ఉద్యమాలకి ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహంలో మహిళలు ఇబ్బంది పడతారని దూరంగా ఉంచాలనుకున్నారు. కాని ఆమె వారితో సంప్రదించి మహిళలు ఉద్యమంలో పాల్గొనేట్లు చేశారు. ఆమే శ్రీమతి కమలాదేవి ఛటోపాధ్యాయ.

ఈమె ఆనాటి మదరాసు ప్రెసిడెన్సీ నేటి కర్నాటకలోని మంగుళూరులో 1903 ఏప్రిల్ 3వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు విద్యాధికులు. తల్లి గిరిజాబాయి. తండ్రి అనంత ధరేశ్వర్. వీరు ఆ రోజుల్లో మంగుళూరు కలెక్టర్‌గా పనిచేసేవారంటే ఎంత గొప్పస్థితిలో ఉన్న కుటుంబమో అర్థం చేసుకోవచ్చు.

గొప్ప కుటుంబీకులు బడికి వెళ్ళి చదువుకోవడం అప్పటి పద్ధతి కాదు. కాబట్టి ఇంట్లోనే ప్రైవేటుగా చదివారు. తల్లి పురాణేతిహాసాలను వివరించేవారు. మొదటి నుండి సంకల్పబలం, ధైర్యసాహసాలతో మానసిక స్థైర్యం గల వ్యక్తి ఈమె.

ఏడేళ్ళ వయసులోనే తండ్రి మరణించారు. ఆయన ఆస్తిపరులయినా వీలునామా వ్రాయక పోవడం వలన – ఆనాటి చట్టాల ప్రకారం గిరిజాబాయికి ఆస్తి అందలేదు. దాయాదులకి వెళ్ళింది. భరణం వద్దని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నారామె. తనకు పుట్టింటి తరపున వచ్చిన స్త్రీ ధనంతోనే పిల్లలను పెంచి పెద్ద చేశారు.

కమలాదేవి ఇలా తల్లి పెంపకంలోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. క్వీన్ మేరీస్ కాలేజిలో, లండన్ లోని బెడ్‌ఫోర్డ్ కాలేజిలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. సోషియాలజీలో డిప్లొమా తీసుకున్నారు. 14 ఏళ్ళ వయసులో కృష్ణారావు అనే వ్యక్తితో వివాహమయింది. కాని రెండేళ్ళు తిరగకుండా వితంతువు అయ్యారు.

క్వీన్ మేరీస్ కాలేజిలో స్నేహితురాలు సుహాసినీ ఛటోపాద్యాయ సోదరుడు హరీంద్రనాథ్ ఛటోపాద్యాయతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కళాభిమానులు కావడంతో మనసులు కలిశాయి. ఇద్దరూ కలసి అనేక నాటకాలు, స్కిలను రూపొందించారు. ఇవి విజయవంతంగా ప్రదర్శించ బడినాయి.

లండన్‌లో విద్యార్థినిగా ఉన్నప్పుడే గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాల పట్ల మక్కువని పెంచుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చి ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని మహిళల ప్రమేయం లేకుండా నిర్వహించాలనుకున్నారు. కాని ఈమె ఆయనకి సర్ది చెప్పి మహిళల ప్రాతినిధ్యానికి ఒప్పించగలిగారు. దండి ఉప్పు సత్యాగ్రహంలో స్వయంగా పాల్గొని ఉప్పును తయారు చేశారు.

సత్యాగ్రహ సమయంలో అరెస్టయ్యారు. సుమారు ఐదేళ్ళు జైలు శిక్షని అనుభవించారీమె. ఆ సమయంలోనే చాలా విషయాలను అవగాహన చేసుకున్నారు. స్వయంగా సోషియాలజీ చదివిన వారు కావడంతో వివిధ వృత్తులకు చెందిన కుటుంబాలు, వృత్తిపరమైన పరిస్థితులు, జీవన విధానాలను గురించి పరిశీలించి పరిశోధన చేశారు. ఈ పరిశోధనలే స్వాతంత్రం లభించిన తరువాత ఈమె ఆయారంగాలలో కృషి చేయడానికి దోహద పడింది.

1936లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు ఈమె. జయప్రకాష్ నారాయణ, రామమనోహర లోహియా, మిసూమసాని వంటి సోషలిస్టు నాయకులతో కలసి పని చేశారు కమలాదేవి.

బాల్యం లోనే వీరి కుటుంబానికి అనీబెసెంట్, పండిత మహదేవ గోవింద రెనడే, గోపాలకృష్ణ గోఖలే వంటి జాతీయ పోరాటయోధులతో సన్నిహిత సంబంధాలుండేవి. రమాబాయి రెనడేతో సాన్నిహిత్యం మహిళల అభ్యున్నతి కోసం కృషిచేయవలసిన అవసరాన్ని తెలియజేసింది.

శ్రీమతి మార్గరెట్ కజిన్స్ స్థాపించిన ‘ALL INDIA WOMEN’S CONFERENCE’ లో సభ్యురాలిగా పనిచేశారు.

ఈ సంస్థ కార్యక్రమాలను గురించి దేశమంతటా విస్తృతంగా తిరిగి ప్రచారం చేశారు. మహిళల ఓటింగ్ హక్కు కోసం ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమ కార్యకర్తల ప్రోత్సాహంతో ‘MADRAS PROVINCIAL LEGISLATIVE ASSEMBLY’ కి పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయినా భారత దేశంలో ఎన్నికలలో పోటీ చేసిన తొలి మహిళగా నిలిచి రికార్డు సృష్టించారు.1929లో బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సుకు హాజరయారు.

ఈమె తన కార్యక్రమాలను విదేశాలలో పరిచయం చేయడం కోసం అనేక దేశాలు పర్యటించారు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో అమెరికాలో పర్యటించారు. అక్కడి బ్రిటిష్ వ్యతిరేకులతో పరిచయాలను పెంచుకున్నారు. వీటిని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఈమెను భారతదేశానికి రాకుండా నిషేధాన్ని విధించారు.

మేధావులు ప్రతికూల పరిస్థితులని కూడా అనుకూలంగా మార్చుకుంటారు. అందుకు కమలాదేవి ఒక ఉదాహరణ. స్వదేశానికి రావడానికి విధించిన నిషేధాన్ని ఇతర దేశాల పర్యటనకి ఉపయోగించుకున్నారు. అమెరికా తరువాత ఆఫ్రికా, చైనా, జపాన్, డెన్మార్క్ వంటి దేశాలలో పర్యటించారు. స్వాతంత్రోద్యమానికి సమాంతరంగా సామాజికాభివృద్ధి, మహిళాభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చలు ఉపన్యాసాలలో పాల్గొన్నారు.

స్వాతంత్ర్యం లభించిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, మహిళాభివృద్ధి కోసం కృషి చేశారు. మహిళల కోసం విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేశారు. వీటిలో భాగంగానే న్యూఢిల్లీలో ‘లేడీ ఇర్విన్ కాలేజ్ ఫర్ హోమ్ సైన్సెస్’ స్థాపించబడింది.

ఈమె స్వాతంత్ర్యం రాకముందు ఫరీదాబాద్‌లో 50,000 మందికి పని కల్పించే చేతివృత్తుల కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. భవన నిర్మాణాన్ని పూర్తి చేసి సంపూర్ణంగా సౌకర్యాలను కల్పించారు. దేశవిభజన తరువాత ఫరీదాబాద్ పాకిస్థాన్‌కి వెళ్ళిపోవడం బాధాకరం.

స్వాతంత్ర్యం లభించిన తరువాత వివిధ చేతివృత్తులు, హస్తకళలు, కళలు, సంగీతం, నాటకం, పప్పెట్రీ (తోలుబొమ్మలాట) మొదలైన రంగాల అభివృద్ధి కోసం కృషి చేశారు. వీటిలో భాగంగానే సంగీత నాటక అకాడమీ, సెంట్రల్ కాలేజి ఇండస్ట్రీస్ ఎంపోరియం, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి.

హస్తకళలు, చేతివృత్తులు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధి పెంపొందించే అవకాశాలు పెరిగాయి, ప్రజల జీవనోపాధి, తలసరి ఆదాయం పెరిగాయి. ఈ విధంగా దేశ పునర్నిర్మాణంలో ఇవి ప్రముఖ పాత్రను నిర్వహించాయి. సహకార కేంద్రాల ద్వారా కుడా వీటికి పెట్టుబడులను అందించే ఏర్పాట్లు చేయగలిగారీమె.

సాంస్కృతికరంగంలో కూడా మన కళలు విదేశాలలో విస్తృతంగా ప్రదర్శించబడినాయి. భారతీయ కళలకు విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఈమె పాత్ర అనిర్వచనీయం. కాళహస్తి, కలంకారీ, పోచంపల్లి చీరలు, జైపూర్ నీలంకుండలు మెదలైన వాటిని అభివృద్ధి చేసారు.

ఈమె స్వయంగా సినిమా నటి కూడా. తన మాతృభాష కన్నడంలో తొలి మూకీ సినిమా మృచ్ఛకటిక (వసంతసేన) లో నటించారు. ఇంకా తాన్‌సేన్, శంకర్ పార్వతి, ధన్నాభగత్ సినిమాలలో నటించారు.

కేరళ ప్రాచీన నాటక సంప్రదాయం ‘కుటియాట్టం’ ప్రక్రియని అభ్యసించిన నాట్య కళాకారిణి కూడా ఈమె.

ఈమె నాటకరంగానికి ఎనలేని సేవలు చేశారు. యునెస్కోకి అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధంగా జాతీయ నాటక సంస్థని స్థాపించారు. దేశంలోను, అంతర్జాతీయంగాను అనేక ప్రదేశాలలో రంగస్థల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

ఈమె వివిధ ప్రక్రియలలో సుమారు 20 గ్రంథాలను రచించారు. తన ఆత్మకథను ‘ఇన్నర్ రిసెసెస్ ఔటర్ స్పేసెస్’ పేరుతో వెలువరించారు.

‘ఛటోపాధ్యాయ ఇన్ వార్-టార్న్ చైనా’, ‘ది అవేకెనింగ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’, ‘ట్రైబలిజం ఇన్ ఇండియా’ ఈమె వ్రాసిన గ్రంథాలలో ముఖ్యమైనవి.

ఈమె సేవలకు గాను జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. భారత ప్రభుత్వం 1955లో పద్మభూషణ్, 1987లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించి గౌరవించింది. 1974 సంగీత నాటక అకాడమి వారి ఫెలోషిప్ ను పొందారు. విశ్వభారతి విశ్వ విద్యాలయం శాంతినికేతన్ వారు ‘దేశికోత్తమ’ను అందించి గౌరవించారు. 1977లో యునెస్కో వారు హస్త కళలలో ప్రోత్సాహానికి గాను పురస్కారాన్ని అందించి గౌరవించారు.

1988 అక్టోబర్ 29వ తేదీన బొంబాయిలో మరణించారు. ఈమె శ్రీమతి సరోజినీ నాయుడికి స్వయానా మరదలు.

భారత ప్రభుత్వం ఈమె వర్ధంతి సందర్భంగా ది 29-10-1991వ తేదీన రెండు స్టాంపులను విడుదల చేసింది. ఈ స్టాంపులు ఆమె చిత్రంతో విడుదలవలేదు. ఆమెకి మానసిక పుత్రికలైన కళారూపాలతో వెలువడడం విశేషం.

29-10-1991 న విడుదలయిన ఫస్ట్ డే కవర్

ఈమె చిత్రాన్ని ఫస్ట్ డే కవర్ మీద ఎడమ వైపున ముద్రించారు.

‘ఆజాదీ కా అమృతోత్సవ్’ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here