కమ్యూనిస్ట్ హీరోయిన్… తెలుగింటి ఆడపడుచు… శ్రీమతి లీలా నాయుడు

7
6

[dropcap]2[/dropcap]8-07-2021 లీలానాయుడు వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె బంగారపు స్పూన్‌తోనే పుట్టింది. బాల్యంలోనే పెద్ద సెలెబ్రిటీలను కలిసింది. తరువాత తనే సెలెబ్రిటీ అయింది. రంగురంగుల చిత్రప్రపంచంలో నవరత్నాలలా తొమ్మిది సినిమాలలోనే నటించింది. అయితే సమాంతరంగా పాత్రికేయురాలు, సంపాదకురాలు, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా అట్టడుగువర్గాల కష్టనష్టాలను తెరకెక్కించింది. చివరకు అనూహ్యంగా ఆస్తిని, డబ్బుని పోగొట్టుకుని పేదరాలిగా మిగిలింది. పిల్లల తల్లయినా వారికి దూరమై తల్లడిల్లిన అభాగ్యురాలు.

ఈమె తల్లి ప్రముఖ INDOLOGIST, జర్నలిస్ట్, స్విస్-ఫ్రెంచ్ మూలాలున్న డా॥మార్తె మాంగేనా నాయుడు. తండ్రి ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత మేరీక్యూరీ సహాయకులు, అణుభౌతిక శాస్త్రవేత్త, UNESCO కి ఆసియా దేశాల తరఫున టాటా కంపెనీలకి సలహాదారు – అన్నింటికంటే ముఖ్యంగా మన తెలుగు వారికి గర్వకారకుడు, ఆంధ్రప్రదేశ్‍లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి చెందిన డా॥ పత్తిపాటి రామయ్యనాయుడు.

అంత గొప్ప తల్లిదండ్రులకు లీల 1940లో బొంబాయిలో జన్మించారు.

1954 సంవత్సరంలో ఫెమినా వారి మిస్ ఇండియాగా ఎంపిక చేయబడ్డారు. అమెరికన్ ‘ఓగ్ మ్యాగజైన్’ వారు ఎంపిక చేసిన ప్రపంచ ప్రసిద్ధ అందగత్తెలలో మొదటి పది మందిలో నిలిచారు. ఈ పదిమందిలోనే మన జయపూర్ మహారాణి గాయత్రిదేవి కూడా ఉండడం ఒక చారిత్రక విశేషం.

1957లో ప్రసిద్ధ ఒబెరాయ్ హోటల్స్ యజమాని కుమారుడు తిలక్ రాజ్ ఒబెరాయ్‍తో ఈమె వివాహం జరిగింది. సంవత్సరంలోగా మాయ, ప్రియ అనే కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.

తరువాత భర్తతో విభేదాల కారణంగా విడిపోయారు. కోర్టు పిల్లలను తండ్రికే అప్పగించింది. ప్రసవ సమయంలో కలిగిన అనారోగ్యం , భర్త నుండి విడిపోవడం,

పిల్లలు దూరమవడం ఆమెను మనోవేదనకు గురి చేశాయి.

ఈ సమయంలో ఈమె కుటుంబ సన్నిహితులు రాబర్టో రోజ్‍లిని సలహాతో పారిస్‌లో చికిత్స చేయించుకున్నారు. లండన్‌లో ఆధ్యాత్మిక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారిని కలిశారు. ఆయన బోధనలకు ప్రభావితురాలయ్యారు. తన జీవితాన్ని ఆశావహ దృక్పథము వైపు మరల్చారు. జీవితాంతం ఆయన బోధనలే తనని నిలబెట్టాయని చెప్పుకునేవారు. జీవితంలో ఎన్ని బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవరోధాలు ఎదురయినా అధిగమించే శక్తినిచ్చాయని, ధైర్య స్థైర్యాలని కల్పించాయని చెప్పారు.

నాలుగేళ్ళ వయసులోనే కుటుంబ స్నేహితులు శ్రీమతి సరోజినీ నాయుడిని, సరోజినీ నాయుడి ద్వారా బాపూజీని దర్శించారు. తండ్రి టాటా గ్రూపు వారికి సన్నిహితుడు కావడంతో జె.ఆర్.డి.టాటాని అంకుల్ అని పిలిచే చనువు ఏర్పడింది.

అయితే రామయ్యనాయుడి గారికి క్యాన్సర్ సోకింది. వైద్య చికిత్స కోసం స్విట్జర్లాండ్ పంపారు టాటా. అక్కడ పాఠశాలలో చేరిందామె. అయితే అక్కడ వర్ణవివక్ష ఎదురయింది. విషయం తెలుసుకున్న తండ్రి ‘ఇకోల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్’లో చేర్చారు.

తరువాత రామయ్యనాయుడి గారిని జె.ఆర్.డి టాటా వారి క్యాన్సర్ హాస్పిటల్‌లో పని చేసేటందుకు ఆహ్వానించారు. మళ్ళీ భారతదేశానికి వచ్చారు. అయితే లీల తల్లితో బొంబాయిలో ఉండేవారు. రామయ్య విధి నిర్వహణ నిమిత్తం ఢిల్లీలో ఉండేవారు.

ఈమె బొంబాయిలోని కుటుంబ స్నేహితులతో కలిసి షమ్మీకపూర్ వివాహానికి వెళ్ళారు. అక్కడ రాజ్ కపూర్ దృష్టిని ఆకర్షించారు. తరువాత రాజ్ కపూర్ తన నాలుగు సినిమాలలో నటించడానికి అంగీకార పత్రాలను ఆశించారు. అయితే అప్పటికే ఈమె శ్రేయోభిలాషులు రాజ్ ప్రేమ వ్యవహార సరళిని గురించి హెచ్చరించారు. ఆమె సున్నితంగా తిరస్కరించి తప్పుకున్నారు.

పండిట్ రవిశంకర్ కుటుంబం కూడా ఈమె కుటుంబానికి సన్నిహితులు. ఆయన స్నేహితురాలు, డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాత్రి కమలా చక్రవర్తి ఒకసారి లీల ఫోటోలను తీశారు.

ఆ ఫోటోలను చూసిన హృషీకేశ్ ముఖర్జీ ఆమెను ‘అనురాధ’ చిత్రంలో నాయికగా ఎంపిక చేశారు. 1962లో విడుదలయిన ఈ చిత్రంలో కథానాయకుడు బలరాజ్ సహాని. ఈ చిత్రానికి పండిట్ రవిశంకర్ సంగీత దర్శకులు. “హేరే వో దిన్న్ నా ఆయే”, “జానే కైసే సప్నోం మే ఖో గయిన్ అంకియాన్’, ‘కైస్ దిన్ బీతే కైసీ బీతీ రాతేం” వంటి గీతాలను ఆయన స్వరపరిచారు.

ఈ సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. బెర్లిన్ చలనచిత్రోత్సవంలో ‘Golden bear’ లభించింది.

తరువాత 1962లోనే ‘ఉమ్మీద్’ సినిమాని అశోక్ కుమార్, జాయ్ ముఖర్జీ, లీలానాయుడులతో నితిన్‌బోస్ నిర్మించారు.

1963లో మర్చంట్ – ఐవరీ వారి తొలి సినిమా ‘The House Holder’ పేరుతో ఆంగ్లంలోను, ‘ఘర్బార్’ పేరుతో హిందీలోను నిర్మించారు. ఈ చిత్రంలో శశికపూర్ సరసన నటించారీమె.

1963లోనే ‘యే రాస్తే హైన్ ప్యార్ కే’ సినిమాలో సునీల్‌దత్, రహమాన్లతో కలిసి నటించారు. ఇది సునీల్ దత్ నిర్మించిన తొలిచిత్రం.

1964లో ‘బాగి’ అనే చిత్రంలో నటించారు. 1968లో ‘ఆబ్రూ’ అనే సినిమాలో నటించారు. 1969లో ‘The Guru’ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.

1985లో శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన ‘త్రికాల్’ సినిమా ఈమెకు మంచి పేరు తెచ్చింది. ఈమె చివరి సినిమా 1992లో విడుదలయిన ‘Electric Moon’. దీనికి ప్రదీప్ కిషన్ దర్శకత్వం వహించారు.

మొత్తం మీద ఈమె నటించినవి తొమ్మిది సినిమాలే కావడం విశేషం.

వేళ్ళ మీద లెక్కించే సినిమాలలో నటించిన ఈమెకు తప్పిపోయిన సినిమాలున్నాయి. సత్యజిత్ రే ఈమెను, మార్లన్ బ్రాండో లను కలిపి నిర్మించాలనుకున్న సినిమా మొదలవనేలేదు.

విజయ్ ఆనంద్‌ 1965లో నిర్మించిన ‘గైడ్’ లో ఈమె నటించాలి. అయితే ఈ సినిమా నాయికగా నృత్యాన్ని అభ్యసించిన నర్తకి కావాలి. ఈమె నాట్యంలో శిక్షణ పొందలేదు. అందువల్ల ఈ అవకాశం వహీదా రెహమాన్‌ను వరించింది.

సినిమా నాయిక పాత్రలను గురించి, సినిమాలను గురించి అలా ఉంచితే ఈమె డాక్యుమెంటరీ చిత్రాలను, లఘు చిత్రాలను నిర్మించారు. దివ్యాంగులయిన పిల్లలను గురించి ‘A CERTAIN CHILDHOOD’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. లీలానాయుడు ఫిల్మ్స్ పతాకం మీద కుమార్ షాహ్ని దర్శకత్వంలో దీనిని నిర్మించారు. యునైటెడ్ నేషన్స్ వారి కోరిక మేరకు ‘A MATTER OF PEOPLE’, ‘VOICE FOR LIFE’ లఘు చిత్రాలను నిర్మించారు.

జె. ఆర్.డి.టాటా గారి కోరిక మేరకు ‘బొంబాయిని గురించి డాక్యుమెంటరీ’ చిత్రం తీశారు.

బొంబాయి రైలు పట్టాల పక్కన నివసించే గుడిసెవాసుల కడగళ్ళను గురించి, ఇటుక బట్టీల కార్మికులను గురించి డాక్యుమెంటరీలను నిర్మించారు.

“విమానాలలో వెస్ట్రన్ టాయిలెట్లను ఎలా వాడాలి?” అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని టాటా కోరిక మేరకు నిర్మించారు. ఆ రోజుల్లో విమాన ప్రయాణీకులకు ఉపయోగపడింది.

1971లో అనూహ్యంగా ద్వితీయ వివాహం చేసుకున్నారు. గోవాకు చెందిన అంతర్జాతీయ కవి, రచయిత డామ్ మోరియో “Times of India’ పత్రికలో పనిచేసేవారు. ఈ దంపతులు 1971 నుండి 1981 వరకు హంగ్‌కాంగ్, జపాన్, నైరోబీ, కాంగో, న్యూయార్క్, ఫిలిప్పైన్స్, బొంబాయిలు తిరుగుతూ గడిపారు. ఇద్దరూ కలిసి ప్రాజెక్టు వర్క్స్‌లో పాలు పంచుకున్నారు. అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధితో ఇంటర్వ్యూ తీసుకున్నారు.

బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్’ (B.B.C) వారి కోరిక మీద భార్యా, భర్తలిద్దరూ కలిసి ‘కలకత్తా నక్సలైట్స్’ గురించి, ‘అసన్సోల్ బొగ్గు కార్మికుల’ గురించి డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించారు.

హాంగ్‌కాంగ్ ప్రభుత్వ టి.వి. కాంట్రాక్టులు తీసుకుని ‘బౌద్ధమతస్థులయిన చైనీయులలో రక్తదానం గురించిన మూఢనమ్మకాలను తొలగించి, శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించేటందుకు’ డాక్యుమెంటరీని నిర్మించారు.

ఇన్ని డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించిన ఈమె జీవితం గురించి 2009లో బిడిషారాయ్ దాస్, ప్రయోంజనా దత్తాలు ‘లీల’ అనే డాక్యుమెంటరీని నిర్మించడం ఓ విశేషం.

సొసైటీ’, ‘కీనోట్’ పత్రికలను నడిపారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అధినేత రామనాథ గోయెంకా తన పత్రికలో ‘కమ్యూనికేషన్ మేనేజర్’గా ఈమెను నియమించారు.

ఈమెలో మానవీయ కోణం స్పష్టంగా కనిపిస్తుంది. ‘అనూరాధ’ సినిమా షూటింగ్ సమయంలో అక్కడ పనిచేసే కుర్రవాడికి దెబ్బలు తగిలితే అతనికి వైద్యం చేయించాలని పట్టుబట్టారు. వైద్యసదుపాయం అందాకే షూటింగ్‌లో పాల్గొన్నారు.

అలాగే ఒకసారి గ్రూప్ సాంగ్‌లో నటించే ఎక్స్‌ట్రా నటీమణులను నిలబెట్టడాన్ని గమనించారు. వారికి కూడా కుర్చీలు వేస్తేనే తను కూర్చుంటానని పట్టుబట్టారు. వారందరూ కూర్చునేంతవరకూ నిలుచునే ఉన్నారు.

ఉన్నత ధనిక కుటుంబంలో పుట్టిన ఈమె అణగారిన వర్గాలు, కార్మిక వర్గాలు, మురికివాడల గుడిసెల వాసులు, గనుల కార్మికుల దుర్భర జీవిత విధానం గురించి తను బాధపడేవారు. ప్రపంచానికి తెలియజెప్పడం కోసం వ్యాసాలు వ్రాసేవారు. లఘు చిత్రాలను, డాక్యుమెంటరీలను నిర్మించారు.

సల్మాన్ రష్దీ వంటి రచయితకి ఆతిథ్యమిచ్చారు. 25 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత భర్త డామ్‌మోరియా ఈమెను వదిలి మరో స్నేహితురాలితో సహజీవనం మొదలు పెట్టాడు. అప్పటి నుండీ ఒంటరి అయిపోయారు.

ఢిల్లీలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి సన్నిహితులను అమ్మి పెట్టమంటే వారు తమ పేరున వ్రాయించుకుని మోసం చేశారు.

విదేశాలకు వెళుతూ బొంబాయిలోని ఇంటికి సంబంధించిన బిల్లులు, ఇతర బిల్లులను కట్టమని సన్నిహితులకి డెబిట్ కార్డ్ నిచ్చి వెళ్ళారు. ఆమె తిరిగి వచ్చేటప్పటికి డెబిట్ కార్డ్‌లో జీరో బ్యాలెన్స్ ఎదురయింది. ఈ విధంగా కోటీశ్వరురాలు పేదరాలిగా మిగిలారు. విధి వైపరీత్యం జీవితాలను అతలాకుతలం చేస్తుంది కదా!

చివరి రోజుల్లో అప్పుడప్పుడు పిల్లలు ఫోన్లో మాట్లాడేవారు. పాతకాలం నాటి ఆ భవంతిలో కిటికీలో నుండి సముద్రంలోకి చూస్తూ కాలం గడిపేవారు. రచయిత జెర్రీ పింటోతో కలిసి ఆత్మకథను ‘ఎ ప్యాచ్‌వర్క్ లైఫ్’ (A Patchwork Life) పేరుతో వ్రాసుకున్నారు.

ఈ విధంగా ఆగర్భశ్రీమంతురాలై, హిందీ-ఆంగ్ల చిత్రాల కథానాయికై, కోటీశ్వరులయిన ఓబెరాయ్ ఇంటి కోడలై, వారసత్వంగా లభించిన కోట్ల ఆస్తిని అమాయకంగా పోగొట్టుకుని, పిల్లలున్నా వారికి దూరమై విధివంచితురాలైన లీలానాయుడి జీవితం తరువాతి తరాలవారికి పాఠాలను నేర్పించింది.

2009 జూలై 28న దీర్ఘకాలం నుండి బాధిస్తున్న ఇన్‌ఫ్లూయంజా వ్యాధితో ముంబైలో మరణించారామె.

ఈమె జ్ఞాపకారం 2011 ఫిబ్రవరి 13వ తేదీన 5 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

జూలై 28వ తేదీ ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here