మద్రాసు లలితాంగి యం. యల్. వసంతకుమారి

7
7

[dropcap]03[/dropcap]-07-2021 తేదీ ‘యం. యల్. వసంత కుమారి’ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

దక్షిణ భారతదేశంలో శాస్త్రీయ సంగీత కళాకారిణులలో ముగ్గురు – త్రిమూర్తులుగా పేరు పొంది విశ్వవిఖ్యాతి పొందారు. వారు శ్రీమతి యం.యస్.సుబ్బలక్ష్మి, శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్, శ్రీమతి యం.యల్.వసంతకుమారి. శ్రీమతి యం.యల్.వసంతకుమారి యం.యల్.విగా, మద్రాసు లలితాంగిగా పేరు పొందారు.

ఈమె 1928 జూలై 3వ తేదీన నాటి (మద్రాసు ప్రెసిడెన్సీ) నేటి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తల్లిదండ్రులు లతాంగి, కుత్తనూర్ అయ్యస్వామి అయ్యర్‌లు, తల్లే తొలి సంగీత గురువు.

ఆ రోజుల్లోనే కాన్వెంటులో విద్యను అభ్యసించారు. సీనియర్ కేంబ్రిడ్జి వరకు సాధారణ విద్యను అభ్యసించారు. డాక్టర్ చదవాలని ఈమె కోరిక. తల్లిదండ్రుల కోరికా అదే!

ఈమె తల్లి దేశమంతా తిరిగి సంగీత కచ్చేరీలు ఇచ్చేవారు. తల్లితో కలిసి వెళుతూ ఉండేది వసంత.

12 ఏళ్ళ వయసులో లతాంగి సిమ్లాలో సంగీత విభావరిలో పాల్గొన్నారు. తల్లితో కలిసి వసంత ఈ విభావరిలో గానాలాపన చేశారు.

బెంగుళూరులో ఒంటరిగానే సంగీత విభావరిలో పాల్గొని గీతాలాపన చేశారు. ఇది ప్రేక్షకులను, శ్రోతలను సమ్మోహనపరచింది.

14 సంవత్సరాల వయసులోనే ‘మద్రాసు లలితాంగి’గా ప్రకటించబడ్డారు. చిన్న వయసులోనే ఈమె ప్రతిభకు ఈ విధంగా గుర్తింపు లభించింది.

శ్రీ జి.యన్. బాలసుబ్రహ్మణ్యం ఈమె ప్రతిభను గుర్తించారు. శిష్యురాలిగా స్వీకరించి ఆమెకు సహజంగా, వారసత్వంగా లభించిన సంగీత కళకి మరింత మెరుగులద్దారు. ఈమె వైద్యవృత్తి మీద ఆకాంక్ష నుండి సంగీతం వైపు పూర్తిగా ధ్యాస పెట్టడానికి కారకులు జి.యన్.బాలసుబ్రహ్మణ్యం గారే!

గురువు గారి మాటల్లో “వసంత నిజమైన శిష్యత్వాన్ని వర్ణిస్తుంది. ఆమె అన్నింటినీ గ్రహిస్తుంది. కానీ ఆమె తన అద్భుతమైన సృష్టిలను ప్రదర్శిస్తుంది”. అన్నీ వింటారు కానీ తనకు నచ్చినట్లే చేస్తారని చెప్పేవారాయన.

1950 నాటికి సంగీతంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు. ఈమె విజయం మహిళా సంగీత కళాకారిణులకందరికీ విజయమని భావించారు.

ఇందుకు కారణం ఈమె చాలా ఓపికతో అన్వేషిస్తూ, రాగాలాపనలో సాహసోపేతంగా నూతన ఆవిష్కరణలను కొనసాగించగలగడమే.

అద్భుతమైన స్వరం, సుసంపన్నమయిన శ్రుతిలయల సొబగులు ఈమెను ప్రత్యేక సంగీత కళాకారిణిగా మలిచాయి. క్లిష్టమైన రాగాలాపన, కల్పనలలో శృతిభేదం అర్థమయ్యే మాదిరి ఆలపించడం ఈమె ప్రత్యేకత.

లతాంగికి పురందరదాసు కృతుల ఆలాపనలో అద్భుతమైన పేరుంది. ఇది వారసత్వంతో కుమార్తెకు లభించింది. తద్వారా పురందరదాసు దేవరనామాలను ఆలపిస్తూ విస్తృత ప్రచారం కల్పించారు యం.యల్.వి.

‘సింధుభైరవి’ రాగంలో పురందరదాసు “వెంకటచల నిలయం…” కూర్పును రూపొందించారు. నారాయణ తీర్థులు రాసిన ‘కళ్యాణ గోపాలం’ను కూడా సింధుభైరవి రాగంలోనే మార్చి ఆలపించారు.

శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్ సంగీత వేదిక మీద ప్రారంభించిన రాగం, తానం, పల్లవిలను ఈమె కొనసాగించి ప్రాచుర్యంలోకి తెచ్చారు.

ఈమె సంగీత కచ్చేరీలకు ఇంట్లో సాధన చేసేవారు కాదు. కార్యక్రమానికి వెళుతూ ‘కారులో కూర్చుని కంపోజ్ చేయడం తనని ఆశ్చర్యపరచేద’ని శిష్యురాలు సుధారంగనాథన్ చెప్పేవారు.

1948లో ‘కృష్ణభక్తి’ సినిమాలో నటించారు. ఈమె నటించిన ఒకే ఒక సినిమా ఇది.

స్వర్గీయ సి.ఆర్.సుబ్బురామన్ సంగీత దర్శకుడిగానే చాలామందికి తెలుసు. కాని ఆయన గాయకుడు కూడా! ఈమె సుబ్బురామన్‌తో కలిసి ‘పెళ్ళికూతురు’ సినిమాలో “విరజాజుల వల…”, “పాపులలో కడుపాపి…” పాటలను ఆలపించారు. ‘వచ్చిన కోడలు నచ్చింది’ సినిమాలో సుసర్ల దక్షిణామూర్తి ఈమె చేత పాటలు పాడించారు.

పెళ్ళికూతురు, బీదల పాట్లు, నవ్వితే నవరత్నాలు, సౌదామిని, నా యిల్లు, నాగులచవితి, వచ్చిన కోడలు నచ్చింది, భలే అమ్మాయిలు, మాయాబజార్, భూకైలాస్ సినిమాలలో ఈమె ఆలపించిన పాటలు విజయవంతమయ్యాయి. వీటిలో శాస్త్రీయ పోకడతో కూడిన పాటలే అధికం.

భూకైలాస్ సినిమాలోని “మున్నీట పవళించు నాగశయన… చిన్నారి దేవేరి సేవలు సేయా…” అనే దశావతారవర్లన పాట ఈ నాటికీ అజరామరంగా నిలిచే ఉంది. ఈ పాట సంగీతాభ్యాసకులు తప్పనిసరిగా సాధన చేయవలసిన పాట(ఠ)మని సినీవిమర్శకులు నొక్కివక్కాణించడం విశేషం.

“సుందరాంగ మరువగనేలోయ్! రావేలా! నా అందచందములు…” అనే ‘సంఘం’ సినిమాలోని వీణ పాటను మరవగలమా!

భూకైలాస్‌లోని “దేవ మహదేవ మము బ్రోవుము శివా”, “నీవే దానవా దేవమానవా!” పాటలు, ‘పెళ్ళికూతురు’ సినిమాలోని “1950కి 60కి తేడా”, “అంతా ప్రేమమయం…” వంటి పాటలు ఈమె గానగరిమకి తార్కాణం.

“శ్రీకరులు దేవతలు కరుణించగా” (మాయాబజార్), ‘భలే అమ్మాయిలు’ సినిమాలో “గోపాల జాగేలరా! బాలగోపాల జాగేలరా!” పూర్తి శాస్త్రీయ రాగాలాపనే! ఈ పాటని ఈమె పి.లీల కలిసి పోటాపోటీగా ఆలపించారు. అంతే పోటీగా నటీమణులు స్వర్గీయ సావిత్రి, గిరిజలు నటించారు. సంగీత కళాకారిణులలా వీరి ముఖకవళికలు, పాటలో స్వరాల కనుకూలంగా పెదవుల కదలికలు ప్రేక్షకశ్రోతలను అబ్బురపరుస్తాయి.

ఈ విధంగా కర్నాటక శాస్త్రీయ సంగీతంతో సమాంతరంగా సినిమా పాటలనూ ఆలపించి – ఆయా సన్నివేశాలను తన పాటలతో సుసంపన్నం చేశారు.

1975లో జి.వి అయ్యర్ నిర్మించిన ‘హంసగీతె’ కన్నడ సినిమాలో డా.యం.బాలమురళీకృష్ణ సంగీత దర్శకత్వంలో అష్టపదిని ఆలపించారు.

1951లో వికటం ఆర్.కృష్ణమూర్తిని వివాహమాడారు. వీరి పిల్లలు కె.శంకరరామన్, శ్రీవిద్య. స్వర్గీయ శ్రీవిద్య సినిమా నటిగా, శాస్త్రీయ సంగీత కళాకారిణిగా పేరు పొందారు.

ఈమె శిష్యులలో సుధారంగనాథన్, ఎ.కన్యాకుమారి, సి.హెచ్. రామచంద్రన్, త్రిచూర్.వి.రామచంద్రన్, శ్రీవిద్య, యమునా ఆర్ముగం వంటివారు పేరు పొందారు.

యమునా ఆర్ముగం, జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో నెలకొల్పిన రిషీ వాలీ స్కూల్లో సంగీత అధ్యాపకురాలిలా పని చేశారు. మలేషియాకు చెందిన తెలుగు పండితులు కూడా వీరి శిష్యులు కావడం విశేషం.

ఈమెకు 1970లో సంగీత నాటక అకాడమీ వారి ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. మైసూరు విశ్వవిద్యాలయం 1976లో డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ డాక్టరేట్ ఈమె పురందరదాసు కీర్తనల కోసం చేసిన కృషికి ప్రతిఫలం. 1977 భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’తో సత్కరించింది. 1987లో ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నైవారు సంగీత కళాశిఖామణి పురస్కారాన్నిచ్చి గౌరవించారు. మలేషియా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ మలేషియా గౌరవపురస్కారంతో గౌరవించింది.

ప్రతి సంగీత కచ్చేరి ఆయా సంగీత కళాకారులకి, వారి సామర్థ్యానికి పరీక్ష అని చెప్పేవారు ఆమె. కొద్ది లోపం జరిగినా అది సంగీత కళాకారుడినే కాదు, ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు పరీక్ష అనుకుని తయారవవలసి ఉంటుందని ఆమె చెప్పేవారు. ఈమె మొదటి శిష్యురాలు సరస్వతీ శ్రీనివాసన్ తరువాత 1960ల నాటికి ఈమె సహ సంగీతకారులవడం విశేషం.

ఈమె జ్ఞాపకార్థం 2018 జూలై 5వ తేదీన రూ.5-00/-విలువ గల స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

ఈమె జయంతి జూలై 3వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here