వీనస్ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్ మధుబాల

11
8

[dropcap]ఫి[/dropcap]బ్రవరి 23వ తేదీ ప్రముఖ నటి మధుబాల వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

“అందానికి అందం నేనే” అన్నారో సినీకవి. ఆ రీతిన అద్భుతం, అపురూపం, అబ్బురం, అద్వితీయమైన అందం ఆమె స్వంతం. ఆ ముఖబింబాన్ని ఎలాంటి లోటు లేకుండా సృష్టించాడు బ్రహ్మ అనడం అతిశయోక్తి కాదు. స్వర్ణయుగపు హిందీ చిత్రరాజాలను తన వైవిధ్యభరిత అభినయం, నాట్యవిన్యాసాలతో సుసంపన్నం చేశారు. ముగ్ధగా వయ్యారాలొలికించినా, గూఢచారిణిగా సస్పెన్స్ సృష్టించినా, సంప్రదాయ మహిళగా అలరించినా, గౌరవనీయ పాత్రలలో రాణించినా, ఆధునిక మహిళగా అధునాతనంగా కనిపించినా, హాస్యపాత్రలలో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టినా, క్లబ్ డాన్సర్ పాత్రలో కుర్రకారుకి వెర్రెక్కించినా, విషాద వేదనా భరిత పాత్రలలో కంటతడి పెట్టించినా ఆమెకి ఆమే సాటి.

అమిత పేదరికాన్ని అనుభవించి, నటనలో కీర్తిపతాకని ఎగురవేసి, అత్యధిక పారితోషికాన్ని తీసుకున్న నటిగా, గొప్ప వితరణశీలిగా, కన్న తండ్రి కర్కశ ప్రవర్తనతో పరిపరి విధాల నలిగిపోయిన అభాగ్యురాలిగా, వివాహితురాలయినా అనారోగ్యం వెన్నాడగా ఒంటరి అయిన ఆవేదనా భరిత జీవితమామెది. ఆమే ‘వీనస్ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్ మధుబాల’.

ఈమె 1933 ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజున ఢిల్లీలోని సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో 11 మంది పిల్లలలో ఒకరుగా జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఆయేషా బేగం, అతావుల్లాఖాన్‌లు. ఈమెకు వారు పెట్టుకున్న పేరు ముంతాజ్ జెహాన్ బేగం ద్లేహావి. వారి మత సాంప్రదాయం ప్రకారం పాఠశాలకు వెళ్ళలేదు. కాని తండ్రి దగ్గర హిందీ, ఉర్దూ భాషలను చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు. ఆ తరువాత పాస్తో భాషనీ నేర్చుకున్నారు. .

హిందీస్థానీలో మూడు మాండలికాలను స్వంతం చేసుకోగలిగారు. 1950లో సుశీలారాణి పటేల్ దగ్గర ఆంగ్ల భాషను అభ్యసించారు.

ఈమె తండ్రి పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో పని చేసేవారు. ఆ ఉదోగ్యం పోవడంతో జీవనోపాధిని వెతుక్కుంటూ బొంబాయి నగరాన్ని చేరుకున్నారు. అక్కడ కండివాలిలోని ఒక మురికివాడలో అద్దెకు ఉండేవారు.

తన అందమైన కుమార్తె ముంతాజ్‌ను సినిమానటిని చేయాలని, అలా తన ఆర్థిక సమస్యలను తీర్చుకోవచ్చని ఆయన ఆకాంక్ష.

9 ఏళ్ళ వయస్సులోనే ‘బసంత్’ అనే చిత్రంలో బాలనటగాయనిగా నటించింది బాలిక. అలా బాలనటిగా 1947 వరకు కొనసాగారు.

తర్వాత 1947లో నీల్ కమల్ అనే సినిమాలో రాజకపూర్ సరసన నటించారు. బాలనటిగా బేబీ ముంతాజ్ పేరుతోను, నీల్ కమల్ నాయికగా ముంతాజ్ బేగం పేరుతోను పేరు పొందారీమె.

‘నీల్ కమల్’ లో నాయికగా తన ప్రస్థానాన్ని ఆరంభించారు. చిత్తూరు విజయ్, లాల్‌దుపట్టా, అమర ప్రేమ, దౌలత్ వంటి సినిమాలలో నటించినా అంత పేరు పొందలేదు. 1949లో నటించిన ‘మహల్’ సినిమా ఈమె సాయిని అంబరాన నిల్చింది. ఆ తరువాత తరానా, ఖజానా, బాదల్, సాంగిల్, బహుత్ దిన్ హువే, అమర్, మిస్టర్ అండ్ మిసెస్ 55, యహుది లడ్కీ, గేట్ వే ఆఫ్ ఇండియా, ఏక్ సాల్, పోలీసు, ఫాగున్, కాలాపానీ, హౌరా బ్రిడ్జ్, చల్తీ కానామ్ గాడి, మొఘల్ – ఎ- ఆజం, బర్సాత్ కీ రాత్, ఝుమ్రా, బాయ్ ఫ్రెండ్, హాఫ్ టికెట్ మొదలయిన సినిమాలలో కథానాయిక పాత్రలలో జీవించారు. 1964లో షరాబి, 1971లో జ్వా ల ఈమె చివరి సినిమాలు.

ఈమె రాజ్ కపూర్, అశోక కుమార్, ప్రదీప్ కుమార్, దేవానంద్, దిలీప్ కుమార్, ప్రేమ్ నాథ్, గురుదత్, షమికపూర్, రెహమాన్, కిషోర్ కుమార్, సునీల్‌దత్, భరతభూషణ్ మొదలయిన హిందీ సినిమా కథానాయకులతో నాయికగా వైవిధ్యభరితమయిన పాత్రలను పోషించారు. అందరికీ సరిజోడుగా దీటుగా నటించి తన నటనా వైదుష్యాన్ని ప్రేక్షకులకు అందించారు.

నటీమణులు కామినీ కౌశల్, సురయ్యా, గీతాబాలి, నళినీజయవంత్ వంటి వారి కలిసి పోటాపోటీగా నటించారు.

కమల్ అమ్రోహి, మెహబూబ్ ఖాన్, గురుదత్, కె.ఆసిఫ్, మోహన్ సిన్మా సోహ్రబ్ మోడి, కిదార్ శర్మ, అమియా చక్రవర్తి, ఓం ప్రకాష్, రాజ్ ఖోస్లా, శక్తి సామంత మొదలైన దర్శకుల దర్శకత్వంలో నటించి రాణించారామె. ఈ దర్శకులందరూ ఈమె అందచందాలను, సౌకుమార్యాన్ని, నటనాట్య కౌశల్యాలను తమ ప్రతిభా పాటవాలతో వెలుగులోకి తెచ్చి వెండితెరని వెలిగించారు. ప్రేక్షకుల మదిలో ఆమె సుస్థిర స్థానం పొందేటందుకు దోహదం చేశారు.

మహల్‍లో ఆత్మగా, అమర్, మిస్టర్ అండ్ మిసెస్ 55లలో రొమాన్స్ – హస్యసమ్మిళిత పాత్రలలో, కాలా పానీలో జర్నలిస్ట్‌గా బాయ్ ఫ్రెండ్, హాఫ్ టిక్కెట్ లలో హాస్యనాయికగా, చల్తీ కా నామ్ గాడీలో ఆధునిక నగర యువతిగా, హౌరాబ్రిడ్జ్ లో క్లబ్ డ్యాన్సర్ గా, గేట్ వే ఆఫ్ ఇండియా, ఏక్ సాల్ చిత్రాలలో బహు పాత్రాభినయం చేసిన నటిగా, మొఘల్ – ఎ – ఆజంలో విఫల ప్రేమికురాలిగా నటించారు ఈమె.

లతాజీ తొలిపాట”ఆయెగా ఆయెగా ఆయేగా అనేవాలా” (మహల్), “దిల్ హై ఆఫ్ కో హుజూర్ లిజియే” (జాలినోట్), “అచ్చా జీ మెయిన్ హారి చల్ మాన్ జావోనా” (కాలాపానీ), “ఆయియే మెహరుబా దేఖియే జానే జా” (హౌరా బ్రిడ్జ్), “ఏక్ లడ్కీ భీగీ బాగీసి” (చలీకానామ్ గాడి), ‘జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా” (మొఘల్ – ఎ-ఆజం) మొదలయిన గీతాలు ఈమె నటన, నాట్య వైరుధ్యాలకు తార్కాణం. ఈమె చిత్రాలలోని పాటలలో సింహభాగం ఈ నాటికీ అజరామరంగా నిలిచి ప్రేక్షక శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి.

ఈమె ఆడంబరంగానే బతికారు. తన ఇంటికి ‘అరేబియన్ విల్లా’ అని పేరు పెట్టుకున్నారు. ఈమెకి ఆ రోజుల్లో పేరు పొందిన బ్యూక్, చవర్లెట్, హిల్‌మన్, టౌన్, స్టేషన్ వాగన్ మొదలయిన కంపెనీలకు చెందిన ఐదు కార్లుండేవి. 18 ఆల్సేషియన్ కుక్కలను పెంచారు. దానగుణం ఎక్కువే.

శ్రీ బాబూరావ్ పటేల్ ఈమెని ‘క్వీన్ ఆఫ్ ఛారిటీస్’ అని ప్రశంసించారు. ఆ రోజుల్లో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు పోలియో వ్యాధి బారిన పడి దివ్యాంగులయ్యేవారు. ఈమె తన ప్రాంతంలోని ఈ వ్యాధి బాధితులయిన పిల్లలకు ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున సహాయం అందించి వారి కుటుంబాలకు దేవత అయ్యారు. జమ్ముకాశ్మీర్, పాకిస్థాన్ లోని తూర్పు బెంగాల్ శరణార్థుల సహాయనిధులకి విరివిగా విరాళాలను అందించారు. ఈమె అందించే ధన సహాయాలకి కూడా మతాన్ని ప్రస్తావించిన విమర్శలు ఈమెను అమితమైన మానసిక వేదనకి గురిచేశాయి. అప్పటి నుండి గుప్తదానాలను చేసేవారు.

1962లో ‘Film & Television Institute of INDIA’ కు క్రేన్ కెమెరాని బహూకరించారు. ఈనాటికీ అది పని చేస్తుండడం విశేషం.

బొంబాయి ఆకాశవాణి కేంద్రంలో ఖుర్షీద్ అన్వర్ సంగీతరచన చేసిన గీతాలను ఆలపించారు.

లతాజీ అద్భుతంగా ఆలపించిన ‘మహల్’ సినిమాలోని పాటలకు తెర మీద జీవం పోశారు ఈమె. వీరిద్దరికీ గొప్ప పేరు తెచ్చి, హిందీ సినిమా సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాన్ని చేర్చిన చిత్రమిది. ‘బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూబ్’  రూపొందించిన అంచనాల ప్రకారం 10 గొప్ప ‘రొమాంటిక్, హారర్ చిత్రాల’లో ఈ సినిమా ఒకటి కావడం భారతీయ సినిమాకి గర్వకారణం. ఇంకా 114 బాలీవుడ్ హారర్ చలన చిత్రాలు ‘దట్ యు జస్ట్ కెన్ స్కూప్‌పూప్’ జాబితాలో దీనికి స్థానం లభించింది.

‘మధుబాల ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో చిత్రనిర్మాణ సంస్థని స్థాపించారు ఈమె. నాటా, మెహ్లాన్ కే ఖ్వాబ్, పఠాన్ అనే మూడు హిందీ సినిమాల నిర్మాత్రి.

1969లో ‘ఫర్జ్ ఔర్ ఇష్క్’ అనే చిత్రాన్ని తన దర్శకత్వంలో మొదలు పెట్టారు. కాని ఇమె అనారోగ్యం వల్ల నిర్మాణం ఆగిపోయింది.

బాలీవుడ్ సినీ పరిశ్రమలో తొలి భయానక చిత్రంగా పేరు పొందిన ‘మహల్’ సినిమాలోని నాయిక పాత్రని చాలా మంది నాయికలు తిరస్కరించడం వలన, అనార్కలి సినిమాలోని అనార్కలి పాత్ర కోసం జరిగిన ఆడిషన్లో ఎవరు ఎంపిక కాకపోవడం వల్ల ఈ పాత్రలు ఈమెని వరించి తరించాయి. ఈ రెండు సినిమాలు ఆయాకాలాలకు సంబంధించి బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలవడం ఒక గొప్ప రికార్డు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప చారిత్రక విశేషం.

హాలీవుడ్‌లో మెరిసిన తొలి బాలీవుడ్ తార ఈమె. 1952 లోనే అమెరికన్ మ్యాగజైన్ ‘థియేటర్ ఆర్ట్స్’ లో ఈమె ప్రస్తావన కనిపిస్తుంది. “The biggest star in the world and she is not in Beverley Hills’ ‘ అనే శీర్షికతో వ్యాసాన్ని ప్రచురించారు.

హాలీవుడ్ సినిమా సినిమాలో నటించమని అవకాశాన్ని అందుకున్న తొలి భారతీయ నటి కూడా ఈమె. అయితే అది కలలాగానే మిగిలింది. అమెరికన్ దర్శకుడు ఫ్రాంక్ కప్రా అందించిన అవకాశాన్ని ఈమె తండ్రి అంగీకరించలేదు.

1950లో ఈమె నటించిన ‘హంస్తే అన్సూ’ ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ వారి చేత ‘A’ సర్టిఫికేట్ పొందిన తొలి హిందీ సినిమాగా రికార్డును సృష్టించడం విశేషం.

ఆ రోజులలో నటీనటులే తమ పాటలను పాడుకునేవారు. ఈమె కూడా తను బాలనటిగా నటించిన బసంత్, పూజారి మొదలయిన సినిమాలలో బాలనటగాయనిగా నటిస్తూ ఆలపించారు.

ఈమె తనకి ‘ధాకే కీమల్మాల్’ షూటింగ్ లో పరిచయమయిన నటుడు,

గాయకుడు కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకునే ద్దరూ కలిసి చలీ కానమ్ గాడి, హాఫ్ టికెట్, ఝుమ్రూ, మహల్ కే ఖ్వాబ్ సినిమాలలో నటించారు. వివాహమయిన తరువాత లండన్ వెళ్ళారు. వీరితో కలిసి మధుబాల వైద్యులు కూడా వెళ్ళారు. అంతకు ముందు కొన్ని సినిమాల షూటింగ్ సందర్భాలలోను, ఇతర సందర్భాలలోను ఈమెకు రక్తపు వాంతులు అయ్యాయి. అయితే ఈమెతో సహా పరిశ్రమ కూడా ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వలేదు.

లండన్ వైద్యులు ఈమెని పరీక్షించి ‘వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్’ (పుట్టకతో వచ్చే గుండె జబ్బు) గుండెలో రంధ్రంగా నిర్ధారించారు. రెండు సంవత్సరాలు మాత్రమే జీవిస్తారని కూడా ఊహించి చెప్పారు.

ఆ తరువాత ఈ దంపతులు స్వదేశానికి వచ్చారు. ఆమె కొద్ది రోజులు మాత్రమే భర్త ఇంట్లో ఉన్నారు. ఈమెకు సహాయకురాలిని ఏర్పాటు చేసి, వైద్య ఖర్చులు వంటివన్నీ కిషోర్ చూసుకున్నారు. ఆమె ఒంటరితనం భరించలేక తన ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడప్పుడు కిషోర్ పరామర్శించేవారు.

వైద్యులు నిర్ధారించిన రెండు సంవత్సరాలు కాకుండా ఈమె 9 సంవత్సరాలు జీవించడం విశేషం. అయితే ఈమె చాలా శారీరక బాధలను అనుభవించారు. శరీరం కృశించి పోయింది. చివరకు బొంబాయిలోని బ్రీచ్ కాండీ హాస్పటల్లో 1969 ఫిబ్రవరి 23వ తేదీన మరణించినారు.

అతి తక్కువ కాలంలో 70కి పైగా సినిమాలలో నటించారీమె. గొప్ప ఐకానిక్ హోదాను సంపాదించారు. ‘మొఘల్ – ఎ – ఆజమ్’ లోని అనార్కలి పాత్ర పోషణతో ఈమె ఈ హోదాని సాధించగలిగారు.

‘అల్లా మెయిన్ మర్నా నహిన్ చాహ్తీ’ (దేవుడా నాకు చావాలని లేదు) అని కోరుకోవడం వల్లనే అంతకాలం బ్రతకగలిగారని అనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే గీతాదత్, వహీదా రెహమాన్లు ఇద్దరికీ ఈమె సన్నిహితులు కావడం.

ఖతీజా అక్బర్ ‘I Want to live-The story of MADHUBALA’ పేరుతోను, UBS పబ్లిషర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వారు ‘MADHUBALA Her life And Her Films’ గ్రంధాలలో ఆమె జీవితం గ్రంధస్థం చేయబడింది.

‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ ఈమెను ‘భారత వెండితెరపై తొలి అందం’ అని; ‘టైమ్’ పత్రిక ‘క్యాష్ కర్రీ స్టార్’ అని, Rediff.com ‘సమకాలీనుల కంటే శక్తివంతమైన ప్రముఖురాలు’ అని ప్రశంసించాయి.

“ఆమె జీవించి ఉంటే తన సమకాలికులని మించి పోయేది” అని దిలీప్ కుమార్ ప్రశంసించారు.

లక్స్, గోద్రేజ్ కంపెనీల అంబాసిడర్ అవడానికి కూడా ఆమె అందమే కారణం. మయన్మార్, ఇండోనీషియా, మలేషియా, తూర్పు ఆఫ్రికా, గ్రీస్ వంటి దేశాలలో కూడా ఈమెకు అభిమానులు ఉండడం భారతీయులుగా మనకు గర్వకారణం.

ఆ రోజుల్లో అత్యధిక సారితోషికం తీసుకున్ననటీమణిగా రికార్డు సృష్టించారు. 1951 నాటికీ సినిమాకి 1.5 లక్షల రూపాయలు వసూలు చేశారని అంచనా. ‘మొఘల్ – ఎ- ఆజంకు ‘ 3 లక్షల రూపాయలు పారితోషికం అందుకున్నారు.

2008 మార్చి 18వ తేదీన ఈమె జ్ఞాపకార్థం 5 రూపాయల విలువతో ఒక స్టాంపుతో పాటు ‘మినియేచర్ షీట్’ ను కూడా విడుదల చేసారు. ఇప్పటి వరకు మినియేచర్ షీటు మీద మురిసి మెరిసిన ఏకైక నటీమణి ఈమే! స్టాంపులో పొందుపరిచిన చిత్రానికి తోడు మరో మూడు ముఖ చిత్రాలను జతపరిచి ఈ షీటును విడుదల చేసారు. ఈ ఓటుకి రెండు వైపుల ఫిల్మ్ స్ట్రిప్ ముద్రించబడింది. ఈ ఫిల్మ్ స్ట్రిప్ మధ్యలో ఎడమ వైపున ఈమె మూడు చిత్రాలు, కుడివైపున స్టాంపు ముద్రించబడింది.

మరొక ప్రత్యేకత నటీమణులలో ఈమెకే దక్కింది. తపాలాశాఖ 25 మంది ప్రముఖుల స్టాంపులను బంగారు తాపడంతో విడుదల చేసింది. స్వర్ణయుగ హిందీ సినిమా ఐకాన్‌ను స్వర్ణమధుబాలగా కూడా మనకి చూపించారు.

గులాబి రంగులో ముద్రించిన ఈ స్టాంపులో “మధుబాల – సుమబాల ఓహో! గులాబిబాల!” అనిపిస్తూ – కనిపిస్తూ మనని అలరిస్తుంది. ఇంత గొప్పగా ఆమెని గౌరవించిన భారత తపాలాశాఖ అభినందనీయం.

ఫిబ్రవరి 23వ తేదీ ఈమె వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here