నోబెల్ బహుమతుల కుటుంబీకురాలు శ్రీమతి మేరీ పియరీ క్యూరీ

6
6

[dropcap]న[/dropcap]వంబర్ 6వ తేదీ మేరీ క్యూరీ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ప్రపంచ ప్రసిద్ధి పొందిన భౌతిక, రసాయన శాస్త్రజ్ఞురాలు, ఈ రెండు శాస్త్రాలలో నోబెల్ బహుమతులను పొందిన ఏకైక మహిళ, 5 నోబెల్ బహుమతి స్వీకర్తల కుటుంబీకురాలు, దేశభక్తి కుటుంబానికి చెందిన వ్యక్తి, (తన మాతృదేశం పోలెండ్ పేరు మీద తను కనుగొన్న ‘పోలోనియం’ అనే మూలకానికి పేరు పెట్టడం ఈమె దేశభక్తికి తార్కాణం), రేడియో ఇన్స్టిట్యూట్‌లకు డైరెక్టరయిన తొలి మహిళ, సోర్బోన్‌లో ప్రొఫెసర్‌గా పని చేసిన తొలి మహిళ, సైన్సెస్ ఫ్యాకల్టీగా జనరల్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా నియమితురాలైన తొలి మహిళ, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రేడియోలజీ ఇన్‌స్టిట్యూట్ ద్వారా క్షతగాత్రులకు శస్త్రచికిత్సలకు తోడ్పడిన ఏకైక మహిళామూర్తి శ్రీమతి మేరీ క్యూరీ.

ఈమె అసలు పేరు మారియా స్లోడొస్క, తల్లిదండ్రులు బ్రోని స్లావా, వ్లాడిస్లాస్లాడొస్కిలు. వీరిద్దరు ఉపాధ్యాయులు. తండ్రి శాస్త్ర విజ్ఞాన, భౌతిక శాస్త్రాలను బోధించేవారు. వార్సాలోని పాఠశాలలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు మేరీ. ఇక్కడే ఫ్లోటింగ్ విశ్వవిద్యాలయంలో చదివారు. 1883లో అండర్ గ్రాడ్యుయేషన్లో అత్యధిక మార్కులతో బంగారు పతకాన్ని పొందారు. సోర్బోన్‌లో గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రాలను అభ్యసించారు.

1889 నుండి 1891 వరకు వార్సాలో గడిపింది. వార్సాలో ఆమె బంధువు జోజెఫ్ బోగుస్కీ ఒక ప్రయోగశాలను నిర్వహించేవారు. అది రసాయన ప్రయోగశాల. అక్కడ 1890-91 వరకు ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. రష్యన్ రసాయన శాస్త్రజ్ఞుడు డిమిత్రి మెండలీవ్‌కు సహాయకురాలిగా పని చేశారు.

ఆర్థిక ఇబ్బందులను ట్యూషన్లు చెప్పడం ద్వారా అధిగమించారు. కష్టపడి, శ్రద్ధగా చదివి 1893లో భౌతికశాస్త్రంలో పట్టాను పొందారు.

గాబ్రియేల్ లిప్‌మన్ నడుపుతున్న ప్రయోగశాలలో పని చేశారు. ఫెలోషిప్‌ను సంపాదించి చదువును కొనసాగించారు. 1894లో పారిస్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని సంపాదించారు.

1984లో స్కూల్ ఆఫ్ ప్రొఫెసర్ – పియరీ క్యూరీని కలిశారు. ఇద్దరూ కలిసి అయస్కాంత తత్వంపై పరిశోధనలు చేశారు. 1895లో మేరీ, పియరీ క్యూరీల వివాహం జరిగింది. మేరీ క్యూరీగా మారారు.

శ్రీ హెన్రీ బెకరల్ ఈమెకి పరిశోధన సలహాదారుగా ఉన్నారు.

మేరీ, పియరీ ఇద్దరూ కలిసి పరిశోధనలను కొనసాగించారు. ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడం వీరి పరిశోధనలను మెరుగుపరచింది. వీరి పరిశోధనలు ముఖ్యంగా అణుధార్మికత (Radio Activities) గురించి జరిగాయి. ఈ విషయంలో తరువాత శాస్త్రవేత్తలకు మార్గదర్శకులయ్యారు.

పిచ్‌బ్లండ్ ఖనిజం నుండి యురేనియంను వేరు చేశారు. 1898 నాటికి పిచ్‌బ్లండ్‌లో యురేనియం కన్న ఎక్కువ ధార్మికత కలిగిన పదార్థం ఉందనే విషయాన్ని కనుక్కున్నారు. థోరియంలో కూడా రేడియో ధార్మిక పదార్థాలున్నాయని కనుగొన్నారు మేరీ. పోలోనియం, రేడియంలను విడగొట్టారు. ఒక టన్ను ఖనిజాన్ని విడగొట్టి, వేడి చేసి కొన్ని నెలలపాటు ప్రయోగాలు చేశారు. పరిశోధన జరిగే సమయంలో రహస్యంగా ఉంచాలి. అలాగే వీరి పరిశోధనాంశాలను రహస్యంగా ఉంచారు. 1898 డిశంబర్ 26వ తేదీన తమ పరిశోధనా ఫలితాలను వెలువరించారు. పోలోనియం, రేడియం మూలకాలకు పేర్లు పెట్టింది ఈ దంపతులే!

1903లో హెన్రీ బెకరల్ పర్వవేక్షణలో ESPCI (ECOLE Superieure de physiqueet de chimie industrielles de la ville de) కోర్సును పూర్తి చేశారు. ఈ కోర్సు పూర్తి చేయడంతో పారిస్ విశ్వవిద్యాలయం నుండి D.Sc (Doctor of Science) పట్టాను స్వీకరించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

ఈ దంపతులు 1903లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వివాహిత జంటగా తొలి రికార్డు వీరిదే! వీరితో కలిసి ఈ బహుమతిని పంచుకున్న మూడవ వ్యక్తి హెన్రీ బెక్వెరల్.

1906లో పియరీ క్యూరీ మరణించారు. ఆమె క్రుంగిపోయారు. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో పరిశోధనలను కొనసాగించారు.

1906లో సైన్సెస్ ఫ్యాకల్టీలో జనరల్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో బాధ్యతలను స్వీకరించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

రేడియోధార్మిక ఐసోటేపులను వేరు చేసే పద్ధతులను కనిపెట్టారు. పోలోనియం, రేడియం వంటి మూలకాలని కనుక్కున్నారు. ఈ పరిశోధనలకు గాను 1911లో రసాయన శాస్త్రంలో ‘నోబెల్ బహుమతి’ని అందుకున్నారు.

తరువాత నెలరోజులకే ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఇంగ్లాండ్‌లో గడిపారు.

1912లో వార్సా సైంటిఫిక్ సొసైటీ ప్రయోగశాలలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1914లో పారిస్ విశ్వవిద్యాలయంలో రేడియం ఇన్స్టిట్యూట్‌ని ప్రారంభించారు. దీనికి డైరెక్టర్‌గా మేరీ క్యూరీ నియమితులయ్యారు.

1914లో మొదటి ప్రపంచయుద్ధంలో ఈమె నిర్వహించిన పాత్ర అద్వితీయం. యుద్ధంలో శాస్త్రవేత్త పాత్ర ఏమిటా అని అనుమానం రావచ్చు. అవును శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంటుంది.

యుద్దంలో గాయపడిన సైనికులకి శస్త్ర చికిత్సలు చేసేటందుకు రేడియోలాజికల్ కేంద్రాలు చాలా చాలా అవసరం. రేడియాలజీ, అనాటమీ, ఆటోమోటివ్ మెకానిక్, వాహనాలు, అంబులెన్లు, జనరేటర్లు, అవసరమయినపుడు మొబైల్ రేడియోగ్రఫీ యూనిట్లని అభివృద్ధి చేశారు. 1914లో మొదటి మిలిటరీ రేడియాలజీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈమె కుమార్తె ఐరీన్ క్యూరీ, మిలిటరీ వైద్యులు సహాయసహకారాలను అందించారు.

ఈమె ఆధ్వర్యంలో 20 మొబైల్ రేడియోలాజికల్ వాహనాలు, 200 రేడియోలాజికల్ యూనిట్లు పని చేశాయట. మిలియన్ మంది గాయపడిన సైనికులకు ఈ యూనిట్లలో చికిత్స అందిందని ఒక అంచనా. తనకి నోబెల్ బహుమతి ద్వారా లభించిన ధనాన్ని ఖర్చులకు వినియోగించారామె. బంగారు పతకాలని అమ్ముదామని ప్రయత్నించారు. కాని అవి ఎవరూ కొనలేదు. దీనిని బట్టి ఈమె దేశభక్తి అర్థమవుతుంది.

రేడియంను కనుగొన్న రజతోత్సవ సంత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈమెకి స్టెఫండ్‌ను మంజూరు చేసింది. 1921లో అమోరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు హార్డింజ్ ఈమెకు 1గ్రాము రేడియంను బహుమతిగా అందజేశారు.

ఈమె నేతృత్వంలో శాస్త్ర పరిశోధనలు చేసిన కుమార్తె ఐరెన్ జోలియట్ – క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీలు కూడా నోబెల్ బహుమతి గ్రహీతలుగా విజయం సాధించారు.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం వివిధ అంతర్జాతీయ సంస్థలలో పనిచేశారు. యుద్ధం తరువాత అంతర్జాతీయ పరిణామాలను విశ్లేషించడం కోసం ‘నానా జాతి సమితి’ స్థాపించబడింది. ఇందులో ‘అంతర్జాతీయ మేధో సహకారం’ కోసం ఏర్పాటు చేసిన సంస్థలో పనిచేశారు.

1929లో వార్సా రేడియం ఇన్స్టిట్యూట్‌ లోను, పారిస్ రేడియం ఇన్స్టిట్యూట్‌ లోను,1930లో  ఇంటర్నేషనల్ అటామిక్ వెయిట్స్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.

ఈమె వివిధ సమయాలలో రేడియం పరిశోధనలు జరిపినపుడు, యుద్ధంలో రేడియోథెరపీ కేంద్రాలు ఏర్పాటు చేసినపుడు, రేడియోధార్మిక కిరణాలు ఈమెను అనారోగ్యానికి గురిచేశాయి.

అనార్యోగంతో 1934 జూలై 4వ తేదీన ఫ్రాన్స్ లోని హాట్- సావోయిలో మరణించారు. ఈమె జీవితం తరువాత తరాల వారికి రక్షణదుస్తుల ఆవశ్యకతను తెలియజేసింది.

ఈమె రీసెర్సెస్ సబ్‌స్టాన్సెస్ రేడియో యాక్టివిటీస్‌ను 1904లో, ఐసోలేట్ ఎలిమెంట్స్ ఐసోటోప్ అండ్ క్లాసిక్ ట్రెయిటీ డీ రేడియో యాక్టివైట్‌ను 1910లో వ్రాసి శాస్త్ర విజ్ఞాన ప్రపంచానికి అందించారు.

ఫ్రాంకోయిస్ గిరౌడ్ ఈమె జీవితాన్ని ‘మేరీ క్యూరీ: ఎ లైఫ్’ పేరుతో గ్రంథస్థం చేశారు.

ఈమె కొన్ని బహుమతులు భర్తతో కలిసి, కొన్ని స్వయంగా స్వీకరించారు. భర్త పియరీతో కలిసి 1903లో భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి, డేవీ పతకం, 1904లో మాట్యుచి పతకాలను పొందారు.

స్వయంగా 1907లో యాక్టోనియన్ ప్రైజ్, 1909లో ఇలియట్ క్రెస్పన్ మెడల్, 1911లో రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి, 1921లో అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ వారి ఫ్రాంక్లిన్ మెడలను పొందారు.

ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.

ది రాయల్ డానిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో, ఐయోటా సిగ్మా పై మహిళా శాస్త్రవేత్తల సంఘంలో, పోలిష్ కెమికల్ సొసైటీలో సభ్యురాలిగా పని చేసిన ఏకైక మహిళా శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచారు.

పరమాణు సంఖ్య 96 ఉన్న మూలకానికి ఈమె పేరు మీద ‘క్యూరియం’ అని పేరు పెట్టి గౌరవించారు. మూడు రేడియో ధార్మిక ఖనిజాలు ఈమె పేరు మీదుగా క్యూరట్, స్లో డోవస్కైట్, కుప్రోస్క్‌లోడోవ్‌స్కైట్ పేర్లతో పిలువబడుతున్నాయి. ఈమెకి రేడియోధార్మికతకీ ఉన్న అనుబంధం ఈ విషయంతో తేటతెల్లమవుతుంది.

ఈమె జీవితం ఎన్నో గ్రంథాలలో, సినిమాలలో నిక్షిప్తం చేయబడింది. విశ్వవ్యాప్తంగా ఈమె పేరు చిరస్మరణీయం. ప్రపంచ మహిళా శాస్త్రజ్ఞులలో మరకత మాణిక్యమని చెప్పొచ్చు.

ఈమె జ్ఞాపకార్థం 1968వ సంవత్సరం నవంబర్ 6వ తేదీన 20 పైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. ఈ స్టాంపు మీద కుడివైపున మేడమ్ క్యూరీ చిత్రం కనిపిస్తుంది. ఎడమవైపున రేడియోధార్మిక కిరణాలను పంపుతున్న దృశ్యం కనిపిస్తాయి. ఒక గొప్ప వైద్య శాస్త్రజ్ఞురాలికి మనదేశం అందించిన గొప్ప నివాళి ఇది.

ఈమె జయంతి నవంబర్ 6వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here