చిరంజీవి – మార్కండేయ మహర్షి

0
7

[dropcap]మ[/dropcap]న పురాణాల్లో ప్రస్తావించబడే మహర్షులలో చిరంజీవిగా వరాలు పొంది లోక కళ్యాణము కోసము రాజులకు ఇతర మునులకు మంచి విషయాలనేకము బోధించిన మహర్షి మార్కండేయుడు. అందుచేతనే నేటికీ తల్లిదండ్రులు వారి పిల్లలను మార్కండేయుడిలా చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ దీవిస్తుంటారు. మనము ఇప్పుడు మార్కడేయుడి జన్మ వృత్తాంతము, అయన చిరంజీవిగా ఎలా అయినాడు, అయన గొప్పతనము, అయన భోధనలు మొదలైన అంశాలను తెలుసుకుందాము.

మనకున్న 18 పురాణాలలో మార్కండేయ పురాణము ఒకటి ఈ పురాణములో శివకేశవుల మహత్యాలు,ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యము, దేవి మహత్యము వివరిచబడ్డాయి.

మార్కండేయుడు మృకండుడు అనే మహర్షి కుమారుడు. ఈయన భృగు మహర్షి కుమారుడైన విధాత కొడుకు. మృకండుని భార్య మరుధ్వతి. వారికి సంతానము లేకపోతే పై లోకాలలో ఉత్తమ గతులు ఉండవు కాబట్టి  మృకండుడు భార్యతో వారణాసి చేరి శివుని కోసము ఘోర తపస్సు చేస్తాడు. అయన తపస్సులో లీనమై నిశ్చలముగా రాయిలా ఉన్న సమయములో జంతువులు వాటి దురద తీర్చుకోవటానికి రాయిలాంటి అయన శరీరానికి రుద్దుకొని వాటి దురదను తీర్చుకోవటం వల్ల ఆయనకు మృకండుడు అనే పేరు వచ్చింది. శివుడు ఈ ఘోర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి, “నీకు సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే కుమారుడు కావాలా? లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా?” అని అడిగితే మృకండుడు 16 ఏళ్ళు బ్రతికినా సద్గుణుడైన కుమారుడే కావాలి అని అడుగుతాడు. శివుడు సంతసించి పుత్రుడిని ఇచ్చాను అని చెప్పి అదృశ్యమవుతాడు.

శివుని వరము ప్రకారము గర్భవతి అయిన మరుద్వతి దివ్య తేజస్సు కలిగిన కుమారుడిని కంటుంది. కుమారునికి మార్కడేయుడు అని నామకరణము చేస్తారు. 7 సంవత్సరాల 3 నెలలు నిండినాక మార్కండేయునికి ఉపనయనము చేస్తారు. ఒకరోజున సప్తరుషులు మృకండ మహర్షి ఆశ్రమానికి వస్తే మార్కండేయుడు వారికి నమస్కరించగా వారు చిరంజీవ అని దీవిస్తారు. మృకండుడు సప్త ఋషులకు ఈశ్వరుడు ఇచ్చిన వరము గురించి చెప్పగా వారు దివ్యదృష్టితో జరిగిన విషయాన్నీ తెలుసుకుంటారు. వారు మార్కండేయుని బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళ్లి బ్రహ్మ చేత కూడా చిరంజీవి అని దీవింప చేస్తారు. నారదుడు కూడ మార్కండేయునికి నిరంతము శివనామ జపము చేయమని సలహాయిస్తాడు.  అలాగే మార్కండేయుడు దీక్షతో శివనామ జపము చేస్తూ కాలము గడుపుతూ ఉంటాడు. నారదుడు సప్తఋషుల బ్రహ్మ దీవెనల గురించి యమ ధర్మరాజుకు  చెప్పి 16 ఏళ్ళు నిండినాక మార్కండేయుని ప్రాణాలు తీయకపోతే యముడు అంటే లోకాల్లో భయము ఉండదు అని యమునితో అంటాడు.

16 ఏళ్ళు నిండిన మార్కండేయుని ప్రాణాలు తీయటానికి ముందు యమభటులు పంపితే వారు మార్కండేయుని తేజస్సు చూసి దగ్గరకు చేరలేక పోతారు. అప్పుడు యముడే స్వయముగా భూలోకానికి వచ్చి తన యమపాశాన్నిమార్కండేయుని మీదకు విసిరే ఆ సమయానికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని దీక్షతో శివుని నామాన్ని జపిస్తూ ఉంటాడు. అప్పుడు శివలింగము నుండి శివుడు ప్రత్యక్షమై తన భక్తుడిని కాపాడటానికి కాలరుద్రుడై యముని పైకి వస్తాడు. అప్పుడు యముడు భయపడి మార్కండేయుని ప్రాణాలను వదలివేస్తాడు. శివుడు నీవు చిరంజీవిగా ఉంటావని దీవించి అదృశ్యము అవుతాడు. ఆవిధముగా బ్రహ్మ, శివుని వరాల వల్ల యమపాశము నుండి తప్పించుకున్న మార్కండేయుడు, ‘అసలు చావే లేకుండా ఉండాలంటే ఏమి చేయాల’నీ శివుని ప్రార్థించి అడుగుతాడు. శివుడు విష్ణుమూర్తిని ప్రార్థించమని చెపుతాడు. మార్కండేయుడు తపస్సు మొదలుపెడితే ఇంద్రుడు తపస్సు భగ్నము చేయాలని ప్రయత్నించినా, మార్కండేయుడు దీక్షగా పదివేల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తి ద్వారా చావు అనేది లేకుండా ఉండేటట్లు వరము పొందుతాడు.

వరము పొందిన మార్కండేయుడు విష్ణుమూర్తిని ధ్యానము చేస్తూ భూలోక సంచారము చేస్తుండగా ఒక పెద్ద ప్రళయములో చిక్కుంటాడు. ఆ తరువాత విష్ణుమూర్తిచే రక్షింపబడి అదంతా విష్ణుమూర్తి మాయగా తెలుసుకుంటాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై సృష్టి రహస్యాలను మార్కండేయునికి చెప్పి నీకు ఏమి భయము లేదు అని చెప్పి అంతర్ధానము అవుతాడు. మార్కండేయుడు మళ్ళీ తపస్సులోకి వెళతాడు. పాండవులు అరణ్యవాసము చేస్తున్నప్పుడు వారు మార్కండేయుని కలుస్తారు. శ్రీకృష్ణుడు ధర్మరాజు సందేహాలను తీర్చమని మార్కండేయునికి చెపుతాడు. ధర్మరాజు కర్మగతులను వివరించామని అడుగుతాడు. “సృష్టిలోని మొదటి కల్పంలో బ్రహ్మ పవిత్రమైన ధర్మముతో కూడుకున్న మనుష్యులను పుట్టించాడు. వారు మంచి సత్ప్రవర్తన కలిగి సత్య సంకల్పము ఉన్నవాళ్ళు, జ్ఞావంతులు, ఆయుష్షు ఎక్కువగా ఉన్నవాళ్ళు. రాను రాను తక్కువ ఆయుష్షు, సత్ప్రవర్తన లేనివాళ్లు పుట్టి వారి వారి పాప పుణ్యాలను బట్టి పుడుతూ చస్తూ వారి వారి కర్మ ఫలాలను అనుభవిస్తున్నారు. ధర్మ మార్గములో ప్రయాణించేవారు పుణ్యాన్ని పొందుతున్నారు. ఇదే కర్మ గతి” అని సూక్షముగా ధర్మరాజుకు మార్కండేయుడు ఉపదేశిస్తాడు. ధర్మరాజుకు మార్కండేయుడు బ్రాహ్మణ ప్రభావము గురించి దుందుమారుడనే రాజు గురించి, అత్రి గౌతముల వాదన గురించి, వైవస్వత చరిత్ర గురించి వాసుదేవుని చరిత్ర గురించి లాంటి అనేక విషయాలను ధర్మారాజు సందేహాలకు జవాబులుగా చెపుతాడు. ఆ విధముగా ధర్మరాజు మార్కండేయుని ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటాడు.

మార్కండేయుడు తన ఆశ్రమానికి వచ్చిన గౌరముఖ మహర్షికి పితృదేవతల గురించి వివరిస్తాడు. ధర్మ పక్షుల గురించి ఆయనకు చెప్పినదే మార్కండేయ పురాణముగా పిలుస్తారు. మనకు ఉన్న 18 పురాణాలలో చిన్న పురాణము ఇదే. అలాగే క్రొష్టికి అనే ముని ఈయన సందర్శనార్ధము వచ్చినప్పుడు ప్రపంచ విషయాలను వివరిస్తాడు. బ్రహ్మ జన్మ గురించి, అన్ని ద్వీపాల గురించి, సూర్యుని గొప్పతనము గురించి చెపుతాడు. ఆ విధముగా మార్కండేయుడు కఠోర దీక్షతో శివ కేశవుల అనుగ్రహాన్ని పొంది చిరంజీవిగా అయినాడు. లోకానికి ఎన్నో విషయాలను తెలియజేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here