వివిధ రంగాల సేవా ధురీణ మాతా అమృతానందమయి దేవి

2
8

[dropcap]ఆ[/dropcap]మె పేద కుటుంబంలో పుట్టి – పేదల అవసరాలను గురించి అవగాహన చేసుకున్న మహిళ. వివిధ మత ప్రార్థనా సంస్థలకు వెళ్ళి బోధనలను వినేవారు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేసేవారు. భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించటంతోనే ఈమె సేవలు ఆగలేదు, ప్రజల కనీస అవసరాలను గుర్తించారు. అనేక సంస్థల ద్వారా దేశ, విదేశాలలో విద్య, వైద్య సౌకర్యాల రూపకల్పన చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విశ్వవ్యాప్తంగా సేవలను అందించారు. గొప్ప మానవతావాది అయిన ఈమె ‘కౌగిలించుకునే సాధువు’గా పేరు పొందారు, విశ్వరత్న పురస్కారాన్ని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందుకున్న ఆమే మాతా అమృతానందమయి దేవి.

ఈమె కేరళ రాష్ట్రంలోని కొలాం జిల్లా లోని పరాయకడవు (నేటి అమృతపురి) లో జన్మించారు. 1953 సెప్టెంబర్ 27న జన్మించిన ఈమె తల్లిదండ్రులు దమయంతి సుగుణా నందన్ లది పేద కుటుంబం. ఈమె అసలు పేరు ‘సుధామణి ఇడమన్నేల్’.

పేద కుటుంబమయినప్పటికీ తమకి కలిగి ఉన్న దానిలోనే ఇతరులకి సాయంచేసి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో తిట్లు తినేవారు.

ఈమె బాల్యం నుండి ప్రార్థనా మందిరాలకి, దేవాలయాలకి వెళుతుండేవారు. శ్రీకృష్ణుని ధ్యానించేవారు. చర్చికి వెళ్ళి ప్రార్థనలను ఆలకించేవారు.

తరువాత కాలంలో ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించారు. దేశ విదేశాలలోని భక్తులను ఆకర్షించారు. భక్తులకు ఇష్టమైన దేవతలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈమె అందించడం విశేషం. వివిధ మతాల వారికి కూడా వారికి అనుగుణమయిన జ్ఞానాన్ని అందించేవారు.

ఈమె తల్లిదండ్రులు వివాహం చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఆమె ఒప్పుకోలేదు. ఆమె పెళ్ళి, సంసారం కంటే ప్రజలకు సహాయం చేయడం, వారి అభివృద్ధి కోసం కార్యక్రమాలను నిర్వహించడమే సంతోషంగా భావించారు.

తమ పూరి గుడిసెలో స్థాపించిన చిన్న ఆశ్రమం అంచెలంచెలుగా ఎదిగింది. విశ్వవ్యాప్తంగా చాలా దేశాలలో ఆశ్రమశాఖలను ఏర్పరచి సేవలందించడం మొదలైంది.

1981లో ఈమె శిష్యులతో కలసి ‘మాతా అమృతానందమయి మఠం’ (MAM) ను స్థాపించారు. ఈ మఠం ద్వారా ఈమె విశ్వవ్యాప్తంగా వైవిధ్య భరిత రంగాల అభివృద్ధి కోసం విస్తృతమైన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

ఈమె జీవుల పట్ల కరుణ చూపేవారు. సహనం, నిస్వార్థత, నిరాడంబరం, ఈమె ఆయుధాలు. ఈమె మానవుల అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం చేయించడం, ఆడపిల్లలను హింసించడం సహించలేక పోయేవారు.

వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసేవారు. అటువంటి దురాగతాలకి ఆడపిల్లలు, మగపిల్లలు కూడా బలి కాకూడదని, నివారణా మార్గాల కోసం వెదికేవారు.

పేదలను భాధించే ఇంకా చాలా సమస్యలను అరికట్టేటందుకు ఈమె తీసుకున్న చర్యలు అసామాన్యం. ప్రభుత్వాలు కూడా కొన్ని పనులు చేయడానికి సాహసించవు. కాని ఈమె తన మఠంలో వివిధ శాఖలను ఏర్పాటు చేశారు. ఆ విభాగాల ద్వారా వివిధ రంగాలలో జాతీయస్థాయి లోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ మఠం తరపున సేవలను అందించారు. వీటిని ఒక్కసారి అవలోకిస్తే —

పేదలకు ముఖ్యంగా కనీస అవసరాలైన ఆహారం, నివాసం, విద్య, వైద్యం, జీవనోపాధి మొదలయిన అయిదు ప్రాథమిక అవసరాలను అందించాలనే నిర్ణయానికి వచ్చారు.

‘మదర్స్ కిచెన్’ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి సుమారు పది మిలియన్ల మందికి ఉచితంగా భోజనం అందజేయడం ఆహారాన్నందించే కార్యక్రమాలలో ముఖ్యమైనది. ఈ కార్యక్రమం ద్వారానే మన దేశంతోపాటు కొన్నివిదేశాలలో కూడా ఆహారాన్ని అందించడమేగాక, శుద్ధిచేసిన తాగునీటిని అందించడం గొప్ప విశేషం.

వైద్యం విషయాన్ని గమనిస్తే కొచ్చిలో ‘అమృత ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ 1100 పడకలతో 1998లో స్థాపించబడింది. ఇక్కడ సుమారు 4 మిలియన్ల మందికి ఉచితంగా వివిధ శస్త్రచికిత్సలను చేశారు. 2022 ఆగష్టు 24వ తేదీన హర్యానాలోని ఫరీదాబాద్‌లో ‘అమృత హాస్పిటల్’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2600 పడకలతో ఈ హాస్పిటల్ని నిర్మించారు. ఢిల్లీలో కూడా సుమారు 2000 పడకల హాస్పిటల్‌ని నిర్మించే ప్రయత్నాలు జరగడం చాలా గొప్ప. ఒక మఠం ఆధ్వర్యంలో ఇంత గొప్పగా వైద్య సౌకర్యాలను కల్పించడం మామూలు విషయం కాదు.

వితంతువులయిన నిరుపేదలకు, మానసిక వికలాంగులకు సామాజిక పెన్షన్లను ఇస్తుంది. 2006 నుండి సుమారు రెండు లక్షల మంది మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా జీవనోపాధిని కలిగిస్తున్నారు.

ఈమె ఛాన్సలర్ ‘అమృత విశ్వవిద్యాలయం’ నడుపుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు వివిధ దేశాలలో పేరు ప్రఖ్యాతులు, జీవనోపాధి లభించడం విశేషం. NAAC లో A గ్రేడు, భారతదేశం అత్యుత్తమ విశ్వవిద్యాలయాంలో నాల్గవ స్థానాన్ని పొందింది. దేశ, విదేశాలలోని ఈ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశలలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు కూడా స్కాలర్షిప్‍లను అందించి రికార్డు సృష్టించిన ఘనత ఈ విశ్వవిద్యాలయానిది.

ప్రజలకు కనీస అవసరాలను అందిచే కార్యక్రమంలో విస్తృతమైన సేవలను అందించడంతోనే సరిపెట్టలేదీమె. భయంకర ప్రకృతి విపత్తులయిన వనదలు, తుఫానులు, సునామీలు సంభవించినప్పుడు దేశ విదేశాలలో ఈ మఠం ద్వారా మరియు ‘ఎంబ్రేసింగ్ ది వరల్డ్’ ద్వారాను మాత అందించిన సాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లను వివరించడం అసాధ్యం.

పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా వివిధ రాష్ట్రాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి గంగానది తీర ప్రాంతాలను, శబరిమల ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాలలోను అనేక ప్రాజెక్టులను చేపట్టారీమె తన మఠం ద్వారా, ఈమె సామాజిక సేవాకార్యక్రమాలను.

మానవులు నిస్వార్థసేవ, కరుణ, ఓర్పు, క్షమాపణ, స్వీయనియంత్రణ మొదలయిన లక్షణాలను అలవరచుకోవాలని, యోగా సాధన చెయ్యాలని బోధించారు.

సుమారు 30కి పైగా భాషలలో భజన్ లను సృజించారు.

వాటికన్ నగరంలో పోప్ ఫ్రాన్సిస్ 2014లో కార్యక్రమంలో బానిసత్వానికి వ్యతిరేకంగా సార్వత్రిక ప్రకటన మీద సంతకం చేశారు. 2018లో మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. మతాలకతీతంగా పని చేశారు.

ఐక్యరాజ్య సమితిలోను, ప్రపంచమతాల పార్లమెంటులోను ప్రసంగించారు. సాంకేతిక పరిశోధనలు అవసరమని అవి పేదలను అభివృద్ధి పరచే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

వీరికి దేశ, విదేశాల నుండి అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. పలు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లతో సత్కరించాయి.

2013లో మొదటి ‘విశ్వరత్న పురస్కార్’ను భారత ప్రభుత్వం అందించింది. 2018లో స్వచ్ఛ భారత్ మిషన్‍కి అందించిన సహకారానికి గాను ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు.

భారత ప్రభుత్వం 2018 పిబ్రవరి 20వ తేదీ ఈమె గౌరవార్థం ‘అమృతసంగమ్’ పేరిట ఒక ప్రత్యేక కవర్‌ని విడుదల చేసింది.

ఈ కవర్ మీద మాత చిత్రంతో పాటు, వారి మఠం చిత్రాన్ని ముద్రించారు. ఎడమవైపున పై భాగంలో వీరి మఠం చిహ్నాన్ని ముద్రించి గౌరవించారు. మాత అమృతానందమయి దేవి నవ్వుతున్న చిత్రం కనిపిస్తుంది.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here