ది ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా మీనాకుమారి

4
8

[dropcap]31[/dropcap]-03-2022 మీనా కుమారి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె బాల నటగాయని, నటి, కవయిత్రి, రచయిత్రి, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసి భారతీయ హిందీ సినిమా చరిత్రలో లెజండరీగా పేరు ప్రఖ్యాతులను పొందారు.

కమల్ అమ్రోహి, విజయ్ భట్, విమల్ రాయ్, అశోక్ కుమార్, రాజ్ కపూర్, గురుదత్, బలరాజ్ సహాని మొదలయిన కథానాయకుల సరసన విభిన్న రసాల పాత్రలలో రాణించారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (BFJA) వారి ఉత్తమ నటి పురస్కారాన్ని పొందిన గొప్ప నటీమణి. బాధతో కూడిన వేదనా భరిత పాత్రలతో సమాంతరంగా హాస్యం, శృంగారం, కోపం లను అద్భుతంగా తన నటన ద్వారా చూపించి ప్రేక్షకుల మనసులలో ఈ నాటికీ నిలిచిన ఆమె “హిందీ సినిమా యొక్క దిగ్గజ తార మాత్రమే కాదు/గొప్ప నైపుణ్యం, సున్నితత్వం, సునిశితత్వం, మృదు హృదయం గల గొప్ప కవయిత్రి”. ఈమే ‘ది ట్రాజడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా మీనాకుమారి’.

ఈమె నాటి బొంబాయి ప్రెసిడెన్సీ (నేటి మహారాష్ట్ర) లోని ముంబై నగరంలోని దాదర్ ఈస్ట్‌లో 1933 ఆగష్టు 1వ తేదీన జన్మించారు. తల్లి ఇక్బాల్ బేగం. తండ్రి అలీబక్స్. తల్లి నర్తకి, తండ్రి నటుడు, సంగీత కళాకారుడు, సంగీత దర్శకుడుగా పని చేశారు. ఈమెని మున్నా అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఈమెకి చదువంటే ఇష్టం. కాని పేదరికంతో బడిలో చదువుకోలేకపోయారు. నాలుగేళ్ళ వయస్సులోనే తండ్రి తన వెంట స్టూడియోల చుట్టూ తిప్పేవారు. స్వయంగానే చదువుకున్నారు. హిందీ, ఆంగ్ల భాషలను అభ్యసించారు. కాని ఈమె ఏకాగ్రత ఉర్దూ భాష పట్ల చూపించేవారు. షూటింగ్ విరామంలో పుస్తకాలను చదువుతూనే కన్పించేవారు.

1939వ సంవత్సరంలో విజయభట్ దర్శకత్వం వహించిన ‘లెదర్ ఫేస్’ సినిమాలో బేబీ మహజబీన్ పేరుతో బాలనటిగా అరంగేట్రం చేశారు. తరువాత అధూరి కహానీ, పూజ, ఏక్ హీ భూల్, నయారోష్‌నీ, కసౌటి, విజయ్, గరీబ్, లాల్ హవేలి మొదలయిన సినిమాలలో బేబి మీనా ఆడి, పాడి అలరించారు.

1946లో పదమూడేళ్ళ లేబ్రాయంలో ‘బచ్చోం కా ఖేల్’ సినిమాతో మీనాకుమారి పేరుతో నాయికగా రంగప్రవేశం చేశారు. దునియా ఏక్ సరాయ్, పియా ఘర్ ఆజా, బిఛ్‌డే బాలం మొదలయిన సినిమాలలో నటించారు. ఈ చిత్రాలలో ఈమె ఆలపించిన పాటలు కూడా ఆయా సినిమాలని సుసంపన్నం చేశాయి. ఈ నాటికీ ఈమె నటన, గానం ప్రేక్షక శ్రోతల మనసులను గిలిగింతలు పెడుతూ అలరిస్తూనే ఉండడం విశేషం.

మలిరోజుల్లో కొంతకాలం పౌరాణిక, జానపద చిత్రాలలో నటించారు. హోమీ వాడియా దర్శకత్వం వహించిన చిత్రాలివి. వీరఘటోత్కచ్, శ్రీ గణేష్ మహిమా, లక్ష్మీ నారాయణ్, హనుమాన్ పాతాల్ విజయ్ మొదలయిన చిత్రాలలో వైవిధ్య భరిత పౌరాణిక పాత్రలను ధరించారు. అల్లాఉద్దీన్ ఔర్ జాదుయ్ చిరాగ్ వంటి జానపద చిత్రంలో కూడా నటించారు. హమారా ఘర్ సనమ్, తమాషా వంటి మల్టీ స్టారర్ సినిమాలలో నటించారు. అయితే ఈమెకి ప్రత్యేకించి పేరు తెచ్చిన సినిమాలు కావవి.

1952లో విడుదలయిన బైజు బావరా సినిమా తరువాత అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఆయా సినిమాలలో ఈమె నటించిన పాత్రలలో ఈమె నటన, నాట్యం, అభినయాలు అద్వితీయం, అబ్బురం, అపురూపం.

మన మహానటి సావిత్రిలా ఈమె కూడా ముఖ కవళికలతో అద్భుతమైన హావభావాలను ఒలికిస్తారు. పెదాల విరుపు, కంటి కొసమెరుపు ఈమెకే ప్రత్యేకం.

దిల్ అపనా ఔర్ ప్రీత్ పరాయ్ సినిమా లోని ‘అజీబ్ దాస్తా హై, ఏ కహాఁ షురూ కహాఁ ఖతమ్ – ఏ మంజిలే హై కౌన్సీ న వో సమఝ్ సకె న హమ్’, సాహెబ్ బీబీ ఔర్ గులామ్ సినిమాలోని ‘పియా అయిసో జియా మై సమాయ్ గయో రే మై తన్‍మన్ కి సుద్ బోధ్ గావాన్ బైఠీ’, పాకీజా సినిమాలోని ‘మౌసం హై ఆషికానా యే దిల్ కహీఁ ఉన్‌కో ఐసే మే డూంఢ్ లానా’, దిల్ ఏక్ మందిర్ సినిమాలోని ‘హమ్ తేరే ప్యార్ మే సారా ఆలమ్’, భీగీ రాత్ సినిమాలోని ‘దిల్ నే జో న కహ్ సకా’ వంటి సూపర్ హిట్ గీతాలు ఆమె నటనకు భాష్యం చెప్పిన కొన్ని ఉదాహరణలు మాత్రమే.

పరిణీత (1953), దో బిఘా జమీన్, ఫుట్ పాత్, దాయెరా, చాందినీ చౌక్, బాగ్‌బన్, ఇలామ్ (1954), ఆజాద్, అడ్ల్-ఎ-జహంగీర్, బంష్, రుక్సానా (1955), మేమ్ సాహిబ్, ఏక్ – హాయ్ – రాస్తా, నయా అందాజ్ (1956), శారదా, మిస్ మేరి (1957), సహారా, ఏంజిల్ సవేరా (1958), చిరాగ్ కహా రోష్నీ కహా, చార్ దిల్ చార్ రాహెన్, అర్ధాంగిని (1959), కోహినూర్, దిల్ అప్నా ఔర్ ప్రీత్ రాయ్ (1960), భాభీకి చుడియాఁ, సాహెబ్ బీబీ ఔర్ గులామ్ (1961), ఆర్తి, మై చుప్ రహుంగీ (1962), కినారె, దిల్ ఏక్ మందిర్ (1963), బేనజీర్, గజల్, చిత్రలేఖ (1964), కాజల్, భీగీరాత్ (1965), పూల్ ఔర్ పత్తర్, సూర్జహాన్ (1966), మజ్లీదీదీ, బహు బేగం (1967), బహారోన్ కి మంజిల్, అభిలాష (1968), సౌత్ ఫేరే (1970), నా అప్నే, దుష్మన్ (1971), పాకీజా (1972) వంటి సుమారు తొంభై పైగా చిత్రాలలో తన నటనా వైభవాన్ని ప్రదర్శించారు.

ఈమె అశోక్ కుమార్, దిలీప్ కుమార్, నాసిర్ ఖాన్, దేవ్ ఆనంద్, రాజ్ కపూర్, షమ్మీకపూర్, ప్రదీప్ కుమార్, రాజ్ కుమార్, రాజేంద్రకుమార్, బలరాజ్ సహాని, గురుదత్, శశికపూర్ సునీల్, జెమినీ గణేశన్, లీలా చిట్నీస్, కుంకుమ్, శశికళ, నాదిరా, నిగర్ సుల్తానా, మినుముంతాజ్ మొదలయిన నటీనటులతో పోటీపడి పలు వైవిధ్య భరితమైన పాత్రలలో నటించి, జీవించి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు.

విజయభట్, ఆర్.సి.తల్వార్, బి.ఆర్.చోప్రా, లేఖరాజ్ భక్రి, బిమల్ రాయ్, సత్యేన్ బోస్, దేవేంద్ర గోయల్, ఖాజా అహమ్మద్ అబ్బాస్, హేమచంద్రందర్, కె. అమరనాథ్, డి.డి. కశ్యప్, ఫణి మజుందార్, ఆర్.సి.తల్వార్, కిషోర్ సాహు, సి.వి. శ్రీధర్, ఎల్.వి. ప్రసాద్, భర్త అయిన కమల్ అమ్రోహి వంటి హేమా హేమీలయిన దర్శకులందరూ ఈమెను వైవిధ్యభరితం, రసస్ఫోరకమైన పాత్రలలో నటింపజేశారు. ఈమెలోని నట, నాట్యాభినయ నైపుణ్యాన్ని వెలికి తీసి ఆయా చిత్రాలను ఈమె ప్రావీణ్యంతో సుసంపన్నం చేశారు.

బైజూ బావరా, పరిణీత, మేమ్ సాహెబ్, ఏక్ హి రాస్తా, శారద, మిస్ మేరీ, చిరాగ్ కహా రోష్నీ కహా, హర్నామ్ సింగ్ రావైల్, దిల్ అప్నా ఔర్ ప్రీత్, సాహిబ్ బీబీ ఔర్ గులాం, ఆర్తి, పాకీజా చిత్రాలలోని ఈమె పాత్రలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఈమె గాయనిగా కూడా పేరు పొందారు. బాలనటిగా నటించిన చిత్రాలలో పాటలు స్వయంగా పాడుకున్నారు. ఆ రోజులలో ఇది చాలా సహజం. కాని 1946 నాటి దునియా ఏక్ సరాయ్, 1948 నాటి పియా ఘర్ ఆజా, బిఛ్‌డే బాలం చిత్రాలతో పాటు 1966 నాటి పింజ్రే కే పంచి, 1972 లోని చిత్రం పాకీజా లో కూడా పాటలు పాడారు.

ఈమె మొత్తం 4 ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి అవార్డులను పొందారు. బైజు బావరా, పరిణీత, సాహిబ్ బీబీ ఔర్ గులాం, కాజల్ చిత్రాలలోని పాత్రలకు ఈ అవార్డును అందుకున్నారు.

BFJA అవార్డులు శారద, ఆర్తి, దిల్ ఏక్ మందిర్, పాకీజా చిత్రాలలోని నటనకు లభించాయి.

పాకీజా చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‍గా పని చేసినందుకు గాను ప్రశంసలను అందుకున్నారు.

‘పాకీజా’ చిత్రం లోని నటనకు గాను ‘షామా – సుష్మ ఫిల్మ్ అవార్డ్స్’ వారు మీనాకుమారిని ఉత్తమనటిగా ఎంపిక చేశారు.

ఈమె అతిథి పాత్రలో నటించిన ‘దో బీఘా జమిన్’ 1954వ సంవత్సరంలో ‘కేన్స్ అంతర్జాతీయ బహుమతి’ ని అందుకున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

‘సాహిబ్ బీబీ ఔర్ గులాం’ చిత్రం 13వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించబడింది. ఈ చిత్రోత్సవానికి మన దేశ ప్రతినిధిగా మీనాకుమారి హాజరయ్యారు.

పాకీజా సినిమాలో తల్లీకూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలోని వేశ్య పాత్ర నటన ఈమె నట జీవితంలో ఎవరెస్టు శిఖరం. ఇటీవల ‘గంగూభాయి కతియవాడి’ లో వేశ్య పాత్ర పోషించిన అలియాభట్ పాకీజా చిత్రాన్ని చాలా సార్లు చూశారట

ఈమె జీవిత చరమాంకంలో లివర్ సిరోసిస్ వ్యాధి బారిన పడ్డారు. ఆ వ్యాధితో బాధపడుతూనే ‘పాకీజా’ సినిమాని పూర్తి చేశారు. పాకీజా సినిమా విడుదలైన 3 వారాలకి 1972 మార్చి 31 వ తేదీన బొంబాయిలోని సెయింట్ ఎలిజబెత్ నర్సింగ్ హోమ్‌లో మరణించారు.

ఈమె జీవితానికి మన తెలుగు నటీమణి స్వర్గీయ సావిత్రి జీవితానికి ఉన్న సారూప్యం – ఇద్దరూ మద్యపానానికి బానిసలై అనారోగ్యం పాలయి మరణించడం.

ఈమె కారు ప్రమాదంలో చిత్తయిన ఎడమ చేయి కనపడకుండా ఉండడం కోసం తన ఆహార్యాన్ని మార్చుకున్నారు. దుస్తులతో ఎడమ చేతిని కనపడకుండా జాగ్రత్తపడి నటించారు.

1972లో వినోద్ మెహతా తను వ్రాసిన ‘మీనాకుమారి – ది క్లాసిక్ బయోగ్రఫీ’ గ్రంథంలో ‘ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ కూడా ఈమెతో కలిసి నటించే సమయంలో ఆమెతో సమానంగా నటించడానికి ఇబ్బంది పడేవారు’ అని వ్రాశారు. 1998లో మోహన్ దీప్ ‘దోపహార్ కా సామ్నా’లో ఈమె జీవితచరిత్రని ధారావాహికగా ప్రచురించారు. 2006లో మధుప్ శర్మ, ‘ఆఖ్రీ అదైదిన్’ పేరుతో ఈమె జీవిత చరిత్రని వ్రాశారు.

‘ది వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా మధుబాల’ ఈ ‘ట్రాజడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా మీనాకుమారి’ కి అభిమాని. మీనాకుమారిది విలక్షణ స్వరమని, ఆ స్వరానికి ప్రత్యామ్నాయం లేదని ప్రశంసించి ఆ నటీమణి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు.

సహనటి నర్గీస్ దత్ ‘మీనా-మౌత్ ముబారక్ హో’ (మీ మరణానికి అభినందనలు) లనే వ్యాసాన్ని ఉర్దూ పత్రికలో వ్రాసి అంజలి ఘటించారు. సహజంగానే సామాజిక, ఆరోగ్య రంగాలలో సేవలను అందించిన నర్గీస్ నటి మీనాకుమారి జ్ఞాపకార్థం ‘మీనాకుమారి మెమోరియల్ ఫర్ ది బ్లైండ్’ సంస్థని స్థాపించి ఆమె పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇది నర్గీస్, మీనాకుమారిల మధ్య గల అనుబంధానికి తార్కాణం.

సిబిఎన్-1 బిఎన్ నిర్వహించిన ఎన్నికలలో అత్యంత ఉత్తమ భారతీయ చిత్రాలలో ఈమె నటించిన దో బీఘా జమీన్, సాహిబ్ బీబీ ఔర్‌ గులామ్, పాకీజాలు స్థానం సంపాదించడం మీనాకుమారికి ప్రజలు అందించిన నివాళే!

ఈమె ‘నాజ్’ అనే కలం పేరుతో ఉర్దూలో కవితలను వ్రాశారు. ఈ కవితా సంకలనం తన్హా చాంద్ (లోన్లీ మూన్) పేరుతో ముద్రించబడింది.

”మీనాకుమారి కీ అమర్ కహానీ’ సోహ్రాబ్ మోడి దర్శకత్వం వహించిన ఈమె జీవితకథ. ‘సైరా’ పేరుతో ఈమె జీవితాన్ని గురించి ఒక లఘుచిత్రాన్ని సుఖదేవ్ దర్శకత్వంలో నిర్మించారు.

‘అజీబ్ దాస్తాన్ హైయే’ పేరుతో ఈమె జీవితం నాటకంగా కూడా తయారయి ప్రదర్శించబడింది.

ఈమె వివిధ ఉత్పత్తులకు మోడల్‌గా నటించారు. రేడియో సిలోన్ నుండి ప్రత్యేక కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు.

ఈమె తన కాలంలో అత్యధిక పారితోషికాన్ని పొందారు. ఇంపాలా కారు కొన్న తొలి భారతీయ నటి ఈమే! తన సమకాలీన నటీమణులందరిలోను ఈమె అన్ని విధాలుగా అగ్రశ్రేణి కథానాయిక.

ఈమె జ్ఞాపకార్థం 13-02-2011 వ తేదీన 5 రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. ‘Legendary Heroines of India’ శీర్షికతో విడుదలయిన మినియేచర్ షీట్లో ఈమెతో పాటు దేవికా రాణి, లీలానాయుడు, నూతన్, కానన్ దేవీ, సావిత్రిల చిత్రాలను ముద్రించారు.

ఈమె స్టాంపు మిద ఎడమవైపున కథక్ నృత్యకారిణి గాను, కుడివైపున ఆవేదనాభరిత చిత్రంలోను మీనాకుమారి చిత్రాలను ముద్రించారు.

మార్చి 31 వ తేదీ ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here