సాహసోపేత ఏకైక మహిళా భారత ప్రధాని శ్రీమతి ఇందిరా ప్రియదర్శినీ గాంధి

5
11

[dropcap]అ[/dropcap]క్టోబర్ 31 ఇందిరా గాంధి వర్థంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

మనదేశపు ఏకైక మహిళా ప్రధాని/ఒక ప్రధాని కుమార్తె/మరొక ప్రధాని తల్లి/ఆగర్భ శ్రీమంతురాలు, స్వాతంత్ర్య పోరాట యోధుల కుటుంబీకురాలు/పేద ప్రజల పెన్నిధి, మూడుసార్లు ప్రధానిగా గెలిచి తరువాత ఓడిపోయినా వెన్నుతిప్పని ధైర్యశాలిని/4వ సారి ప్రధానియై అంతర్జాతీయ రంగంలో భారత ఖ్యాతి పతాక ఎగురవేసిన ధీరవనిత/నమ్మిన లక్ష్యం కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధి.

ఈమె 1917 నవంబర్ 19వ తేదీన యునైటెడ్ ఫ్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔథ్, బ్రిటిష్ ఇండియాలోని అలహాబాద్‌లో జన్మించారు.

తల్లిదండ్రులు కమలానెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూలు. ఈమె అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని. బాల్యం నుండి ఈమె ఇంట్లో స్వాతంత్ర్య పోరాటపు విషయాలే! అవన్నీ ఆకళింపు చేసుకుని దేశభక్తిని పెంపొందించుకున్నారు.

కుటుంబ సభ్యులందరూ జైలుశిక్షను అనుభవించిన వారే! అందువల్లనే ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ వ్రాసిన లేఖల ద్వారా భారతదేశ చరిత్రని, ప్రపంచ చరిత్రని అవగాహన చేసుకున్నారు. ఈ లేఖల సారమే తరువాత కాలంలో డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గ్రంథాలుగా పేరు పొందాయి.

తోటి విద్యార్థినీ, విద్యార్థులతో ‘వానరసేన’ను ఏర్పాటు చేశారు. స్వదేశీ ఉద్యమానికి ఊతమందించారు. తల్లిదండ్రులను, ఇతర జాతీయ నాయకులను జైలుకి వెళ్ళి పరామర్శించేవారు. “మనం పిల్లలమైనా స్వాతంత్ర్యం కోసం మనవంతు కృషి చెయ్యాలి” అని స్నేహితులతో చెప్పేవారు.

పూనా విశ్వవిద్యాలయం నిర్వహించిన మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయారు. తరువాత శాంతినికేతన్‌లో చదివారు. తల్లి కమలా నెహ్రూ అనారోగ్యంతో మరణించారు. తల్లి మరణం ఈమెను క్రుంగదీసింది. తనను తను సముదాయించుకున్నారు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సోమర్‌విల్ కళాశాలలో చదివారు. అక్కడే ఫిరోజ్ గాంధీతో పరిచయం పెంచుకున్నారు. ఈ పరిచయం పెళ్ళికి మార్గం చూపింది. జవహర్‌లాల్‌కి ఇష్టం లేదు. మహాత్మాగాంధీ చొరవతో ఇందిర, ఫిరోజ్‌ల పెళ్ళి జరిగింది.

లండన్‌లో భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ‘ఇండియా లీగ్’ సంస్థ స్థాపించబడింది. 1930లో ఈ లీగ్‌లో సభ్యురాలయ్యారు. పోరాటంలో పాల్గొన్నారు.

తరువాత స్వదేశానికి వచ్చారు. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలయారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు.

సుమారు 13 నెలల తరువాత జైలు నుండి విడుదలయ్యారు.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. భారత ప్రధానిగా జవహర్‌లాల్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. 1951 ఎన్నికలలో జవహర్‌లాల్‌కు వ్యతిరేకంగా ఫిరోజ్ పోటీ చేశారు. ఈమె తండ్రి తరపున ప్రచారం చేశారు. ఫిరోజ్ ఓడిపోయారు. 1959లో ఫిరోజ్ మరణించారు.

1962లో చైనా సరిహద్దు వివాదాలలో తేజ్‌పూర్ మీద దాడి చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించారు ఇందిర. 1963లో ‘కామరాజ్ ప్లాన్’కు అనుకూలంగా పని చేశారు. నెహ్రూ వ్యతిరేకులందరూ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయారు.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1984 వరకు ఈమె జీవితంతో ముడిపడి ఉంది. ప్రథమ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి వర్గంలో ప్రసారశాఖా మంత్రిగా సేవలను అందించారు.

శాస్త్రిగారు తాష్కెంట్ ఒడంబడిక చేసుకునేందుకు రష్యా వెళ్ళి, అక్కడే మరణించారు. తరువాత 1966లో ఈమె ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

ప్రధానమంత్రిగా పని చేసిన సమయంలో ప్రతిరోజు ప్రజలను కలిసేవారు. వారి సమస్యలను విని, సామాన్యుల జీవన పరిస్థితులను అవగాహన చేసుకునేవారు. పేద ప్రజలకు ప్రభుత్వం చేయవలసిన సహాయ, సహకారాలను గురించి తెలుసుకున్నారు.

రాజకీయంగా చూస్తే మహిళా ప్రధానమంత్రిణి ఏమి చేయగలరు అనే ప్రశ్న రాజకీయ నాయకులు లేవనెత్తారు. బలహీనమయిన నాయకురాలని ముద్ర వేశారు. 1967లో జరిగిన ఎన్నికలలో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో తక్కువ మెజారిటీ మాత్రమే లభించింది.

1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈమె ప్రజలను ఆకర్షించగలిగారు. ఇందిరా ప్రభంజనం వెల్లువెత్తింది. ‘గరీబీ హఠావో’ నినాదం ఈమె విజయానికి ఊతమందించింది.

ఒక ప్రధానిగా సాహసోపేత నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. పేదరిక నిర్మూలనకి కంకణం కట్టుకున్నారు. ఈమె సంస్థానాధీశులకు రాజ్యభరణాలను రద్దు చేశారు. బ్యాంకులను జాతీయం చేశారు. సామ్యవాద ప్రకటన ద్వారా పేదల అభ్యున్నతి కోసం కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాలలో ’20 సూత్రాల పథకం’ ముఖ్యమయింది. “ఇరవై సూత్రాల పథకమిందిర వజ్రాయుధం” అనేది ప్రభుత్వ ప్రధాన నినాదమయింది. గాంధీజీ సిద్ధాంతాలకనుగుణంగా ఈ సూత్రాలు రూపొందడం విశేషం.

హరిత విప్లవానికి నాంది పలికారు. వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సంభవించాయి. వివిధ పంటల దిగుబడి పెరిగింది. వ్యవసాయ రంగంలో అధునాతన మార్పులు వచ్చాయి. ఆధునిక పద్ధతులలో వ్యవసాయం ఇనుమడించింది.

1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేశారు. పశ్చిమ పాకిస్థాన్ అరాచకాలను భరించలేక తూర్పు పాకిస్థాన్ ప్రజలు కాందిశీకులుగా మన దేశానికి వచ్చేవారు. వారికి సహాయం చేయడం కోసం మన సైన్యాన్ని పంపించేవారు. ఈ యుద్ధంలో మన సైన్యం గెలిచింది. ‘బంగ్లాదేశ్’ ప్రత్యేక దేశంగా అవతరించింది. ఈ సంఘటన మన దేశాన్ని పాకిస్థాన్‌కు మరింత దూరం చేసింది.

1971 ఎన్నికలలో ఈమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 1975లో వచ్చిన ఈ తీర్పు ఇందిరాగాంధికి 6 సంవత్సరాల పాటు ఎన్నికల బహిష్కరణను ప్రకటించింది. ప్రతిపక్షనాయకులు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. శాంతి భద్రతలను సంరక్షించేందుకు ‘అత్యవసర పరిస్థితి’ని 1975 జూన్ 25న ప్రకటించారు.

దేశంలో ముఖ్యనాయకులందరినీ అరెస్టు చేసి జైళ్ళలో నిర్బంధించారు. విలేఖరులను అరెస్టు చేశారు. విదేశీ విలేఖరులను వారి దేశాలకు పంపించారు.

పౌరహక్కులు రద్దయ్యాయి. ఉద్యోగులు సమయపాలన సజావుగా సాగింది. అయితే ప్రజలలో భయాందోళనలు కలిగాయి. ఈమెకి వ్యతిరేకుల సంఖ్య పెరిగింది. ఈమె రెండవ కుమారుడు సంజయ్ గాంధి తల్లికి అండగా నిలిచాడు. సంజయ్ ఐదుసూత్రాల పథకం అమలులో లోపాలు ప్రధాని ఇందిరను ప్రజలకు మరింత దూరం చేశాయి. అత్యవసర పరిస్థితిని రద్దు చేయమని సన్నిహితులు సలహా ఇచ్చారు.

దీనిని రద్దు చేసి లోకసభకు ఎన్నికలను ప్రకటించారు. 1977లో జరిగిన ఎన్నికలలో ఈమె ఓడిపోయారు.

విభిన్న సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు ‘జనతాపార్టీ’ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతర్గత కలహాలు, కుమ్ములాటలలో ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో పతనమయింది.

1978లో కాంగ్రెస్ నుండి విడిపోయి ఇందిరా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఆమె స్వయంగా కర్నాటకలోని చిక్ మగళూరు లోకసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

1980 జనవరిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఈమె ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ నియోజకవర్గం నుండి గెలిచారు. నాల్గవసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆమె కుమారుడు సంజయ్ గాంధి విమాన ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో ఆమెకి అండగా పెద్ద కుమారుడు రాజీవ్ గాంధి నిలబడ్డారు.

ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఉద్యమం తీవ్రంగా కొనసాగింది. అమృతసర్ స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ వాదులు తలదాచుకున్నారు. వీరికి బింద్రన్‌వాలే నాయకులు. 1984లో అమృతసర్ స్వర్ణ దేవాలయంలోనికి మన సైన్యాన్ని పంపారు ఇందిరాగాంధి. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరుతో జరిగిన పోరాటంలో ఖలిస్తాన్ నాయకులు మరణించారు. స్వర్ణదేవాలయం పాక్షికంగా దెబ్బతింది.

ఖలిస్తాన్ వాదులు ఆమె మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. సమయం కోసం వేచిచూశారు. 1984 అక్టోబర్ 31వ తేదీన ఆమె అంగరక్షకులుగా ఉన్న సిక్కు సైనికులే ఆమెను ఆమె నివాసం లోనే కాల్చిచంపారు.

1974లో రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్‌లో అణుపాటవ పరీక్ష చేయించారు. భారత అణు కార్యక్రమానికి నాంది పలికినట్లయింది.

1983లో అలీన దేశాల అధ్యక్షురాలిగా ‘అలీన దేశాల శిఖరాగ్ర మహాసభ’ను ఢిల్లీలో నిర్వహించారు.

వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులతోను కలిశారు. మన దేశాభివృద్ధి ఈ చర్చలను ఉపయోగించుకున్నారు. ప్రపంచ బ్యాంకు అధికారులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధికారులతో వివిధ అంశాలను గురించి చర్చలు జరిపారు.

1975వ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. కాని ఇందిరాగాంధి 1975 నుండి 1985 వరకు ‘అంతర్జాతీయ మహిళా దశాబ్దం’గా ప్రకటించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారు.

పలువురు దేశాధినేతలు ఆమె శక్తి సామర్థ్యాలను, పరిపాలనా విధానాన్ని ప్రశంసించారు. కాని అత్యవసర పరిస్థితి ప్రకటన ఆమె రాజకీయ జీవితంలో చీకటి కోణంగా మిగిలింది. ఆపరేషన్ బ్లూస్టార్ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది.

ఈమెకి వివిధ దేశాలు అవార్డులను ఇచ్చి గౌరవించాయి. అమెరికా మదర్స్ అవార్డ్, ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టే అవార్డు,హాలెండ్ మెమోరియల్ అవార్డు, ఈమెకు లభించాయి. రష్యా లెనిన్ శాంతి బహుమతితో గౌరవించింది. 1971లో మన భారత ప్రభుత్వపు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ లభించింది.

ఈమె జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ వివిధ సందర్భాలలో 5 స్టాంపులను విడుదల చేసింది.

1984 నవంబర్ 19 తేదీన 50 పైసల విలువతో వజ్రాకారంలో ఒక స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు మీద ప్రధానిగా ఇందిర పాస్‌పోర్టు చిత్రం కనిపిస్తుంది.

1985 జనవరి 31వ తేదీన రెండు రూపాయల విలువతో ఒక స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు పై భాగాన ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగిస్తున్న ఇందిరా గాంధి చిత్రం కనిపిస్తుంది. క్రింద భాగంలో కుడివైపున ఐక్యరాజ్యసమితి చిహ్నం ముద్రించబడింది.

1985 అక్టోబర్ 31వ తేదీన స్వర్గీయ ఇందిరా గాంధి తొలి వర్ధంతి సందర్భంగా రెండు రూపాయల విలువతో ఒక స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు మీద ఇందిరా గాంధి చివరిసారిగా ప్రసంగించిన భువనేశ్వర్ సభ చిత్రం కనిపిస్తుంది. అసంఖ్యాక జనసమూహానికి అభివాదం చేస్తున్న ఇందిర కనిపిస్తారు.

1985 నవంబర్ 19వ తేదీన ఆమె జయంతి సందర్భంగా మూడు రూపాయల విలువతో ఒక స్టాంపు విడుదలయింది. ముసుగుతో నవ్వుతూ చూస్తున్న ఇందిరా గాంధి కనిపిస్తారు.

ది 28-12-1985 వ తేదీన ‘భారత జాతీయ కాంగ్రెస్’ శత వార్షికోత్సవాల సందర్భంగా 60 మంది కాంగ్రెస్ అధ్యక్షుల ముఖచిత్రాలతో నాలుగు స్టాంపుల బ్లాక్ విడుదలయింది. చివరిస్టాంపు మీద ఈమె ముఖచిత్రం కనిపిస్తుంది.

మన దేశాన్ని నడిపిన ఏకైక మహిళా ప్రధాని పరిపాలనాదక్షురాలు, అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులను పొందిన స్వర్గీయ ఇందిరా గాంధి వర్థంతి అక్టోబర్ 31 వ తేదీ సందర్భంగా నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here