గ్వాలియర్ చివరి రాజమాత… శ్రీమతి విజయ రాజే సింధియా

4
9

[dropcap]జ[/dropcap]నవరి 25వ తేదీ శ్రీమతి విజయ రాజే సింధియా వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె రాచకుటుంబంలో జన్మించారు. తల్లి మరణించడంతో అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. ఆ రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించారు. మరో రాజరిక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు. ఆ కుటుంబం గొప్పదనాన్ని చివరి వరకూ నిలిపే ప్రయత్నం చేశారు. అందుకే చివరి వరకూ ‘రాజమాత’గానే ప్రసిద్ధి పొందారు. రాజకీయ జీవితపు తొలి రోజుల్లో గాంధేయురాలిగా ఉద్యమాలలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన లోక్‌సభ సభ్యురాలిగా పని చేశారు. చివరికి తన భావాల అనుగుణంగా జనసంఘ్ పార్టీ తరపున, ఆ తరువాత భారతీయ జనతాపార్టీ పక్షాన రాజకీయ పదవులను నిర్వహించారు. పదవులకే వన్నె తెచ్చారు. రామజన్మభూమి, మహిళా విద్యల కోసం కృషి చేశారు. ఆమే చిట్ట చివరి గ్వాలియర్ రాజమాత శ్రీమతి విజయ రాజే సింధియా.

ఈమె 1919వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన బ్రిటిష్ సెంట్రల్ ప్రావిన్సెస్ లోని బీరార్‌లో జన్మించారు. తల్లిదండ్రులు చూడదేవేశ్వరీ దేవి, ఠాకూర్ మహేంద్ర సింగ్. మహేంద్ర సింగ్ పరిపాలనాశాఖలో డెప్యూటీ డైరెక్టర్‌గా పని చేసేవారు. విజయ రాజేకు తల్లిదండ్రులు పెట్టిన పేరు లేఖా దివ్యేశ్వరీ దేవి.

ఈమె బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్నారు. అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. పాఠశాల విద్యను సాగర్‌లో పూర్తి చేసుకున్నారు. బెనారస్ లోని అనీబిసెంట్ థియోసాఫికల్ కాలేజిలోను, లక్నో లోని ఇజ్‌బెల్లా థోర్బర్న్ కాలేజిలోను ఉన్నత విద్యను అభ్యసించారు. ఉజ్జయినిలోని విక్రమ్ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్‌ను పొందారు.

గాంధేయురాలిగా ఆయన పిలుపునందుకున్నారు. ఆయన ప్రారంభించిన ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొన్నారు. విదేశీ వస్తువులు, వస్త్రాలను తగలబెట్టారు.

ఈమెకి 1941 సంవత్సరంలో గ్వాలియర్ మహారాజు జియాజీరావు సింధియాతో వివాహం జరిగింది. ఈమె పేరును నాటి పద్ధతుల ప్రకారం విజయ రాజే సింధియాగా మార్చారు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు.

జియాజీరావు సింధియా ‘హిందూమహాసభ’కు అనుకూలంగా ఉండేవారు. గ్వాలియర్ హిందూమహాసభకు బలమైన కోటగా నిలిచింది.

1947లో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత శ్రీ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ వారు హిందూమహాసభ అనుచరులను ఇబ్బంది పెడతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలని గురించి ప్రధానమంత్రితో చర్చించేటందుకు మహారాజుకి సమయం దొరకలేదు. బొంబాయిలో ముఖ్యమైన పనుల కోపం ఉండిపోవలసి వచ్చింది.

ఈ సమయంలో మహారాణి విజయ రాజే సింధియా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు ఆయన కోరిక మీద. రాజకీయాలలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ పక్షాన లోక్‌సభకి పోటీ చేయమని జియాజీరావుని కోరారు. అయితే ఆయనకి ఎన్నికలలో పోటీచేయడానికి అంగీకరించలేదు. కాని విజయ రాజే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఈ పొత్తు దీర్ఘకాలం కొనసాగలేదు.

ఈమెకు సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, విలువల పట్ల మక్కువ. హిందూ మతమంటే ప్రీతి. ఈ పరిస్థితుల పట్ల అనుకూలంగా ఉన్న జనసంఘ్ వైపు మొగ్గారు. తమ సంస్థానంలోను, మధ్యప్రదేశ్ లోను దీని ప్రాబల్యాన్ని పెంచేటందుకు ఈమె అద్వితీయమైన కృషిచేశారు.

ఈమె రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే వైవిధ్యభరితంగా దర్శనమిస్తుంది. 1957,1962లలో భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన లోక్‍సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

1967లో స్వతంత్రపార్టీ అభ్యర్ధిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. జనసంఘ్ అభ్యర్థిగా శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు (అప్పుడు జమిలి ఎన్నికలు జరిగాయి). మధ్యప్రదేశ్ అసెంబ్లీలో జనసంఘ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

1971 ఎన్నికలలో ప్రధాని ఇందిరా గాంధికి వ్యతిరేకంగా పనిచేశారు. మధ్యప్రదేశ్ నుండి జనసంఘ్ సభ్యులుగా ఈమెతో పాటు స్వర్గీయ ప్రధాని శ్రీ అటల్ బిహరీ వాజ్‌పేయి, ఈమె కుమారుడు స్వర్గీయ మాధవరావు సింధియాలు గెలిచారు. ఈ విధంగా తన స్వరాష్ట్రంలో సత్తాని చాటారు.

1975వ సంవత్సరంలో భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులను అరెస్టు చేశారు. దేశంలో మొత్తం మీద వివిధ ప్రాంతాలలో జైళ్ళలో బంధించారు. ఈ సమయంలో తీహార్ జైలులో విజయ రాజే బంధించబడ్డారు. ఈమె తోటి ఖైదీ జయపూర్ మహారాణి గాయత్రీదేవి, వీరిద్దరు తమ భావాలను పంచుకుని మంచి స్నేహితులయ్యారు. ఇందిరాగాంధి పద్ధతులను వీరు నిరంతరం నిరసించారు.

తరువాత 1977 వ పంవత్సరంలో జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయింది.

1978 నుండి 1989 వరకూ జనసంఘ్ పక్షాన, భారతీయ జనతాపార్టీ పక్షాన రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు.

1989,1991,1996,1998 లలో భారతీయ జనతాపార్టీ పక్షాన లోక్‌సభ సభ్యురాలిగా పనిచేశారు. 1999 తరువాత ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు.

అనారోగ్యానికి గురయిన తరువాత రాజకీయాల నుండి విరమించుకున్నారు. రాజకీయాల నుండి విరమించినా, కుటుంబం అంతఃకలహాలకు నిలయమయినా వెన్నుచూపలేదు. తను నమ్మిన భారతీయ జనతా పార్టీకి మాత్రమే సేవలను అందించారు. పార్టీ విజయాల పరంపరలో ఆమెది ఒక ప్రత్యేక స్థానం.

ఈమె పెళ్ళయిన తరువాత 1956లో ‘సింధియా కన్యా విద్యాలయా’ అనే బాలిక పాఠశాలను స్థాపించారు. ఈ విద్యాలయం భారతీయ ప్రామాణిక విలువలకు ప్రాధాన్యతను ఇచ్చింది. బాలికల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేసింది.

ఆధునిక కాలంలో పరిఢవిల్లిన సాంఘిక, ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామికీకరణల పట్ల ఈవిడకి ఎనలేని మక్కువ. ఇవన్నీ మహిళలను, తద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని ఈమె నమ్మారు.

“పారిశ్రామికీకరణతో పాటు సైన్స్ పురోగతి పాత కుటుంబ జీవనవిధానాన్ని మార్చింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా భారతీయ మహిళలు బయటకు రావలసిన అవసరం వచ్చింది. కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే ఉపాధి కూడా వారికి లభించింది. ‘ఊయలని ఊపే చేయి ప్రపంచాన్నిశాసిస్తుంది’ అనే సామెతని నమ్ముతాను. ఆ మహిళల చేతులకి బలం చేకూర్చే పాఠశాలలు కావాలి. అటువంటి పాఠశాలను ప్రారంభించడం నా కల” అని చెప్పారీమె. ఈ విధంగా బాలాకావిద్యను ప్రోత్సహించారు.

తమ గ్వాలియర్ ప్రజల కోసం సంస్కరణలను తీసుకొచ్చారు. పేదల అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలను చేపట్టారు. ఈమె వేసిన పునాదులే ఈ ప్రాంతం భారతీయ జనతా పార్టీ పరిపాలన రావడానికి దోహదం చేసింది. గ్వాలియర్ సంస్థానాన్నే కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం కూడా కృషి చేశారీమె.

1961లో భర్త మరణించిన తరువాత ఈమె తమ సంస్థాన ప్రజల పట్ల, వారి సంక్షేమం, వివిధ అంశాలలో అభివృద్ధి కోసం కృషి చేశారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపలేక పోయారు. అయితే తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న పిల్లలు రాజకీయాలలో రాణించారు. వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రిణిగా, యశోధర మధ్యప్రదేశ్ క్యాబినెట్ మంత్రిగా రాణించారు. కుమారుడు మాధవరావు సింధియా తల్లితో విబేధించడంతో కుటుంబం అంతఃకలహలు నిలయమై ఈమెని మానసిక క్షోభకి గురిచేసింది. మాధవరావు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజకీయాలలో పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ కల అయోధ్య రామాలయం. ‘రామజన్మభూమి’ ఎజెండాని స్వీకరించారు, విస్తత ప్రచారాన్ని కల్పించారు. కరసేవకులు తమ ప్రయాణంలో గ్వాలియర్ వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి గౌరవించారు. వారికి మంచి ఆతిథ్యాన్ని అందించారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి సందర్భోచితంగా సేవలను అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ పార్టీకి కంచుకోటగా మార్చాయి.

ఈమె సామాజిక సేవకురాలిగా కూడా సేవలను అందించి మెప్పించారు. అఖిల భారత మహిళాసభ గ్వాలియర్ శాఖాధ్యక్షురాలిగా 40 ఏళ్ళపాటు పనిచేశారు. విశ్వహిందూ పరిషత్ ట్రస్టీ సభ్యురాలిగా పలు సేవలను అందించారు. తన నియోజకవర్గంలోను, రాష్ట్రంలోను వివిధ అంశాలలో అభివృద్ధి సాధించేటందుకు ఈమె చేసిన సేవలు అనిర్వచనీయం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ విశ్వ విద్యాలయానికి ఉపకులపతిగా సేవలందించారు. ఈ విధంగా విద్యారంగంలో సంస్కరణల కోసం కృషి చేశారు.

రాచకుటుంబంలోనే పుట్టి పెరిగినా సామాన్య ప్రజల కష్టసుఖాలను అవగాహన చేసుకున్నారు. మహిళల దీనావస్థని చూసి బాధపడి వదిలేయలేదు. వారి విద్యకోసం విద్యాలయాన్ని స్థాపించారు. తను అనుకున్నవన్నీ చేతల్లో చూపించి చేతలమనిషి అని ఋజువు చేసుకున్న మహిళామూర్తి ఈమె.

ఈమె తన ఆత్మకథని “The Last MahaRani Of Gwalior’ పేరుతో వ్రాసుకున్నారు. ఈ గ్రంథరచనలో మనోహర్ మల్గోంకర్ సహయం ఎనలేనిది. ఈ గ్రంథంలో ఆమె జీవితంలోని ముఖ్యఘట్టాలతో సహ సమాంతర భారత రాజకీయాలనీ వివరించారు. ఇందిరా గాంధి మరణం తరువాత 1984 ఎన్నికల వివరణ కూడా ఇందులో పొందుపరచబడింది. ఈమె ‘Lok Path Se Rajpath” గ్రంథాన్ని కూడా రచించారు.

ఈమె జీవిత చరిత్రని మృదులాసిన్హా హిందీలో గ్రంథస్థం చేశారు. ‘Ek Thi Rani Aisi Bhi? పేరుతో ఇది ప్రాచుర్యం పొందింది.

ఈ మహరాణి 2001 జనవరి 25వ తేదీన ఢిల్లీలో మరణించారు.

శ్రీమతి విజయ రాజే సింధియా జ్ఞాపకార్థం 2001 డిసెంబర్ 20వ తేదీన 4 రూపాయల విలువతో ఒక స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు మీద మేలిముసుగులో రాజమాత కనిపిస్తారు.

ఈమె వర్థంతి జనవరి 25వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here