ఉత్తమ నటీమణే కాదు… సేవాధురీణ కూడా! స్వర్గీయ నర్గీస్ దత్!

13
11

[dropcap]03[/dropcap]-05-2021 తేదీ నర్గీస్ దత్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

భారతదేశపు గొప్ప నటీమణి/పద్మశ్రీ పురస్కారాన్ని, ఊర్వశి అవార్డుని అందుకున్న తొలి భారతీయ మహిళ/విలక్షణ రంగాలలో సేవలందించిన సేవాధురీణ స్వర్గీయ నర్గీస్ దత్.

వీరు పోషించిన వైవిధ్యభరిత పాత్రలలోని నటన, పాటలలోని నర్తన ఈనాటికి అజరామరంగా నిలిచాయి. వీరు 1929 జూన్ 1వ తేదీన నాటి బెంగాల్ (ప్రెసిడెన్సీ) నేటి కోల్‌కతాలో జన్మించారు. వీరి తల్లి జద్దన్‌బాయి హుస్సేన్, తండ్రి అబ్దుల్ రషీద్. అబ్దుల్ రషీద్ అవిభక్త భారతదేశం (నేటి పాకిస్థాన్ లోని) రావల్పిండిలో జన్మించారు. హిందూ మతస్థుడు. అసలు పేరు మోహన్ చంద్ ఉత్తమ చంద్ త్యాగి. వివాహం తరువాత ముస్లింగా మారారు.

జద్దన్‌బాయి తొలి భారతీయ సినిమాలలో నటిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, హిందూస్థానీ శాస్త్రీయ గాయనిగా పేరు పొందారు.

నర్గీస్ తొలి పేరు ఫాతిమా రషీద్. అయితే తల్లి సినిమా నటి కావటం చేత ఈమెకు 5 ఏళ్ళు నిండగానే సినిమాలో నటించే అవకాశం లభించింది. బాలనటిగా ‘బేబి నర్గీస్’ పేరుతో 1935లో ‘తలాష్ – ఇ – హక్’ సినిమాలో నటించింది.

‘నర్గీస్’ అంటే ‘పువ్వు’ అని అర్థం. తరువాత ఈ పేరుతోనే సినీ నటిగా కొనసాగారు. 1942 సంవత్సరంలో ‘తమన్నా’ చిత్రంలో నాయికగా నటించారు. 1943లో 14 ఏళ్ళ వయసులో ‘తక్దీర్’ సినిమాలో నటించారు. దీనిని మెహబూబాఖాన్ నిర్మించారు. మోతీలాల్ కథానాయకుడు. ఫిల్మిండియా దీనిని ‘అద్భుతమైన అరంగేట్రం’గా ప్రశంసించింది. నర్గీస్ నటనకు పేరు తేవడంతోపాటు బాక్సాఫీసును బద్దలు కొట్టడం విశేషం.

తరువాత బాబుల్, ఆవారా, శ్రీ 420, దీదార్, అందాజ్, ఆహ్, జోగన్, అనోఖా ప్యార్, ఆగ్, జాగ్తే రహో, బర్సాత్, బేవఫా, చోరీ చోరీ, పర్దేశి, ఘర్ సంసార్, మొదలైన చిత్రాలలో నటించారు.

రాజ్ కుమార్, దిలీప్ కుమార్‌లతో ఎక్కువ సినిమాలలో నటించారు. ఈ సినిమాలన్నీ హిందీ సినిమా స్వర్ణయుగంలో గొప్ప క్లాసిక్స్‌గా వాసికెక్కాయి.

1957లో మహబూబ్ ఖాన్ నర్గీస్ నాయికగా ‘మదర్ ఇండియా’ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో నర్గీస్ 28 ఏళ్ళ వయసులోనే తల్లి పాత్రను ధరించి మెప్పించారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడింది.

1968లో ‘రాత్ ఔర్ దిన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా వీరికి ఊర్వశి పురస్కారాన్ని అందించింది. ఇదే వీరి చివరి చిత్రం.

‘ఆహ్’ సినిమా తెలుగులో ‘ప్రేమలేఖలు’ పేరుతో విడుదలయి తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది.

వీరికి జీవితకాలంలోను, మరణానంతరం కూడా అనేక పురస్కారాలు, అవార్డులు లభించాయి. 1957లో ‘మదర్ ఇండియా’ సినిమాలో ధరించిన రాధ పాత్రలోని నటనకు పిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 1958లో ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందారు. సినిమా రంగం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన తొలి నటీమణులిద్దరిలో వీరు ఒకరు. మరొకరు దేవికారాణి.

వీరి చివరి సినిమా ‘రాత్ ఔర్ దిన్’లో నటనకు గాను 1968లో జాతీయ ఉత్తమనటి అవార్డును పొందారు.

జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని ‘ఊర్వశి’ పేరుతో అందజేస్తారు. అలా ఊర్వశి పురస్కారాన్ని అందుకున్న తొలి నటీమణి కూడా వీరే! ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.

1958వ సంవత్సరంలోనే చెకోస్లోవేకియా దేశంలో జరిగిన చలనచిత్రోత్సవంలో ‘మదర్ ఇండియా’ సినిమాలోని నటనకు గాను ‘కార్లోవివేరి ఫిల్మ్ ఫెస్టివల్’ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకున్నారు.

వీరి మరణానంతరం 2001లో హీరోహోండా మరియు స్టార్‌డస్ట్ సినిమా పత్రిక వారు ‘బెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది మిలీనియం’ పురస్కారాన్ని ప్రముఖ హిందీ నటుడు శ్రీ అమితాబ్ బచ్చన్‌తో కలిపి వీరికి అందించారు.

సునీల్‌ దత్ ‘మదర్ ఇండియా’ సినిమాలో నర్గీస్ కుమారుని పాత్రలో నటించారు. సునీల్ దత్ నర్గీస్‌తో పెళ్ళి ప్రస్తావన తెచ్చారు. నర్గీస్ అంగీకరించారు. సునీల్ దత్‌తో వీరి వివాహం జరిగింది. నర్గీస్ హిందూ మతాన్ని స్వీకరించారు.

మానవ జీవితాల్లో చిత్ర విచిత్రాలెన్నో జరుగుతాయి. వీరి కుటుంబ జీవితంలో చిత్రం ఒకటుంది. వీరి తండ్రి వివాహమయిన తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే/నర్గీస్ పెళ్ళి తరువాత హిందూమతాన్ని స్వీకరించారు. పెళ్ళి తరువాత సినిమాలలో నటించడం తగ్గించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. సంజయ్, నమ్రత, ప్రియలు, సంజయ్ దత్ సినిమా వారసత్వాన్ని, ప్రియాదత్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం ముదావహం.

నర్గీస్, సునీల్‌దత్ దంపతులు హిందీ సినిమా రంగాన్ని తమ నటనతో అలరించడమే కాదు, సామాజిక రంగంలో కూడా విశిష్టము, విలక్షణము అయిన సేవలను అందించారు.

ఈ దంపతులు ‘అజంతా కల్చరల్ ట్రూప్’ ద్వారా భారతీయ సైనికులకు వినోదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నాటి ప్రముఖ సినీనటులు, గాయనీ గాయకులు పాల్గొన్నారు. వీరందరితో స్టేజ్ షోలు తయారు చేయించారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం తరువాత ఆనందోల్లాసాలలో తేలియాడే సైనికుల కోసం ఢాకా నగరంలో మొదటి ప్రదర్శనను ఇచ్చారు. తరువాత వివిధ సరిహద్దు ప్రాంతాలలో సైనికుల వినోదం కోసం ప్రదర్శనలను ఏర్పాటు చేసి వారిని అలరించారు.

1972 అక్టోబర్ 2వ తేదీన నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సలహాలతో ‘ది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ (SSI) సంస్థను స్థాపించారు. ఈ విధంగా దివ్యాంగుల సేవారంగంలో కార్యక్రమాలను ప్రారంభించారు.

పిల్లలలో నరాల సంబంధిత వ్యాధులు, ఫిట్స్, పక్షవాత లక్షణాలున్న వారికి వైద్య సేవలను అందించడమే SSI లక్ష్యం. ఈ సంస్థకు మొదటి పోషకురాలయి చరిత్రను సృష్టించారు.

1980వ సంవత్సరంలో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. 1981వ సంవత్సరంలో పాంక్రియాటిక్ (క్లోమపు) క్యాన్సర్‌కు గురయ్యారు. అమెరికాలోని స్లోన్-కెట్టరింగ్ హాస్పటల్‌లో చికిత్స చేయించుకున్నారు. భారతదేశం తిరిగి వచ్చిన తరువాత ముంబైలోని బ్రీచ్‌కాండీ హాస్పటల్‌లో 1981 మే 3వ తేదీన మరణించారు. నర్గీస్ దత్ మరణానంతరం సునీల్ దత్ వీరి జ్ఞాపకార్థం నర్గీస్ దత్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పటల్‌ను స్థాపించారు. నర్గీస్ దత్ మెమోరియల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించారు. క్యాన్సర్ పేషంట్లకు సేవలను అందించడమే ఈ సంస్థ ధ్యేయం.

భారతదేశ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ‘జాతీయ సమైక్యత’పై రూపొందించిన చిత్రాలకు ‘నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా అవార్డు’ను అందిస్తున్నారు.

వీరి జీవితచరిత్ర గ్రంథస్థం చేయబడింది. ‘ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ నర్గీస్’ను టి.జె.యస్. జార్జ్ వ్రాయగా/’మిస్టర్ అండ్ మిసెస్ దత్: మెమొరీస్ ఆఫ్ అవర్ పేరెంట్స్’ని నర్గీస్ కుమార్తెలు ప్రియా దత్, నమ్రతా దత్‍లు వ్రాశారు

భారతదేశపు స్వర్ణయుగ హిందీసినిమా చరిత్రలో అసమాన నటిగా, సంఘసేవకురాలిగా పేరు పొందిన స్వర్గీయ నర్గీస్ దత్ జ్ఞాపకార్థం 1993 డిశంబరు 30వ తేదీన 1 రూపాయ విలువగల స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. నవ్వుతూ చూస్తున్న నర్గీస్ దత్ ముఖచిత్రంతో పాటు, స్టాంపు మీద ఎడమవైపున క్రింది భాగంలో SSI అని ముద్రించారు. ఇది నర్గీస్‌కు ‘స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’కు గల అనుబంధాన్ని తెలియజేస్తుంది.

మే 3వ తేదీ వీరి వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***                                                         

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here