మహిళాభివృద్ధే ధ్యేయంగా బ్రతికిన ‘శ్రీమతి పండిత రమాబాయి సరస్వతి

9
6

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 23వ తేదీ శ్రీమతి పండిత రమాబాయి సరస్వతి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

తొలి దశలో మరాఠీ, సంస్కృత గ్రంథాలను అభ్యసించి, సంస్కృత శ్లోకాల ప్రవచనాలతో దేశ ప్రజలను ఆకర్షించిన మహిళ/భారత్‌లో బ్రాహ్మణ మహిళలను గురించి “The High Caste Hindu Woman’ గ్రంథాన్ని రచించిన సబల/మలి దశలో క్రైస్తవాన్ని స్వీకరించి ‘క్లెమెంటినా బట్లర్’గా మారి బైబిల్‌ను మరాఠీ భాషలోకి అనువదించిన వనిత ‘శ్రీమతి పండిత రమాబాయి సరస్వతి’. వీరు నిరంతరం మహిళాభివృద్ధి కోసమే కృషిచేశారు.

వీరు 1858 ఏప్రిల్ 23వ తేదీన నాటి మద్రాసు ప్రెసిడెన్సీ నేటి కర్నాటక రాష్ట్రంలోని కెనరా జిల్లా కుద్రేముఖ్ పర్వత సానువులలోని గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీబాయి డోంగ్రీ, అనంతశాస్త్రి డోంగ్రీలు. అనంతశాస్త్రి గొప్ప సంస్కృత పండితులు. సంస్కృత పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవించేవారు.

రమాబాయి తండ్రి వద్ద మరాఠీ, సంస్కృత భాషలను అభ్యసించారు. అనంతశాస్త్రి పేదరికంతో కునారిల్లి పోయాడు. 1876-1878 మధ్య సంభవించిన డొక్కల కరువు కాలంలో అనంతశాస్త్రి, భార్య లక్ష్మీబాయితో సహా మరణించారు. రమా, ఆమె తమ్ముడు శ్రీనివాస్ అనాథలుగా మిగలడం విచారకరం.

బాల్యం నుండి తండ్రి సంస్కృత ప్రవచనాలను వింటూ అభ్యసించిన రమాబాయి వాటిని ఉగ్గుపాలతోనే ఔపోసన పట్టారు.

తండ్రి జీవనోపాధికి కారణమైన ఈ పురాణ ప్రవచనాలనే తమకు జీవనాధారంగా స్వీకరించారు. దేశమంతా తిరిగి ప్రచారాలు చేసి హిందూ మతధర్మాలని సుసంపన్నం చేశారా అక్కా తమ్ముళ్ళు.

కలకత్తా పర్యటన వీరి జీవితంలో కొత్త మలుపులు తీసుకొచ్చింది. కేశవ చంద్రసేన్ వీరి చేత వేదాభ్యసనం చేయించారు. వీరు సంస్కృత గ్రంథాలలోని 18,000 శ్లోకాలను వినిపించారు. ఇందుకు ప్రతిగా ‘కలకత్తా విశ్వవిద్యాలయం’ వీరికి ‘పండిత’, ‘సరస్వతి’ అనే బిరుదులను ప్రదానం చేసి గౌరవించారు. మహిళలకు ‘పండిత’ పురస్కారం వీరితోనే మొదలయింది. ఈ విధంగా రమాడోంగ్రీ ‘పండిత రమాబాయి సరస్వతి’గా మారారు.

1880వ సంవత్సరంలోనే తమ్ముడు శ్రీనివాస్ డోంగ్రీ మరణించారు.

బెంగాలీ న్యాయవాది, ఉపాధ్యాయుడు ‘బిపిన్ బిహారీ మేధ్వీ’తో వీరి వివాహం జరిగింది. వీరిది ఆదర్శ వివాహం. వీరికి మనోరమ అనే కుమార్తె పుట్టింది. రమాబాయి దురదృష్టం “హమ్మయ్య జీవితంలో స్థిరపడ్డాను” అనుకునే వేళ భర్త మరణించారు. కుమార్తెను తీసుకుని పూనా నగరాన్ని చేరుకున్నారు.

ఇక్కడే వారి జీవితం మలుపు తిరిగింది. అంతే కాదు భారత దేశ మహిళల జీవితాలను మలుపు తిప్పి, వారిని అభివృద్ధి పథం వైపు నడపగలిగే పనులను చేయగలిగారు. కొంతకాలం రమాబాయి రెనడే దంపతులు వీరికి ఆతిథ్యమిచ్చి, సాంత్వన చేకూర్చారు. ధైర్య సైర్యాలను అందించారు.

పూనాలో ‘ఆర్య మహిళా సమాజ్’ను స్థాపించారు. బాలికల విద్య, బాల్యవివాహాల నిర్మూలనల కోసం ఈ సమాజం పనిచేసింది.

ఇదే సమయంలో భారతీయుల విద్యా సంస్కరణల కోసం ‘లార్డ్ హంటర్ కమీషన్’ను ఏర్పాటు చేసింది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం. రమాబాయి ఈ కమీషన్ ముందు హాజరయి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

“ఈ దేశంలోని వందమంది విద్యావంతులైన పురుషులలో 99% మంది మహిళా విద్యను వ్యతిరేకిస్తున్నారని” నిర్భయంగా చెప్పారు. ఇంకా “ఉపాధ్యాయినులకు శిక్షణను ఇవ్వాలి, మహిళా పాఠశాలలను స్థాపించాలి, అవి సక్రమంగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించడానికి మహిళా పాఠశాల ఇనస్పెక్టర్లను నియమించాలి” అని నొక్కి వక్కాణించారు.

మహిళలకు వైద్య సదుపాయల లేమి గురించి కూడా వీరు ప్రస్తావించడం గొప్ప విశేషం. మహిళలకు మహిళలే వైద్యం చేసే రోజులు రావాలని ఆకాంక్షించారు. మహిళలకు వైద్య కళాశాలలలో సీట్లు కావాలని కోరారు. వీరి కోరికలు, ఆకాంక్షలు అదృష్టవశాత్తు విక్టోరియా రాణి వరకు వెళ్ళడం చారిత్రక విశేషం. లార్డ్ డఫ్రిన్ కాలంలో మహిళా వైద్య ఉద్యమం జరగడానికి రమాబాయి మాటలు దోహదం చేశాయనడం అతిశయోక్తి కాదు.

స్వయంగా వైద్య శిక్షణ తీసుకోవడం కోసం 1883లో బ్రిటన్ వెళ్ళారు. ఈలోగా వీరికి చెవిటితనం వచ్చింది. వైద్య శిక్షణ తీసుకోవడానికి ఈ వైకల్యం అడ్డంకి అయింది.

1883లో బ్రిటన్ లోని ఆంగ్లికన్ చర్చికి సంబంధించిన ‘సెయింట్ కమ్యూనిటీ ఆఫ్ సెయింట్ ప్రార్థనా మందిరం’లో బాప్టిజం తీసుకున్నారు. బ్రిటన్లో మేరీ వర్జిన్ ఇంట్లో ఉన్నారు.

1886వ సంవత్సరంలో అమెరికా వెళ్ళారు. అక్కడ బంధువు డా॥ఆనందీబాయి జోషి తొలి భారతీయ మహిళా డాక్టర్‌గా పట్టాను స్వీకరించిన స్నాతకోత్సవానికి హాజరయారు.

అమెరికా, కెనడా, జపాన్ వంటి దేశాలలో పర్యటించి మహిళల సమస్యలు, పరిష్కార మార్గాలను వివరించారు. బాల్య వివాహాలు, బాల వితంతువులు, హిందూ మహిళల జీవితాలలోని చీకటి కోణాలను వివరించేవారు.

1887లో అమెరికాలోని బోస్టన్‌లో ‘అమెరికన్ రమాబాయి అసోసియేషన్’ను స్థాపించారు. వీరు రచించిన ‘The High Caste Hindu Woman’ పుస్తకం 10,000 కాపీలను అమ్మారు. ఈ అమ్మకాలు, ఇతర దాతల చందాలు కలిసి 1888 నాటికి 30,000 డాలర్ల మొత్తం సమకూరింది.

1889లో భారతదేశానికి తిరిగి వచ్చారు. నాటి బొంబాయి (నేటి ముంబై) లో ‘శారదా సదన్’ను స్థాపించారు. ఇక్కడ వితంతు మహిళల విద్యాభివృద్ధికి సౌకర్యాలను కలిగించారు. దేశంలో అనాథ బాలికలు, వితంతు మహిళల కోసం స్థాపించిన మొదటి వసతి గృహమిదే కావడం గొప్ప విశేషం. విద్య, వృత్తి విద్యలను అభ్యసించే అవకాశాలను కల్పించారు. తరువాత కాలంలో ఇవి ఆయా మహిళలకు జీవనోపాధిని కూడా కల్పించాయి.

ఇదే సమయంలోనే పూనా నగరాన్ని భయంకరమైన కరువు కబళించింది. ఈ సమయంలో ఎడ్లబండ్ల మీద ప్రజలను శారదాసదన్‌కి చేర్పించి – కొద్దిరోజులు పునరావాస శిబిరంగా మార్చారు.

ఆ తరువాత పూనాకు సుమారు 40 కి.మీ దూరంలో ఉన్న ‘కేడ్గావ్’ గ్రామంలో ‘ముక్తీ మిషన్’ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పాఠశాలను స్థాపించారు. ఇక్కడ మహిళల జీవనోపాధికి కావలసిన అనేక అంశాలలో – దర్జీపని, కలపకోయడం, నేతపని, వ్యవసాయం, తోటపని, కుటీర పరిశ్రమలలో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లను కల్పించారు.

1900 సంవత్సరం నాటికి ఈ సంస్థలో 1500 మంది నిర్వాసితులు ఆశ్రయం పొందుతూనే – వివిధ అంశాలలో శిక్షణను పొందడం జరిగింది. పశు సంరక్షణకు కూడా స్థానం కల్పించారు. ఈ మిషన్‌ను తరువాత ‘రమాబాయి ముక్తి మిషన్’గా మార్చారు.

వీరి కుమార్తె బొంబాయిలోను, అమెరికాలోను ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. వీరు విద్యను ముగించుకుని తిరిగి వచ్చాక శారదాసదన్ ప్రిన్సిపాల్‍గా సేవలను అందించారు. గుల్బర్గా సమీపంలో ఒక క్రిస్టియన్ హైస్కూలును స్థాపించే సమయంలో తల్లికి సాయం చేశారు. తల్లికి అన్ని రంగాలలోను తోడు నీడై నిలచి సేవాకార్యక్రమాలలో పాలు పంచుకున్న ఈమె 1921లో మరణించారు. అందరినీ పోగొట్టుకున్నా కుమార్తెను చూసి బ్రతుకుతున్న రమాబాయి ఈ సంఘటనతో మానసికంగా, శారీరకంగా కృంగిపోయారు.

వీరు స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. 1889లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు.

వీరు గ్రీకు, హీబ్రూ భాషలను కూడా నేర్చుకున్నారు. ఏడు భాషలలో ప్రావీణ్యతను సంపాదించుకున్నారు. బైబిల్ ను మరాఠీ భాషలోకి అనువదించారు. అయితే ఆ గ్రంథాన్ని ఆవిడ చూడలేదు. వీరి మరాఠీ బైబిల్ గ్రంథాన్ని 1924వ సంవత్సరంలో ‘మేరీలిస్సాహస్తి’ ముద్రించారు. రమాబాయి సరస్వతికి గల క్రైస్తవనామం ‘క్లెమెంటినా బట్లర్’ పేరుతో ఈ బైబిల్‌ను ముద్రించారు. (కేడ్గావ్, ఇండియా) రమాబాయి ముక్తి మిషన్ ప్రచురణలుగా పేరు పొందింది.

వీరు భారతీయ మహిళల బాధల, పరిష్కార మార్గాలతో రూపొందించి రచించిన ‘The High Caste Hindu Woman’ గ్రంథాన్ని డా॥ ఆనందీబాయి జోషికి అంకితమిచ్చారు.

1919వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం వారి ‘కైసరి – ఇ – హింద్’ పతకాన్ని స్వీకరించారు.

ఈ విధంగా ఒక సంస్కృత పండితురాలు, బాలల, మహిళల అభివృద్ధికోసం ‘ఆర్య మహిళా సమాజ్’, ‘ముక్తి మిషన్’, శారదాసదన్’లను స్థాపించిన సంఘసంస్కర్త, బైబిలును మాతృభాషలోకి అనువదించిన అనువాదకురాలు శ్రీమతి పండిత రమాబాయి సరస్వతి 1922వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన బొంబాయిలో మరణించారు.

వీరి జ్ఞాపకార్థం 1989వ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన 60 పైసల స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. ఈ స్టాంపు మీద పండిత రమాబాయి ముఖచిత్రంతో పాటు ‘శారదాసదన్’ భవనం చుట్టు వృక్షాల మధ్య దర్శనమిస్తుంది.

వీరి జయంతి ఏప్రిల్ 23వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***                                                         

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here