తల్లి పట్ల గల అవ్యాజమైన ప్రేమను తెలిపే ‘అవ్వ నానీలు’

1
10

[శ్రీ బాలసాని కొమురయ్య రచించిన ‘అవ్వ నానీల’ని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]ప[/dropcap]ద్య కవి, ప్రైవేట్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, బాలసాని కొమురయ్య కలం నుండి జాలువారిన ‘అవ్వ నానీలు’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది. అవ్వ నానీలు ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. తెలుగు సాహిత్యంలో నాలుగు పంక్తులు లేదా 25 అక్షరాలతో సాగే సూక్ష్మ కవితా పద్ధతిని నానీలు అంటారు. నానీల కవితా ప్రక్రియను ఆచార్య ఎన్ గోపి ప్రవేశపెట్టారు. తెలుగు సాహిత్య రంగంలో అత్యాధునిక దేశీ ప్రక్రియ నానీలు 1997 సంవత్సరంలో ఆచార్య ఎన్ గోపి కలం నుండి కవిత రూపంగా పురుడు పోసుకున్నాయి. భావ శైలితో వస్తు నిర్మాణంలో ధారాశక్తితో గాఢత సాంద్రతతో ఒక కెరటంలా ఎగసిపడే ఉదాత్త గుణంతో నానీలు సూటిగా పాఠకుని హృదయాన్ని తాకుతాయి. వస్తు వైవిధ్యంతో నానీల సంపుటాలు ప్రచురింపబడ్డాయి. నానీల కవితల్లో సమకాలీనత కనిపిస్తుంది. ఆచార్య ఎన్ గోపి స్ఫూర్తితో కొమురయ్య ‘అవ్వ నానీలు’ రాసినట్లుగా తోస్తోంది. పల్లెటూరులో అమ్మను అవ్వ అని నాన్నను అయ్య, నాయిన, బాపు అని పిలుస్తారు. కొమురయ్య తల్లిని అవ్వ అని పిలిచేవాడు. అవ్వ ఈ లోకం నుండి దివికి చేరింది. అవ్వను గురించిన యాదిలో నానీలు రాసినట్లుగా తోస్తోంది.

ఉదయం లేవగానే

పొంగిన సంబురం

రాత్రి కలలో

అవ్వ జోల పాట.’

ఉదయం లేవగానే సూర్యోదయ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. పగటివేళలో గాలిలోకి లేచిన దుమ్ము, దూళి అంతా నేల మీదకి చేరడంతో గాలి పరిశుభ్రంగా ఉంటుంది. ఉదయం పూట వాహనాల రద్దీ లేకపోవడంతో అంతటా నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఉదయం లేవగానే ఏదైనా పని మొదలు పెడితే శుభ ఫలితాలు ఉంటాయని పల్లెవాసుల నమ్మకం మరియు పల్లె సంస్కృతికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఉదయం పూట నిశ్శబ్దంతో కూడుకుని ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా వాతావరణం అద్భుతంగా ఉంటుంది.కవి కొమురయ్య అవ్వ పర లోకగతురాలు అయింది.అవ్వను గూర్చిన జ్ఞాపకాలలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.నిద్ర నుండి లేవగానే అతనికి చెప్పలేనంత ఆనందంతో పాటు పరవశం కలుగుతోంది. అవ్వ ఇక రాదు అని తెలుసు. ఉదయం పూట అవ్వ తన చెంత ఉన్నట్లు అవ్వతో మాట్లాడినట్లుగా సంబరపడిపోతున్నాడు. రాత్రి వచ్చిన కలలో ప్రియాతి ప్రియమైన అవ్వ దగ్గర పడుకున్నట్లుగా అవ్వ జోల పాట పాడి నిద్ర పుచ్చినట్లుగా గుర్తుకు వచ్చింది. మదిలో మెదిలిన అవ్వను గూర్చిన జ్ఞాపకాలు అతనిని వెంటాడుతున్నాయి. అవ్వ జ్ఞాపకాలతో అతను జీవిస్తున్నాడు. చిన్నతనంలో అవ్వ జోల పాట పాడి నిద్రపుచ్చే సంగతులు అందరికి తెలుసు. అవ్వ జోల పాట పాడగానే పసిబిడ్డ హాయిగా నిద్రలోకి జారిపోవడమనే చిన్ననాటి అనుభూతులు అతని మదిలో మెదిలి సంబురంలో తేలిపోతున్నాడు. ఊహకందని అతని అనుభూతి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు.

వంటింట్లో

పోపు వాసన లేదు

అవ్వ వాడిన

పోపు గంటె మాయం.’

అవ్వ ఈ లోకంలో లేదు. అవ్వ వంట గదిలో పోపు పెడుతూ వంట చేసేది. అవ్వ కూరలు వండేటప్పుడు పోపు గంటెలో పోపు పెట్టడంతో పోపు వాసనల ఘుమఘుమలు కమ్మగా ఇంటి నిండా వ్యాపించేవి. అవ్వ ఉన్నప్పుడు కావలసినవి అన్ని వండి పెట్టడం అదొక వింత అనుభూతి. అతను పని చేసి ఇంటికి రాగానే అవ్వ చేసిన పిండి వంటలు కమ్మగా వండి పక్కన పెట్టడం వాటిని ఇష్టంగా తింటుంటే అవ్వ సంతోషించిన క్షణాలు గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్ళు జలజల రాలాయి. అవ్వ లేని ఇల్లు దేవుడు లేని దేవాలయంలా ఉంది. వంట గది శూన్య గృహంలా ఉంది. దిక్కు దివానం లేని అవ్వ లేని ఇంటిలో అవ్వ పెట్టే పోపు వాసనలు ఘుమఘుమలు ఎలా వ్యాపిస్థాయి. అవ్వ వంట చేసినపుడు వచ్చే పోపు వాసనను అతను గుర్తు చేస్తున్నాడు. వంట గదిలో అవ్వ వాడిన పోపు గంటెకు కూడా రెక్కలు వచ్చి మాయం అయింది. అవ్వ లేని వంట గదిలో ఎవ్వరు వంట చేయడం లేదు. తెలిసినవాళ్లు ఎవరో అవ్వ వంట గది నుండి పోపు గంటెను తీసుకొని వాడుకుంటున్నారు. వంట గదిలో అవ్వ వాడిన పోపు గంటె కూడా మాయమై పోయింది అని అతను ఆవేదన చెందడం సరైనదే అని చెప్పవచ్చు.

అవ్వ మాట

తారక మంత్రం

స్మరిస్తే చాలు

బాధలన్నీ ఆవలిగట్టు.’

అవ్వ మాట తారక మంత్రం అనడం అతనికి అవ్వ పట్ల గల అపారమైన ప్రేమను తెలియజేస్తుంది. అవ్వను కూడా దేవతగా పూజించే సమాజం మనది. అవ్వ ఎప్పుడు మంచి చెబుతుంది. అవ్వ మంచి కొరకు పాటుపడుతుంది. అవ్వను కూడా త్యాగానికి ప్రతీకగా చెప్పవచ్చు. రామ నామాన్ని తారక మంత్రం అంటారు. అవ్వ చెప్పిన మాట తారక మంత్రంలా అతని ఉన్నతికి దోహదం చేసింది. అవ్వ ద్వారా అతను అపారమైన జ్ఞాన సంపదను పొందాడు. అవ్వను స్మరించడం వలన బాధలు అన్ని తీరతాయి, సంసార నావను ఈ తీరం ఒడ్డు నుంచి ఆవలి గట్టుకు చేరుస్తుంది అనే ప్రగాఢ నమ్మకం అతనిలో ఉంది.

ఆకాశం

తొంగి చూసింది

ఇంటి ముందర

అవ్వ నక్షత్రం ముగ్గు.’

ఆరు బయట నుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలి రంగు ఆవరణమే ఆకాశం. నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్య ప్రదేశం ఆకాశం. మనకు రాత్రి సమయంలో ఆకాశం సూర్యకాంతి లేకపోవడం వలన చీకటిగా కనిపిస్తుంది. ఆ చీకటిలో అనంత దూరాలలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి. నక్షత్రాలు అంటే సూర్యుడిలా ఖగోళంలో ఉండే స్వయం ప్రకాశిత వాయు గోళము అని చెప్పవచ్చు. ఆకాశం తొంగి చూసింది అనే వాక్యం చదవగానే మనలో ఆశ్చర్యం కలుగుతుంది. ఆకాశం ఎక్కడైనా తొంగి చూస్తుందా? అనే సవాలక్ష ప్రశ్నలతో కూడిన సందేహాలు మనలో పొడసూపుతాయి. ఆకాశం ఎందుకు తొంగి చూసింది? ఇంటి వాకిలి ముందర శుభ్రంగా ఊడ్చి ఆవు పేడతో కల్లాపి చల్లి అవ్వ రోజు ముగ్గు వేస్తుంది. అవ్వ తీర్చిదిద్దిన అందమైన ముగ్గు ధగ ధగా నక్షత్రంలా మెరుస్తుంది. అందుకే ఆకాశంలోని చుక్కలు అవ్వ వేసిన అందమైన ముగ్గు చూడడానికి వచ్చాయి అని చెప్పడంలో కవి కొమురయ్య భావన చక్కగా ఉంది. ఆకాశంలోని నక్షత్రాలు దిగి వచ్చి అవ్వవేసిన ముగ్గు మీద వాలినాయి అని చెప్పడం గొప్పగా ఉంది..

భువికి దిగిన

సింగిడి వన్నె

తీరొక్క పూలతో

అవ్వ చేతి బతుకమ్మ..’

భూమండలంలో మూడో వంతు భాగమే భూమి ఉంటుంది. ప్రాణులు ఉన్న ఒకే ఒక్క గ్రహం భూమి అని చెప్పవచ్చు. సింగిడి అనగా ఇంద్రధనస్సు. వర్షాకాలంలో ఏడు రంగులతో ఆకాశంలో అందంగా కనిపించేది. ఇంద్రధనస్సులోని రంగులు ఏడు. వైలెట్, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ మరియు ఎరుపు. VIBGYOR గా చెప్పవచ్చు రెయిన్‌బో ఆకాశంలో మాత్రమే చూడవచ్చు .రెయిన్‌బోను రంగుల హరివిల్లు అని పిలుస్తారు. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్యయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. బతుకమ్మ గౌరీ పండుగ, సద్దుల పండుగ, దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. రంగురంగుల పూలను పిరమిడ్ ఆకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. బతుకమ్మ పండుగ బొడ్డెమ్మతో మొదలవుతుంది. ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఆడుతారు. తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడే పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు కలగలిపి భక్తితో పాడుకుంటారు. బతుకమ్మను ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తంగేడు, గునుగు పువ్వులు, బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి తీరొక్క పూలతో అవ్వ పేర్చిన బతుకమ్మ ఏడు రంగులతో కూడిన ఇంద్రధనస్సులా సొగసుగా ఉండేది. ఆకాశం నుండి దిగిన ఇంద్రధనస్సు అవ్వ పేర్చిన బతుకమ్మ అలంకారానికి ముగ్దురాలై భూమిపై వాలింది అని చెప్పిన కవి కొమరయ్య భావం అద్భుతం అని చెప్పవచ్చు.

మట్టి పరిమళం

నా చుట్టూతా

నీ పాదాల స్పర్శ

తాకిన నేలంతా.’

మట్టి జీవానికి ఆధారమైన సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, వాయువులు, ద్రవాలు జీవపదార్థాల మిశ్రమం అని చెప్పవచ్చు. భూమిలో మట్టి ఉండే భాగాన్ని పెడోస్పియర్ అని అంటారు. వాన కురిసిన తర్వాత భూమిలో ఒక రకమైన మట్టి పరిమళం వస్తుంది. అవ్వ నివసించిన ప్రాంతమైన ఆ ఇంటిలో ఆమె కొలువై ఉన్నట్లు భూమిలోని మట్టి వాసనలు అతని శరీరంతో పాటు అతని ఇంటి చుట్టు ప్రక్కల పరిసరాల నిండా వ్యాపించి ఉన్నాయి. అవ్వ నడిచిన ఇంటిలో అవ్వ పాదాల స్పర్శను తాకిన నేల ఎంతో పవిత్రమైందని అతను చెప్తున్నాడు. అవ్వ చేత బుడిబుడి నడకలు నేర్చి పెరిగి పెద్దవాడై ఉన్న అతడు అవ్వ లేకున్నప్పటికీ అతడు ఆ ఇంటి నిండా ఆవరించిన మరియు పరిసరాలలో వ్యాపించి ఉన్న మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు. అవ్వ నడిచిన పాదాల స్పర్శకు నేల కూడా పునీతమైందని చెప్పిన కవి కొమరయ్య భావం గొప్పది.

సింతకాయ తొక్కు

కమ్మదనం యాదికి

సద్ది మూట

తిన్నప్పుడల్లా.’

అవ్వ చేత పెరిగిన అతడు బువ్వ తింటున్న వేళలో అతనికి చిన్నతనంలో అవ్వ బువ్వతో కలిపి పెట్టిన చింతకాయ తొక్కు కమ్మదనం గుర్తుకువస్తుంది. మధ్యాహ్నం పూట అవ్వ చేత పెట్టిన సద్ది మూట విప్పి చింతకాయ తొక్కు కలుపుకొని బువ్వ తింటుంటే కమ్మదనం గుర్తుకు వస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

యాదికచ్చినప్పుడల్లా

గుండె సెరువు

బతుకనని

నువ్వన్న ఆఖరి మాట.’

అవ్వ స్వర్గం చేరింది. అవ్వ గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెల్లోంచి బాధ చెరువులా ఎగసి పారుతుంది. అవ్వ పట్ల గల ప్రేమతో అతని గుండె భారమై దిగులు ఆవహిస్తుంది. ప్రాణాలు విడిచే చివరి సమయంలో బిడ్డా ఇక నేను బతకనని ఏడుస్తూ చెప్పిన అవ్వ ఆఖరి మాటలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. అవ్వ పట్ల గల అవ్యాజమైన ప్రేమను తెలియ జేస్తున్నది. కవి కొమురయ్య అవ్వ నానీలు స్మృతి కవితలుగా రాసి అవ్వను సజీవం చేశాడు. కవి కొమురయ్యను అభినందిస్తున్నాను. కవి కొమురయ్య మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


బాలసాని కొమురయ్య 05-05-1973 రోజున పెద్దపెల్లి జిల్లాలో భోజన్నపేట గ్రామంలో సామాన్యమైన గౌడ కుటుంబంలో జన్మించాడు. కొమురయ్య తల్లిదండ్రులు మధురవ్వ, రాజేశం గౌడ్. కొమురయ్య తండ్రి రాజేశం గౌడ్ కులవృత్తి అయిన కల్లుగీత పనిచేస్తూ జీవించేవాడు. కొమురయ్య తాత చంద్రయ్య, నాయనమ్మ ఎల్లమ్మ. కొమురయ్య తాత చంద్రయ్య కూడా కులవృత్తి అయిన కల్లుగీత పనిచేస్తూ జీవించేవాడు.

కొమురయ్య 1 నుండి 7వ తరగతి వరకు భోజన్నపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. 8 నుండి 10వ తరగతి పెద్దపల్లి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ; ఇంటర్మీడియట్ పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓనూ; డిగ్రీ పెద్దపల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివాడు. కొమురయ్య పి.జీ. ఎం.కాం.విద్యను కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండలో చదివారు. ఎం.ఏ. తెలుగు కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండలో చదివాడు. కొమురయ్య 2003లో ట్రినిటీ తెలుగు పండిట్ శిక్షణా కళాశాల, పెద్దపల్లిలో తెలుగు పండిట్ ట్రైనింగ్ పొందాడు. కొమురయ్య తెలుగు భాషా ఉపాధ్యాయునిగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు.

కొమురయ్య డిగ్రీ చదువుతున్నప్పుడే సాహిత్యం పట్ల ఆసక్తితో కవితలు రాయడం ఆరంభించాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దపెల్లి వారి సంపాదకత్వంలో వచ్చిన ఫిబ్రవరి 1995 సంవత్సరం, కాలేజీ మ్యాగజైన్ ఉదయినిలో మొదటిసారిగా కవిత ప్రచురింపబడింది. ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలో ఉగాది కవిత 2013లో ప్రచురింపబడింది. ‘అవ్వ నీ యాదిలో..’ ఉత్తమ ప్రేమలేఖగా తెలుగు వెలుగు పత్రిక, మే 2018 సంవత్సరంలో ప్రచురించింది. ఓదెల తీర్థంబోతన్న (కథ) తెలుగు వెలుగు పత్రికలో, జనవరి 2021లో ప్రచురితమైంది. కొమురయ్య ‘కొండగట్టు ఆంజనేయ శతకం’ 2015 సంవత్సరంలో ముద్రించాడు.

కొమురయ్య విశిష్ట సేవలకు గుర్తుగా అందించిన సత్కారాలు పురస్కారాలు.

  1. తెలుగు రక్షణ వేదిక – తేది 23 – 10 – 2016 రోజున బతుకమ్మ పురస్కారం.
  2. కళానిలయం, హైదరాబాద్ వారిచే తేది 09 – 09 -2016 రోజున సినారె సాహితీ పురస్కారం.
  3. సాంస్కృతి సమైక్య విజయవాడ వారిచే తేది 07 -04- 2019 రోజున ఉగాది వెలుగు పురస్కారం.
  4. సాంస్కృతి సమైక్య వారిచే తేది 27 – 01 – 2019 రోజున డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు స్మారక కవిత్వ సృజనా పురస్కారం.
  5. డాక్టర్ కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం
  6. వివేకానంద సేవా సమితి భూపాలపల్లి వారిచే తేది 16 – 12 -2019 సాహిత్య రత్న అవార్డు పొందారు.

కొమురయ్య వివాహం సృజనతో 05 – 12 – 1993 రోజున గోదావరిఖనిలో జరిగింది. కొమురయ్య, సృజన దంపతులకు ఇద్దరు సంతానం. ప్రథమ సంతానం కుమారుడు హరిచందన్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివాడు. మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తున్నాడు. ద్వితీయ సంతానం కుమార్తె కొత్తూరి శ్రీవిద్య ఎం.ఎస్సీ. ఫిజిక్స్ చదివింది. ఆమె భర్త అజయ్ ఇండియన్ బ్యాంకులో మేనేజర్.

కొమురయ్య పద్య రచన, వచన కవిత్వం. వ్యాసాలు, కథలు రాస్తున్నారు. కాళోజీ రచనలు ఇష్టం. కొమురయ్య ప్రస్తుత నివాసం కరీంనగర్‌. కొమురయ్య ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాడు. ప్రతి రోజు పుస్తక పఠనం చేస్తారు. కొమురయ్య తెలుగు ఉపాధ్యాయుడిగా పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పఠనంలోనూ, సృజనాత్మక రచనలు చేయడం లోనూ ఆసక్తిని కలిగిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here