అపురూపమైన అనుభూతులకు పెన్నిధి ‘చిలక్కొయ్య’

18
14

[ప్రముఖ కవి, తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాల రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీ గాజుల రవీందర్ కలం నుండి జాలువారిన ‘చిలక్కొయ్య’ అనే కవితని విశ్లేషిస్తున్నారు నరేంద్ర సందినేని.]

[dropcap]సా[/dropcap]హితీ గౌతమి, కరీంనగర్ వారు ప్రచురించిన శ్రీ విళంబి ఉగాది కవితా సంకలనం, ‘చైత్ర విభావరి’ పేరిట వెలువరించారు. శ్రీ విళంబి ఉగాది కవితా సంకలనంలో గాజుల రవీందర్ రచించిన ‘చిలక్కొయ్య’ కవిత చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.

‘చిలక్కొయ్య అంటే

గోడకు కొట్టిన మేకు కాదు

తర తరాల వారసత్వానికి వారధి

అపురూపంగా చూసుకున్న అనుభూతులకు పెన్నిధి’

చిలక్కొయ్య అంటే వస్త్రము మొదలైనవి యుంచుటకు గాను గోడ యందు కొట్టిన చిలుక వంటి ఆకారం కల కొయ్య అని అర్థం అవుతుంది. ఆంగ్లంలో చిలక్కొయ్యను హ్యాంగర్ అని అంటారు. చిలక్కొయ్య అంటే గోడకు కొట్టిన మేకు అని మనందరికీ తెలుసు. కాని కవి రవీందర్ చిలక్కొయ్య అంటే గోడకు కొట్టిన మేకు కాదు, తరతరాల వారసత్వానికి వారధి, అపురూపంగా పెంచుకున్న అనుభూతులకు పెన్నిధి అని అంటున్నారు. చిలక్కొయ్య తరతరాల వారసత్వానికి పెన్నిధి ఎలా అవుతుంది? అని మనలో సందేహాలు పొడసూపుతాయి. చిలక్కొయ్య పల్లెలో ఆనాడు ప్రతి ఇంటిలో కొలువై ఉండేది. పల్లెలో కూడా నగరీకరణ ప్రవేశించిన తర్వాత ఈనాడు ఎవరి ఇంట్లో కూడా చిలక్కొయ్య ఆనవాలు కూడా కనిపించడం లేదు. ఈనాడు చిలక్కొయ్య కనిపించకుండా మాయమైపోయింది. అట్లాంటి మన పల్లె సంస్కృతికి నిదర్శనంగా నిలిచిన చిలక్కొయ్యను గురించి ఈనాటి తరానికి అయితే తెలియదు. పట్టణాల్లో అయితే చిలక్కొయ్యను గురించి ఎవరికి తెలియదు. పల్లె మూలాల్లో నివసిస్తున్న కొందరికి మాత్రం చిలక్కొయ్యను గురించి తెలిసి ఉండవచ్చు. పల్లెలో పుట్టిన రవీందర్ తన ఇంట్లో ప్రత్యక్షంగా చిలక్కొయ్యను చూసిన జ్ఞాపకాలను తన హృదయంలో పదిలంగా నిక్షిప్తం చేసుకున్నారు. ఆనాటి పల్లె జ్ఞాపకాలకు గుర్తుగా మిగిలిన చిలక్కొయ్యను గురించిన విషయాలను వేడుకగా కవిత ద్వారా పంచుకోవడం అద్భుతం అని చెప్పవచ్చు. రవీందర్ చిలక్కొయ్యతో గల అనుభవాలను రంగరించి కవితకు రూపం ఇవ్వడం సమంజసంగా ఉంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అనే విషయాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ పల్లెలో ప్రతి ఇంట కొలువై ఉన్న చిలక్కొయ్యను కవి రవీందర్ సజీవం చేశారు. తెలంగాణలో తాత, తండ్రి తరాల వారసత్వానికి సేతువుగా ప్రతి ఇంట చిలక్కొయ్య ఉంది అనేది వాస్తవమని చెప్పవచ్చు. అలాంటి చిలక్కొయ్యను ఎంతో అపురూపంగా చూసుకునే వాన్ని, అందువల్ల గొప్ప అనుభూతి నాలో కలిగింది అంటున్నారు. కవి రవీందర్ చిలక్కొయ్యను చూసినందు వల్ల తనలో కలిగిన అనుభూతిని గొప్ప నిధిగా చెప్పడం చక్కగా ఉంది.

‘తనకు తగిలించే ప్రతి వస్తువు

ఒక పురాతత్వ శాస్త్రపు అమూల్య నిధి’

చిలక్కొయ్యకు తగిలించే ప్రతి వస్తువు పూర్వీకుల జీవన విధానాన్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన వస్తువు అని చెబుతున్నారు. పురాతత్వ శాస్త్రజ్ఞులు తవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, శాసనాలు, నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు. ఎటువంటి లిఖితపూర్వక ఆధారాలు లేని పూర్వీకుల సమాజం వారి జీవన విధానం గురించి తెలుసుకునేందుకు పురాతత్వ శాస్త్రం కీలకమైంది. వివిధ మానవజాతుల సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవడం, పూర్వీకుల జీవన విధానాన్ని పునర్నిర్మించడం, వాటిని అక్షరబద్ధం చేయడం, కాలంతోపాటు జీవన విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో పరిశోధించడం, పురాతత్వ శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం. చిలక్కొయ్యకు తగిలించిన వస్తువులను వెలకట్టలేని అమూల్యమైన నిధి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘తాతయ్య తెచ్చిన తాటి ముంజల నుంచి

నానమ్మ అల్లిన నవారు దాక

అన్నింటికీ తానొక ఆలవాలం

అద్భుత కళా కౌశల సన్నిధానం’

పల్లెలో తాటి ముంజలు విస్తారంగా లభిస్తాయి. వేసవికాలంలో తాటి ముంజలు తింటే చల్లదనంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుందనే ఒక నమ్మకం కొనసాగుతోంది. తాతయ్య ఆప్యాయంగా తమ తోటలో కాచిన తాటి ముంజలను ఎంతో ఇష్టంగా పిల్లల కొరకు తెచ్చిన వాటిని మొదటగా ఇంటిలోని చిలక్కొయ్యకే తగిలిస్తాడు. అమ్మమ్మ అల్లిన నవారును కూడా ఇంట్లోని చిలక్కొయ్యకే తగిలిస్తుంది. ఇంట్లోకి ఏ వస్తువును తెచ్చినా దానిని చిలక్కొయ్యకు తగిలించడం జరిగేది. చిలక్కొయ్య ఏ వస్తువుకైనా ఆశ్రయమిచ్చి తనను అక్కున చేర్చుకుంటుంది.

‘ఆ రోజుల్లో తానొక లైట్ హౌస్ గా మారి

ఇంట్లోని ప్రతి వస్తువుకు తానే కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది’

ఆ రోజులను తల్చుకుంటూ చిలక్కొయ్య గురించిన సంగతులను తెలుపుతున్నారు. చిలక్కొయ్య ఇంట్లోనే ఉండి ఓడలకు దిక్కు తెలియ జేయుటకై రేవున ఉండే దీప స్తంభంలా మారి ఇంటిలోని ప్రతి వస్తువు దీని చెంతనే లభ్యమయ్యేది అని చెప్పిన తీరు అద్భుతం.

‘ఎవ్వరికీ లేని పొగరు దానికి

అందుకే కాబోలు ఎల్లప్పుడు తల ఎత్తుకుని నిల్చునేది’

చిలక్కొయ్యకు ఎవ్వరికి లేని పొగరు ఎందుకు ఉంటుంది? చిలక్కొయ్య గోడకు కొట్టిన మేకు కదా దానికి మనిషిలా అనుభూతులు, అనుభవాలు ఎలా కలుగుతాయి? చిలక్కొయ్యకు ఎవరికి లేని అహంకారం అందుకే అది ఎల్లప్పుడు తల ఎత్తుకుని నిల్చునే ఉంటుంది అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పడంలో సందేహం లేదు.

‘అర్ర లో అప్పాలనైనా, దేవునింటిలో దీపానికైనా

అర్ర కు వేసుకున్న తాళానికైనా

తన దగ్గరకు వెళ్ళాల్సిందే!!’

అర్ర అంటే తెలంగాణ మాండలిక భాషలో గది అని అర్థం. అప్పాలు, గారెలు, సకినాలు, అరిసెలు అన్ని గదిలో పెట్టి తాళం వేసి తాళం చెవిని అమ్మ చిలక్కొయ్యకే తగిలిస్తుంది. ప్రతిరోజు అమ్మ ఉదయము, సాయంత్రం వేళల్లో గదిలోకి వెళ్లి దేవుని దగ్గర దీపం వెలిగిస్తుంది. తర్వాత అమ్మ దేవుడి గదికి తాళం వేసి తాళం చెవిని చిలక్కొయ్యకే తగిలిస్తుంది. అప్పాల గదిలోకి వెళ్లి అప్పాలు తీసుకోవాలన్నా దేవుని గదిలోకి వెళ్లి దీపం వెలిగించాలన్నా చిలక్కొయ్య దగ్గరికి వెళ్లి తాళం చెవిని తీసుకుంటేనే ఆయా గదుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంట గది తాళము చెవిని చిలక్కొయ్యకే తగిలేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆనాటి పాత విషయాలను నెమరు వేసుకోవడం చక్కగా ఉంది.

‘విత్తనాల కోసం పేరుగా పేర్చిన మక్క కంకుల్ని

మెడలో వేసుకొని బంగారు నగలని మురిసి పోయేది’

అమ్మ సహజంగా విత్తనాల కొరకు దండగా పేర్చిన మక్క కంకుల్ని చిలక్కొయ్యకే తగిలించడం ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది. చిలక్కొయ్య తన మెడలో వేసిన మక్క కంకుల దండను చూసి బంగారు నగలని మురిసిపోయేది అని చెప్పిన రీతి చక్కగా ఉంది..

‘ఎల్లి గడ్డలను చూసి తన నడుముకు దోపుకుని

ఒడ్డాణమని ఓరగా చూసేది’

ప్రతి సంవత్సరం విత్తనాల కొరకు అమ్మ ఎల్లిగడ్డలను చిలక్కొయ్యకే తగిలించేది. చిలక్కొయ్యకు తగిలించిన ఎల్లిగడ్డలను చూసి చిలక్కొయ్య ఒడ్డాణమని వగలు పోయేది అని కవి రవీందర్ చెప్పిన భావన అద్భుతం.

‘ఈ రోజు పంకీల కొంకీలు వచ్చినంక

‘పరీక్షకు నిల్చిన పరీక్షిత్తు మహారాజై కనబడుతుంది.’

పరీక్షిత్తు పాండవుల తరువాత భారతదేశాన్ని పరిపాలించిన మహారాజు. పరీక్షిత్తు అర్జునుడి మనవడు. అభిమన్యుని కుమారుడు. పరీక్షిత్తు తల్లి ఉత్తర. పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ పరీక్షిత్తుపై బ్రహ్మ శిరోనామక అస్త్రమును ప్రయోగించెను. అప్పుడు శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంనకు చక్రమును అడ్డువేసి బ్రహ్మ అస్త్రం యొక్క ప్రభావంను తగ్గించెను. ఉత్తరకు మృత శిశువు జన్మించినాడు. శ్రీకృష్ణుడు తన యోగ శక్తులతో మృత శిశువునకు ప్రాణంను పోశాడు. కాబట్టి ఇతనిని పరీక్షిత్తు అని అంటారు. ఈరోజు మన ఇంట్లో వాడుతున్న పంకీల కొంకీలను హ్యాంగర్ అని అంటారు. ప్రతి ఇంట హ్యాంగర్‌నే వాడుతున్నారు. ఈనాడు కొత్తగా వచ్చిన పంకీల కొంకీల వల్ల చిలక్కొయ్యకు పరీక్షలు ఎదురయ్యాయి. ఆనాడు తల్లి గర్భంలోనే పరీక్షకు నిలిచిన పరీక్షిత్తు మహారాజుకు ఎదురైన అనుభవాలు మనం మహాభారతంలో చదివాము. ఈనాడు చిలక్కొయ్యకు కూడా అలాంటి అనుభవాలు ఎదురై పరీక్షకు నిలుస్తూ పరీక్షిత్తు మహారాజులా కనబడుతుందని చెప్పడం కవి భావన చక్కగా ఉంది.

‘ఆధునిక హంగుల మధ్య

అనామకంగా ఉన్న తనను చూస్తుంటే

అడవిలో ఉన్న రాములోరై అజ్ఞాతవాసం చేస్తున్నట్టుంది’

అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికతకు అద్దం పడుతు సరికొత్త హంగులతో డిజైన్లతో తయారవుతున్న హ్యాంగర్‌లు వచ్చి సరి కొత్త సంచలనం సృష్టించాయి. ఆధునికత సృష్టించిన మాయాజాలం వల్ల చిలక్కొయ్య పరిస్థితి చిక్కుల్లో పడింది. పేరు లేకుండా పడిపోయి ఉన్న చిలక్కొయ్యని చూస్తుంటే దశరథుడు తమ కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయాలనే సంకల్పంతో ఉంటే కైకేయి కోరిన వింత కోరికల వలన రాముడికి చేయాల్సిన పట్టాభిషేకం ఆగిపోయింది. పితృవాక్య పరిపాలన కొరకు రాముడు 14 ఏళ్లు వనవాసం చేయవలసింది అని చెప్పడం, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు మధ్య చిలక్కొయ్య అనేక చిక్కులతో రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్లుగా ఉంది అని ప్రస్తావించడం చక్కగా ఉంది.

‘విధ్వంసమైన పల్లె సంస్కృతికి

స్మృతి కిణాంకమై మిగిలిన దీపస్తంభమై నిలిచింది.’

సంస్కృతి అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను ప్రజల యొక్క జీవనం, ఆచారవ్యవహారాలు, ప్రమాణాలు, మతము, సంబంధాలు, పాలన వంటి వాటిని తెలుపుతుంది. సమాజం యొక్క ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతి సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు వాటికి హద్దులు లేవు. సంస్కృతి నిరంతరాయంగా మారుతుంటుంది. సంస్కృతి ఒకదానితో ఒకటి కలుస్తూ విడిపోతూ పరిణామం చెందుతుంది. పల్లెలు పట్టణాలుగా మారినాయి. సంస్కృతిలో భాగమైన చిలక్కొయ్య మరుగున పడిపోయింది. పూర్వ సంస్కృతికి నిదర్శనంగా చిలక్కొయ్య ఒక జ్ఞాపకంగా దారి చూపే దీపస్తంభంగా నిలిచిపోయింది. పల్లె సంస్కృతి ఎందుకు విధ్వంసం అయింది? మనిషి ఒక యంత్రంలా, క్షణం తీరికలేని వ్యక్తిగా మారిపోయాడు. భావోద్వేగాలతో సంఘర్షణలో పడిపోయి మనిషి జీవిస్తున్నాడు. మన పల్లె సంస్కృతిని మరిచిపోయాడు. మన సంస్కృతి వ్యాపారమయం అయింది. విదేశీ భావజాలంలో పడి కొట్టుకుపోతున్నది. ఈ విధానం మారాలని కవి ఆకాంక్షిస్తూ ఉన్నాడు. కవి రవీందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


గాజుల రవీందర్ తేది 08-10-1970 రోజున కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలంలో చీమలకుంటపల్లి గ్రామంలో ఉన్న అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. రవీందర్ కూరెళ్ళ గ్రామం, కోహెడ మండలం, సిద్దిపేట జిల్లాకు చెందినవారు. తల్లిదండ్రులు నరసమ్మ, బాల్ రెడ్డి. తండ్రి బాల్ రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. తాత సింగరయ్య, నానమ్మ శాంతమ్మ. నరసమ్మ బాల్ రెడ్డి దంపతులకు నలుగురు సంతానం. రవీందర్‍కు ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు.

రవీందర్ ప్రాథమిక, మాధ్యమిక విద్య కూరెళ్ళ ప్రభుత్వ పాఠశాల లోనూ, కోహెడ గ్రామంలోని జెడ్ పి.హెచ్.ఎస్. ప్రభుత్వ పాఠశాలలోనూ సాగింది. ఇంటర్మీడియట్ ప్రభుత్వ సైన్స్ జూనియర్ కళాశాల, కార్కానగడ్డ, కరీంనగర్ లో చదివారు. బిఎస్సి ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేటలో చదివారు. ఎం.ఏ. (తెలుగు) ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కళాశాల,హైదరాబాదులో చదివారు.

రవీందర్ హైదరాబాద్ లోని మెహిదీపట్నం లోని ప్రభుత్వ తెలుగు పండిత శిక్షణ కళాశాల నుంచి తెలుగు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 1998 సంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కుమార్ వాడి కరీంనగర్ లో గ్రేడ్ 2 తెలుగు పండిట్‍గా నియమించబడ్డారు. 2009 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పదోన్నతి పొందారు. ప్రస్తుతం రవీందర్ తెలుగు స్కూల్ అసిస్టెంట్‍గా కరీంనగర్ లో పనిచేస్తున్నారు.

రవీందర్ గత 15 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా సాహితీ గౌతమి సంస్థలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాల రచయితల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. రవీందర్ సాహితీ ప్రస్థానం విద్యార్థి దశ నుండే ప్రారంభమైంది. కవితలు, వ్యాసాలు, వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. రవీందర్ రాసిన వ్యాసాలు ఆ రోజుల్లోనే కృష్ణా పత్రికలో ప్రచురింపబడ్డాయి. రవీందర్ పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు కవితలు, కథలు, వ్యాసాలు రాయడంలో మెలుకువలు నేర్పుతూ ప్రోత్సహిస్తున్నారు. రవీందర్ నిత్య విద్యార్థిలా ఇప్పటికీ ప్రతి దినం పుస్తక పఠనం కొనసాగిస్తున్నారు. రవీందర్ భార్య కావ్య. ఈ దంపతులకు వేద సంహిత, మధు సాత్విక అనే ఇద్దరు కుమార్తెలు. రవీందర్ కరీంనగర్‌లో స్వగృహం నిర్మించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here