అలనాటి ఉర్దూ స్ఫూర్తి గేయం ‘జాతీయ గీతం 1857!’

0
12

[మౌల్వీ లియాఖత్ అలీ రచించిన ‘జాతీయ గీతం 1857!’ అనే ఉర్దూ గేయానికి శ్రీ దివికుమార్ అనువాదాన్ని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి మౌల్వీ లియాకత్ అలీ కలం నుండి జాలువారిన ఉర్దూ గేయం ‘జాతీయ గీతం 1857!’. దీనిని దివి కుమార్ తెలుగులోకి అనువదించారు. జాతీయ గీతం అంటే రవీంద్రనాథ్ టాగోర్ రచించిన జనగణమన. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం, మహమ్మద్ ఇక్బాల్, గురజాడ అప్పారావు రాసిన దేశభక్తి గేయాలు, సుబ్రహ్మణ్య భారతి రాసిన గీతాలు కూడా జాతీయ గీతం వంటివే. మనం నిత్యం పాఠశాలల్లో పిల్లల చేత జనగణమన, వందేమాతరం పాటలు పాడిస్తుంటాం. పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తుంటాం.

శ్రీ మౌల్వీ లియాకత్ అలీ

మౌల్వీ లియాకత్ అలీ 1817 సంవత్సరంలో సామాన్యమైన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. వీరు అలహాబాద్ సమీపంలోని ప్రయాగ్ రాజ్ ప్రాంతంకు చెందిన వారు. ఉపాధ్యాయునిగా పనిచేశారు. గొప్ప ధైర్య సాహసాలు కలవారు. సాధారణమైన జీవితం గడిపారు. స్వాతంత్ర సంగ్రామంలో మౌల్వీ లియాకత్ అలీ బ్రిటిష్ వారికి సింహ స్వప్నంలా నిలిచారు. ఆయనను బ్రిటిష్ వారు సెప్టెంబర్ 1871 సంవత్సరంలో ముంబయిలో అరెస్ట్ చేశారు. బ్రిటిష్ న్యాయస్థానం మౌల్వీ లియాకత్ అలీకి జీవిత ఖైదు విధించింది. ఫోర్ట్ బ్లెయిర్ సెల్యులర్ జైల్‌లో శిక్ష అమలు చేసేందుకు అండమాన్ దీవులకు తరలించారు. మౌల్వీ లియాకత్ అలీ 17 మే 1892 రోజున జైలులో అస్తమించారు. మన భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్ర సమరం – సిపాయిల తిరుగుబాటు 1857 – అని మనం చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం. 1857 నాటి స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన నానా సాహెబ్ పేరు మనకు బాగా తెలుసు. నానా సాహెబ్ గారి ఆంతరంగిక కార్యదర్శి అజీమ్ ఉల్లాఖాన్. అజీమ్ ఉల్లాఖాన్ మంచి వ్యవహార దక్షుడు, గొప్ప వ్యూహకర్త అని చెప్పవచ్చు. స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో అజీమ్ ఉల్లా ఖాన్ నడిపిన రహస్య పత్రిక పేరు ‘పయామ్-ఎ-అజాదీ’. ఆ పత్రిక భారతీయులకు ఎంతో స్ఫూర్తిని కలిగించేది. ‘పయామ్-ఎ-అజాదీ’ పత్రికలో అలహాబాద్, ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు మౌల్వీ లియాఖత్ అలీ రాసిన ‘జాతీయ గీతం 1857’ ఆ రోజుల్లోనే ప్రచురితమైంది.

గుంటూరు జిల్లా ఉండవల్లిలో నివసిస్తున్న సయ్యద్ నశీర్ అహ్మద్ రాసిన ‘స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లిం యోధులు’ అనే పుస్తకంలో మౌల్వీ లియాకత్ అలీ ఉర్దూలో రాసిన ‘జాతీయ గీతం 1857’ను తెలుగు అక్షరాలతో 2007 సంవత్సరంలో ప్రచురించారు. 2007 సంవత్సరం నాటికి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం జరిగి 150 ఏళ్లు అని చెప్పవచ్చు. 2007 సంవత్సరంలో ప్రజా సాహితీ జూన్ నెల సంచికలో దివికుమార్ భావాన్ని, భావుకతని చెడకుండా తెలుగులోకి అనువదించారు. ప్రజాసాహితీ జూన్ 2007 సంచికలో జాతీయ గీతం 1857 ప్రచురింపబడింది‌. ఇట్టి జాతీయగీతం అన్నిట్లోకి తొట్ట తొలి గేయంగా చెప్పవచ్చు.

‘హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం
పవిత్రమైనది మా దేశం
స్వర్గం కంటే మహా ప్రియం
సమస్త సంపద మాదేలే!!
హిందుస్థాను మన దేశం
దీనికి మనమే వారసులం!’

శ్రీ దివికుమార్

జాతీయగీతంను ఆంగ్లంలో National Anthem అని అంటారు. ఒక దేశం యొక్క జాతీయ గీతం దేశానికి గర్వకారణంగా చెప్పవచ్చు. జాతీయ గీతం పౌరులలో దేశభక్తి, ధైర్యం మరియు జాతీయ భావాన్ని ప్రేరేపిస్తుంది. జాతీయగీతం దేశం పట్ల గౌరవాన్ని కలిగించడమే కాకుండా ఐక్యత మరియు సామరస్యతా సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది. జాతీయ గీతం స్వేచ్ఛా, సార్వభౌమాధికారాలకు, దేశం యొక్క గొప్ప సాంస్కృతిక చరిత్రకు చిహ్నంగా చెప్పవచ్చు. పాఠశాలలో పిల్లలకి చిన్నప్పటినుండి దేశభక్తి పెంపొందించడానికి మరియు పిల్లల్లో దేశం పట్ల గౌరవం పెంపొందించడానికి సహాయపడుతుంది. దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమర యోధులకు నివాళులు అర్పిస్తూ జాతీయ గీతం ఆలపించడం ఆనవాయితీగా వస్తుంది. జాతీయ గీతం మొత్తం జాతిని ఏకం చేసి ఏకతాటిపై నడిపిస్తుంది. దేశం యొక్క జాతీయ గీతం మన మాతృభూమి గొప్పతనాన్ని ప్రకటిస్తూ మనం గర్వంగా తల ఎత్తి నిలబడటానికి సహాయపడుతుంది. జాతీయ గీతం మన దేశ చరిత్ర,సంస్కృతి, సంప్రదాయం, ప్రజలు మరియు ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక గుర్తింపును ప్రదర్శిస్తుంది. జాతీయగీతం భారతదేశం యొక్క ఏకత్వం మరియు భిన్నత్వాన్ని సూచిస్తుంది. జాతీయగీతం పౌరులలో దేశభక్తి భావాన్ని ప్రేరేపిస్తుంది. మన దేశపు జాతీయ గీతం మన దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, దేశభక్తి వంటి విషయాలను వ్యక్తం చేసే సంగీత మాధ్యమంగా చెప్పవచ్చు. జాతీయ గీతం మన దేశం యొక్క ప్రభుత్వం చేత సాంప్రదాయాల చేత గుర్తింపు కలిగి ఉంటుంది. జాతీయగీతం అధికారిక లేదా మిలిటరీ సందర్భాలలో పాడడం జరుగుతూ ఉంటుంది. హిందుస్థాను అనేది పర్షియన్ పదం. హిందూ సంస్కృతి సింధుతో కలిసి వచ్చింది. సింధుతో సహా సింధులోయను పర్షియన్ భాషలో హిందూ అని పిలుస్తారు. మధ్య పర్షియన్‌లో బహుశా మొదటి శతాబ్దం నుండి ఒక దేశం లేదా ప్రాంతాన్ని సూచించే ప్రత్యయం – స్థాను జోడించబడింది. భారతదేశంను హిందుస్థాను పేరుతో పిలుస్తారు కాబట్టి హిందుస్థాను మన దేశం అని చెప్తున్నాడు. హిందుస్థాను దేశానికి మనమే వారసులం అంటున్నారు.నిజమే హిందుస్థానులో నివసిస్తున్న ప్రజలు హిందుస్థానును మన దేశం అని అనుకుంటారు. దేశానికి మనమే వారసులము అని చెప్పడం హిందూస్తాను దేశం పట్ల గల నిజమైన ప్రేమను తెలుపుతున్నది. పవిత్రమైనది మా దేశం అంటే మంచి సద్గుణాలు మరియు మంచి లక్షణాలు కలిగిన దేశం అని గర్వంగా చెబుతున్నారు. స్వర్గం కంటే మహా ప్రియం. స్వర్గం ఒక నమ్మకం. స్వర్గం గురించి అనేక మూలాల నుండి వివిధ రకాల నమ్మకాలు ఉన్నాయి. సాధారణంగా స్వర్గాన్ని విశ్వసించే వారి యొక్క నమ్మకాలు ఆ వ్యక్తి ఏ మత సంప్రదాయానికి లేదా తెగకు చెందిన వాడు అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మతాలు మరణం తర్వాత ఆత్మలు అమరత్వంతో ప్రశాంత జీవనం గడిపే ఒక ప్రదేశంగా స్వర్గాన్ని సూచిస్తాయి. సాధారణంగా స్వర్గం అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశంగా భావిస్తారు. మంచి పనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళుతారు. చెడ్డ పనులు చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళుతారు. స్వర్గం నరకానికి వ్యతిరేకమైనది. స్వర్గం చనిపోయిన తర్వాత వెళ్లే మంచి లోకం. హిందుస్థాను దేశాన్ని స్వర్గం కంటే గొప్పది అనే కవి భావన చక్కగా ఉంది. సమస్త సంపద మాదేలే అంటున్నారు. సంపదలు అంటే ఆస్తులు అంటారు. ఒక వ్యక్తి తమ ఆధీనంలో ఉన్న స్థిర చరాస్తులను సంపదలు అంటారు. సమగ్ర సంపద అంటే ఒక దేశం లేదా ప్రాంతం యొక్క సంపదను దాని సహజ, మానవ మరియు భౌతిక ఆస్తులు అని చెప్పవచ్చు. దేశం యొక్క వనరులు, విద్య మరియు మౌలిక సదుపాయాలతో సహా దేశం ఎంత సంపన్నంగా ఉందో కొలవడం, దేశ భవిష్యత్తును రక్షించే మంచి నిర్ణయాలు తీసుకోవడంలో నాయకులకు సహాయపడుతుంది. నాయకులు ప్రజలు సుఖశాంతులతో ఉండేలా చూసుకోవాలి. ఇది సహజ, మానవ మరియు భౌతిక ఆస్తులను కలిగి ఉన్న ద్రవ్య కొలత. సహజ ఆస్తులు భూమి, అడవులు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. అయితే మానవుల ఆస్తులు, విద్య మరియు నైపుణ్యాలను సూచిస్తాయి. భౌతిక ఆస్తులలో భవనాలు మరియు మౌలిక సదుపాయాలు ఉంటాయి. హిందుస్థాను దేశంలో గల సమస్త సంపదలు మాకే చెందుతాయి. హిందుస్థాను దేశంలో గల సమస్త సంపదలు మావే అని బలంగా దేశం పట్ల గల అచంచలమైన ప్రేమతో చెప్పడం చక్కగా ఉంది.

‘దీని వైభవం దీని ప్రాభవం
వెలుగులు చిమ్మును జగమంతా
అతి ప్రాచీనం
ఎంతో ధాటి
దీనికి లేదురా
ఇలలో సాటి!!
హిందుస్తాను
మన దేశం
దీనికి మనమే వారసులం!’

భారతదేశం జంబూద్వీపం. ఇది వేదాలలో భారతదేశమునకు ఇవ్వబడిన పేరు. జంబూ అంటే నేరేడు పండు. ఈ దేశంలో నేరేడు పండ్లు ఎక్కువగా ఉంటాయి కనుక దీనికి జంబూద్వీపం అనే పేరు వచ్చింది. భారతదేశం, భరత వర్షం, భరతుడు అనే రాజు పేరు మీదుగా వచ్చినది. హిందూ దేశం ఇది సింధు నది పేరు మీదుగా వచ్చినది. పూర్వపు పర్షియన్లు, గ్రీకులు సింధు నదికి ఆవల ఉన్న దేశం కనుక హిందూ దేశం పేరుతో పిలిచారు. హిందూ దేశం యొక్క రూపాంతరమైన ఇండియా అనే పేరు బ్రిటిష్ వారి పాలన వలన ప్రాముఖ్యతను పొందినది. ప్రస్తుతం భారతదేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు ఇండియా, భారతదేశం మరియు హిందుస్థాను. భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేరువేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాలు, వర్గాల సమిష్టి కలయిక అని చెప్పవచ్చు. భారతదేశం భిన్న సంస్కృతుల ఏకత్వం అని అర్థమవుతుంది. భారతదేశం లోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణకళ, ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి భిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతి అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతున్నది. భారతీయ సంస్కృతి అనేక వేల సంవత్సరాల చరిత్రను ప్రభావితం చేసింది.

‘గంగా యమునలు పారు నిండుగా
మా నేలల్లో బంగారు పండుగ
దిగువున పరుచుకు మైదానాలు
దిగ్గున ఎగసే సంద్రపుటలలు
మంచు నిండిన ఎత్తు కొండలు
కావలి దండిగ మాకు అండగా
హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం!’

గంగానది భారతదేశంలోని ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. పావన గంగ అని హిందువులు స్మరిస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి హిమానీనదంలో భాగీరథి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకానంద నది దీనితో కలుస్తుంది. అక్కడినుండి దీనిని గంగ అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రవహించిన గంగానదికి హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలో కోసి, గోమతి, శోణ వంటి ఉపనదులు కలుస్తాయి. అన్నింటికంటే పెద్దదైన యమునా నది అలహాబాద్ ప్రయాగ వద్ద గంగా నదిలో కలుస్తుంది. యమునా నది గంగానదికి ఉపనది. యమున చాలా పెద్ద నది. గంగతోపాటు యమునకు కూడా హిందూ మతంలో పవిత్ర స్థానం ఉంది. గంగా యమున రెండు నదుల ఒడ్డున ఉత్తర భారత దేశంలో పెద్దవైన నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఢిల్లీ, కాన్పూర్, వారణాసి, పాట్నా, కోల్‌కతా, అలహాబాద్ తర్వాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహా ప్రవాహంగా మారుతుంది. గంగా నది భారతదేశానికి జీవనాడిగా పరిగణించబడుతుంది. గంగానది అనేక రకాల పంటలు పండించడానికి తగిన నీటివ‌సతిని కల్పిస్తున్నది. గంగా నది బేసిన్ సారవంతమైన నేలను కలిగి ఉంటుంది. గంగానది ప్రవహిస్తున్నప్పుడు పోషకాలు సమృద్ధిగా ఉన్న అవక్షేపాలను తీసుకువెళ్తుంది. గంగానది తీరం వెంబడి సారవంతమైన మట్టిని మేటలు వేస్తుంది. గంగానది పవిత్రమైనది, దేవతగా పూజింపబడుతుంది. గంగానది మహా ప్రవాహం బంగ్లాదేశ్ మైదానంలో అనేకంగా చీలి అక్కడ సుందరవనాలు డెల్టా గుండా ప్రవహించి తర్వాత బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది. సుందరవనాలు డెల్టా దట్టమైన వృక్షాలతో కూడిన అరణ్యం. పర్యావరణపరంగా విశిష్టమైన వృక్ష జంతు సంపదకు ఆలవాలమని చెప్పవచ్చు. గంగానది జల కళలతో అలరారుతూ నిండుగా పారుతుంది. గంగ నీటి పారకం వల్ల రైతులు తమ భూములలో అనేకమైన పంటలు పండిస్తారు. మనదేశంలోని భూములలో సమృద్ధిగా పంటలు పండడం వల్ల మన దేశ రైతులు ధనవంతులు అవుతున్నారు. గంగానది పరీవాహక ప్రాంతంలో దిగువన వెలసిన మైదానాలతో కళకళలాడుతుంది. గంగానది నీరు సముద్రంలో కలుస్తుంది. సముద్రం వద్ద ఎగసే సంద్రపు టలల హొయలు ఎంతో చక్కగా ఉంటాయి.

‘మంచు నిండిన ఎత్తైన కొండలు
కావలి దండిగా మాకు అండగా’

భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన హిమాలయాలు, ఎల్లలుగా ఉన్నాయి. హిమాలయాలు ఎల్లప్పుడు మంచు కురుస్తు సూర్యుని నుండి భూమి వేడెక్కకుండా కాపాడుతూ సమస్త జీవరాశికి ఈ భూమి మీద మనుగడ సాగించే అవకాశం కల్పిస్తున్నాయి. ఉత్తరాన మంచుతో కూడిన ఎత్తైన హిమాలయాలు మన దేశానికి రక్షణ కవచాలుగా ఉన్నాయని చెప్పవచ్చు.

‘దూరం నుండి వచ్చిన దుష్టులు
చేసిరి కంతిరి మాయ చేష్టలు
ప్రియాతి ప్రియమవు దేశాన్నంత
దోచివేసిరి రెండు చేతులా!!
హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం!’

వర్తక వాణిజ్యాల కోసం స్వదేశ రాజుల అనుమతులు సంపాదించి మన దేశంలో బ్రిటిష్ వారు ప్రవేశించారు. ఐకమత్యం లేని సంస్థానాధిపతుల మధ్యగల తగవుల గురించి తెలుసుకున్న బ్రిటిష్ వారు మభ్యపెట్టి ఒక పక్షం వారికి సైనిక సహాయం అందించి ఇద్దరిని దొంగ దెబ్బ తీసి రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ వారు క్రమంగా దురాలోచనతో మొత్తం భారతదేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. వర్తకం నెపంతో మన దేశానికి వచ్చి బ్రిటిష్ వారు మన దేశ సంపదను కొల్లగొట్టారు. బ్రిటిష్ పాలన 1600 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు సాగిన బ్రిటిష్ పాలన అని చెప్పవచ్చు. దూరం నుండి వచ్చిన దుష్టులు ఎవరు? అంటే బ్రిటిష్ వారు అని చెప్పవచ్చు. బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉన్న రాజుల బలహీనతలను పసిగట్టి వారికి సహాయం చేస్తున్నట్టు నమ్మించి ఆ రాజుల సంస్థానాల నుండి సంపదను దోచుకున్నారు. ప్రియాతి ప్రియమైన భారతదేశమంతా బ్రిటిష్ వారి ఏలుబడిలోకి వచ్చింది. బ్రిటిష్ వారు మాయ చేష్టలతో మనం అపురూపంగా ప్రేమించే మన దేశ సంపదనంతా రెండు చేతులా దోచుకుని బ్రిటిష్ దేశానికి తరలించారు.

‘అమరవీరులు విసిరిన సవాలు
దేశ వాసులు వినరండి
బానిస సంకెలు తెంచండి
నిప్పుల వానై కురవండి!!
హిందుస్థాను
మన దేశం
దీనికి మనమే వారసులం’

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని అమరవీరులు అంటారు. అట్లాంటి త్యాగధనులు విసిరిన సవాలును స్వీకరించి పోరాటం చేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అమరవీరుల అందించిన సందేశం దేశవాసులంతా ఆచరణలో పెట్టాలి. బ్రిటిష్ వారు మన దేశస్థులను బంధించిన బానిస సంకెళ్లు తెంచివేయాలి. అందుకోసం మన దేశస్థులంతా నిప్పుల వానై కురిసి దుర్మార్గులైన బ్రిటిష్ వాళ్ళను వాళ్ళ దేశానికి తరిమి కొట్టాలి. హిందూస్తాను మన దేశం దీనికి మనమే వారసులం అని చెప్పడం చక్కగా ఉంది.

‘హిందూ ముస్లిం సిక్కులందరం
ప్రియాతిప్రియమవు సోదరులం
అదిగదిగో మన స్వతంత్ర జెండా
చేస్తాం సలాం గుండెల నిండా!!’

భారతదేశంలో నివసించే హిందు, ముస్లిం, సిక్కులు ప్రియాతిప్రియమవు సోదరులు అని చెప్పడం అద్భుతంగా ఉంది. మనదేశంలో నివసించే పౌరులు అందరు కలిసి మెలిసి ఉంటేనే దేశ సమగ్రత కాపాడబడుతుంది. దేశం అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది. మన దేశం కోసం పోరాడిన అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయి. అదిగదిగో ఎగురుతున్నది మన స్వతంత్ర జెండా. మనం అందరం స్వతంత్ర జెండాకు హృదయపూర్వకంగా వందనాలు చేస్తాం అని వెల్లడించడం, మన దేశం పట్ల గల అమితమైన ప్రేమకు నిదర్శమని తెలియజేస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here