గట్టెపల్లి మురళికి నివాళి ‘ప్రజా పోరాట యోధుడు’ కవిత

0
11

[కసిరెడ్డి జలంధర్ రెడ్డి గారు రచించిన ‘ప్రజా పోరాట యోధుడు’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]క[/dropcap]వి, రిటైర్డ్ తెలుగు భాషా ఉపాధ్యాయుడు, కసిరెడ్డి జలంధర్ రెడ్డి కలం నుండి జాలువారిన ‘ప్రజా పోరాట యోధుడు’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది.

ప్రజా పోరాట యోధుడు ఎవరు? ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ‘రజాకార్లను చీల్చి చెండాడిన సమరయోధుడు గట్టుపులి మురళి’ అనే పుస్తకాన్ని ఎమెస్కో పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.

ఇంత మంచి పుస్తకం వెలుగులోకి తీసుకురావడానికి ప్రధాన కారకుడు గట్టెపల్లి మురళి కుమారుడు సంపత్ కుమార్. తన తండ్రి అయిన గట్టెపల్లి మురళి గురించిన నిజాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ పుస్తకంలో 38 మంది కవులు కవితలు రాశారు. పులి రంగారెడ్డి వ్యాసం రాశారు. గట్టెపల్లి మురళి యాదిలో కసిరెడ్డి జలంధర్ రెడ్డి ‘ప్రజా పోరాట యోధుడు’ శీర్షికతో భావస్పోరకంగా అలతి అలతి పదాలతో కవితను చక్కగా రాశారు

‘ఆ పేరు వింటేనే నవాబుకు సింహ స్వప్నం.’

నిజాం నవాబు ఆకృత్యాలను ఎదిరించిన వీరుడు గట్టెపల్లి మురళి అని చెప్పడానికి సందేహం లేదు. మన తెలంగాణలోని ప్రతి పల్లెలో గట్టెపల్లి మురళి అంటే అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. అందరి నోళ్ళలో నానుతున్న వ్యక్తి. ప్రజా పోరాట యోధుడు అని చెప్పవచ్చు. అట్లాంటి వీర యోధుడు నిజాం నవాబు కలలో కనిపిస్తే భయం భయంతో గజగజలాడేవాడట. నిద్రలో లేచి కూర్చునే వాడట. ఆ రాత్రంతా మురళిని తల్చుకుంటు నిద్రపోయేవాడు కాదట. మనుషులందరికీ కలలు వస్తాయి. కలలో సింహం కనబడ్డది అంటే ఆ సింహం దాడి చేసి చంపేస్తుందని కలవరం, భయం. నిజంగానే సింహం లాంటి వీరుడు గట్టెపల్లి మురళి కలలో కూడా నిజాం నవాబు కంటిమీద కునుకు లేకుండా చేసేవాడట. అట్లాంటి నిజమైన వీరుడు గట్టెపల్లి మురళి తెలంగాణలో పేర్కొనదగ్గ వ్యక్తుల్లో ఒకడుగా చెప్పవచ్చు.

‘రజాకార్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి’

ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు తెలంగాణ ప్రాంతంలో సాగించిన దమనకాండను తలుచుకుంటే నేటికి వెన్నులో వణుకు పుడుతుంది. పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసాన్ని కత్తితో కోసి గోర్లు ఊడబెరికే వారు. భర్తల ముందే భార్యలను అత్యాచారం చేసేవారు. భార్యల ముందే భర్తలను నరికి చంపేవారు. మగవాళ్ళ ఆచూకీ చెప్పకపోతే పిల్లలను గాల్లోకి ఎగరేసి కత్తికి గుచ్చి చంపేవారు. అందుకే రజాకార్ల పేరు చెబితే జనానికి అంత వణుకు పుడుతుండేది. రజాకార్ల సైన్యం గుర్రాల మీద ఊర్ల వెంట పోతుంటే.. జనం భయం, భయంగా తలుపులేసుకుని చిన్నచిన్న సందులోంచి చూసేవాళ్ళు. రజాకార్లు వెళ్తున్న సమయంలో ఎవరైనా రోడ్డుమీద కనిపిస్తే.. వాళ్లను గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవారట. నిజాం నిర్దేశించిన పన్నులు ఆ రోజుల్లో మన ఊహలో కూడా అందనంత అక్రమంగా ఉండేవని చెబుతారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి నిజాం రాజులు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా సుఖాలను అనుభవించారు. ప్రపంచంలోని ఖరీదైన వాహనం ఏది విడుదలైన అది నిజాం రాజు వద్ద ఉండాల్సిందే. అతిథులకు అద్భుత భవంతులు, రాచ మర్యాదలు చేసేవారు. పేదలు మాత్రం కరువు కాటకాలతో ఆకలితో శుష్కించి పోయారు. జనం రక్త మాంసాలతో నిజాం రాజులు మేడలు కట్టుకున్నారు. అందుకే ప్రజలలో తీవ్రమైన ఆగ్రహం పెల్లుబికింది. అట్లాంటి దుర్మార్గులైన రజాకార్లకు కూడా గట్టెపల్లి మురళిని తలుచుకుంటే భయంతో గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. మురళి ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునేవాడు కాదు. అన్యాయాన్ని ఎదిరించేవాడు. కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడుగా ఉండి ప్రజల కొరకే ఆయన జీవితం అంకితం చేశారు. ప్రజల కొరకు పాటుపడే మురళి అక్కడ ఉంటే రజాకార్ల ఆటలు సాగనిచ్చేవాడు కాదు. ఎదిరించి పోరాడే తత్వం కల వ్యక్తి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రతిఘటించే శక్తి, ప్రశ్నించే ధైర్యం కల వ్యక్తి అతడు.

‘బాల్యం నుండే వాయు, జల స్తంభన

వంటి సాహస క్రీడల సాధన చేసి’

వాయు స్తంభన విద్య ద్వారా మనిషి గాలి లేకుండా ఉండగలడు. బయట నుంచి గాలి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాయువు లేకుండా జీవించి ఉండడం యోగ సాధన ద్వారా సాధ్యమేనని చెబుతున్నారు. నీటిలో ఊపిరి బిగబట్టి ఉండడం సాధ్యమేనా? అని మనలో ప్రశ్న తలెత్తవచ్చు. జల స్తంభన విద్య ద్వారా ఎంతసేపైనా నీటిలో మునిగి ఉండగలరు. అతడు నీటిలో ఉన్నాడని తెలిసినా ఎవరు అతనిని ఏమి చేయలేరు. చిన్నతనంలో గురువుల వద్ద గట్టెపల్లి మురళి వాయు స్తంభన, జలస్తంభన విద్యలను మరియు సాహసక్రీడలను సాధన చేసి నేర్చుకున్నాడు. వాయు,జల స్తంభన విద్యల గురించి మహాభారతంలో ఉంది. మహా భారత యుద్దం ముగిసింది. కౌరవులంతా ఓడిపోయారు. చివరికి దుర్యోధనుడు, మరి కొందరు మిగిలారు. దుర్యోధనునికి జల స్తంభన మరియు వాయు స్తంభన విద్యలో ప్రావీణ్యం ఉంది. దుర్యోధనుడు ఒక మడుగులో దాగి ఉన్నాడు అని మహాభారతంలో చదువుకున్నాం. అట్లాంటి విద్యలను గట్టెపల్లి మురళి గురువుల వద్ద సాధన చేసి నేర్చుకున్నాడు.

‘ఉన్నత కుటుంబంలో జన్మించినా

దేశసేవే లక్ష్యంగా సమాజ క్షేమమే ధ్యేయంగా

పీడిత ప్రజల కోసం సర్వం త్యజించి

సాయుధ పోరాటంలో పాల్గొని

నిజాం నవాబును గడగడలాడించిన

కారణ జన్ముడతను’

గట్టెపల్లి మురళి ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రుల నుంచి పుణికి పుచ్చుకున్న నైతిక విలువలు చిన్నతనంలోనే అలవడ్డాయి. మనం పుట్టిన భూమి అమ్మ వంటిది. మనం పుట్టిన దేశాన్ని సేవించాలి. నేను, నాది అనే అహం పనికిరాదు. సాటి మనిషిని ప్రేమించే సౌశీల్యం ఉండాలి. ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణం అంటారు. మనం పదిమందిలో ఉన్నప్పుడు మన వల్ల పదిమందికి మేలు జరగాలి. పరస్పర సహకారంతో పరోపకారంతో మంచిగా మెలగడమే దేశసేవ. సమాజం యొక్క అవసరాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించడం, వాటి పరిష్కారంలో ముందు ఉండి నడిపించడం నాయకత్వ లక్షణాలు. ప్రజాస్వామిక విలువలను పెంచుకోవడం వంటి సుగుణాలు నిండి ఉన్న వ్యక్తి గట్టెపల్లి మురళి.

సమాజ సంక్షేమం పట్ల అవసరాల పట్ల సరియైన స్పందన కలిగి వారి జీవితాల్లో వెలుగులు వెన్నెలలు కురిపించే నాయకత్వ పటిమతో ముందుకు నడిచాడు గట్టెపల్లి మురళి. పీడిత ప్రజల కోసం సర్వం త్యజించిన వీరుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. జైలు జీవితం గడిపాడు. తెలంగాణ సాయుధ పోరాటం 1946- 1951 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు వ్యతిరేకంగా జరిగింది. ఈ పోరాటంలో 4500 మంది తెలంగాణ ప్రజలు అమరులయ్యారు. హైదరాబాద్ స్టేట్‍లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఎలాంటి సంబంధం లేకుండా అసఫ్ జాహీల పాలనలో కొనసాగింది. నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండు వేర్వేరు. 1948లో కలకత్తా అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ మహాసభ సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు అని తీర్మానించింది. మఖ్డుం మొహియుద్దీన్ సహ 5 గురు కమ్యూనిస్టు పార్టీ నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది. కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని అదే కమ్యూనిస్టు పార్టీ విధానం అని రాజ్ బహదూర్ గౌర్ ప్రకటించారు. ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, జమీందారులు, దొరలు, గ్రామాలపై బడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటానికి మూలాలు నిజాం నిరంకుశ పాలనలో ఉన్నాయని చరిత్రకారులు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజ్యంను ఏలిన పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాయి నుంచి దొరల వరకు సాగిన అణిచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణ పై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు కొనసాగాయి. నిజాం ప్రభుత్వం ప్రజలపై బలవంతులైన రజాకార్లు, దొరలు ఇతర శక్తులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకోలేదు.

రజాకార్లు, దొరలు గ్రామాలపై పెత్తనం వహించే గ్రామాధికారులకు గ్రామంలోని వివిధ వృత్తుల వారు వెట్టిచాకిరి చేసే పరిస్థితులు నిజాం పాలనా కాలంలో నెలకొన్నాయి. దొరల ఇళ్లల్లో జరిగే వేడుకలకు శుభకార్యాలకు గ్రామాల్లో అణచివేయబడ్డ కులాల వారు మొదలుకొని, వ్యాపారస్థులైన కోమట్ల వరకు ఉచితంగా పనిచేయవలసి రావడం, డబ్బుతో పని లేకుండా ఏది అడిగితే అది సమకూర్చడం వంటివి జరిగేవి. వంట పని, వడ్డన పని మొదలుకొని అన్ని పనులు పంచబడేవి. నిత్యం దళిత కులాలకు చెందిన వారు అధికారులు దొరల ఇళ్లల్లో వెట్టి పనిచేసి దయనీయమైన జీవితం గడపవలసి వచ్చేది. ఏడవ నిజాం పరిపాలించిన ప్రాంతంలో తెలుగువారు, కన్నడ ప్రాంతం వారు, మరాఠీ వారు, తమిళ ప్రాంతం వారు ఉండగా కేవలం ఉర్దూ భాషను మాత్రమే ప్రోత్సహించి మిగిలిన భాషలను అణచివేశారు. విద్య విషయంలో ఉద్యోగం విషయంలో ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఉండేది. ఉర్దూ భాషను నేర్చుకున్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఉర్దూపై వ్యతిరేకత ఈ రాష్ట్రంలో లేకున్నప్పటికీ తమ మాతృభాష అయిన తెలుగును అణిచివేయడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. గట్టెపల్లి మురళి భారతీయ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా ఉండి సాయిధ పోరాటంలో పాల్గొని నిజాం నవాబును గడగడలాడించిన కారణజన్ముడు అని చెప్పవచ్చు. కారణజన్ములు అంటే దుర్మార్గం, అరాచకం ప్రబలినప్పుడు వాటిని అణచడానికి ధర్మసంస్థాపన కొరకై అనేకమందికి మంచి చేయడానికి, సమాజసేవ చేయడానికి, పుట్టిన లేక అవతరించిన వారు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుని కారణజన్ముడు అంటారు.

‘చిన్నతనంలోనే పాఠ్యపుస్తకాలపై ఉన్న

నిజాం ఫోటోను దహనం చేసి.

తనలోని విప్లవ భావాన్ని చాటుకొని

నిజాం అరాచకాలను అణచేందుకు

సాయుధ పోరాటమే మార్గమని

అజ్ఞాతంలోకి వెళ్లి

నిరంకుశ పాలనకు

చరమగీతం పాడిన ప్రజా యోధుడు’

చిన్నతనంలో గట్టెపల్లి మురళి మానకొండూరు గ్రామంలో హనుమాన్ సింగ్ ఇంటిలో మరియు కొందరు మిత్రులతో కలిసి ఉండేవాడు. మురళి మానకొండూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో పాఠ్యపుస్తకాలపై నిజాం ఫోటో ముద్రించబడి ఉండేది. ప్రతి విద్యార్థి పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలోని నిజాం ఫోటోకు సలాం చేసిన తర్వాతనే పుస్తక పఠనం కొనసాగేది. నిజాం ప్రభువు ఆరాధ్యుడిగా ఉర్దూ మీడియం పాఠశాలలు కొనసాగేవి. మానకొండూరు పాఠశాలలో చదువుతున్న మురళికి నిజాంకు నమస్కారం చేసే పద్ధతి ఏమీ నచ్చలేదు. అసల్ మాలిక్ నినాదం నచ్చలేదు. ఒకరోజు పాఠశాలలో చదువుతున్న మురళి విద్యార్థులందరి పాఠ్యపుస్తకాల్లోని నిజాం ఫోటోలు అన్నింటిని ముక్కలు ముక్కలుగా చించిపడేశాడు. ఆ విషయం తరగతి పాఠశాల ఉపాధ్యాయుడు మరియు ప్రధానోపాధ్యాయుల దృష్టికి వెళ్ళింది. ఆ పాఠశాలలోని ఉపాధ్యాయుల బృందం గట్టెపల్లి మురళిని పిలిచి దండించబోయారు. మురళి ధైర్యంగా ఉపాధ్యాయులపై తిరగబడటంతో సర్కారు వారి దృష్టికి తీసుకెళ్లారు. చదువుకునే రోజుల్లో మురళికి దేశభక్తి మెండుగా ఉండేది అని అర్థం అవుతున్నది. మురళి పాఠశాలలో ఇట్లా ప్రవర్తించిన విషయం మురళి తల్లి లక్ష్మీబాయి, మనవడు సంపత్ కుమార్‌కు ఆనాటి పాఠశాలలో పుస్తకాలపై ఉన్న నిజాం నవాబు ఫోటోలు చించివేసిన సంగతిని పూసగుచ్చినట్టు వివరించారు. విప్లవం అంటే ఏమిటి? ఒక వ్యవస్థ మీద కలిగే అసహ్యం, విరక్తి, అకస్మాత్తుగా తీవ్రంగా ఏర్పడిన ఏహ్యభావం. మన తెలంగాణ వాళ్లు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో కొనసాగించారు. మురళి నిజాం యొక్క అరాచకాలను అణచేందుకు సాయుధ పోరాటమే మార్గమని నమ్మి అజ్ఞాతంలోకి వెళ్లిన వీరుడు. నిజాం యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకులతో కలిసి నిజాం పాలనకు చరమగీతం పాడిన ప్రజా యోధుడు గట్టెపల్లి మురళి అని చెప్పవచ్చు.

‘తనను చిత్రహింసలు పెట్టిన పోలీసు అధికారిని

జల స్తంభన విద్యతో నీళ్లలో ఉండి

తుపాకీతో కాల్చి చంపిన

సర్కారుకు సవాలు విసిరిన దీశాలి’

గట్టెపల్లి మురళిని పోలీస్ అధికారి సీతాపతి చిత్రహింసలు పెట్టాడు. చిత్రహింసలు భరించి కూడా మురళి పోలీస్ అధికారి సీతాపతిని నెల రోజుల్లో నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నీవు నన్ను ఏమీ చేయలేవు అని పోలీస్ అధికారి సీతాపతి నవ్వినాడట. గట్టెపల్లి మురళి దళం మహదేవపూర్ అడవుల్లో సంచరిస్తున్నదని పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీస్ అధికారి సీతాపతి మరియు ఇతర పోలీసులు మురళి దళాన్ని ఎక్కడున్నా గాలించి పట్టుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళారు. మంథని అవతల తలమడుగు అనే ప్రదేశంలో మురళి దళం సంచరిస్తున్నదనే సమాచారం. పోలీసులు మరియు పోలీస్ అధికారి సీతాపతి తన కొరకు వెతుకుతున్నారని గట్టెపల్లి మురళికి తెలిసింది. మురళి దళంలో పనిచేస్తున్న రాజ్యలక్ష్మి అనే దళ సభ్యురాలు ఒక లేఖను పోలీస్ అధికారి సీతాపతికి అందజేసింది. అంతే వేగంగా ఆమె అడవిలోకి మాయమై పోయింది. గట్టెపల్లి మురళి లేఖలో చెప్పిన చోటుకు పోలీస్ అధికారి సీతాపతి మరి ఇతర పోలీసులు నీటిమడుగు వద్దకు చేరుకున్నారు. జల స్తంభన విద్యతో మురళి మడుగులో దాగి ఉన్నాడు. ఆ మడుగు దగ్గర తుంగలో దాగిన మురళిని చూసిన పోలీస్ అధికారి సీతాపతి ముందుకు ఉరికి తుపాకీతో పేల్చాడు. సీతాపతి కాల్చిన తుపాకీ గుండు మురళి తొంటిలోకి వెళ్ళింది. అదే సమయంలో మురళి పేల్చిన తుపాకీ గుండు పోలీస్ అధికారి సీతాపతి గుండెల్లోకి దూసుకుపోయింది. పోలీసులు పలు దిక్కులకు పారిపోయారు. “ఇదే నీకు శిక్షరా సీతాపతి” అన్నాడు మురళి. పోలీస్ అధికారి సీతాపతి కళ్ళు మూశాడు. ఆ కాలంనాటి పోలీస్ అధికారి సీతాపతిని చంపిన ఘన చరిత్ర గట్టెపల్లి మురళిది.

‘సెప్టెంబర్ 17న ‘తెలంగాణ విమోచన’ కలిగినా

జమీందారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేసి

బతికినంత కాలం కమ్యూనిస్టుగా

ప్రభుత్వ ప్రయోజనాలకు ఆశపడక

చివరకు సమరయోధుల పింఛన్ సైతం

తృణీకరించిన ఆదర్శమూర్తి’

1948 సెప్టెంబర్ 13న భారతదేశ సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనిని పోలీస్ యాక్షన్ అంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశాడు. నిజాం నవాబు కబంధహస్తాల నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందింది. ఈ విధంగా హైదరాబాద్ వాసులకి స్వాతంత్రం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17న పాటిస్తారు. జమీందారులు శిస్తులు వసూలు చేసేవారు. శిస్తులు చెల్లించలేని రైతులను వంగబెట్టి బండలు ఎత్తే వారు. తీవ్రమైన హింసలకు గురి చేసేవారు. శిస్తులు చెల్లించలేని వాళ్ళ భూములను కబ్జా చేసేవారు. జమీందారులు చేస్తున్న అకృత్యాలపై గట్టెపల్లి మురళి అలుపెరుగని పోరాటం చేశారు. బ్రతికినంత కాలం మురళి కమ్యూనిస్టుగా ఉన్నాడు. మానవుడు సంఘజీవిగా పరిణామం చెందడానికి మూలం శ్రమ విభజన అని చెప్పవచ్చు. అందరు అన్ని పనులు చేయలేరు. తమకు కావలసిన వస్తువులు, వసతులు, తమకు తామే సమకూర్చుకోలేరు. అందువలన సమాజం క్రమంగా శ్రమ విభజన అంతర్లీనంగా పరిణామం చెందింది. ఇటువంటి అసమానతలను పోగొట్టి, అవకాశాలను పొందుపరిచి, తద్వారా మానవుడి సంఘ జీవన విధానాన్ని సంస్కరించే ప్రయత్నం కమ్యూనిజం చేసింది. కమ్యూనిజం సామాజిక ఆర్థికసిద్ధాంతం ప్రజా విప్లవం ద్వారానే సాధ్యమంటారు. గట్టెపల్లి మురళి స్వీయ ప్రయోజనాలకు ఆశ పడలేదు. చివరకు సమర యోధుల పింఛన్ సైతం త్రుణీకరించిన ఆదర్శమూర్తి అని చెప్పవచ్చు. ఎలాంటి పోరాటం చేయని వాళ్ళు, ఎలాంటి జైలు శిక్ష అనుభవించని వాళ్లు, తప్పుడు దృవీకరణ పత్రాలతో సమరయోధులుగా చలామణి అవుతున్న కాలమిది. జైలు శిక్ష అనుభవించి ప్రజల కొరకు పోరాటం చేసిన మురళి సమరయోధుల పింఛన్ సైతం తీసుకోలేదు. బతికినంత కాలం నమ్మిన సిద్ధాంతం పట్ల ఆచరణతో బ్రతికాడు.విలువలతో జీవించాడు. ఇట్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు.

‘లక్ష్మీ రాజేశ్వర్, లక్ష్మీబాయి

పుణ్య దంపతులకు మూడో సంతానం

ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం

తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడిన

భావితరాల మార్గదర్శి గట్టెపల్లి మురళి’.

గట్టెపల్లి మురళి తల్లి లక్ష్మీబాయి, తండ్రి లక్ష్మీ రాజేశ్వర్ సుల్తాన్‌బాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందినవారు. లక్ష్మీ బాయి, లక్ష్మీ రాజేశ్వర్ పుణ్య దంపతులకు మూడవ సంతానంగా గట్టెపల్లి మురళి జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో అతని పేరు స్వర్ణాక్షరాలతో లిఖించదగినది. ఎప్పటికీ గుర్తుండిపోయేది. తెలంగాణ విముక్తి కోసం పోరాడినవాడు గట్టెపల్లి మురళి అని చెప్పడంలో గర్వంగా ఉంటుంది. అలాంటి వీరుని గురించి చదవడం, రాయడం, వినడం మన మనసుకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆనాటి విప్లవ వీరుడు, వీర కిశోరుడు, గట్టెపల్లి మురళికి నా జోహార్లు అర్పిస్తున్నాను.


కసిరెడ్డి జలంధర్ రెడ్డి పచ్చునూరు గ్రామం. మానకొండూర్ మండలం, కరీంనగర్‌కు చెందిన వారు. జలంధర్ రెడ్డి 02-09-1944 రోజున పచ్చునూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు రుక్కమ్మ, బాల్ రెడ్డి. తండ్రి బాల్ రెడ్డి పచ్చునూరు గ్రామంలో వ్యవసాయం చేస్తూ పోలీస్ పటేల్‌గా పని చేశారు. తాత రాంరెడ్డి వ్యవసాయం చేస్తూనే పోలీస్ పటేల్‍గా పనిచేశారు. జలంధర్ రెడ్డి ఒకటవ తరగతి నుండి 3 వ తరగతి వరకు పచ్చునూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివారు. 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాల కొండపల్కల గ్రామంలో చదివారు. పచ్చునూరు గ్రామం నుండి కొండపల్కల గ్రామానికి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. పచ్చునూరు నుండి కొండపల్కలకు 6 కిలో మీటర్ల దూరం. రోజూ బడికి నడిచి వెళ్ళి నడిచి వచ్చేవారు. జలంధర్ రెడ్డి 9వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ప్రభుత్వ మల్టీ పర్పస్ హై స్కూల్ కరీంనగర్ లో చదివారు. పచ్చునూరు నుండి కరీంనగర్ కు 24 కిలో మీటర్లు. రవాణా సౌకర్యాలు లేవు. ఆ ఊరి నుండి ఎడ్ల బండ్లు కట్టుకుని కరీంనగర్ కు వచ్చే వారు. ఒకో సారి ఎడ్ల బండ్లు లేనపుడు కరీంనగర్ కు 24 కిలో మీటర్లు నడిచి వచ్చే వారు. 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు కరీంనగర్ లో భారత్ టాకీస్ వద్ద గల ఒకరి ఇంటిలో గది అద్దెకు తీసుకుని ముగ్గురు మిత్రులతో కలిసి వంట చేసుకుని బడికి వెళ్లే వారు. ప్రభుత్వ మల్టీ పర్పస్ హై స్కూల్‌లో ఉపాధ్యాయులు చక్కగా బోధించేవారు. జలంధర్ రెడ్డి సెలవు దినాల్లో కరీంనగర్ నుండి పచ్చునూరు గ్రామంకు వెళ్ళే వారు. జలంధర్ రెడ్డి కష్టపడి చదువుకుని 1964 సంవత్సరంలో 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారు. 1968 సంవత్సరంలో డి.ఓ.ఎల్ సంస్కృతాంధ్ర కళాశాల వరంగల్‌లో చదివి ఉత్తీర్ణులయ్యారు. 07-07-1970 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వెనకెపెల్లి – సైదాపూర్ హైస్కూల్లో అప్పాయింట్ అయ్యారు. 1973 సంవత్సరంలో బి.ఓ.ఎల్ సంస్కృతాంధ్ర కళాశాల నుండి ఉత్తీర్ణులయ్యారు. 1974 సంవత్సరంలో ప్రభుత్వ బీఈడీ కాలేజీ హన్మకొండలో పండిట్ ట్రైనింగ్ చేశారు. 30-09-2002 నాడు గవర్నమెంటు హైస్కూల్ వెన్నంపల్లి సైదాపూర్ మండలం నుండి గ్రేడ్ వన్ తెలుగు పండిట్‌గా రిటైర్ అయ్యారు.

జలంధర్ రెడ్డి జనవరి 2023 సంవత్సరంలో ‘ఆశ నిండిన శ్వాస’ అనే కవితా సంపుటిని ప్రచురించారు. ఇప్పుడు జలంధర్ రెడ్డికి 79 సంవత్సరాల వయసు ఉంది. అయినప్పటికీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వివిధ సాహిత్య సమావేశాలలో పాల్గొంటారు. అడపాదడపా కవితలు రాస్తుంటారు. నిత్య విద్యార్థిలా ఇప్పటికీ పుస్తకాలు ఆధ్యయనం చేస్తుంటారు. రోజు సాయంత్రం పూట మిత్రులతో కలిసి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంకు వెళ్లి వాకింగ్ చేస్తుంటారు. జలంధర్ రెడ్డికి కరీంనగర్‌లో సొంత ఇల్లు ఉంది. జలంధర్ రెడ్డి భార్యా, పిల్లలు మరియు మనుమలు మనుమరాండ్లతో కలిసి సంతోషంగా విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here