జానపద గేయాల సేకరణ కర్త ‘మానారె’ సాహితీ కృషి

0
9

[ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త, ప్రముఖ కవి, రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ మాదాడి నారాయణ రెడ్డి సాహితీ కృషిని వివరిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]ఆ[/dropcap]దిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త, ప్రముఖ కవి, కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ మాదాడి నారాయణ రెడ్డి (మానారె) మర్రిపల్లిగూడెం గ్రామం, హుజురాబాద్ తాలూకా, కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. రంగమ్మ, గోపాల్ రెడ్డి దంపతులకు 24-07-1940 నాడు జన్మించారు. గోపాల్ రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. నారాయణ రెడ్డి తాత నరసింహారెడ్డి, నాయనమ్మ జానమ్మ. తాత కూడా రైతే.

తోబుట్టువులు:

మాదాడి గోపాల్ రెడ్డి, రంగమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.

  • ప్రథమ సంతానం: వెంకటమ్మ అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడిపోయారు.
  • ద్వితీయ సంతానం: మాదాడి నారాయణ రెడ్డి (మానారె) భార్య శకుంతల, మహా ముత్తారం గ్రామానికి చెందినవారు.
  • తృతీయ సంతానం: చందుపట్ల వినోద, భర్త దామోదర్ రెడ్డి, రిటైర్డ్ యం.ఇ.ఓ. మహా ముత్తారం గ్రామానికి చెందిన వారు.

విద్యాభ్యాసం, మిత్రులు:

నారాయణ రెడ్డి 1 వ తరగతి నుంచి 4 వ తరగతి వరకు (1947 నుంచి 1951 మార్చి వరకు) ప్రభుత్వ పాఠశాల బుట్టారెడ్డి గూడెం నామాంతరం గల మర్రిపల్లి గూడెం గ్రామంలో చదివారు. పాపయ్య సారు హెడ్మాస్టర్‌గా ఉండేవారు, ఆయన తెలుగు బోధించేవారు. పాఠశాలలో ధర్మపురి అటెండర్‌గా పనిచేసేవారు. ఎవరైనా పిల్లలు పాఠశాలకు రాలేదని తెలవగానే అటెండర్ ధర్మపురి ఆ పిల్లల్ని పాఠశాలకు తీసుకువచ్చేవారు. పాపయ్య సారు బాగా స్ట్రిక్ట్‌‌గా ఉండేవారు. పాపయ్య సారు క్లాస్‌కి రాగానే పిల్లలంతా పుస్తకాలు తెరిచి ఉంచుకోవాలి. ఎవరైనా పిల్లలు పుస్తకాలు తెరవకుంటే పాపయ్య సారు వారిని దండించేవారు. నారాయణరెడ్డి మర్రిపల్లి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉండే బుట్టారెడ్డి గూడెంకు స్నేహితులతో కలిసి నడిచి వెళ్లేవారు.

నారాయణరెడ్డి మాధ్యమిక విద్యను 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు (1951నుండి 1954 మార్చి వరకు) కరీంనగర్ జిల్లా లోని హుజురాబాద్ తాలూకా లోని కమలాపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో చదివారు. మర్రిపల్లిగూడెం గ్రామం నుండి కమలాపూర్ గ్రామం 10 కిలోమీటర్ల దూరం ఉండేది. మిడిల్ స్కూల్ చదువుతున్నప్పుడు నారాయణరెడ్డి కమలాపూర్ గ్రామంలో పట్టాభి అనే ఒక పద్మశాలి ఇంట్లో గది అద్దెకు తీసుకుని స్వయంగా వంట చేసుకునేవారు. నారాయణ రెడ్డి ఒక్కడే ఉండేవారు. నారాయణ రెడ్డి నాన్న బియ్యం, పప్పులు అన్ని సామానులు తెచ్చి ఉంచేవారు. 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు బొందయ్య సారు సైన్సు బోధించేవారు. పింగళి శ్రీరామ్ రెడ్డి సారు, కాళి దాస్ సారు ఇంగ్లీష్ బోధించేవారు. రాజన్న సారు తెలుగు బోధించేవారు. అప్పుడు కమాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కూరగాయలు పండించేవారు.

నారాయణ రెడ్డి 8వ తరగతి నుండి 9వ తరగతి వరకు పరకాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (1954 జూన్ నుండి 1956 మార్చి వరకు) చదివారు. నారాయణరెడ్డి పరకాలలో చదువుతున్నప్పుడు ఒక సంవత్సరం బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. తర్వాత 9వ తరగతిలో నారాయణరెడ్డి నరసింహారెడ్డి, కొమురయ్యలు పరకాలలో ఒక గది అద్దెకు తీసుకొని ముగ్గురు కలిసి వంట చేసుకొనే వారు. వీరు సంస్కృతాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు. అలుగునూర్‌కు చెందిన వెంకట్ రెడ్డి సారు గణితం బోధించేవారు. 8, 9వ తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితుడు కొమురయ్య ఆర్ఎంపి డాక్టర్‌గా పనిచేశారు. 8, 9 వ తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితుడు నరసింహా రెడ్డి గవర్నమెంట్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. 8, 9 వ తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితుడు భాష్యాచారి లెక్చరర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు ప్రస్తుతం హన్మకొండలో ఉంటున్నారు.

నారాయణరెడ్డి పదవ తరగతి (1956 జూన్ నుండి 1957 మార్చి వరకు) మంథని గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదివారు. నారాయణరెడ్డి పదవ తరగతి చదువుతున్నప్పుడు చందుపట్ల గోపాల్ రెడ్డి ఇంట్లో ఒక గది అద్దెకు తీసుకుని స్వయంగా వంట చేసుకుని పాఠశాలకు వెళ్లేవారు. మంథనిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజన్న సారు, సేనాపతి సారు తెలుగు బోధించేవారు. హెచ్.ఎస్.సి.లో సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్, హిందీ సెకండ్ లాంగ్వేజ్, సంస్కృతం ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండేది. నారాయణరెడ్డి హెచ్.ఎస్.సి.లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నారాయణ రెడ్డి మ్యాథమెటిక్స్ లో 73 మార్కులు, హిందీలో 60 మార్కులు సాధించారు.

పి.యు.సి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సుబేదారి, వరంగల్‌లో (1957-1958 వరకు) చదివారు. నారాయణ రెడ్డి పి.యు.సి. తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. పి.యు.సి.లో పి.జి.లాలే సంస్కృతం బోధించడంతో పాటు ఎన్.సి.సి.లో శిక్షణ ఇచ్చేవారు.

హనుమకొండలోని సుబేదారిలో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బి.ఏ. చదివారు. బి.ఏ.ప్రథమ సంవత్సరం చదువుతున్నప్పుడు హనుమకొండలోని ఏనుగుల గడ్డలో ఒక్కడే గది అద్దెకు తీసుకుని స్వయంగా వంట చేసుకునేవారు. ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం బ్రాహ్మణ వీధిలో గది అద్దెకు తీసుకొని కేతిరెడ్డి నరసింహా రెడ్డి, దశరథ రెడ్డి, జి.వెంకట్రాం నరసయ్య, జి.లక్ష్మయ్యలు రూంమేట్స్‌గా కలిసి ఉండేవారు. బాల సముద్రం ప్రాంతం అంతా తుమ్మ ఉత్తరేణి చెట్లతో అడవి లాగా ఉండేది. నారాయణరెడ్డి స్నేహితులతో కలిసి ఆ చెట్ల మధ్య నుండి కాలిబాటలో కళాశాలకు నడిచి వెళ్లే వారు. ఉత్తరేణి చెట్లవేళ్ళతో పండ్లు తోముకునేవారు. డిగ్రీ లో సంస్కృతం పిజి లాలే సారు మరియు పుల్లేల శ్రీరామచంద్రుడు సారు బోధించేవారు. వేటూరి ఆనందమూర్తి సారు తెలుగు సాహిత్య చరిత్ర బోధించేవారు. ఇరివెంటి కృష్ణమూర్తి సారు పాండవోద్యోగం నాన్ డిటైల్ బోధించేవారు. జి.వి. సుబ్రహ్మణ్యం సారు పోయెట్రీ బోధించే వారు. బషీరుద్దిన్ సారు పొలిటికల్ సైన్స్ బోధించేవారు.

నారాయణ రెడ్డి డిగ్రీ చదువుతున్నప్పుడు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో ఏర్పాటు చేయబడిన రెండు ఎన్.సి.సి. క్యాంపులలో పాల్గొన్నారు. నారాయణ రెడ్డి బి.ఏ. 1961లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. నారాయణ రెడ్డి హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు (1961 నుండి 1963 వరకు) చదివారు. నారాయణరెడ్డి ‘ఏ’ హాస్టల్ లో ఉండి చదువుకున్నారు. వరవరరావు, మాదిరాజు రంగారావు, వేణుముద్దల నరసింహ రెడ్డి నారాయణరెడ్డి కన్న సీనియర్లు. వేణుముద్దల నరసింహా రెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్‌లో లెక్చరర్‌గా కొంత కాలం పని చేశారు. ఎస్. లక్ష్మణమూర్తి నారాయణరెడ్డి కన్న సీనియర్. అతను కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయి హనుమకొండలో ఉంటున్నారు. నారాయణరెడ్డి ‘ఏ’ హాస్టల్ లో ఉన్నప్పుడు రూమ్మేట్‌గా ఆకుల పాపయ్య ఉండేవాడు. ఎం.ఏ. ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు హాస్టల్‌లో ఒక్కరు మాత్రమే ఉండే గదిని నారాయణ రెడ్డికి కేటాయించినారు. అప్పుడు నారాయణరెడ్డి చదువే లక్ష్యంగా పెట్టుకున్నారు. లిటరరీ కాంపిటీషన్‌లో ఉపన్యాసం, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవారు. నారాయణరెడ్డి ఎం.ఏ. చదువుతున్నప్పుడు కాలేజీ మ్యాగజైన్ ‘శోభ’లో ఆముక్తమాల్యద గ్రంథం లోని మాల దాసరి కథ గురించి రాశారు.

ఎం.ఏ.లో ప్రొఫెసర్ ఖండవల్లి లక్ష్మీరంజనం సారు సాహిత్య చరిత్ర బోధించేవారు. దివాకర్ల వెంకటావధాని సారు పోయెట్రీ బోధించే వారు. డాక్టర్ పల్లా దుర్గయ్య సారు మోడర్న్ పోయెట్రీ బోధించేవారు. డాక్టర్ బిరుదురాజు రామరాజు సారు సాహిత్య చరిత్ర బోధించేవారు. చలమచర్ల రంగాచార్యులు సారు పద్య పాఠ్యాంశాలను బోధించేవారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డి.ఎస్.రెడ్డి గారు ఉండేవారు. నారాయణరెడ్డి ఎం.ఏ. చదువుతున్నప్పుడే నన్నయ్య పద ప్రయోగ కోశం ప్రాజెక్టులో పని చేశారు. నారాయణ రెడ్డి ఎం.ఏ. తెలుగు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యారు.

ఉద్యోగ బాధ్యతలు:

నారాయణరెడ్డి 1963 ఆగస్టు నుండి 1963 సెప్టెంబర్ వరకు చంచల్ గూడ మిడిల్ స్కూల్ హైదరాబాదులో గ్రేడ్ 2 తెలుగు పండిట్‌గా పని చేశారు. నారాయణరెడ్డి అకౌంటెంట్ జనరల్ ఆఫీస్,(ఏజీ ఆఫీస్) హైదరాబాదులో అక్టోబర్ 1963 నుండి 21- 08-1964 వరకు యు.డి.సి. గా పనిచేశారు. తర్వాత 28- 08- 1964 నుండి 17- 09- 1967 వరకు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్‌లో ట్యూటర్‌గా పనిచేశారు. నారాయణరెడ్డి 18- 09- 1967 నుండి 12- 10- 1969 వరకు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ సాయం కళాశాల కరీంనగర్‌లో తెలుగు అసిస్టెంట్ లెక్చరర్‌గా పనిచేశారు.

వీరు బదిలీ పై అదిలాబాదు వెళ్లి 13- 10- 1969 నుంచి 19- 04- 1976 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్‌లో తెలుగు అసిస్టెంట్ లెక్చరర్‌గా పనిచేశారు. అక్కడనే పదోన్నతిని పొంది 20-04- 1976 నుండి 17- 07- 1980 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్ లో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత 18-07-1980 నుండి 08-08-1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్‌లో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు.

తర్వాత వీరు బదిలీపై వెళ్లి 08-08-1989 నుండి 25-06-1991 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపల్లిలో తెలుగు లెక్చరర్‌గా పని చేశారు. నారాయణరెడ్డి బదిలీపై తిరిగి కరీంనగర్‌కు వచ్చి 26-06-1991 నుండి 26-06-1996 వరకు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్‌లో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు.

తరువాత వీరు ప్రిన్సిపల్‍గా పదోన్నతిని పొంది 27-06-1996 నుండి 07-07-1997 వరకు ఎస్.కె.ఎన్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జగిత్యాలలో ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే కోరుట్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా అదనపు బాధ్యతలను కూడా చేపట్టినారు. వీరు తిరిగి బదిలీపై కరీంనగర్ వచ్చి 07-07-1997 నుండి 31-07-1998 వరకు ఎస్.అర్.అర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్‌లో ప్రిన్సిపల్‌గా పని చేశారు. నారాయణ రెడ్డి 31-07-1998 రోజున ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ నుండి ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో 2001 నుండి 2018 వరకు ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించారు.

పరిశోధన:

నారాయణరెడ్డి గారికి ఎం.ఏ.లో చేరినప్పటి నుండి తెలుగులో పిహెచ్.డి చేయాలనే కాంక్ష ఉండేది. డాక్టర్ బి. రామరాజు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉండేవారు. వారిని నారాయణ రెడ్డి పిహెచ్.డి. కొరకు సంప్రదించడం జరిగింది. డాక్టర్ బి.రామరాజు గారు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల పైన పిహెచ్.డి. చేయమని సూచించినారు. అప్పుడు నారాయణ రెడ్డి ఉద్యోగరీత్యా ఆదిలాబాద్‌లో లెక్చరర్‌గా పని చేయుచున్నారు.

నారాయణ రెడ్డి పిహెచ్.డి. చేయాలనే తలంపు మేరకు టేప్ రికార్డర్ వెంట ఉంచుకుని ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లినారు. అక్కడ గ్రామ పెద్దల సహకారంతో జానపద గేయాలు సేకరించారు. నారాయణ రెడ్డి (మానారె) ఆసిఫాబాద్ లో ‘అంకమ రాజు కథ’ అనే దాదాపు రెండువేల పంక్తులు గల కోలాటం పాటను సేకరించారు. నారాయణ రెడ్డి పిహెచ్.డి. ఇంటర్వ్యూ కు వెళ్ళినారు మరియు తాను సేకరించిన జానపద గేయాల గురించి వివరించినారు. ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలపై పిహెచ్.డి. చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ వారి నుండి అనుమతి లభించింది. నారాయణరెడ్డి ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు అనే అంశంపై పిహెచ్.డి. చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీలో 1978 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నారాయణరెడ్డి ప్రిపిహెచ్.డి. ప్రిలిమినరీ పరీక్ష 1980 సంవత్సరంలో వ్రాసి ఉత్తీర్ణత సాధించినారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలపై పిహెచ్.డి. చేయడానికి అనుమతించినారు మరియు గైడ్ గా ప్రొఫెసర్ డాక్టర్ పాకాల యశోదా రెడ్డిని నియమించడం జరిగింది.

నారాయణ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని తాలూకాలలోని గ్రామాలకు వెళ్లి దాదాపుగా 1500 జానపద గేయాలను సేకరించడం జరిగింది. నారాయణరెడ్డి తాను సేకరించిన జానపద గేయాలను యథాతథంగా సీడీలో భద్రపరచడం జరిగింది. నారాయణరెడ్డి తాను సేకరించిన జానపద గేయాలను అందులోని విషయాన్ని బట్టి వివిధ వర్గాలుగా అధ్యాయాల వారిగా వ్యాసాలు రాసి తమ గైడ్ అయిన డాక్టర్ పాకాల యశోదా రెడ్డికి చూపించి వారి ఆమోదమును పొందినారు. నారాయణరెడ్డి సిద్ధాంత వ్యాసాన్ని ఐదు సంవత్సరాలలో సమర్పింపలేని కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ వారి నుండి మరొక సంవత్సరం సమయం పొడిగించబడినది. నారాయణరెడ్డి భార్య శకుంతల తేది 01-01-1986 రోజున అకాల మరణం చెందడం జరిగింది. అట్టి అనివార్యమైన స్థితి వల్ల, పిల్లలపై తనకు గల బాధ్యతలతో సతమతం అయ్యారు. నారాయణ రెడ్డి తన వృత్తి పట్ల గల నిబద్ధతతో పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయానికి గడువు లోగా సమర్పింప లేకపోయినారు.

నారాయణ రెడ్డి కుమారులు రాంగోపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిల ప్రోత్సాహంతో ‘అంకమ రాజు కథ’ను నవంబర్ 2001 సంవత్సరంలో ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాన్ని నారాయణరెడ్డి తన ధర్మపత్ని శకుంతలకు అంకితం ఇచ్చినారు. నారాయణరెడ్డి ‘ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు’ అనే సిద్ధాంత గ్రంథాన్ని మార్చి 2007లో ముద్రించినారు. అట్టి పుస్తకాన్ని నారాయణరెడ్డి తన తల్లి రంగమ్మ గారికి మరియు తండ్రి కీర్తిశేషులు గోపాల్ రెడ్డి గారికి అంకితం ఇవ్వడం జరిగింది. ‘ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతి’ అనే గేయాల సంపుటిని ఆర్థిక భారాన్ని సైతం లెక్కచేయక జనవరి 2009 సంవత్సరంలో నారాయణరెడ్డి ప్రచురించినారు. ఆ పుస్తకాన్ని ఆదిలాబాద్ జిల్లా జానపద గాయకులకు తనకు వారిపై గల గౌరవంతో అంకితం ఇచ్చారు. నారాయణరెడ్డి ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ సేకరణలో, ప్రచురణలో వారు కనబరిచిన శ్రద్ధాసక్తులను అభినందిస్తున్నాను.

తల్లిదండ్రుల మరణం:

నారాయణరెడ్డి తండ్రి గోపాల్ రెడ్డి మర్రిపల్లిగూడెం గ్రామంలో గల భూములను అమ్మి వేశారు. 1955- 1956 సంవత్సరంలో మహా ముత్తారం గ్రామం కు వెళ్లి అక్కడ భూములు కొన్నారు. మహా ముత్తారం గ్రామంలో ఇల్లు నిర్మాణం చేశారు. మహా ముత్తారం గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించారు. నారాయణరెడ్డి తండ్రి గోపాల్ రెడ్డి మహా ముత్తారం గ్రామానికి వెళ్లిన ఒక సంవత్సరానికే ఆరోగ్యం బాగా లేక జ్వరం వచ్చి 03-01-1956 రోజున 70 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడిపోయారు. నారాయణరెడ్డి అమ్మ రంగమ్మ మరియు మేనమామ బొబ్బాల పుల్లారెడ్డి కలిసి వ్యవసాయం చేసేవారు. నారాయణరెడ్డి తండ్రి గోపాల్ రెడ్డి చనిపోగానే కుటుంబ భారం అంతా అమ్మ రంగమ్మ పై పడింది. నారాయణరెడ్డి అమ్మ రంగమ్మ తేది16- 11- 2007 రోజున 98 ఏళ్ల వయస్సులో కరీంనగర్‌లో స్వర్గస్తులయ్యారు.

వివాహం, సంతానం:

నారాయణరెడ్డి వివాహం 1959 వేసవి కాలంలో శకుంతలతో జరిగింది. నారాయణరెడ్డి మామయ్య రావుల రాంరెడ్డి, అత్తమ్మ సత్తెమ్మ చెట్ల ముప్పారం గ్రామం, మండలం కేసముద్రం,జిల్లా మహబూబాబాద్ కు చెందిన వారు.

మాదాడి నారాయణరెడ్డి, శకుంతల దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.

  1. ప్రథమ సంతానం: రాంగోపాల్ రెడ్డి. భార్య రజిత. రాంగోపాల్ రెడ్డి యూనియన్ బ్యాంక్‌లో చీఫ్ మానేజర్‍గా పని చేసి రిటైర్ అయ్యారు. రాం గోపాల్ రెడ్డి, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు,1)కార్తిక్ కుమార్ రెడ్డి, 2) సిద్ధార్థ కుమార్ రెడ్డి.
  2. ద్వితీయ సంతానం: విజయ పాల్ రెడ్డి, భార్య రుక్మిణి. విజయ పాల్ రెడ్డి సంక్షేమ శాఖలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. విజయ పాల్ రెడ్డి,రుక్మిణి దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. 1) శ్రుతి, 2) సాహితి.
  3. తృతీయ సంతానం: కుందూరి వనజాదేవి, భర్త రఘువీర్ రెడ్డి. రఘువీర్ రెడ్డి ఎల్ఐసి జోనల్ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. వనజా దేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వనజా దేవి, రఘువీర్ రెడ్డి దంపతులకు ఒక్కతే కూతురు. పేరు: వైష్ణవి రెడ్డి.
  4. చతుర్థ సంతానం: శ్రీధర్ రెడ్డి, భార్య సబిత. శ్రీధర్ రెడ్డి బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి,సబిత దంపతులకు ఇద్దరు సంతానం. 1) రాకేశ్ రెడ్డి 2) హరిణి.

సతీ వియోగం:

నారాయణరెడ్డి భార్య శకుంతల తేది 01-01-1986 రోజున ప్రమాదవశాత్తు ఈ లోకాన్ని వీడిపోయారు. నారాయణరెడ్డి భార్య దూరమవడం వల్ల జీవితంలో ఎంతో కోల్పోయారు. అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తనకున్న ఉద్యోగ వ్యాపకంలో పడిపోయి తేరుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. కొడుకులు, కోడండ్లు, కూతురు, అల్లుడు, మనుమలు, మనుమరాళ్ళు, మరియు బంధువులు, స్నేహితులు అందరితో కలివిడిగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నారాయణ రెడ్డి వృద్ధాప్యంలో ఉన్నప్పటికి తన పనులు తాను చేసుకుంటారు. పుస్తకాలు అధ్యయనం చేస్తుంటారు. పుస్తక పఠనంతో సేద తీరుతారు.

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) వెలువరించిన గ్రంధాలు:

  1. స్పందన కవితల సంపుటి: ముదిగొండ ఈశ్వర చరణ్, ముదిగొండ వీరేశలింగం, మాదాడి నారాయణ రెడ్డి (మానారె). ముగ్గురు కవులు కవితలు రాశారు.
  2. శైవలిని: ఇది కవితా సంకలనం. ఇందులో ‘అబద్ధం బజారున పడ్డది’ కవిత నారాయణ రెడ్డి రాశారు. నారాయణ రెడ్డి ఈ కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఇది ఆదిలాబాద్ జిల్లా రచయితల సంఘం ద్వారా ప్రచురింపబడింది.
  3. అంకమరాజు కథ – కోలాటం పాట, నవంబర్ 2001లో ప్రచురణ.
  4. ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు,మార్చి 2007లో ప్రచురణ.
  5. అదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతి, జనవరి 2009లో ప్రచురణ.

మాదాడి నారాయణ రెడ్డి(మానారె) రాసిన వ్యాసాలు:

  1. అముక్తమాల్యద-మాల దాసరి కథ. కరీంనగర్ నుండి వెలువడిన గౌతమి మాస పత్రిక, మార్చి,1969లో ప్రచురింపబడింది.
  2. అదిలాబాద్ మాండలికాలు -భారతి మాసపత్రిక, అక్టోబర్ 1977లో ప్రచురింపబడింది.
  3. అంకమరాజు కథ: వివేచన, పరిశోధన పత్రిక, నాలుగో ఇష్యూ డిసెంబర్ 1979 లో ప్రచురింపబడింది.
  4. మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలుగు మాండలికాలు: ఆంధ్రభూమి దిన పత్రిక, 16 నవంబర్ 1980 లో ప్రచురింపబడింది.
  5. కోలాటం పాటల్లో అంకమరాజు కథ: ఆంధ్రభూమి దినపత్రిక,11 అక్టోబర్ 1981 లో ప్రచురింపబడింది.
  6. ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల్లోని కొన్ని మాండలికాలు: ఆంధ్రభూమి దినపత్రిక, 6 వ డిసెంబర్ 1981 లో ప్రచురింపబడింది.
  7. విసుర్రాయి పాటల్లో జానపద స్త్రీ: జానపద సరస్వతి, ఏపీ జానపద సాహిత్య పరిషత్ ప్రచురించిన పత్రిక అక్టోబర్1983 లో ప్రచురింపబడింది.

మాదాడి నారాయణరెడ్డి(మానారె) సాహిత్య రంగంలో విశేష కృషి చేసినారు. అంతే గాక అనేక సెమినార్లు మరియు కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన వివరాలు:

  1. సమ్మర్ స్కూల్ ఆఫ్ లింగ్విస్టిక్స్ ఏప్రిల్ 29,1963 నుండి జూన్ 8,1963 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ మరియు లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సెమినార్‌లో నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
  2. యూజీసీ సమ్మర్ ఇనిస్టిట్యూట్ ఇన్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అక్టోబర్ 11,1996 నుండి నవంబర్ 6,1996 వరకు నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ, షిల్లాంగ్ మరియు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మైసూరు వారు లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి సహకారంతో షిల్లాంగ్ లో ఏర్పాటు చేసారు. ఇందులో నారాయణరెడ్డి ఆసక్తిగా పాల్గొని భాషా శాస్త్రంలోని విశేషాలను నేర్చుకున్నారు.
  3. యూజీసీ సమ్మర్ ఇనిస్టిట్యూట్ ఇన్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ మే 9,1977 నుండి జూన్ 4 1977 వరకు మధురై యూనివర్సిటీ మధురై మరియు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మైసూరు వారు లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వారితో కలిసి మధురైలో నిర్వహించినారు.
  4. 29 అక్టోబర్1979 నుండి 31అక్టోబర్ 1979 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరు లో జరిగిన ఏపీ ఓరియంటల్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తితో పాల్గొన్నారు.
  5. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ లో మార్చి 14,1981 నుండి మార్చి 16,1981 వరకు జరిగిన సెమినార్ ఇన్ ఫోక్‌లోరిస్టిక్స్ లో వీరు పాల్గొన్నారు.
  6. జూన్ 1981 లో తిరుపతిలో జరిగిన మూడవ ఏపీ ఓరియంటల్ కాన్ఫరెన్స్ లో నన్నయగారి ప్రక్రియల పై పత్ర సమర్పణ చేశారు.
  7. అక్టోబర్ 29,1982 నుండి అక్టోబర్ 31,1982 వరకు రాజస్థాన్‍లోని జైపూర్‌లో జరిగిన 31వ ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
  8. డిసెంబర్ 27,1983 నుండి డిసెంబర్ 29,1983 వరకు హైదరాబాదులో నిర్వహించబడిన ఇండియన్ ఫోక్‌లోర్ కాంగ్రెస్- 4 సెషన్‌లో పాల్గొన్నారు.
  9. శాతవాహన విశ్వవిద్యాలయం మార్చి 19,20, 2010 లో నిర్వహించిన జాతీయ సెమినార్ – కరీంనగర్ ప్రాంత చరిత్ర-సంస్కృతి సాహిత్యాలులో నారాయణరెడ్డి పాల్గొని ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు సంస్కృతి ప్రత్యేకతలు పై పత్ర సమర్పణ చేశారు. ఇది శాతవాహన విశ్వవిద్యాలయం ప్రచురించిన ఉత్తర తెలంగాణ సంస్కృతి-చరిత్ర మార్చి 2011లో ముద్రితమైంది.

మాదాడి నారాయణ రెడ్డి(మానారె) పాల్గొన్న ఆకాశవాణి ప్రసారాలు:

1) మహారాష్ట్ర సరిహద్దుల్లోని మాండలికాలు – ఆకాశవాణి, హైదరాబాద్ 2 వ ఆగస్టు, 1980 రోజున ప్రసారమైంది.

మాదాడి నారాయణ రెడ్డి(మానారె) కు లభించిన పురస్కారాలు:

  1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారాయణరెడ్డికి తెలుగు ఉపన్యాసకునిగా విశిష్ట సేవలు అందించినందులకు గాను 26 జనవరి 1994 గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయునిగా సర్టిఫికెట్ మెరిటోరియస్ సర్వీసెస్ ప్రదానం చేశారు.
  2. తేది: 24-01-1999న ఉత్తమ ఉపాధ్యాయునిగా డాక్టర్ జె.రమణయ్య మెరిట్ అవార్డు సర్టిఫికెట్‌ను నారాయణరెడ్డి పొందినారు.
  3. ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు పుస్తకానికి డిసెంబర్ 2007లో బొందుగుల పాటి అహల్యా సుందర్రావు స్మారక సాహితీ గౌతమి, కరీంనగర్ వారి పురస్కారం అందుకున్నారు.
  4. మై గిఫ్ట్ పురస్కార్-2008, మై గిఫ్ట్ యువ సంస్థ నర్సింగాపూర్,చందుర్తి మండలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు నారాయణరెడ్డిని పురస్కారం అందించి సన్మానించడం జరిగింది.
  5. తేది19-10-2018 న ఆదిలాబాద్ జిల్లా ఆకాశవాణి 32వ వార్షికోత్సవం సందర్భంగా నారాయణరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల పై చేసిన పరిశోధనకు గుర్తింపుగా ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం వారు ఘనంగా సత్కరించినారు.

మాదాడి నారాయణరెడ్డి (మానారె) ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు సేకరించి వ్రాసిన సిద్ధాంత గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించి పిహెచ్.డి.పట్టా పొందనందులకు నాకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ మాదాడి నారాయణ రెడ్డి (మానారె) అదిలాబాద్ జిల్లా జానపదుల నుండి సేకరించిన పాటలకు లిఖిత రూపం ఇచ్చి జానపదులు అలవోకగా పాడుకునే ఆ పాటలను అందరు చదువుకునేలా గ్రంథస్థం చేసి సజీవం చేశారు. ఆదిలాబాద్ జిల్లా జానపదుల గేయ చరిత్ర లో నారాయణరెడ్డి (మానారె) పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది.మాదాడి నారాయణ రెడ్డి (మానారె) చేసిన కృషికి అభినందనలు తెలపడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

నేను బి.కాం.డిగ్రీ ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ కళాశాల కరీంనగర్ లో 1985-1986 సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నారాయణ రెడ్డి సారు నాకు తెలుగు బోధించారు. సారు క్లాస్‌లో పాఠాలు చక్కగా బోధించే వారు. తెలుగు పీరియడ్‌లో క్లాస్ మొత్తం మంది విద్యార్థులు అటెండ్ అయ్యే వారు. కాలేజ్ అయి పోయిన తర్వాత సారును కలుసుకోవడం జరగలేదు. చాలా ఏళ్ళు గడిచిపోయాయి. నేను కరీంనగర్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక రోజు అనుకోకుండా నా గురువు నారాయణ రెడ్డి ‌సారును కోర్టులో చూడడం జరిగింది. చదువు నేర్పిన గురువు కదా ఎప్పటికి గుర్తు ఉంటారు. సారు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మాట్లాడాను. సారు అభిమానంతో ఒకసారి ఇంటికి రా బాబు అని ఆహ్వానించారు. అడ్రస్ చెప్పారు. సారు ఇంటికి వెళ్ళి కలిశాను. సారులోఎంతో విద్వత్తు ఉన్నట్టు తెలిసింది. సారు రాసిన పుస్తకాలు నాకు ఇచ్చారు. తర్వాత సారు రాసిన కవితలు చదివాను. కవితలు మహామహులు రాసినట్లుగా చాలా గొప్పగా ఉన్నాయి. సారు కవితల పై విశ్లేషణా వ్యాసాలు రాశాను. అలాంటి గొప్ప వ్యక్తి నాకు గురువు కావడం నా పూర్వ జన్మ సుకృతంగా తలంచుచున్నాను. వారి సాహిత్య జీవితం పై వ్యాసం రాసే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) చేసిన కృషి మరువలేనిది, మరపురానిది అని చెప్పడం అతిశయోక్తి కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here