[dropcap]ఆ[/dropcap]మెకి బాల్యం నుండి చదువంటే మక్కువ. ఢాకా బోర్డ్ ఇంటర్మీడియట్లో ప్రథమ స్థానం పొంది, కలకత్తా లోని బెతూన్ కాలేజిలో బి.ఎ. ఫిలాసఫీ డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణురాలయినా పట్టాని తీసుకోలేక పోయారామె. విద్యార్థినిగా ఉన్నప్పుడే భారత స్వాతంత్ర్యోద్యమ విప్లవసంఘాలలో పనిచేసి విప్లవాత్మక హింసావాద ఉద్యమంలో పాల్గొన్నారు. విప్లవకారులకి సాయం చేయడంతోనే ఆగక, బ్రిటిష్ అధికారుల విలాస మందిరం యూరోపియన్ క్లబ్ మీద దాడికి నాయకురాలై ఆత్మాహుతి చేసుకున్న విప్లవ నాయిక. ఆమే ప్రీతిలతా వడ్డేదార్.
ఈమె 1911 మే 5వ తేదీన నాటి బెంగాల్ ఫ్రావిన్స్ నేటి బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ సమీపంలోని దోలాఘాట్ గ్రామంలో జన్మించారు.
ఈమె తల్లి ప్రతిభా వడ్డేదార్ స్వదేశీ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవారు. తండ్రి జగబంధుభాబు చిట్టగాంగ్ పురపాలక సంఘ కార్యాలయంలో ప్రధాన గుమాస్తాగా పనిచేసేవారు.
ఆ రోజుల్లో ఈమె విద్యాధికురాలు. చిట్టగాంగ్ లోని డాక్టర్ ఖస్తగిర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదివారు. మెట్రిక్యులేషన్ తరువాత ఢాకాలోని ఈడెన్ కాలేజిలో ఇంటర్‌మీడియట్ ఢాకా బోర్డులో చదివారు. ప్రథమస్థానాన్ని సంపాదించారు.
కలకత్తా లోని బెతూన్ కాలేజిలో తత్వశాస్త్రం బి.ఎ. చదివారు. అయితే ఈమెకి డిగ్రీ పట్టాని ప్రదానం చేయకుండా ఆపేశారు – దీని వెనుక అసలు కథ వేరే ఉంది.
కళాశాల లోని ఈమె సహధ్యాయులు కల్పనాదత్తా, సరోజినీపాల్, రేణుకారాయ్, కమలాముఖర్జీ మొదలయిన వారితో కలసి విప్లవ కార్యక్రమాలలో పాల్గొనేవారు. కలకత్తాలోని విప్లవ సంఘాలతో సంప్రదించి చిట్టగాంగ్‌లో నిర్వహించవలసిన కార్యక్రమాలను తన మిత్రులతో కలసి ఆచరణలో పెట్టేవారు.
అపర్ణాచరణ్ బాలికోన్నత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా విధులను నిర్వహించారు.
ప్రముఖ విప్లవవీరుడు సూర్యసేన్‌తో ఈమె పరిచయం కలిగింది. ఈమె యుగాంతర్ అనే విప్లవ సంఘంలో చేరారు. విప్లవ కార్యకలాపాలలో విస్తృతంగా పాల్గొన్నారు. జైలులో శిక్షననుభవిస్తున్న విప్లవకారులను మారువేషాలలో కలిసేవారు. బయట ప్రపంచంలో నిర్వహించవలసిన కార్యక్రమాలను గురించి చర్చలు జరిపేవారు.
బినోద్ బిహారీ చౌదరి వంటి విప్లవకారులు మహిళలను ఉద్యమంలో చేర్చుకోవడానికి అభ్యంతరం చెప్పారు. కాని విప్లవ కార్యకలాపాలకు అవసరమైన కరపత్రాలు, రహస్యపత్రాలు, బాంబులు, తుపాకి మందు, ఆయుధాలను సరఫరా చేసే అవకాశం పోలీసుల తనిఖీని తప్పించుకోవడానికి పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ఉంటుందని మిగిలిన విప్లవ వీరులు వాదించారు. ఈ విధంగా చిట్టగాంగ్ మహిళలు విప్లవ వీరనారీమణులయ్యే అవకాశం కలిగింది.
ఈమె భారత రిపబ్లికన్ సైన్యంలోని మహిళా విభాగం చిట్టగాంగ్ విభాగంలో చేరి పనిచేశారు. టెలిగ్రాఫ్, టెలిఫోన్ వైర్లను కత్తిరించి బ్రిటిష్ వారి కమ్యూనికేషన్లకు భంగం కలిగించడంలో ఈమె, ఈమె సహచరుల పాత్ర అద్వితీయం. జలాలాబాద్ విప్లవ కార్యకలాపంలో ఆయుధ సామగ్రిని అందించే బాధ్యతను నిర్వహించారు.
సూర్యసేన్ బృందం చిట్టగాంగ్ పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్ శ్రీ క్రెయిగ్‌ని హతమార్చడానికి నిశ్చయించారు. తమ బృందంలోని ఇరువురు రామకృష్ణ బిశ్వాస్, కలిపాడ చక్రవర్తులకు ఈ పనిని అప్పగించారు. అయితే వీరు పొరపాటున చాంద్‌పూర్ యస్.పీ.ని చంపారు. అరెస్టయి అలీపూర్ జైలులో బంధించబడ్డారు. వీరిని కలిసే బాధ్యత ప్రీతిలతకు అప్పగించబడింది. ఈమె సోదరిలాగా వారిని కలసి ధైర్యం చెప్పారు.
చిట్టగాంగ్‌లో ‘పహర్తాలి యూరోపియన్ క్లబ్’ బ్రిటిష్ అధికారులకు,వారి కుటుంబానికి వినోదవిలాస కేంద్రంగా భాసిల్లేది, ‘కుక్కలకు, భారతీయులకు ఈ క్లబ్ లోకి అనుమతి లేదు’ అనే బోర్డు ఈ క్లబ్బు ముందు వేలాడుతుండేది. భారతీయులకు ఈ బోర్డు మనస్తాపం కలిగించేది.
ఈ క్లబ్ మీద దాడి చేయాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించింది విప్లవదళం. ఈ కార్యకలాపం కోసం కల్పనాదత్తాను నాయకురాలిగా నియమించాలని అనుకున్నారు. కాని ఆమెను అరెస్టు చేసి జైలులో బంధించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ పని కోసం శిక్షణ పొందిన సుమారు పది మహిళలలో ఒకరయిన ప్రీతిలత నాయకత్వం వహించారు.
కోటవాలి దగ్గర సముద్రతీరానికి వెళ్ళి పహర్తాళి క్లబ్ మీద దాడి చేయడం కోసం ప్రణాళికను తయారు చేశారు. 1932 సెప్టెంబర్ 24 వ తేదీన క్లబ్ మిద దాడికి సమయాన్ని నిర్ణయించారు.
ప్రీతిలత పంజాబీ పురుషుడి వేషం ధరించారు. ఇంకా వివిధ రకాల దుస్తులలో కాళీశంకర్ డే, బీరేశ్వర్ రాయ్, శాంతిచక్రవర్తి, మహేంద్ర చౌదరి, సుశీల్ డే, మొదలయిన వారందరితో కలసి క్లబ్ మిద దాడి చేశారు.
సుమారు రాత్రి గం.10-45 నిముషాలకు క్లబ్ మీద విప్లవకారులు మూడు గ్రూపులుగా ఏర్పడి ముప్పేట దాడి చేశారు.
వీరి కాల్పులకు ప్రతిగా క్లబ్ లోని వారు ఎదురు కాల్పులు జరిపారు. దాడిలో పాల్గొన్న వారందరూ తప్పించుకున్నారు. కాని బుల్లెట్ దెబ్బ తిన్న ప్రీతిలత వారికి దొరికి పోయారు. పరుగెత్త లేక కాదు ప్రాణాలను లెక్కచేయకుండా ధైర్యంగా వారికి ఎదురు నిలవాలనుకున్నారు. కాని ఆమెకి బ్రిటిష్ వారి చేతికి బందీగా దొరకడం ఇష్టం లేక పోయింది. వెంటనే పొటాషియం సయనైడ్ మింగి వీర మరణాన్ని పొందారు. (ఈ క్లబ్ మీద దాడి చేయడం కోసం ఎంపికయిన విప్లవ వీరులకి ఆపద్సమయంలో ఆత్మాహుతి చేసుకోడానికి పొటాషియం సైనైడ్ ఇవ్వబడింది). అప్పటికి ఈమె వయస్సు 21 సంవత్సరాలు మాత్రమే!
ఈమె ఈడెన్ కాలేజిలో చదువుతున్న సమయంలోనే దీపాలి సంఘ సభ్యురాలయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరురాలు లీలానాగ్ ఈ సంఘ సంస్థాపకులు. ఈ విధంగా విద్యార్థినిగానే ఈమె విప్లవ కార్యకలాపాలకు బీజం పడడం విశేషం. బ్రిటీష్ ప్రభుత్వం వారి దురాగతాలను అవగాహన చేసుకుని వారి పట్ల వ్యతిరేక భావాన్ని పెంచుకున్నారు. వారి మీద పోరాటం చెయ్యడానికి అప్పటి నుండే మానసికంగా సిద్ధమయ్యారు.
ఇలా చిన్నప్పటి నుండే ధైర్యసాహసాలతో విప్లవ కార్యకలాపాల పట్ల ఇష్టాన్ని పెంచుకుని, వాటిలో పాల్గొని వీరమరణం మరణం పొందిన ధీశాలి ఆమె.
ఈమె మరణానంతరం 80 ఏళ్ళ తర్వాత 2012 సంవత్సంలో కలకత్తా బెతూన్ కళాశాల వారు ఈమెకి బి.ఎ డిగ్రీని ప్రదానం చేసి గౌరవించారు.
ఈమె గౌరవార్థం 2022 అక్టోబర్ 11వ తేదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారత తపాలాశాఖ ఒక ప్రత్యేక తపాలా కవర్‌ని విడుదల చేసి గౌరవించింది. కవర్ మీద ఎడమవైపున దీర్ఘవృత్తాకార చట్రంలో ఈమె చిత్రాన్ని, వెనుక భాగాన యూరోషియన్ క్లబ్ భవనాన్ని ముద్రించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet