తొలి మహిళా క్యాబినెట్ మంత్రి కుమారి రాజకుమారి అమృత కౌర్

7
12

[box type=’note’ fontsize=’16’] ఫిబ్రవరి 2వ తేదీ కుమారి రాజకుమారి అమృత కౌర్ జయంతి, ఫిబ్రవరి 6వ తేదీ వారి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]మ[/dropcap]న దేశ జాతీయ పోరాటంలోని వివిధ ఉద్యమాలలో పాల్గొని, జైలు శిక్షను అనుభవించి, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పునరుద్ధరణలో భాగస్వాములైన నాయకులు చాలామంది కనిపిస్తారు. వీరిలో తొలి మహిళా క్యాబినెట్ మంత్రిణిగా సేవలందించిన కుమారి రాజ్‌కుమారి అమృత కౌర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి.

వీరు 1889వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన నాటి బ్రిటిష్ ఇండియా నార్త్ వెస్ట్ ఫ్రావిన్సెస్ లోని (నేటి ఉత్తరప్రదేశ్ రాజధాని) లక్నోలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నీప్రిస్సిల్లా గోలక్నాథ్, శ్రీహర్నం సింగ్‌లు. వీరు కపుర్తల రాజ వంశీకులు. ఆగర్భ శ్రీమంతులు.

వీరి ప్రాథమిక విదాభ్యాసం, ఇంగ్లండ్ లోని డోర్సెట్‌లో షెర్బోర్న్ స్కూల్ ఫర్ గర్ల్స్‌లో జరిగింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివి పట్టా పుచ్చుకున్నారు. విలాసవంతమయిన జీవితం వారి కుటుంబానిది.

1918వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీ మహాత్ముని రాజకీయ గురువు శ్రీ గోపాలకృష్ణ గోఖలే రాజకుమారి గారింట్లో సమావేశాలు నిర్వహించేవారు. ఈ సమావేశాలలో ఆంగ్లేయుల పాలనలో భారతీయులు పడుతున్న బాధలను గురించి చర్చించేవారు. స్వాతంత్ర్య పోరాట అవసరాన్ని గురించి మాట్లాడుకునేవారు. ఈ సంభాషణలు స్పూర్తిని కలిగించాయి. జలియన్ వాలాబాగ్ మారణకాండ వీరి మనసును కదిలించింది. మహాత్మాగాంధీ ఉపన్యాసాలు సిద్ధాంతాలు, జాతీయ పోరాటం వైపు వీరి దృష్టిని కేంద్రీకరించేటట్లు చేశాయి. పూర్తి గాంధేయురాలిలా మారారు. సబర్మతీ ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆడంబర జీవితాన్ని వదిలి – నిరాడంబరత వైపు అడుగులు వేశారు. 16 సంవత్సరాల పాటు గాంధీ మహాత్ముని కార్యదర్శిలా పనిచేశారు. ఎంత నేర్పు, చాకచక్యం, నిబద్ధత, సమర్ధత ఉంటే ఆ పని చేయగలుగుతారు?

మహాత్ముని కార్యదర్శిగా విధులను నిర్వహిస్తూనే ఉద్యమాలలో పాల్గొన్నారు. 1930వ సంవత్సరంలో దండి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1937వ సంవత్సరంలో దేశద్రోహ ఆరోపణలతో జైలు శిక్షను అనుభవించారు. 1942వ సంవత్సరంలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. ఈ ఉద్యమ సమయంలో లాఠీ ఛార్జికి గురయ్యారు. రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటయిన ‘లోథియస్ కమిటీ’ ముందు హాజరయ్యారు.

స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే సమాంతరంగా మహిళా, శిశు, సంక్షేమ వృత్తి విద్య, వైద్య, ఆరోగ్య కార్యక్రమాలలోను పాలు పంచుకున్నారు. ఆలిండియా ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అసోసియేషన్ (అఖిలభారత మహిళా విద్యానిధి సంస్థ) ఛైర్ పర్సన్‌గా, లేడి ఇర్విన్ కాలేజీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా, ‘ఆలిండియా స్పిన్నర్స్ అసోసియేషన్ ధర్మకర్తల మండలి’ సభ్యురాలుగా, ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ’ అధ్యక్షులుగా, మహిళలకు ఓటు హక్కు కోసం కృషిచేసిన నాయకురాలిగా ఈమె సేవలు బహుముఖీనం. ‘ఢిల్లీ మ్యూజికల్ సొసైటీ’ని స్థాపించారు.

భారత రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ప్రాథమిక హక్కులు, మైనారిటీ హక్కుల కమిటీలలో సభ్యులు.

1945లో లండన్‌లో, 1946లో పారిస్‌లో జరిగిన UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) సమావేశాలకు మనదేశ ప్రతినిధిగా హాజరయ్యారు.

WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) జెనీవాలో నిర్వహించిన సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ రెండు సంస్థల సమావేశాలకు హాజరవడం మూలంగా ప్రపంచ దేశాలలోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, ఆరోగ్య తదితర పరిస్థితులను అధ్యయనం చేసే అవకాశం వీరికి లభించింది.

మహిళా సమస్యలయిన బాల్యవివాహాల రద్దు, వితంతువుల పునర్వివాహనిషేధం, పరదా పద్ధతి, అవిద్య వంటి వాటిని అధ్యయనం చేసి పరిష్కార మార్గాల దిశగా పయనించారు.

1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం లభించిన సంగతి అందరికీ తెలిసిందే! ప్రధానమంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన కేంద్రప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. స్వతంత్ర భారతంలో తొలి మహిళా క్యాబినెట్ మంత్రిగా రికార్డు సృష్టించారు.

వీరు వైద్య, ఆరోగ్యశాఖలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. స్వతంత్ర భారతంలో తొలి నాళ్ళలో అతిక్లిష్టమైన పరిస్థితులు రాజ్యమేలేవి. వివిధ రకాల సమస్యలు, సవాళ్ళు ప్రజలు, ప్రభుత్వము ఎదుర్కొనవలసి వచ్చింది. అవిద్య, అజ్ఞానము, భయంకరమైన అంటువ్యాధులు, శిశుమరణాలు, పోషకాహార లోపం, టీనేజ్ తల్లులకు పిల్లల పెంపక విధానాలు తెలియకపోవడం సమాజాన్ని కునారిల్లజేస్తున్నాయి.

ఈ సమయంలో వైద్య, ఆరోగ్య శాఖామంత్రిణిగా రాజకుమారి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య రంగాలలో ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టారు. వివిధ ఆరోగ్య సంస్థలను స్థాపించారు. వీటి స్థాపనలో వీరికి UNESCO, WHO సమావేశాలలో పాల్గొన్న అనుభవం ఎంతో ఉపయోగపడింది. విప్లవాత్మక మార్పులను చేపట్టారు.

‘టి.బి (క్షయ) అసోసియేషన్ ఆఫ్ ఇండియా’, ‘కుష్టు నివారణా బోర్డు’, ‘నర్సింగ్ కాలేజీలు’, ‘అమృతసర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్,’ ‘సెయింట్ జాన్స్ అంబులెన్స్ కార్ప్’ ద్వారా అంబులెన్స్ నిర్వహణ, ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్’, ‘ఇండియన్ ఛైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్’లను స్థాపించారు. ఈ విధంగా వైద్యరంగాన్ని సుసంపన్నం చేశారు.

పై సంస్థలన్నీ ఒక ఎత్తు. ఢిల్లీలో AIMS (All India Institute of Medical Sciences) అఖిల భారత వైద్య విద్యా సంస్థను ఏర్పాటు చేయడం ఒక ఎత్తు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పశ్చిమజర్మనీ, స్పీడన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు వంటి విదేశాల సాంకేతిక సహకారాన్ని తీసుకున్నారు. ఈ సంస్థను రూపొందించడంలో వీరు నిర్వహించిన పాత్ర, చూపిన చొరవలే ఈ నాటికీ దీనిని మనదేశంలో అగ్రగామి సంస్థగా నిలబెట్టాయి. 14 సంవత్సరాలు ‘భారత రెడ్ క్రాస్ సంస్థ’ అధ్యక్షులుగా వీరు నిర్వహించిన పాత్ర ఎనలేనిది. ఈ సంస్థకు వీరి కృషి వల్లనే అనేక అవార్డులు లభించాయి.

ఆ రోజుల్లోనే ప్రపంచంలోనే అతి పెద్ద స్థాయిలో బి.సి.జి టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతమయేందుకు కృషి చేశారు.

సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఆటలు, క్రీడలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆ విషయాన్ని గుర్తించి ‘National Sports Club of India’ ను స్థాపించారు. దీనిని 1961లో National Institute of Sports లోను ఆ తరువాత కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోను విలీనం చేశారు. దీనికి వీరే అధ్యక్షులు. ‘పేదరోగుల సంరక్షణ నిధి’ కోసం 3,00,000 రూపాయలతో తన స్వంత నిధులతో ఏర్పాటు చేశారు. తమ పూర్వీకులకు సిమ్లాలో ఉన్న ఆస్తులను ‘మనోర్‌విల్లి’ ని AIMS కు రాసిచ్చారు. దీనిని AIMS లో పనిచేసే నర్పులకు సెలవులలో సిమ్లా వచ్చి విశ్రాంతి తీసుకునేందుకు అని వీరు తెలియజేశారు. ఈ విధంగా నర్సింగ్ వృత్తిని గౌరవించారు.

1947వ సంవత్సరం నుండి 1957వ సంవత్సరం వరకు 10 సంవత్సరాల పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిణిగా బాధ్యతలు నిర్వహించారు. 1957 నుండి 1964 వరకు రాజ్యసభ సభ్యులుగా పదవిలో ఉన్నారు.

1958 నుండి 1963 వరకు ‘అఖిల భారత మోటారు రవాణా కాంగ్రెస్’ అధ్యక్షులుగా పనిచేశారు. మరణించే వరకు వివిధ సంస్థల అధ్యక్ష పదవులను నిర్వహించారు.

వీరికి రెనే సాండ్ స్మారక పురస్కారం, టైమ్ మ్యాగజైన్ యొక్క Women of the year 1947 పురస్కారం లభించాయి.

1964వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన న్యూఢిల్లీలో మరణించారు. వీరి జ్ఞాపకార్థం 1989వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన 60 పైసల విలువతో స్టాంపును విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ.

వీరి జయంతి ఫిబ్రవరి 2వ తేదీ, వర్ధంతి ఫిబ్రవరి 6వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here