సముద్రపోరాటయోధురాలు – రాణి అబ్బక్క

8
6

[dropcap]భా[/dropcap]రతదేశాన్ని వివిధ దశలలో వైవిధ్యభరితంగా రక్షించుకున్న వారెందరో? స్త్రీ, పురుష, వయో, కుల మత బేధాలు లేవు. ముస్లింరాజులను, ఆంగ్లేయులను ఎదిరించిన వీరనారులే కాదు. భారతదేశంలోకి అందరికంటే ముందు అడుగుపెట్టి, అందరికంటే ఆఖరుకి వదిలి వెళ్ళినవారు పోర్చుగీసులు. ఈ పోర్చుగీసు వారిని ఎదిరించి అద్భుతంగా యుద్ధం చేసి జనరల్స్‌నే హతమార్చి, శత్రువులను మట్టి కరిపించిన వీరనారీశిరోమణి ఉల్లాల్ రాణి అబ్బక్క.

పశ్చిమ తీరంలో ఉల్లాల్‌ను పరిపాలించిన తుళురాణి స్వయంగా జైనమతాన్ని అవలంబించారు. అయినా హిందూ ముస్లింలతో స్నేహాన్ని కొనసాగించారు. వారందరి సహాయ, సంప్రదింపులను స్వీకరించారు. ప్రజలను కన్నబిడ్డలలాగా పరిపాలించారు. సముద్రం మీద ఆధారపడి జీవించే జాలర్లు యుద్ధనైపుణ్యంతో, అగ్నిబాణాలను ప్రయోగించి ఓడలను తగలబెట్టి, పోర్చుగీసు సైనికులను హతమార్చి ఈమెకు అండదండగా నిలబడడం విశేషం. నాలుగు దశాబ్దాల పాటు పోర్చుగీసు వారిని గడగడలాడించిన నిర్భయరాణి, తొలి స్వాతంత్ర పోరాట యోధురాలు రాణి అబ్బక్క.

ఈమె చౌతావంశానికి చెందినవారు. మాతృస్వామ్య కుటుంబ వారసత్వం వీరిది. ఈమె మేనమామ తిరుమల రాయ ఈమెను ఉల్లాల్ రాణిగా పట్టాభిషిక్తురాలిని చేశాడు. ఆయనకు పిల్లలకు లేకపోవడం వల్ల మేనకోడలికి బాల్యం నుండి రాజరికపు విద్యలను నేర్పించాడు. విలువిద్య, గుర్రపుస్వారీ, యుద్ధవ్యూహాలను రచించే ప్రావీణ్యాన్ని అలవోకగా అభ్యసించారు. రాజులకు, రాజకీయాలకు దౌత్యనీతి చాలా అవసరం. దౌత్యనీతిని ఔపోసన పట్టి స్వదేశీ రాజులలో కొందరితో స్నేహం చేశారు. అందరినీ కలుపుకుని పోయి యుద్ధాలలో గెలవగలిగారు.

ఈమెకి మంగుళూరు రాజు లక్ష్మప్ప బంగార్రాజుతో వివాహం జరిగింది. కాని బంగార్రాజు శత్రువులయిన పోర్చుగీసు వారితో చేతులు కలిపాడు. వారి వివాహబంధం విఫలమయింది. అతను ఆమెను ఇబ్బంది పెట్టే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు.

మధ్యయుగంలో ఉల్లాల్ గొప్ప నౌకాశ్రయంగా ఉండేది. ఐరోపా దేశాలతో సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పెట్టనికోట అది. కాబట్టి దీనిని ఆక్రమించుకుంటే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. విదేశీయుల ధ్యాస దీనిమీదే ఉండేది. ఈ విదేశీ వ్యాపారం వల్ల ఉల్లాల్ రాజ్య సంపద సుసంపన్నమయింది. ఇది పోర్చుగీసువారికి కంటగింపయింది.

అప్పటికీ కొన్ని పశ్చిమ తీర ప్రాంతాలని, ఓడరేవులని ఆక్రమించి వాటిమీద ఆధిపత్యాన్ని సంపాదించారు పోర్చుగీసువారు. ఉల్లాల్ రేవుని తమకి స్వాధీనం చేయమని కోరారు. అబ్బక్క నిరాకరించారు. విదేశీ వ్యాపారం ఆపమని కోరారు. కాలికట్ జామోరిన్‌తో వ్యాపారాన్ని కూడా మానమని బెదిరించారు. వ్యాపారం తమ ద్వారానే జరగాలని నిర్దేశించారు. కాని రాణి అంగీకరించలేదు.

ఈమె కాలికట్, మోప్లా మొదలయిన రాజులతోపాటు, బిద్నూర్ రాజు వెంకటప్పనాయకుడి వంటి గొప్ప యోధుల సహాయం తీసుకున్నారు. వారితో సంప్రదింపులు జరిపారు. పోర్చుగీసువారికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటయింది. పోర్చుగీసు వారి దాడులకు ప్రతిగా దాడి చేశారు.

తొలిసారిగా 1556లో పోర్చుగీసు అడ్మిరల్ డోమ్ అల్వారో డా సిల్వీరా ఆధ్వర్యంలో ఉల్లాల్ మీద దాడి జరిగింది. ఈ దాడిని విజయవంతంగా తిప్పికొట్టారు అబ్బక్క.

అయితే ఉల్లాల్‌పై 1568లో జనరల్ జోవోపీక్సోటో ఆధ్వర్యంలో మళ్ళీ దాడిచేశారు పోర్చుగీసువారు. ఈ యుద్ధాన్ని తనకి అనుకూలంగా మలచుకున్నారు ఈమె భర్త లక్ష్మప్ప బంగార్రాజు. భార్య పట్ల ద్వేషంతో పోర్చుగీసువారికి సహాయం చేశారు. పోర్చుగీసు ఆధిపత్యాన్ని అంగీకరించి మంగుళూర్ సైన్యాన్ని వారికి అప్పగించారు. రాణి అబ్బక్క రహస్యాలను శత్రువులు పసిగట్టగలిగారు. రాజభవనాన్ని దోచుకున్నారు. రాణి తన ఆంతరంగికుల సాయంతో తప్పించుకున్నారు.

కాని దెబ్బతిన్నపులి తిరిగి దెబ్బతీయకుండా ఉండదు. మరుసటి రోజు రాత్రే శత్రువుల మిద ఆకస్మికంగా దాడి చేశారామె. జనరల్ పీక్సోటేని హతమార్చారు. పోర్చుగీసు సైనికులను బందీలుగా చేశారు.

తరువాత పోర్చుగీసు వారిని ఎదిరించిన జామెరిన్ సైన్యాధ్యక్షుడు కుట్టిపోకర్ మార్కర్ యుద్ధంలో మరణించారు. ఇది రాణి అబ్బక్కని కోలుకోలేని దెబ్బతీసింది.

పలుసార్లు పోర్చుగీసు వారు ఉల్లాల్ రాజ్యంలోని పిల్లలు, మహిళలు, వృద్ధుల మీద దాడులు చేశారు. దేవాలయాల మీద దాడి చేశారు. ఓడలను, వివిధ నగరాలను తగలబెట్టారు.

ఈమె ఎదురుదాడులతో ప్రతిఘటించారు, కాని భర్తచేసిన ద్రోహంతో ఈమె శత్రువులకి దొరికిపోయారు. జైలులో ఖైదీ అయినా కూడా శత్రువులను ఎదిరించి, పోరాడి వీరమరణాన్ని పొందారు.

పోర్చుగీసు వారితో కొబ్బరి చెట్టు భాగాలతోను, అగ్నిబాణాలతోను యుద్ధాలు చేయడం వీరి ప్రత్యేకత. ఈమె సైన్యంలో మొగవీరులు, మత్స్యకారులు, జానపదులతో సహా అన్ని వర్గాల ప్రజలు పనిచేశారు. అందరూ స్వాతంత్ర్యం కావాలనే స్ఫూర్తితో ఐకమత్యంతో యుద్ధం చేశారు. కాని ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేని రీతిన భర్త చేసిన ద్రోహమే ఈమె అపజయానికి కారణమయింది.

ఉల్లాల్ రాజ్య రాజధాని పుట్టిగె. అయితే వారి వాణిజ్య నౌకాతీరపు రాజధాని ఉల్లాల్ రేవు పట్టణం, ఈమె స్వయంగా జైనమతస్థురాలు అయినప్పటికీ ‘రుద్రరాక్’ అనే శిలలను ఉపయోగించి శివాలయాన్ని నిర్మించారు. సోమనాథ్ దేవాలయానికి నిధులను అందించారు. ఇస్లాం మతస్థుల కోసం మసీదులను నిర్మించారు. ఈ విధంగా ఐదున్నర శతాబ్దాల క్రితమే లౌకికవాదిగా నిరూపించుకున్నారు.

శ్రీ చెన్నప్ప మొగవీర వివిధ యుద్ధాలలో ఈమెకు విజయాలను అందించేటందుకు కృషి చేసిన ఏకైక నావికా దళ కమాండర్. పోర్చుగీసువారు 1581లో జరిగిన చివరి యుద్ధంలో ఇతనిని బంధించి, చంపివేశారు.

ఈనాటికీ ఉల్లాల్‌లో ఆమె జ్ఞాపకార్ధం వీర రాణి అబ్బక్క ఉత్సవాన్ని నిర్వహించి గౌరవిస్తున్నారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ‘రాణి అబ్బక్క ఇన్ షోర్ పెట్రోలింగ్’ నౌకను తయారు చేయించారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా ఈ నౌకని నిర్మించి నావికా యుద్ధంలో పోర్చుగీసు వారిని ఓడించిన ‘రాణి అబ్బక్క’ని గౌరవించడం అభినందనీయం.

13-10-2021 తేదీన ఈమె జ్ఞాపకార్థం ప్రత్యేక తపాలాకవర్‌ను విడుదల చేసింది. వీరనారి అబ్బక్క చిత్రాన్ని ముద్రించి ఆమె గొప్పతనాన్ని గౌరవించిన తపాలాశాఖ అభినందనీయం.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here