భారతదేశపు తొలి మహిళా సూపర్ స్టార్ రూబీ మేయర్స్ (సులోచన)

7
7

[dropcap]ది.[/dropcap] 10-10-2021 తేదీన శ్రీమతి రూబీ మేయర్స్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్ మూకీ, టాకీ సినిమాల కథానాయిక, 1924లోనే ‘వీర్‌బాల’ సినిమాలో ద్విపాత్రాభినయనం చేసిన నటి, 1924 ‘వైల్డ్ క్యాట్ ఆఫ్ బోంబే’ పేరుతో మూకీ సినిమాగా, 1936లో ‘బోంబేకి బిల్లి’ పేరుతో విడుదలయిన టాకీ సినిమాలో 8 పాత్రలను పోషించిన మహానటి, రూబీ పిక్చర్స్ అధినేత్రి, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, 1936 నాటికి బొంబాయి గవర్నర్ కంటే అధికజీతం పొందిన ధనవంతురాలు, బాగ్దాదీ యూదువనితా శిరోమణి రూబీ మేయర్స్ (సులోచన).

ఈమె 1907లో అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలోని పూనాలో జన్మించారు. ఈమె తల్లి లూలూ మేయర్స్. 18వ శతాబ్దంలో భారతదేశానికి వలస వచ్చి వ్యాపారపరంగా అభివృద్ధి చేసిన (యురేషియన్) బాగ్దాదు యూదుల జాతి సంతతికి చెందిన కుటుంబీకురాలు.

అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న టెలిఫోన్ రంగంలో ఉద్యోగిగా చేరారు. టెలిఫోన్ ఆపరేటర్‌గా పని చేసేవారు.

కోహినూర్ ఫిలిమ్ కంపెనీ మోహన్ భావనాని ఈమెకి సినిమా అవకాశాలు కల్పించారు. ఈమె మూకీ, టాకీ సినిమాల నటిగా పేరు పొందారు. తరువాత కోహినూర్ కంపెనీ నుండి ఇంపీరియల్ కంపెనీకి మారారు. భావనాని ఈమెను సులోచన పేరుతో సినిమా రంగానికి పరిచయం చేశారు.

1924లో వీర్‌బాల, 1926లో సినిమా క్వీన్, పాగల్ ప్రేమి, ముంతాజ్ మహల్, టెలిఫోన్ గరల్, టైపిస్ట్ గరల్, ది నర్స్, 1927లో బలిదాన్, వైల్డ్ క్యాట్ ఆఫ్ బోంబే, 1928లో మాధురి, అనార్కలి, ఇందిరా బి.ఎ, డాన్సింగ్ గర్ల్ వంటి మూకీ సినిమాలలో నటించారు. ‘వీర్‌బాల’ సినిమాలో ద్విపాత్రాభినయనం చేశారు.

వీటిని గమనిస్తే మహిళలు చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పాత్రలకు ప్రాముఖ్యమిస్తూ ఆ సినిమాలు తీసినట్లు అర్థమవుతుంది.

1930ల నాటికి సాంకేతికాభివృద్ధి పెంపొందింది. ఇది సినిమా రంగం మీద కూడా ప్రభావం చూపించింది. సంభాషణలు కూర్చుకుని, చక్కటి స్క్రిప్ట్ తయారు చేసి సినిమాలు తీయడం మొదలయింది. టాకీ సినిమాల ఆవిర్భావం జరిగింది.

నటనకు ధీటుగా సంభాషణలు చెప్పే నైపుణ్యం తోడు కావలసి వచ్చింది. అయితే రూబీ మేయర్స్‌కు హిందూస్థానీ భాష రాదు. సంవత్సరం కాలం ఈమె ఖాళీగా ఉండే పరిస్థితి వచ్చింది.

అయితే మనోస్థైర్యము, పట్టుదల ఉంటే కొత్త పనులు చేపట్టగలం. ‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’. ఈ సూక్తి ఈమెకి నూరుశాతం వర్తిస్తుంది. సంవత్సర కాలంలో హిందుస్థానీ భాషపై పట్టు సాధించి, సంభాషణా చాతుర్యంతో నటించే స్థాయికి ఎదిగారు.

1932లో ఆమె మూకీ సినిమా ‘మాధురి’ని టాకీ సినిమాగా నిర్మించి విడుదల చేస్తే ఆమె అద్భుత నటనతో విజయం సాధించింది. 1936లో ‘వైల్డ్ క్యాట్ ఆఫ్ బోంబే’ మూకీ సినిమా పునర్నిర్మించబడి ‘బొంబేకి బిల్లి’ గా విడుదలయింది.

‘వైల్డ్ క్యాట్ ఆఫ్ బోంబే’, ‘బొంబేకి బిల్లి’ ఈమెకు ప్రత్యేకమైన సినిమాలు (ఈ రోజుల్లో హీరోలు ఒకే సినిమాలో ఎనిమిది పాత్రలు పోషించారు. పది పాత్రలు పోషించారనడం గొప్పగా చెప్పుకుంటున్నాం). కాని సులోచన ఆ సినిమాలలో తోటమాలి, పోలీస్, అరటిపళ్ళ వ్యాపారి, హైదరాబాదీ పెద్దమనిషి, తిరుగుబోతు, యూరోపియన్ అందగత్తె, దాత, పిక్‌పాకెటర్ మొదలయిన ఎనిమిది స్త్రీ, పురుష పాత్రలను పోషించి రికార్డును నెలకొల్పి సూపర్ స్టార్‌గా నిలిచారు. ఆ రోజుల్లోనే మహానగరంలో ప్రమాదకర వాతావరణంలో తనను తాను కాపాడుకోవడం కోసం, ఒక మహిళ చేసిన సాహసాలతో కూడిన మెలో డ్రామాలు ఈ సినిమాలు. ఈ సినిమా ఒక్కటి చాలు ఈమె గొప్ప నటి అని చెప్పడానికి.

1935లో ‘అనార్కలి’ టాకీ సినిమాలో నటించారు. అంతకు ముందు మూకీ అనార్కలిలోను, ఈ సినిమాలోను నాయికగా నటించారు. కాని 1953లో నిర్మించిన ‘అనార్కలి’ సినిమాలో సలీమ్ తల్లి జోధ్‌బాయిగా, అద్భుతంగా నటించారు. కాలానుగుణంగా వయసుకు తగిన పాత్రలలో రాణించారు.

1932లో మాధురి, 1933లో సులోచన, 1934లో ఇందిర బి.ఎ, 1936లో డాకూ కీ లడ్కీ, 1947 జుగ్ను, 1953 బాజ్, 1968 నీల్ కమల్, 1969 ఆమ్రపాలి, ఆకీ కసం, 1975 జూలీ, 1978 ఖట్టా మీటా ఈమె నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు.

మాధురి, అనార్కలి, ఇందిర బి.ఎ సినిమాలు మూడు గొప్ప రొమాంటిక్ చిత్రాలుగా పేరు పొందాయి. వీటికి శ్రీ ఆర్.ఎస్.చౌదరి దర్శకులు.

ఈమె కోహినూర్ ఫిలిం కంపెనీ నుండి ఇంపీరియల్ ఫిలిమ్ కంపెనీకి మారారు. ఈ కంపెనీలో మొత్తం 37 సినిమాలు చేశారు. తరువాత ఇంపీరియల్ కంపెనీ నుండి బయటకు వచ్చి కొత్త అవకాశాల కోసం ఎదురు చూశారు. అప్పటికే సినిమా రంగంలో పలుమార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త కొత్త నటీమణులు సినీరంగ ప్రవేశం చేశారు. అందుచేత ఈమెకు గొప్ప అవకాశాలు రాలేదు.

తొలి సినిమా వీర్‌బాలకు నెలకు రూ.500/-లు వేతనం తీసుకున్న ఈమె రూ.5000/-లు తీసుకునే స్థాయికి ఎదిగారు. అప్పటి బొంబాయి గవర్నర్ జీతం కంటే ఈమె పారితోషికం ఎక్కువ. దీనిని బట్టి ఈమె నటనా స్థాయిని, ఆమెకు గల ప్రజాదరణను అర్థం చేసుకోవచ్చు.

1939 నాటి ‘అచ్యుత్’ సినిమా ఈమె కథానాయికగా నటించిన గొప్ప చిత్రాలలో చివరిది. ఉన్నత స్థానంలో ఉండగానే నాయికగా తప్పుకోవాలని ఈమె నిర్ణయించుకున్నారు.

ఈమె మూకీ సినీ హీరో దిన్‌షా బిల్లిమోరియోతో ప్రేమలో పడ్డారు. వీరు జతగా నటించిన సినిమాలు ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ సినిమాలే! వీరి ప్రేమ విఫలమైంది. ఆ తరువాత జీవితంతో పాటు సినీ జీవితంలోను కష్టాలు ఎదుర్కొన్నారు. అప్పటి నుండీ నట జీవితంలో తిరోగమనం మొదలయింది.

1947లో విడుదలయిన దిలీప్ కుమార్, నూర్జహాన్‍లతో కలిసి నటించిన ‘జుగ్ను’ సినిమా నిషేధింపబడింది. వృద్ద ప్రొఫెసర్ పాత్రతో సులోచన నటించిన ప్రేమ సరాగాలు నడిపిన యువతి పాత్ర ప్రేక్షకుల దృష్టిలో ఆమెకు గల ఆదరణను తగ్గించింది. అప్పటి నుండి అప్పుడప్పుడూ సహాయనటి, గుణ చిత్రనటిగా నటించారు. జీవితాలలో సర్దుబాటు తప్పదు కదా.

1930లో తన పేరుతోనే ‘రూబీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థని స్థాపించారు. ఈ సంస్థ పేరు మీదే ‘దో దోస్త్’ చిత్రాన్ని నిర్మించారు.

వివిధ కంపెనీలు ఆమెకు వివిధ రకాల దుస్తులను, బహుమతులను అందించేవి. సినిమా థియేటర్లలో ఆమె పేరు దీపాల వెలుతురులో ధగధగా మెరిసిపోయేది. వివిధ పత్రికలు, సావనీర్లలలో ఈమె గురించిన ప్రకటనలు విరివిగా ప్రచురించబడేవి.

ఒకసారి మహాత్మాగాంధీ ఖాదీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సంఘటనకు సంబంధించి ఒక లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ లఘు చిత్రంలో రూబీ మేయర్స్ ‘మాధురి’ సినిమాలో చేసిన నృత్యాన్ని చేర్చి విడుదల చేశారు. ఈ సంఘటన ఆమెకు ఆ సమయంలో గల ప్రజాదరణను తెలియజేస్తుంది.

ఈమె చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. 1935 నాటికి ధనికవర్గానికి ఒక చిహ్నంగా మారిన Chevrolet కారు సొంతదారు ఈమె. దీనిని బట్టి ఆమె ఆర్థికస్థాయి గురించి మనకు అర్థమవుతుంది.

దర్శకులు డానీ బెనామోషే యురేషియన్లు భారతీయ సినిమాకు చేసిన సేవలను గురించి ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రూబీ మేయర్స్ గురించి ప్రస్తావించి, ప్రశంసించారు.

భారతీయ సినిమాలో ఈమె స్థానం అద్వితీయం. మార్లిన్ డైట్రిచ్ (Marlene Dietrich), గ్రేట్ గార్బో (Greta Garbo) లతో పోల్చగలిగిన స్థాయి ఆమెది.

భారతీయ సినిమాకు ఈమె అందించిన సేవలకు గాను, 1973లో సినిమా రంగపు జీవన సాఫల్యపు పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం’ లభించింది.

సారా మేయర్స్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఈమె పెళ్ళయిన తరువాత శ్రీమతి విజయలక్ష్మీ శ్రేష్ఠగా మారింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భారతీయ వెండితెర మీద గొప్పగా వెలిగిన ఈమె 1983 అక్టోబరు 10వ తేదీన ముంబైలో ఒంటరిగానే జీవిస్తూ మరణించారు.

ఈమె జ్ఞాపకార్థం 2013 మే 3వ తేదీన 5 రూపాయల విలువ గల స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. రెండు అందమైన చిత్రాలతో ముచ్చట గొలుపుతుంది ఈ స్టాంపు. నూరేళ్ళ భారతీయ సినిమా సందర్భంగా విడుదలయిన 50 స్టాంపులలో ఈమెకు స్థానం లభించడం సముచితం.

ది. 10-10-2021 తేదీన ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here