వృద్ధాశ్రమాల రూపకర్త సెయింట్ జీన్ జుగన్

7
11

[dropcap]ఆ[/dropcap]గష్టు 29వ తేదీ జీన్ జుగన్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

పూర్వం మహారాజులు కొడుకులకు రాజ్యభారం అప్పగించి భార్యతో సహా వనాలకు వెళ్ళి వానప్రస్థాశ్రమం స్వీకరించేవారు. సామాన్యులు కూడా వృద్ధులైనాక కుటుంబ బంధాలకు దూరంగా ఏ తోటలోనో, కుటీరాల్లోనో నివశించేవారు.

ఈ రోజుల్లో తమ పిల్లలకు దూరంగా ఉండే వృద్ధుల కోసం వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి పలురకాల వృద్ధాశ్రమాలు నెలవారీ ఫీజు తీసుకునేవి, పేదలకు ఉచితమైనవీ ఉంటున్నాయి. వాటిలో వయసు మళ్ళినవారు తమ జీవిక సాగిస్తున్నారు. అసలీ వృద్ధాశ్రమాలు కట్టాలి అనే ఊహా సంకల్పం చేసి శ్రీకారం చుట్టినవారు ‘సిస్టర్ మేరీ ఆఫ్ క్రాస్’గా పేరు పొందిన సెయింట్ జీన్ జుగన్.

అవి ఫ్రెంచి విప్లవం ఉధృతంగా సాగుతున్న రోజులు. ఆ రోజులలోనే 1792 అక్టోబర్ 15వ తేదీన ఫ్రాన్స్ లోని కాంకేల్ అనే చోట ‘న్యూ ఫౌండ్ ల్యాండ్ – ఫిండింగ్ ఫిషింగ్’ నౌకలో పని చేసే సాధారణ మత్స్యకారుల కుటుంబంలో జన్మించారు జీన్. తల్లిదండ్రులు మేరీ, జోసఫ్. ఆమెకి నాలుగేళ్ళ వయసులో తండ్రి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళి మరణించాడు.

తల్లి ఇళ్ళలో పనులు చేసి పిల్లలను పోషించేది. జీన్ గొర్రెల కాపరి పనిచేసేది. ఉన్ని వస్త్రాలు అల్లడం నేర్చింది. బడికి వెళ్ళే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల తరువాత ‘లేరో సైస్’ లోని హాస్పిటల్‌లో నర్సుగా సేవలందించింది.

17వ శతాబ్దిలో సెయింట్ జాన్ యూడెస్ ‘థర్డ్ ఆర్డర్’ అనే మత సంస్థను స్థాపించారు. ఈ సంస్థకి వెళుతుండేవారామె. ఆ సంస్థ ద్వారా పేదలకు సేవలనందించారు. ఆ సభ్యుల దగ్గర కొద్దిగా చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు. తరువాత కాంకేల్‌కు దూరంగా ధనవంతుల ఇంట్లో సహాయకురాలిలాగా వెళ్ళారు.

1839లో సెయింట్ సెర్ఫాన్‌లో అన్నే చౌవిన్ అనే వృద్ధురాలికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. అన్నే చౌవిన్‌కి పాక్షిక పక్షవాతం కూడా సోకింది. ఇలా వృద్ధులకు సేవ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారావిడ. 1841లో ఒక గదిని అద్దెకు తీసుకుని 12 మంది వృద్ధులకు ఆశ్రయాన్ని కల్పించారు. 1842 నాటికి ఒక శిథిల భవనాన్ని కొన్నారు. ఇందులో 40 మందికి ఆశ్రయాన్నిచ్చారు. ఇలా ఫ్యాంచన్, వర్జీనీ ట్రెడానియల్ అనే ఇద్దరు మిత్రులతో కలిసి ఈ ఆశ్రమాలని నిర్వహించారీమె. ఇవే ‘Little Sisters of the Poor’ గా ప్రాచుర్యం పొందాయి.

ఫ్రాన్స్‌లో ఉత్తమ సేవలను అందించిన వారికి ‘మాంటియాన్ బహుమతి’ని ప్రదానం చేస్తారు. ఈమెను 1845లో ఈ బహుమతి వరించింది.

1846లో రెన్నెస్, దీనాన్‌లలో, 1847లో టూర్స్‌లో, 1850లో యాంగర్స్ మొదలయిన ప్రదేశాలలో సంస్థలను స్థాపించారు. అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో కూడా ఈ సంస్థలు స్థాపించడం మొదలయింది.

సొమ్మొకడిది సోకొకడిది అన్న చందాన ఫాదర్ ‘అబ్బే పైలూర్’ 1843లో ఈమెను ఈ సంస్థ నుండి నిషేధించారు. వ్యవస్థాపకురాలిలా అంగీకరించలేదు. పైలూర్ తనని తాను సుపీరియర్‌గా ప్రకటించుకున్నారు. అయినా జీన్ జుగన్ బాధపడలేదు. సంస్థలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో మమేకమయారు. పూర్తి సహకారమందించారు. ఈ సంస్థ నిర్వహణలో తోటి సిస్టరకు ప్రోత్సాహాన్ని అందించారు. అయితే జీన్ జుగన్ ఈ సంస్థల స్థాపకురాలనే విషయం మరుగునపడింది.

జీన్ తన ‘సిస్టర్ మేరీ ఆఫ్ ది క్రాస్’ పేరుని సార్ధకం చేసుకున్నారు. వివాహ ప్రతిపాదన తీసుకుని వచ్చిన యువ నావికుడితో ఆమె “దేవుడు నన్ను తన కోసం కోరుకుంటున్నాడు. అతను ఇంకా స్థాపించబడని పని కోసం ఇంకా తెలియని పని కోసం నన్ను ఉంచుతున్నాడు” అన్న మాటల పరమార్థం ఈ విధంగా నెరవేరింది.

ప్రస్తుతం ‘లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్’ సంస్థలలో సుమారు 2400 పైనే లిటిల్ సిస్టర్స్ సేవలనందించే పనిలో నిమగ్నమయారు. ఐరోపా, ఉత్తర అమెరికాలోని చాలా దేశాలకు ఈ సంస్థలు వ్యాప్తి చెందాయి. పోప్ లియో XIII ఈ సంస్థలను రాజ్యాంగపరంగా ఆమోదించారు.

1879 ఆగష్టు 29 వ తేదీన ఈమె మరణించారు.

1890 నాటికి అనేక దర్యాప్తులు చేసి ఫాదర్ పైలూర్ మోసాన్ని గ్రహించారు. అపుడు జీన్ ఈ సంస్థ స్థాపకురాలనే విషయాన్ని ధృవీకరించారు.

జీన్ జుగన్, ఫ్రాంకోయిస్ ఆబెర్ట్, వర్జీనీ ట్రెడానియల్ కలిసి కేథలిక్ మతాన్ని బోధించడం కోసం కేథలిక్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రార్థనలు జరిపే అవకాశం కలిగింది.

తను స్థాపించిన సంస్థను వేరే వ్యక్తులు స్వంతం చేసుకున్నా ఆమె నిగూఢంగానే కాలం గడిపారు. ఆమె ఓర్పు, వినయ విధేయతలు అజరామరం. తనను ప్రక్కకి పెట్టిన వారితోనే కలిసి జీవిస్తూ, పేదలకు సేవ చేసి అమరురాలయింది. తను చెప్పిన “దేవుడిని చాలా ప్రేమించండి. అతను చాలా మంచివాడు. మనల్ని మనం అతనికి అప్పగిద్దాం” మాటలని మనసా, వాచా, కర్మణా ఆచరించి చూపించిన ధన్యురాలు.

కలకత్తాకు చెందిన మిస్టర్ అస్ఫర్ మాల్టాలోని సంస్థను సందర్శించారు. ఆయన ఫ్రాన్స్ లోని సంస్థ పెద్దలను సంప్రదించి కలకత్తాలో స్థాపించమని కోరారు. ఆ సంస్థ ప్రతినిధులు కలకత్తాలో స్థాపించారు.

1882 డిశెంబర్ 7వ తేదీ నుండి కుల, మతాలకు అతీతంగా ఈ సంస్థ పేద వృద్ధులకు ఆశ్రయం కల్పించి సేవలు చేయడం ప్రారంభించింది. ఈ సంస్థకి సంబంధించిన శిథిల భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించారు. 1998 నుండీ ఈ భవనంలో 120కి పైగా వృద్ధులు సేవలను పొందుతున్నారు.

1900 సంత్సరం ఏప్రిల్ 30 వ తేదీన బెంగుళూరులో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఇక్కడ నుండి దేశంలోని ఇతర ఆశ్రమాల పని తీరుని సమన్వయం చేస్తుంది. చందాల ద్వారా సంస్థ కార్యకలాపాలను నడుపుతున్నారు. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు.

వృద్ధాప్యంలో వైద్యులు, ఫిజియోథెరపిస్టుల అవసరం చాలా ఉంటుంది. వీరిని నియమించి సేవలను అందిస్తున్నారు.

వినోదాన్ని అందించడం కోసం టెలివిజన్లు, డి.వి.డి ప్లేయర్లు, మినీ సినిమా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దానకర్ణులెందరో ఈ ఆశ్రమాలకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుతున్నారు.

ముఖ్యంగా వివిధ మతాల ఆచారాల ప్రకారం శవపేటికలను అందించడం, అంత్యక్రియలను నిర్వహించడం విశేషం.

ఇటువంటి గొప్ప సేవలకు స్ఫూర్తినిచ్చిన జీన్ జుగన్‌ను 1982 అక్టోబర్ 3వ తేదీన రోమ్ లోని పోప్ జాన్ పాల్ II beatified చేశారు. 2009 అక్టోబర్ 11 వ తేదీన పోన్ బెనెడిక్ట్ XVI సెయింట్‌గా ప్రకటించి గౌరవించారు. ఈ విధంగా ఈమె జీవితం ధన్యమైంది. భారత తపాలాశాఖ, భారత ప్రభుత్వం మొదటి నుండి భారత్‌కి సేవలందించే అవకాశం కల్పించిన వారి జ్ఞాపకార్థం స్టాంపులను విడుదల చేసి గౌరవించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.

ఈ కోవలోనే 2009 అక్టోబర్ 29 వ తేదీన రూ.20/-ల విలువగల స్టాంపును జీన్ జుగన్ జ్ఞాపకార్థం విడుదల చేసింది. ఈ స్టాంపు మీద ఎడమవైపున ఈమె చిత్రం ధ్యానముద్రలో ఉన్నట్లు కనిపిస్తుంది. కుడివైపున ‘Little Sisters of the Poor’ భవనం కనిపిస్తాయి. వివిధ రంగుల మిశ్రితంగా దర్శనమిచ్చే ఈ స్టాంపు ద్వారా ఆమెకు నివాళిని అర్పించింది తపాలాశాఖ.

ఈమె వర్థంతి ఆగష్టు 29వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here