బాపూజీని ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక గురువు ‘శ్రీశ్రీ మా ఆనందమయి’

5
6

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 30వ తేదీ న ‘మా ఆనందమయి’ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

భారతదేశం అనాదిగా ఆధ్యాత్మిక గురువులకు, తత్వవేత్తలకు పెట్టింది పేరు. భారతీయులను వీరి బోధనలతో సుసంపన్నం చేశారు. భారత భూమిని శాంతి ధామం చేశారు. ఇటువంటి వారిలో ఒక గొప్ప గురువు, (అమ్మ) ‘మా’ గా పేరు పొందిన ‘శ్రీశ్రీ మా ఆనందమయి’ ఒకరు.

వీరు 1896వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన ఖెయోరా గ్రామంలో నాటి బెంగాల్ నేటి బంగ్లాదేశ్‌లో జన్మించారు. వీరి అసలు పేరు నీ నిర్మలా సుందరి. వీరి తల్లిదండ్రులు మోక్షదా సుందరీ దేవి, బిపిన్ బిహారి భట్టాచార్యలు. తలిదండ్రులు గాయనీ గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి ఆలపించే వైష్ణవ గీతాలు వీరిని భక్తిపరవశులను చేసేవి. ఖెయోరా, సుల్తాన్‌పూర్‌లో చదివారు. ఊరిలో అందరితోనూ ఆనందంగా గడిపారు.

12 ఏళ్ళ వయసులోనే విక్రమ్‌పూర్‌కు చెందిన రమణీమోహన చక్రవర్తితో వీరి వివాహం జరిగింది. బావగారు రేవతీమోహన్ చక్రవర్తి కుటుంబంతో కలిసి ఈ దంపతులు కొంతకాలం జీవించారు. తరువాత అష్టాగ్రామ్‌కు వెళ్ళి కొంతకాలం అక్కడ జీవించారు.

భర్తను బోలానాథ్ అనేవారు. వీరు ఉద్యోగ నిమిత్తం బాజిత్‌పూర్ వెళ్ళారు. 22 ఏళ్ళ వయసులో 1922లో ఆగష్టు నెల పౌర్ణమి రోజున స్వయంగా దీక్ష తీసుకున్నారు – నీ నిర్మలాసుందరి. భర్త బోలానాథ్ కూడా వీరి నుండి స్వీకరించడం విశేషం. బాజిత్‌పూర్ లోనే కొంతకాలం ఉన్నారు.

దీక్ష స్వీకరించాక సనాతన సంప్రదాయక హిందూమత అంశాలు, యజ్ఞయాగాదులు మొదలైన విషయాలలో విస్తృత జ్ఞానాన్ని సంపాదించారు. బహిరంగంగా కీర్తనలు, భజనలను ఆలపించారు. ఇవన్నీ ప్రజలను ప్రభావితం చేశాయి. వీరికి శిష్యపరంపరను సంపాదించి పెట్టాయి.

జ్యోతిచంద్రరాయ్ వీరి ప్రియ శిష్యుడు. వీరిని ‘మా’ అని సంబోధించేవారు. జ్యోతిచంద్రరాయ్‌ను ‘బైజీ’ అని పిలిచేవారు. 1929లో ‘రమ్నా’ అనే చోట ఆశ్రమాన్ని నిర్మించాడు. ‘మా’ కు తొలి ఆశ్రమం ఇదే! దీనికి ‘రమ్నా కాళీ మందిర్’ అని పేరు పెట్టారు.

‘మా’ భర్త బోలానాథ్ కూడా ‘మా’ ని అమ్మ గానే భావించారు. వారి శిష్యులలో ముఖ్య శిష్యులుగా కర్తవ్య నిర్వహణను కొనసాగించారు.

శ్రీయుతులు ప్రాణగోపాల్ ముఖర్జీ, మహోపాధ్యాయ గోపీనాథ్ కవిరాజ్, త్రిగుణసేన్ వంటి వారితో పాటు ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ ఉదయశంకర్‌లు వీరి శిష్యులుగా వాసి కెక్కడం ముదావహం.

స్వామి వివేకానంద గురువు శ్రీ రామకృష్ణ పరమహంస ఉపదేశాలను శ్రీరామకృష్ణ మిషన్ ద్వారా ప్రచారం చేసి తరించినట్లుగా – మా ఆనందమయి శిష్యురాలు గురుప్రియాదేవి ప్రచార బాధ్యతలను స్వీకరించారు. భారతదేశమంతా విస్తృతంగా పర్యటించి గుర్విణి గారి ఉపదేశాలను ప్రచారం చేశారు. మరో శిష్యుడు కమల్ భట్టాచార్జీ ‘మా’ ప్రసంగాలను రికార్డు చేశారు.

శ్రీ అరవిందో, రమణమహర్షి, పరమహంస యోగానంద, మొదలయిన గురువులతో సమానంగా పేరు ప్రఖ్యాతులను పొందారు.

వీరి శిష్యపరంపరలో భారతదేశంలోని వివిధ మతాల వారికి స్థానం లభించడం విశేషం. జైనులు, బౌద్ధులు, జుడాయిస్టులు, క్రిస్టియన్లు, పార్శీలు, (ముస్లింలు) ఇస్లామీయులు, సిక్కులు, శైవులు, వైష్ణవులు, హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండి వీరి ఉపదేశాలను అనుసరించి జీవితాన్ని గడిపారు. వారివారి పంథాలలో ప్రచారం చేయడం ‘మా’ కు గర్వకారణం.

వీరు అందరిని ఒకే పద్ధతిని అనుసరించమని బోధించలేదు. ప్రతి వ్యక్తి తన స్వభావానికి అనుగుణంగా ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ తన సొంత దృక్కోణంలోనే ఉన్నారని చెప్పేవారు ‘మా’ . ‘అన్ని మార్గాలు నా మార్గాలే, నాకు ప్రత్యేకమైన మార్గం లేదు’ అనే వారు.

తనకు పెద్దగా చదువు లేదని ‘చదువు రాని బిడ్డనని’ స్వయంగా చెప్పుకున్న నిగర్వి ఆమె.

ఆత్మ పరిశీలనం ప్రతి ఒక్కరికీ అవసరమని, నిశ్శబ్దయోగము, ధ్యానము, స్త్రీ, పురుష, కుల, మత, ప్రాంత రహితంగా ఆందరూ ఆచరించవచ్చని మా ఆనందమయి చెప్పారు. వీరిది ప్రేమ సందేశం.

మత గ్రంథాలకు సంబంధించిన పరిశోధనా సంస్థలను స్థాపించారు.

‘మా’ ను వివిధ ప్రాంతల ప్రజలు తమ స్థానిక దేవతల పేర్లతో ఆరాధించడం గొప్ప విశేషం. ఢాకాలో ‘మనుష్ కాళి’, నర్మదాతీరంలో ‘దేవి నర్మదా’, మధురైలో ‘మధుర మీనాక్షి’, సింధీలు ‘జూలేలాల్’, బృందావన్‌లో ‘గౌరంగ’ మొదలగు పేర్లతో వీరు ఆరాదించబడుతున్నారు.

ఈ విధంగా అన్ని ప్రాంతాలు, మతాల ప్రజలు వీరిని అభిమానించి, ఆరాధించారు. వీరిని గురువుగా స్వీకరించి ఉపదేశాలను అనుసరించారు.

తరువాత కాలంలో కార్యక్షేత్రాన్ని ఉత్తరప్రదేశ్ లోని ‘డెహ్రాడూన్’కు మార్చుకున్నారు. 1932 జూన్ 2వ తేదీన బోలానాథ్, ప్రియ శిష్యుడు బైజీలతో కలిసి బయలుదేరారు. దారిలో రాయపూర్ గ్రామంలో కొంతకాలం గడిపారు.

చివరకు డెహ్రాడూన్ చేరుకున్నారు. అక్కడ కాశ్మీరీ కుటుంబాలతో పరిచయం పెంచుకున్నారు. శ్రీహరిరామ్ జోషి అనే భక్తుడు బైజీ అనుచరుడుగా సేవలందించాడు. ఇతను ‘మా’ పట్ల విధేయత పెంచుకోవడమేగాక అన స్నేహితులను ఆమె శిష్యులుగా మార్చారు.

జవహర్‌లాల్ నెహ్రూ భార్య శ్రీమతి కమలానెహ్రూ ‘మా’ ఆనందమయితో గడిపారు. వీరితో జ్ఞాపకాలను జీవితాంతం భద్రపరుచుకున్నారు. కమలానెహ్రూ తన స్నేహితులను స్విట్జర్లాండ్ నుండి భారతదేశానికి ‘మా’ వద్దకు పంపారు.

ఇంకా కమలానెహ్రూ బాపూజీకి కూడా ‘మా’ గురించి తెలియజేశారు. బాపూజీ జమునాలాల్ బజాజ్‌ని ‘మా’ దగ్గరకు పంపారు. తరువాత ‘మా’ వార్ధా నగరంలో బాపూజీని కలిశారు.

‘మా’ వివిధ ప్రదేశాలలో సమావేశాలను నిర్వహించి తన భక్తులను అలరించారు. ఈ సమావేశాల తరువాత బోలానాథ్ భక్తులకు తండ్రిగా (పితాజీ) గా మారారు.

1937లో బైజీ మరణించారు. 1938 మార్చి 7వ తేదీన బోలానాథ్ మరణించారు. భర్తని శిష్యుడిగా స్వీకరించినప్పటికీ అవసరమైనపుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ‘మా’ స్వయంగా ఆయనకి సేవలను అందించారు. ఆయన అంగీకరించడం వల్లనే తను ఈ స్థితిలో ఉండగలిగానని ఆమె విశ్వసించారు.

వీరు 1950లో ‘శ్రీ శ్రీ మా ఆనందమయి సంఘ్’ అనే సంస్థను నెలకొల్పారు. సంస్కృత పాఠశాలలను, వైద్యశాలను నెలకొల్పారు. 1973 నాటికి భారతదేశం మొత్తం మీద 27 ఆశ్రమాలను స్థాపించారు. దేశమంతా తిరుగుతూ ఆధ్యాత్మిక అంశాలను బోధించారు. వీరి ఆఖరి బహిరంగ సభ 1982 జూలై 11వ తేదీన జరిగింది.

తన చివరి రోజులలో కిషన్పూర్ ఆశ్రమంలో భర్త చనిపోయిన ప్రదేశానికి తీసుకుని వెళ్ళమని కోరారు. 1982వ సంవత్సరం ఆగష్టు 27వ తేదీన మరణించారు.

వీరి జీవిత చరిత్రను దీక్షిత్ రచించారు. ఈ నాటికీ వారణాశిలో ‘అమృత్‌వార్తా త్రైమాసిక పత్రిక’ ముద్రణ జరుగుతుంది. ఆంగ్లం, హిందీ, గుజరాతీ, బెంగాలీ భాషలలో ఈ పత్రిక వెలువడుతుంది. హరిద్వార్ లోని శ్రీశ్రీ మా ఆనందమయి సంఘం వార్షిక సమ్యమ్ మహావ్రత్ సమాజాన్ని నిర్వహించడం విశేషం.

దేశమంతటా ‘మహాగురువు’ అని పేరు పొంది, తను పుట్టిన బంగ్లాదేశ్ లోని ముస్లింలతో ‘మా తల్లి’ అని పిలిపించుకున్న అమ్మ ‘మా ఆనందమయి’.

మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వేలాది మంది భక్తులకు తన బోధనలను అందించిన మహమాత ‘శ్రీశ్రీ మా ఆనందమయి’.

వీరి గౌరవార్థం 1987 మే 1వ తేదీన 1 రూపాయి విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. ఈ స్టాంపు మీద ఆధ్యాత్మిక గురువుగా ‘శ్రీ శ్రీ మా ఆనందమయి’ చిత్రం మెరిసే కళ్ళతో దర్శనమిస్తుంది.

ఏప్రిల్ 30వ తేదీ వీరి జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here