ఒకపారి నెక్లస్ కథను పునశ్చరణ చేసుకుందామా!

0
7

[box type=’note’ fontsize=’16’] అప్పటి గయ్ డీ ముపాసాం – ఆ తరవాత విలియమ్ సోమర్సెట్ మామ్‍లు ‘డైమండ్ నెక్లెస్‌’పై వ్రాసిన రెండు కథల గురించి విశ్లేషణ చేస్తూ పాండ్రంకి సుబ్రమణి వ్రాసిన వ్యాసం ఇది. [/box]

[dropcap]సా[/dropcap]హితీ సౌరభాలకు అలవాటు పడ్డ తెలుగు సాహితీ ప్రియులకు అప్పటి మంచి పుస్తకాలు గాని, చదివిన మంచి కధలు గాని గుర్తుకు వస్తే-మనసు గత సౌమ్య సుకుమార యవ్వనపు రోజుల్లోకి వెళ్లిపోకమానదు. మనసూ తనువూ ఊహకు అందని రీతిన ఓలలాడుతాయి. సాహిత్యమంటే ఆపాద మస్తకమూ మనోరంజితమే కదూ!ఆ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఫ్రెంచి రచయిత గయ్ డీ ముప్పాసాంగారు వ్రాసిన ప్రపంచ ప్రసిధ్ధ చిరుకథ- “ది డైమండ్ నెక్లెస్“ చాలా మందికి గుర్తుకి వచ్చే తీరుతుంది. రావాలి కూడాను; శ్రీపాదవారి అత్తరు కథల్లా – రాచకొండవారి వర్షం కథల్లా – పద్మరాజుగారి పడవ ప్రయాణాల్లా- గోర్కీగారి అమ్మతనపు కథానికల్లా — ఇక విషయానికి వస్తాను. అప్పుడు నావి యవ్వనోద్రేకపు రోజులు. స్వస్థలం విజయనగరమైనా ఉద్యోగరీత్యా చెన్నప్పట్నంలో స్థిరపడ్డ రోజులు. అప్పట్లో దాదాపు ప్రముఖ తెలుగు పత్రికలన్నీ-ఆంధ్ర పత్రిక-భారతి-ఆంధ్ర ప్రభ-యువ-జ్యోతి-వంటి వాటితో సహా–సూటిగా చెప్పాలంటే తెలుగు సాహితీ గుభాళింపు తమిళనాట విచ్చుకున్న బ్రహ్మకమలంలా వెల్లివిరిసేది. అప్పుడన్నమాట-నాలో యాగజ్వాలలా సాహితీ కాంక్ష చెలరేగనారంభించింది. ఒక వేపు ఉద్యోగ బాధ్యతలు పెరిగి పోతున్నా ఈ సాహితీ యాగజ్వాల మాత్రం తగ్గుముఖం పట్టలేదు. అటువంటప్పుడన్నమాట – అప్పటి ఆంధ్రప్రభ వార పత్రిక కథా విభాగపు పర్యవేక్షకులు దివంగత బుధ్ధవరపు కామరాజుగారి సలహా ప్రకారం (ఈయన కలం పేరు-తుళికాభూషణ్-గొప్ప కథకులు) మంచి పుస్తకాల కోసం -మంచి కథల కోసం-(అన్ని భాషలవీను) వెతికి తవ్వే వ్యాపకం ఆరంభమైంది. అప్పట్లో మా కేంద్ర ప్రభుత్యోద్యోగులకు శనివారం వారాంతపు సెలవు దినం కాదు. అంచేత ఆదివారం నా వెతుకలాట ఆరంభమయేది. ఎలాగని—లేచిందే లేడి పరుగులా-ఉదయమే ఇంట్లో అల్పాహారం తీసుకుని-మూటా ముల్లెతో తీర్థ యాత్రలకు బయలుదేరినట్టు సాగిపోయేవాడిని. మిక్కిలి పసందైన సాహితీ యాత్ర సుమా! చెప్తే మీకు కూడా ఆసక్తి కలగవచ్చేమో! ఒక్కొక్క వారం ఒక్కొక్కరి వద్దకు—వారాలకు వెళ్ళే పేద విద్యార్థిలా-పెద్దలు బుధ్దవరపు కామరాజుగారి ట్రిప్లికేన్-ప్రసిధ్ధ రచయిత అమంజికరైలో ఉంటూన్న పిలకా గణపతిశాస్త్రి గారింటికి-త్యాగరాయ నగరు జగదాంబ వీథిలో ఉంటూన్న మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారింటికి-ఇలా నగరం నలువైపులా అలుపెరుగని రాకపోకలే-ఆపసోపాలు ఎరగని సాహితీ కుసుమాల చింతనలే–ఇంకా ఎందరెందరో మహాను భావులు! అందరికీ నా వందనములు. మరొక విషయం చెప్పక పోతే అన్యాయం చేసిన వాడినవుతాను; వయసులో బహుదూరపు బాటసారంతటి తేడా ఉన్నా సాహీతీ ఋషి పుంగవులందరూ నాకు టీలు కాఫీలు పానకాలూ ఇచ్చి సత్కరించేవారు-సారీ-ఆదరించేవారు. అప్పుడన్నమాట-సాహితీ ఉద్యమ బాటలో మునిగి తేలుతున్నప్పుడన్నామాట- నాకెదురైన గొప్ప సాహీతీ బంగరు తునక-ఇంగ్లీషులోకి అనువదించబడ్డ ఫ్రెంచి కథ-“ది డై మండ్ నెక్లెస్”. ఈ కధ దాదాపు ప్రతి కథకుడికీ తెలుసు. ఎందుకంటే—ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిధ్ధిగాంచిన కథ. ఐనా-మనలో మనం-మాటా మంతీ చేసుకున్నట్టు రెండు మూడు వాక్యాలలో పునశ్చరణ చేసుకుందాం.

భార్యా భర్తలిద్దరుంటారు. భార్య అందంగా మంచి మంచి అలంకరణలతో ఉండాలని-అందరి ముందూ ఠీవిగా కనిపించాలని తాపత్రయపడుతుంటుంది. కాని భర్తేమో ప్రభుత్య కార్యాలయంలో ఒక మామూలు సిబ్బంది వర్గానికి చెందినవాడు. అవధికి మించిన ఖర్చులు భరించవలసి వచ్చినప్పుడల్లా అందమైన భార్య మనసుని నొప్పించడానికి సాహసించలేక పోతుండేవాడు. అప్పుడొకసారి కార్యాలయ పై అధికారి విందు ఏర్పాటు చేస్తాడు. అందరూ సతీమణులతో తప్పకుండా హాజరవాలన్న నిబంధన. ఆ కబురందుకున్నఇతగాడి భార్యామణి ముఖం చిట్లిస్తుంది. అంత గొప్ప విందుకి బోడి రూపంలో ఎలా వెళ్ళడమని విసుక్కుంటూ పొరుగున ఉన్న ధనవంతురాలి ఇంటికి వెళ్లి ఒక డైమండ్ హారాన్ని అరువు తెచ్చుకుంటుంది. కాని—కటకటా! విందుకి వెళ్ళి ఇంటికి వచ్చి చూసుకునేసరికి మెడన ఆ వజ్రాలహారం ఉండదు. భార్యాభర్తలిద్దరూ బెంబేలు పడిపోతారు. ఎందుకంటే హారం అరువిచ్చినావిడ మోతుబరి వర్గానికి చెందినది. పోలీసు పిర్యాదు గాని ఇస్తే- అంతే సంగతులు మరి! అప్పటి కప్పు డు ఇద్దరూ బలమైన తీర్మానానికి వస్తారు. విషయం పైకి పొక్కక ముందే ఎలాగో ఒకలా ఖర్చుని తగ్గించుకుని అనవసర సుఖాల జోలికి పోకుండా డబ్బుని పొదుపు చేసి కొత్తది కొని ఆ మోతుబరి ధనవంతురాలికి అందచేయాలని. అలాగే చాలా ఖర్చు లను తగ్గించుకోవడంతో బాటు థియేటర్లకు వెళ్ళడం మానుకుంటారు. ఆ రీతిన కూడ బెట్టిన డబ్బుతో అదే డిజైన్‌లో ఉన్న డైమండ్ నెక్లెస్‌ని కొని—తిరిగివ్వటంలో చోటు చేసుకున్న జాప్యానికి వేయి క్షమాపణలు కోరుతూ జరిగిన అసలు విషయాన్ని ఆమె ముందుంచుతారు. అప్పుడామె కోపగించుకోదు సరి కదా-నెత్తిన చేయి పెట్టుకుంటుంది. ఎందుకంటే క్లర్కు భార్యకు ఆమె అరువిచ్చినది అసలైన హారం కాదు. నకిలీది. అసలు హారానికి డూప్లికెట్. అంచేత వాళ్లందించిన అసలు డైమండ్ నెక్లెస్‌ని తిరిగిచ్చేస్తుంది ఆ పెద్దావిడ. ఇదీ కథలోని ముత్యమంతటి ముగింపు!

ఇక మరొక కోణానికి వస్తే-ఇంతటి ఆసక్తికరమైన వైనం ఇంతటితో ముగియకూడదేమో!అంచేత ఇదే డైమండ్ నెక్లెస్ కథ వంటి కథను వ్రాసిన నోబల్ బహుమతి గ్రహీత విలియమ్ సోమర్సెట్ మోమ్ గురించి చెప్పాలి. వృత్తి రీత్యా ఆయన మెడికల్ గ్రాడ్వేట్. ఈయన ఈ కధను ఎందుకు ప్రతి స్పందనగా మరొక కథను వ్రాసారంటే-దాని వలన ప్రేరణ పొంది కాదు—ఓ విధమైన అసహనానికి లోనై వ్రాసారు. ఆ అసహనం ఎందుకు కలిగిందంటే-మోమ్ గారు ఎక్కడికి వెళ్లినా-ఏ సాహితీ సభకు హాజరయినా రచయతలు రచయిత్రుల బృందమంతా గయ్ డీ ముపాస్సాం వ్రాసిన డైమండ్ నెక్లెస్ గురించే ప్రస్తావించేవారు. ఆ కధ విషయమై ఈయన స్పందన కోసం బహు ఆతృతతో ఎదురు చూసేవారు. ఎంత గొప్పకథయితే మాత్రం-ఎప్పుడో వ్రాసిన ఆయన కథ విషయమై ఇలాగా తనను వెంటాడటం!ఇలా లోలోన మథనపడుతూ తను సహితం డైమండ్ నెక్లెస్ కథా వస్తువు పైన ప్రతిస్పందనగా ఒక కథ వ్రాసారు-దాని పేరు-“మిస్టర్ నో-ఆల్” (Mr know all) దీనినాయన కథ రూపంలోనూ వ్రాసారు-దానికి తగ్గట్టు స్క్రిప్ట్ రూపంలోనూ వ్రాసారు. ఒకే కథా వస్తువుపైన రెండు రచనా విధానాలన్నమాట.

ఈ కధంతా విహార నౌకలో పయనిస్తున్నప్పుడు ఆరంభమవుతుంది. అక్కడే పూర్తవుతుంది.

ఇందులోనూ వయ్యారాలతో అలరారే ఒక అందమైన సొగసరి స్త్రీ ఉంటుంది. ఆమె-ఆమె భర్తా ఒక నగల షరాబీకి ఓడ ప్రయాణంలో పరిచయం అవుతారు. ఆ యూదు షరాబీ తనకు అంతా అన్ని విషయాలూ తెలుసన్నట్టు మాడ్లాడుతుంటాడు; అడ్డూ ఆపూ లేకుండా–అంతే కాక-రంగుల రాయిని విలువ కట్టడంలో తనకు మించిన వాడు ఇంగ్లాండు దరిదాపున లేడంటాడు. దానికి ప్రతిస్పందించిన ఆ ఇంగ్లీషతను తన భార్య మెడన ఉన్న డైమండ్ నెక్లెస్ విలువను అంచనా వేసి చెప్పమంటాడు. ఆ సవాల్ ని స్వీకరిస్తూ- “వైనాట్!“అంటూ తన దుర్భిణితో అతడి భార్యను సమీపిస్తాడు. అప్పుడు ఆ సొగసరి స్త్రీ భయకంపితురాలై ఆ యూదు షరాబీకి చూపులతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ చూపులోని భాషను అర్థం చేసుకున్న ఆ మిస్టర్ నో-ఆల్-వెంటనే వెనుకంజ వేస్తాడు. వేస్తూ అంటాడు-“ఔను. ఈసారెందుకో పొరపడ్డాను. నిజమే ఇది విలువలేని మామూలు డైమండ్ హారమే!” అంటూ తొలగి పోతాడు.

నిజానికి ఇక్కడే కథలోని అసలై మలుపు ఉంది. వాస్తవంగా చెప్పాలంటే-ఆ డాబుసరి షరాబీ ఆ సొగసరి స్త్రీని తన భర్త రియాక్షన్ నుండి కాపాడి ఆమె సంసారాన్ని నిలబెడ్తాడు—తనకు తాను స్వేచ్ఛగా ఓటమిని స్వీకరిస్తూ–ఎందుకంటే-అది నిజంగా విలువైన అసలైన హారమే! దానిని ఆమెకు బహుకరించిన వాడు మాత్రం తన భర్త కాదు. అలా బహుమానంగా తనకిచ్చింది వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడు. నా వరకూ ఇది కూడా గయ్ డీ ముప్పాసాం వారి కథకు ఈడైనదేనంటాను. మరి మీరేమంటారో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here