హృదయాన్ని తాకే దాస్యం లక్ష్మయ్య గారి రెండు కవితలు

0
16

[ప్రముఖ కవి, ఉపాధ్యాయులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారి ‘హృదయనది’ కవితా సంపుటిలోని ‘మా ఇంటి వాలుకుర్చీ’, ‘మాయమౌతున్న మనిషి’ కవితలను విశ్లేషిస్తున్నారు నరేంద్ర సందినేని.]

‘మా ఇంటి వాలుకుర్చీ’ కవిత విశ్లేషణ:

‘మా ఇంటి వాలుకుర్చీ’ కవితలోని భావాలు నాకు నచ్చాయి. వీపుని బాగుగా వెనుక ఆనించి కూర్చోవడానికి వీలైనది వాలు కుర్చీ. వాలుకుర్చీలో కూర్చుంటే వెనుక వైపు శరీరానికి విశ్రాంతి కలిగిస్తుంది. మా ఇంటి వాలు కుర్చీలో నాన్న కూర్చుండేవారు. నాన్న వాలుకుర్చీలో కూర్చోవడం వల్ల ఆ కుర్చీకి ఎంతో ఘనత ఏర్పడింది.

‘మా ఇంటి మడత కుర్చీ
అదే తట్టు కుర్చీ
పేరేదైనా మా ఇంటి దర్పం
మా వాలుకుర్చీ’

మా ఇంటిలో మడత కుర్చీ ఉండేది. మా నాన్న మడత కుర్చీలో కూర్చుండే వారు. ఆ కుర్చీని మడత కుర్చీ మరియు తట్టు కుర్చీ అని పిలిచే వారు. మా నాన్న ఆ కుర్చీలో కూర్చుంటే కుర్చీకి అందం వచ్చినట్టుగా ఉండేది. ఆ కుర్చీలో నాన్న కూర్చోవడం వల్ల మా ఇంటి దర్పం పెరిగింది. ఆ కుర్చీలో నాన్న కూర్చుంటాడు కాబట్టి ఆ వాలు కుర్చీకి ఎంతో గౌరవం.

‘వసారాలో వాలుకుర్చీ
కుర్చీపై కండువా ఉంటే
నాయనా ఇంట్లోనే ఉన్నట్టు లెక్క
మా కాళ్లు చడీ చప్పుడు చేయకుండా
వెనుక దర్వాజా గుండా
నట్టింటిలోకి నడిచేవి.’

ఇంటి ముందు ఉండే ఖాళీ ప్రదేశం వసారా.

కండువా లేదా ఉత్తరీయాన్ని పెద్దలు ధరించేవారు. కండువా పెద్దరికానికి హుందాతనానికి చిహ్నంగా ఉండేది.  నాన్న క్రమశిక్షణకు మారు పేరుగా ఉండేవారు. నాన్న ఇంట్లో ఉన్నారంటే అందరూ నిశ్శబ్దంగా ఎవరి పనులు వారు చేసుకునే వారు.  నాన్న ఇంట్లో ఉంటే అందరికీ హడల్ మరియు భయంగా ఉండేది.  నాన్న ఇంట్లో ఉన్నంత సేపు నిశ్శబ్దంగా ఎవరి పనులలో వారు నిమగ్నం అయ్యే వారు. గంభీరమైన నాన్న స్వరం వినగానే భయంతో ఎక్కడి వాళ్ళక్కడ గప్ చుప్ అయ్యే వారు. మా ఇంటి ముందు గల వసారాలో వాలుకుర్చీ వేయబడి ఉండేది. వాలుకుర్చీపై కండువా పరిచి ఉంటే నాయనా ఇంటిలో ఉన్నట్టుగా మాకు తెలిసిపోయేది. ఆటలు ఆడుకుని మేము పెందరాళే ఇంటికి చేరుకోవాలి. ఆలస్యమైతే నాన్న దండించేవారు. అందుకే మా కాళ్ళ శబ్దము కూడా వినిపించకుండా వెనక దర్వాజా గుండా ఇంటిలోనికి నడిచేవారమని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘వాలుకుర్చీ
మా నాన్న కది సుఖాసనం
వాలుకుర్చీకి జనుప వస్త్రం తొడుగు
పొడవాటి చేతులు
పక్కనే ముక్కాలు పీటా
దాని పైన పాన్ దానా.’

సుఖాసనం అనేది సుఖం అనే సంస్కృత పదం నుండి వచ్చింది. సుఖాసనం అర్థం తేలిక, ఇష్టమైన భంగిమ. ఆ రోజుల్లో తమలపాకు పాన్ వేసుకునే వారి ఇంటిలో పాన్ దానా డబ్బా ఉండేది. పాన్ దానా డబ్బాలో సున్నం, బాగం వక్కలు, సోపు, లవంగాలు, యాలకులు, జర్డా, తమలపాకులు ఉండేవి.  వాలుకుర్చీలో నాన్న సుఖాసనంలో కూర్చున్నట్లు ఆనందాన్ని పొందేవారు.

‘మా నాన్న..
ఆ వాలుకుర్చీలో కూర్చునే
పంచాంగం, పురాణాల పఠనం
లెక్క పత్రాలు రాయించుకునే వాళ్ళు
ముహూర్త బలాలు తెలుసుకునే వాళ్ళు
ఆ వాలుకుర్చీ ముందరే
అరుగు నేల పై ఆసనం వేసేవారు.’

తిథి, వార, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదు భాగముల కలయిక పంచాంగం. పంచాంగం దుర్ముహూర్తములు మరియు శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. అవి 1) చాంద్రమాన పంచాంగం. 2) సూర్యమాన పంచాంగం. నాన్న వసారాలో గల వాలు కుర్చీలో కూర్చుని గ్రామంలోని ప్రజలకు జాతకం చూసి పంచాంగంలోని విశేషాలను విడమర్చి చెప్పేవారు. గ్రామస్థులకు పురాణాల్లోని కథలను ఆసక్తి కలిగేలా మనోరంజకంగా విప్పి చెప్పే వారు. పురాణాల్లోని నీతి ఈనాటి సమాజానికి కూడా అనుసరణీయంగా ఉంది. మా గ్రామస్థులకు చదువు రాదు. గ్రామస్థులు చేసే లావాదేవీలకు సంబంధించిన లెక్క పత్రాలు రాయించుకునే వాళ్ళు. గ్రామస్థుల వ్యక్తిగత జాతకాలు చూసి ముహూర్త బలం సరిగా ఉందా లేదా అని నాన్న పంచాంగం చూసి తెలియజేసేవారు. నాన్న వాలుకుర్చీ ముందర గల అరుగు నేలపై ఆసనం వేసిన భంగిమలో కూర్చుండేవారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘నాన్న లేరు
నాన్న ఆనవాలుగా వసారాలో
తట్టు కుర్చీ లేదు
సోఫా సెట్టు ఫైబర్ కుర్చీలు చేరి
పాత కుర్చీని అటకెక్కించాయి.’

నాన్న ఇప్పుడు జీవించి లేరు. నాన్నను కాలం తన వెంట తీసుకుపోయింది. నాన్న లేరు అని చెప్పడానికి హృదయానికి బాధ కలుగుతుంది.  నాన్న ఆనవాలుగా మా ఇంటిలో తట్టు కుర్చీ లేదు అని చెబుతున్నాడు. మా ఇంటి వసారాలో తట్టు కుర్చీ స్థానంలో అధునాతనమైన సోఫా సెట్టు మరియు ఫైబర్ కుర్చీలు అలంకరించాయి. అలనాటి వైభవంగా నాన్న కూర్చుండిన వాలుకుర్చీని అటకెక్కించాయి అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. నాన్న కూర్చుండిన మా ఇంటి వాలుకుర్చీని కవితామయం చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు కవితకు కాదేది అనర్హం అన్న వాక్యం గుర్తుకు వస్తుంది.

~

‘మాయమౌతున్న మనిషి’ కవిత విశ్లేషణ:

మాయమౌతున్న మనిషి కవితను ఆసక్తితో చదివాను. మాయమవుతున్న మనిషి ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలుగవచ్చు. మాయ అనగా వంచన అని అర్థం కూడా ఉన్నది. మాయకు గురి చేయడం, మాయమాటలతో లోబరుచుకోవడం, మోసం చేయడం, ఎల్లెడలా పెచ్చు పెరిగి పోతున్నది. మాయమౌతున్న మనిషి కవితా శీర్షిక ఏమిటి? మనిషి ఎందుకు మాయమవుతున్నాడు? అని మనలో సవాలక్ష సందేహాలు పొడచూపవచ్చు. మాయమవుతున్న మనిషి కవిత గురించిన కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.

‘తరువులా.. నదిలా..
ప్రకృతిలోని అణువణువులా
పరుల కోసం జీవించే ప్రాణిలా
మనిషి కూడా మారితే ఎంత బావుండు!?’

చెట్టు, వృక్షము, మహీరుహము, తరువు. కొమ్మలను ఆకులను కలిగి ఉండేది తరువు. తరువు వల్ల మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. భూమి, నీరు, గాలి, సూర్యుడు మొదలైన వాటి నుండి ఆహారాన్ని గ్రహిస్తూ దీర్ఘకాలం జీవించి ఉండేది తరువు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి నేరుగా కాని పరోక్షంగా కాని ఆహారాన్ని అందించేది చెట్టు. ప్రతి సంవత్సరం చిగురిస్తూ, పుష్పిస్తూ, కాయలు, పండ్లు ఇవి అందిస్తూ ఉంటాయి. చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడుతాయి. ప్రకృతికి అందాలను చేకూర్చడంలోను వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్లు చెట్ల నుండి లభిస్తాయి. మనిషి చెట్టంత ఎదిగాడు అని అంటారు. చెట్లు తదితరాలలో కూడా మనిషిలో ఉన్నట్లే పంచభూతాలు ఉన్నవి అంటారు. వృక్షో రక్షతి రక్షితః చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్థం. మానవాళి మనుగడకు అవసరమైన సంపదలలో వృక్ష రక్షణ ఆవశ్యకతను ఈ వాక్యం తెలియజేస్తుంది. వాతావరణ కాలుష్య నివారణకు,పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యమునకు చెట్టు ఉపయోగపడుతుంది.

వర్షపు నీటి వలన కాని ఎత్తైన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒక దానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో విలీనమవుతాయి. భారతదేశం వివిధ నదులతో కూడి ఉంది. మన దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. మన దేశంలో గంగా, యమున, గోదావరి బ్రహ్మపుత్ర నదులను జీవనదులుగా చెబుతారు.

 ప్రకృతి సృష్టికి కారణమైన శాశ్వతమైన ఒక అంశం. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే మనం కళ్ళతో చూడగలిగేది, మనసుతో భావించేది, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం. ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు.అవి ప్రకృతి, పురుషుడు.ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. ప్రకృతి అనేది ఒక స్వాభావిక పాత్ర లేదా రాజ్యాంగం, ముఖ్యంగా పర్యావరణ గోళం లేదా మొత్తం విశ్వం. ప్రకృతి అనేది జీవితంతో సహ భౌతిక ప్రపంచం యొక్క చట్టాల అంశాలు మరియు దృగ్విషయాలను సూచిస్తుంది. ప్రకృతికి అందాలు చేకూరుస్తున్న చెట్లు, ప్రాణి కోటికి నీరు అందిస్తున్న నదులు. ప్రకృతిలోని అణువణువు మానవాళి సుఖ సంతోషాల కొరకు ఉపయోగపడతాయి. పరుల కోసం జీవించే ప్రాణుల వలె విశాల విశ్వంలో జీవిస్తున్న మనిషి కూడా పరోపకారం అనే గుణాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే పరోపకారార్థం ఇదం శరీరం అనే వాక్యానికి సార్థకత చేకూరుతుంది. మనిషి ప్రకృతి వలె మారితే ఎంత బావుంటుంది అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది. మనిషి మారితే సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘విధి విధానాలు పక్కనబెట్టి
విరించి రాతలనే వెక్కిరించి
మతిమాలిన చేష్టలతో
మసకబారుతున్న మనిషితనం.’

తప్పకుండా జరగబోవు సంఘటనను విధి అని చెప్పవచ్చు. విధి నిర్వహణలో అలసత్వం పనికి రాదు అంటారు. మన విధిని ఎవరు మార్చలేరు అంటారు. నైతిక, మతపరమైన లేదా భావోద్వేగ కారణాల వల్ల మెజారిటీ ప్రజలు సరి అయిన మరియు ముఖ్యమైనదిగా భావించే మంచి ప్రవర్తన కోసం ఏర్పాటు చేసుకొన్న ఒక నియమం లేదా నియమాల సమితిని చట్టం అంటారు. మనలో ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం చేయవలసిన విధి ఉంటుంది. విధిని ప్రతి ఒక్కరు అనుసరించాలి. ఏదైనా చేయడానికి అధికారిక లేదా ఆమోదించబడిన మార్గమైన చర్యల సమితిని విధానం అంటారు. ఎల్లప్పుడు సరైన విధానాన్ని అనుసరించాలి. చేయవలసిన విధానంకు గడువు కూడా ఉంటుంది. విధాన నిర్ణయాలు తరచుగా వనరుల కేటాయింపులతో ప్రతిబింబిస్తాయి. వివిధ రంగాలలోని విధానాల ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. విరించి అనగా బ్రహ్మ. బ్రహ్మ మనుషుల రాతను లిఖిస్తాడు అని అంటారు.ఈ లోకంలో జీవించే మనిషి నెరవేర్చవలసిన విధ్యుక్త కర్మలను, తాను చేయవలసిన విధి విధానాలను సక్రమంగా నిర్వర్తించాలి. మనిషి తనను సృష్టించిన బ్రహ్మ రాసిన రాతలను తూలనాడుతూ పరిహాసం చేసి వెక్కిరిస్తున్నాడు. మనిషికి ఏమైంది? మనిషి ఎందు కోసం వింతగా, విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. మతి తప్పిన వాడి చేతిలో రాయి ఎవరికి తగులుతుందో తెలియదు. మనిషి తన చేష్టల ద్వారా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు. మనిషి ఉన్మాదిగా మారి తనలోని మనిషితనం కోల్పోతున్నాడు. మనిషి మనిషి వలె మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. మనిషి మనిషి వలె జీవించాలి. మనిషి సాటి మనిషిని బాధకు గురి చేయకూడదు. మనిషి సాటి మనిషిని గౌరవించాలి, ప్రేమించాలి. మనిషి మనిషితనం కోల్పోతే మానవత్వానికి చోటు ఉండదు. మనం నివసిస్తున్న సమాజంలో అశాంతి చోటు చేసుకుంది. మనిషి మనిషితనం కోల్పోయినాడు. మనిషి వికృత రూపం దాల్చినాడు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘తీరం దాటిన తుఫానులా
బతుకులన్నీ కకావికలం
బహుముఖాలైన విచ్చలవిడిలో
అంటీ ముట్టని వ్యవహారాలు.’

తుఫాన్ అనగా తీవ్రమైన గాలివాన ఆంగ్లంలో Storm అని అర్థం. సాధారణంగా ప్రకృతిలో అనేక మార్పుల వల్ల తుఫాన్లు వస్తుంటాయి. వాతావరణ ప్రభావం వల్ల తుఫాను ఏర్పడుతుంది. తుఫాను సృష్టించే బీభత్సం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా క్రమేణా వాయుగుండంగా మారి తుఫాను తీవ్ర రూపం దాల్చుతుంది. తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు పడుతుంటాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతాయి. విపరీతమైన గాలులు వీయడంతో కట్టడాలు నేలమట్టమవుతాయి. తుఫాను అంటే ప్రజలు భయంతో వణికి పోతుంటారు. సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుఫాన్ భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్నే తీరాన్ని తాకడం అంటారు. తుఫాన్ తీరాన్ని తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. తీరం దాటిన తుఫాన్ ప్రభావం వల్ల ప్రజల ఆస్తులకు తీరని నష్టం, ఇండ్లు కూలిపోవడం, పంటలు మునిగిపోవడం, పశువులు మృతి చెందడం, ప్రియమైన ఆత్మీయులను కోల్పోవడం వల్ల బతుకులన్నీ చల్లాచెదురుగా అయినాయి. బహుముఖాలైన మనుషుల విచ్చలవిడితనం వల్ల అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు అన్నింటా పెరిగిపోయినాయి. మనుషులు ఏం చేస్తున్నారో, ఎట్లా ప్రవర్తిస్తున్నారో అంతు పట్టకుండా ఉంది.

మనుషుల ఆంటీ ముట్టని వ్యవహారాల వల్ల సమాజంలో కలతలు చెలరేగుతున్నాయి. మనుషుల మధ్య కక్షలు, కార్పణ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనుషులు విచ్చలవిడితనం వల్ల ఎవరు ఎవరిని పట్టించుకోనితనం పెరిగిపోతున్నది. మంచి, చెడుల విచక్షణను తెలుసుకొని మానవత్వంతో మెలగాలి అని చెప్పిన తీరు బాగుంది.

‘బంధువులే రాబందులై
ఓదార్పులో వాడి శరాలై
పెద్దరికాల ముసుగు కప్పుకొని
నగుబాటు చేస్తున్న వైనం.’

బంధువులు అనగా రక్తసంబంధం కలిగిన మానవులు. మన సమాజంలో సాధారణంగా వ్యక్తికి గాని కుటుంబమునకు గాని మరి యొక వ్యక్తితో గాని కుటుంబంతో గాని ఆ రక్తసంబంధం కలిగిన వారందరిని బంధువులుగా గుర్తిస్తారు. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వస్తారు అని సుమతీ శతకంలో పద్యం ఉంది. దుఃఖంలో ఉన్న వారికి ధైర్యం చెప్పుట ఓదార్పు. మన సమాజంలో బంధువులు సఖ్యతగా మెలగడం లేదు. రాబందులు చనిపోయిన శవాలను మాత్రమే పీక్కు తింటాయి. బంధువులు ఈర్ష్య, అసూయలతో ప్రవర్తిస్తున్నారు. రాబందులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి అని అంటారు. మన సమాజంలో బంధువుల ప్రవర్తన విడ్డూరంగా ఉంది. రాబందుల వలె బంధువులు బతికున్న మనుషులను పీక్కు తింటున్నారు. కష్టసుఖాలను పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనానికి పూర్వం చోటు ఉండేది కాదు. ఒక తీరుగా మంచిగా బతికిన రోజుల్లో బంధువులు వచ్చి ఏనాడు పలకరించ లేదు. కష్టాలు చుట్టు ముట్టి గాయాల పాలై పీకల్లోతు బాధల్లో మునిగి ఉన్నప్పుడు బంధువులు వచ్చి ఓదార్పు పేరుతో బాణాలలాంటి మాటలు మాట్లాడుతున్నారు. బంధువులు లోలోపల ఆనందిస్తూ పైకి మాత్రం సానుభూతి ప్రకటిస్తూ మాట్లాడుతున్నారు. బంధువుల మాటలు శరీరానికి కలిగిన గాయం కంటే మానసికంగా ఇంకా ఎక్కువగా కుంగిపోయేలా చేస్తున్నారు.పెద్దరికం ముసుగు కప్పుకొని వచ్చి ములుకులు లాంటి మాటలు మాట్లాడుతూ పరిహాసం చేస్తున్నారు. సమాజంలో మనుషుల వింత విడ్డూర ప్రవర్తన బాధను కలిగిస్తుంది. ప్రేమగా ఉండాల్సిన బంధువులు ప్రేమ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. బంధువులు రాబందుల వలె బతికున్న మనుషులను శవాలుగా మారేటట్లు చేస్తున్న దుస్థితి కనిపిస్తున్నది. ఓదార్పు పేరిట బంధువులు వచ్చి మనసు బాధ కలిగేటట్టుగా మాట్లాడుతున్నారు. పెద్దలు పెద్దరికంగా వ్యవహరించడం లేదు. పెద్దరికం పేరుతో బాధలో ఉన్న వాళ్లను ఇంకా బాధల్లోకి నెట్టేసే ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘మనం కాని బతుకు బతుకుతూ
పరుల సొమ్ము కై పాకులాడుతూ
పాకుడు రాళ్లపైనే మనిషి
దినదినం పతనమవుతున్నాడు.’

మనం మన కోసమే బతుకును కొనసాగించాలి. ఈనాడు మనుషులు మనం కాని బతుకులు గడుపుతున్నారు. ఈనాటి మనుషులు మనం కాని బతుకులు బతుకుతు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఈనాటి మనుషులు వివేకం మర్చిపోయి పరుల సొమ్ముకై పాకులాడుతున్నారు. మనుషులు పరుల సొమ్మును పాపంగా భావించాలి. మనుషులు పరుల సొమ్మును తినకూడదు అనే పవిత్రమైన వాక్కులు మర్చిపోయినారు. మనిషి పాకుడు రాళ్లపై ఎక్కితే కిందకు జారిపడతాం అనే సత్యాన్ని మర్చిపోయినాడు. మనిషి ఎందుకో పాకుడు రాళ్లపైన ఎక్కి కిందకు జారుతూ దినదినం పతనమవుతున్నాడు అనే సందేశంతో కూడుకున్న కవితలోని భావనలు అద్భుతంగా ఉన్నాయి. కవిత పాఠకుల మనసులను ఆలోచింప జేస్తుంది.కవి లక్ష్మయ్య మాయమవుతున్న మనిషి చక్కటి కవితగా రూపుదిద్దుకుంది. సమాజంలో మృగ్యమైపోతున్న మానవతా విలువలను తట్టి లేపేటట్లుగా ఉంది. కవి లక్ష్మయ్య మరిన్ని మంచి కవితా సుమాలను విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


శ్రీ దాస్యం లక్ష్మయ్య 25-07-1963న జన్మించారు. వీరు వీణవంక గ్రామం,కరీంనగర్ జిల్లాకు చెందినవారు. వీరి తల్లిదండ్రులు సీతమ్మ, నరహరి. నరహరిగారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసినారు. లక్ష్మయ్య వీణవంక, మందమర్రి, రామకృష్ణాపూర్, మంచిర్యాల, జమ్మికుంట లలో విద్యాభ్యాసం కొనసాగించారు. లక్ష్మయ్య ఎం,ఏ. బి.ఇడీ.చదివారు. 02-12-1998 రోజున మంథని మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డారు.

24-06-1988న లక్ష్మయ్య వివాహం గోదాదేవితో హుస్నాబాద్ గ్రామంలో జరిగింది. లక్ష్మయ్య గోదాదేవి దంపతులకు ఒక్కడే సంతానం. కుమారుడు హరీష్, భార్య భావన. హరీష్, భావన దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా హైదరాబాదులో పనిచేస్తున్నారు. హరీష్ భావన దంపతులకు ఒక్కడే సంతానం. పేరు: త్రిలోక్ మోక్షిత్.

లక్ష్యయ్య 1983 నుండి 1998 వరకు గోదావరిఖనిలో జర్నలిస్టుగా పనిచేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1983 సంవత్సరంలో సాంస్కృతి సమాఖ్య కరీంనగర్ జిల్లా వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. 1984 సంవత్సరంలో ఉదయ సాహితీ కార్యదర్శిగా పనిచేశారు. 2002 – 2004 వరకు హుస్నాబాద్ నూతన సాహితీ సంస్థ, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినారు. 2004 నుండి ఉదయ సాహితీ సంస్థ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పని చేయుచున్నారు. 2024 సంవత్సరంలో ఉదయ సాహితీ సంస్థ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడ్డారు.

కవి లక్ష్మయ్య ముద్రించిన పుస్తకాల వివరాలు:

భావ చిత్రాలు (మినీ కవితా సంపుటి 1982), తండ్లాట (కవిత్వం 2002), బుర్క పిట్టలు (నానీల సంపుటి 2006), డాక్టర్ టి. శ్రీరంగస్వామి నీల మోహనాష్టకం – ఒక పరిశీలన (2014), మనసా (రీతి శతకం 2016), బిజుగీరు శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్ర మహత్యం (2017), శ్రీ దాస్యం లక్ష్మయ్య కథలు (2017), గునుక పువ్వు (కవిత్వం 2017), కనురెప్పల సవ్వడి (కవిత్వం 2020).

కవి లక్ష్మయ్య సంపాదకత్వం వహించిన గ్రంథాల వివరాలు:

బ్యాలెట్.. బ్యాలెట్.. (కవిత్వం, ఏప్రిల్ 2004), బాల్యం (కవిత్వం, జూన్ 2004), అమ్మంటే.. (కవిత్వం, సెప్టెంబర్ 2004), ఉదయ కిరణాలు (కవిత్వం, ఏప్రిల్ 2005), బతుకమ్మా.. బ్రతుకు (కవిత్వం, డిసెంబర్ 2004), ఆకాశంలో సగం (కవిత్వం జూన్ 2006), చెలిమి (కవిత్వం, అక్టోబర్ 2006), వసంత రాగాలు (కవిత్వం, ఏప్రిల్ 2007), గురువు (కవిత్వం, ఏప్రిల్ 2011), సహచరి (కవిత్వం, సెప్టెంబర్ 2013), ముదిమి (కవిత్వం, జూలై 2016), వివాహ బంధం (కవిత్వం మార్చి 2020), వైరాగ్యం ప్రభాకర్ అభినందన సంచిక (2021), ఆనందాల హరివిల్లు ఆత్మీయ సమ్మేళనం ప్రత్యేక సంచిక (నవంబర్ 2022), పాటల పూదోట గేయ సంకలనం (జూన్ 2023), మన కథలు (కథల సంకలనం జూలై 2023), కవితా కాంచనం (చిత్ర కవితా సంకలనం నవంబర్ 2023), నేటి కవిత డైరెక్టరీ (డిసెంబర్ 2023).

కవి లక్ష్మయ్య సహ సంపాదకత్వం వహించిన గ్రంథాలు:

1) నూతన – 2001.

2) సీమాంట కవిత్వం – 2003.

3) కరువు కవిత్వం – 2003.

కవి లక్ష్మయ్య అందుకున్న అవార్డులు, సత్కారాలు:

శ్రీ లక్ష్మయ్య పలు కవి సమ్మేళనాలలో పాల్గొని తమ కవితలను వినిపించి సత్కారాలు, ప్రశంసా పత్రాలు పొందారు. కవిత, కథా ప్రక్రియలలో పలు పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతుతో పాటు ఎన్నో బహుమతులు పొందారు. వివిధ సంస్థలు ఉగాది పురస్కారాలు అందజేశాయి. వీరికి లభించిన అనేక పురస్కారాలలో – ఇరువెంటి కృష్ణమూర్తి స్మారక సాహిత్య అవార్డు, ఆత్మబంధువు అవార్డు, సీనియర్ సిటిజన్ వాణి పురస్కారం, ఐతా భారతి చంద్రయ్య సాంప్రదాయ కథా పురస్కారం – వంటివి ముఖ్యమైనవి. కవితా భాస్కర, కవితా యశోభూషణ బిరుదులు లభించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here