ఉషా మెహతా – కాంగ్రెస్ సీక్రెట్ రేడియో

8
8

[dropcap]ఆ[/dropcap]గష్టు 11 ఉషా మెహతా గారి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేక మహిళామణిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. మన స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నో మహోజ్వల ఘట్టాలు కనిపిస్తాయి. పోరాటం వివిధ పద్ధతులలో అంటే హింసాత్మకంగా, యుద్ధ నేపథ్యంలో, అహింసాత్మకంగా జరిగింది.

కాని రహస్య రేడియో కార్యక్రమాల ద్వారా జాతీయ పోరాట గాథలను ప్రసారం చేసి, ప్రజలను జాగృతపరచిన మహిళాశిరోమణి ఆమె. ట్రాన్స్‌మిషన్ వ్యవహారాన్ని బ్రిటీష్‌వారు పసికడతారనే భయంతో ఎప్పటికప్పుడు ట్రాన్స్‌మిటర్‌ను వివిధ ప్రదేశాలకు మార్చేవారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత గాంధీయిజం గురించి పరిశోధన చేశారు. ఆ విషయాలను బొంబాయి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు ప్రొఫెసర్ హోదాలో బోధించారు. ‘తామందరం కలలు కన్న స్వరాజ్యం ఇది కాద’ని ముక్కుసూటిగా చెప్పేవారు. ఆమె ఉషా మెహతా!

ఈమె నాటి బొంబాయి ప్రెసిడెన్సీ (నేటి గుజరాత్) లోని సూరత్ దగ్గర గల సరస్ గ్రామంలో జన్మించారు. ఈమె తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో న్యాయవాదిగా పనిచేశారు. బ్రిటిష్ వారికి విధేయుడయిన ఆయన స్వాతంత్ర్య పోరాటాన్ని సమ్మతించేవారు కాదు. కాని ఇటువంటి కుటుంబంలో పుట్టిన ఉష జాతీయ పోరాటంలో పాల్గొనడం, చరిత్ర సృష్టించడం గొప్ప విశేషమే!

ఈమె అహమ్మదాబాద్ వెళ్ళి గాంధీజీ ఆశ్రమాన్ని దర్శించింది. అక్కడ ఆయనని చూసి మాటలు విని స్ఫూర్తిని పొందింది. ఆ తరువాత గాంధీజీ శిబిరాలకు వెళ్ళి ఉపన్యాసాలను వినేది. నూలు వడకడం కూడా నేర్చుకుందా బాలిక. ఎనిమిదేళ్ళ వయస్సులోనే ‘సైమన్ కమిషన్’కు వ్యతిరేకంగా ‘సైమన్ గో బ్యాక్’ అంటూ నినాదాల నిచ్చింది. ఈమె తండ్రి పదవీ విరమణ చేసిన తరువాత బొంబాయికి తరలి వెళ్ళిందా కుటుంబం.

బొంబాయిలోని చందరామ్‌జీ స్కూల్‌లో, విల్సన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. వేదాంత శాస్త్రం, న్యాయశాస్త్రంలను అభ్యసించారు. సమాంతరంగా స్వాతంత్ర్యోద్యమంలోను పాల్గొని, ఉద్యమ పంథాను అవగాహన చేసుకున్నారు. ఈమెకు ఈ రేడియో నిర్వహాణలో విఠల్ బాయ్ ఝవేరి, చంద్రకాంత ఝవేరి, బాబూ భాయ్ ఠక్కర్, నాంకా మోత్వాని, రామమనోహర లోహియా, అచ్యుత రావు పట్వర్ధన్ వంటి నాయకులు సహకరించారు. వీరందరూ సాంకేతిక సహాయాన్ని, వివిధ ప్రదేశాలకు ట్రాన్స్‌మిటర్లను మార్చే పనిలోనూ సాయం చేశారు. ఈ విధంగా ఈమె నేతృత్వంలో, అనేక మంది యువనాయకుల సాయంతో ‘కాంగ్రెస్ రేడియో’ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.

1942 ఆగష్టు నెలలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రకటించింది కాంగ్రెస్. దేశమంతా క్విట్ ఇండియా ఉద్యమానికి స్పందించారు. గాంధీజీ (చేయండి లేదా చావండి) ‘డూ ఆర్ డై’ అని పిలుపును అందించారు. బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద నాయకులందరినీ జైళ్ళలో బంధించింది. 1942 ఆగష్టు 9వ తేదీన బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో వేలాది మంది భారతీయులు సమావేశమయ్యారు. అరుణా అసఫాలీ ఈ మైదానంలో జెండా ఎగురవేసి ‘క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా’గా చరిత్రలో నిలిచారు.

ముఖ్య జాతీయ నాయకులందరూ జైళ్ళలో బందీలు అవడంతో మిగిలిన నాయకులు తమ తమ పంథాలలో పోరాట మార్గాలను ఎంపిక చేసుకున్నారు.

ఇటువంటి పరిస్థితులలో ఉష తమ మిత్రులతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించారు. అదే రహస్య కాంగ్రెస్ రేడియో. 1942 ఆగష్టు 9వ తేదీన రేడియో కార్యక్రమాలకి రూపకల్పన చేశారు. ఈమె 1942 ఆగష్టు 27వ తేదీన “ఇది భారతదేశంలో ఏదో ఒక ప్రదేశం నుండి 42.34 మీటర్ల తరంగ దైర్ఘ్యంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ రేడియో” అని ప్రకటించారు.

ఈ రేడియో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దేశంలోని వివిధ ప్రదేశాలలో జరిగిన జాతీయోద్యమ సంఘటనలను ప్రసారం చేసేది. 71 రోజులపాటు కొనసాగాయి. చివరకు 1942 నవంబర్ 12వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం ఈ రేడియో నిర్వాహకులను అరెస్టు చేసింది.

ఉషా మెహతాను కూడా అరెస్టు చేసి పూనాలోని ఎరవాడ జైలులో బంధించారు. ఈమె జైలులో అనారోగ్యం పాలయ్యారు.

భారత స్వాతంత్ర్యానికి సంబధించిన ప్రతిపాదనలు అమలు జరిగాయి 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది. ఈమెను తొలి రాజకీయ ఖైదీగా విడుదల చేసింది ఆ ప్రభుత్వం.

1947లో స్వాతంత్ర్యం లభించిన తరువాత ఈమె చదువును కొనసాగించారు, గాంధీజీ సిద్ధాంతాలను గురించి పరిశోధన చేసి డాక్టరేట్‌ను పొందారు. 1980 వరకు బొంబాయి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు.

గాంధీ స్మారక నిధి ట్రస్టు అధ్యక్షురాలిగా, గాంధీ పీస్ ఫౌండేషన్, న్యూఢిల్లీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. భారతీయ విద్యాభవన్ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్నారు. గాంధీ గారి దగ్గర ప్రమాణం చేసినట్లు జీవితాంతం ఖద్దరునే ధరించారామె.

ఆమె తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తపరిచారు. “ఖచ్చితంగా ఇది మనం పోరాడిన స్వాతంత్ర్యం కాదు. ఇప్పటికీ ఇది మన కలల భారతదేశం కాదు” అని చెప్పిన ఆమే, అభివృద్ధిని గురించి మెచ్చుకున్నారు. “భారతదేశం ప్రజాస్వామ్యంగా మనుగడ సాగించి అభివృద్ధిని శ్రామిక పునాదిని సాధించింది” అని చెప్పి తన మనోనైర్మల్యతను చాటుకున్నారు.

భారత ప్రభుత్వం ఆమె సేవలకు ప్రతిఫలంగా 1998లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించి గౌరవించింది.

2000 సంవత్సరం ఆగష్టు 9వ తేదీన బొంబాయిలోని క్విట్ ఇండియా ఉత్సవాలలో అనారోగ్యాన్ని లెక్కచేయకుండా పాల్గొన్నారు.

2000 ఆగష్టు 11వ తేదీన సాధారణ జ్వరంతో మరణించారు.

భారత జాతీయ కాంగ్రెస్ సీక్రెట్ రేడియో వాయిస్ ఆమె. ఉషా మెహతా అంటేనే సీక్రెట్ రేడియోకి ప్రత్యామ్నాయంగా ప్రజల హృదయాలలో నిలిచి – మనందరి హృదయాలలోను నిలిచారామె.

ఈమె వర్థంతి ఆగష్టు 11 సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here