సంగీత విదుషీమణి వీణ ధనమ్మాళ్

5
10

[dropcap]ది.[/dropcap] 15-10-2021 తేదీన శ్రీమతి వీణ ధనమ్మాళ్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

20వ శతాబ్ది తొలి రోజులలో అన్ని రంగాలలో దాదాపు పురుషులే రాజ్యమేలేవారు. సంగీత ప్రపంచం కూడా అంతే! అటువంటి పరిస్థితులలో కర్నాటక, హిందుస్థానీ సంగీత రంగాలలో, వీణావాదనంలో మేటిగా నిలిచి రెండు రంగాల సంగీత కళాకారులతో సన్నిహితంగా మెలిగిన విదుషీమణి, తరతరాలుగా కళాకారుల ఇంటిబిడ్డ, చివరిలో అంధురాలయినా స్వరమధురిమలు తగ్గని గాన కోకిల, తన కచేరీకి అంతరాయం కలిగించిన వారెంతటి వారయినా లెక్క చేయక హఠాత్తుగా ముగించే ధైర్యం గల మహిళా శిరోమణి వీణ ధనమ్మాళ్.

ఈమె 1867 సంవత్సరంలో నాటి మదరాసు ప్రెసిడెన్సీలోని చెన్నపట్టణంలోని జార్జిటౌన్‌లో జన్మించారు. ఈమె పుట్టిన తేదీ గురించి వివాదాలున్నాయి. అయితే THE HINDU వారు ఈమె 150వ జయంతి వేడుకలను గురించి వ్రాసిన అంశంలో (3 ఆగష్టు 2017వ తేదీ పత్రికలో) 18 ఆగష్టు 1867న పుట్టినరోజని ప్రస్తావించారు.

ఈమె కుటుంబీకులు 6 తరాల పాటు కళలను పరంపరగా తంజావూరు సంస్థానంలో ప్రదర్శించేవారు. ఈమె తల్లి సుందరమ్మాళ్, అమ్మమ్మ కామాక్షి సంగీత విద్వాంసులు. ఇంకా ముందుకు వెళితే 17వ శతాబ్ది నుండి పాపమ్మాళ్, ఆమె కుమార్తె రుక్మిణి, ఈమె కుమార్తె కామాక్షి, ఈమె కుమార్తె సుందరమ్మాళ్ అందరూ సంగీత నాట్యాలలో పేరు పొందిన కళాకారిణులే!

అంతమంది పూర్వీకుల వారసత్వం ఈమె కృషికి తోడయింది. ఈమెకు కర్నాటక సంగీతాన్ని ఆలంబనగా అందించింది. ముఖ్యంగా వీణా వాదనంతో ఈమె జీవితం పూర్తిగా అంకితమయింది కాబట్టి ‘వీణ ధనమ్మాళ్’ గా పేరు పొందారు.

ఈమెకు అమ్మ, అమ్మమ్మ తొలి గురువులు. శ్యామశాస్త్రి మనవడు అన్నస్వామిశాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. కృష్ణ అయ్యర్, వైధీశ్వరన్ కోయిల్, సుబ్బరామ అయ్యర్ల వద్ద కీర్తనలు, తమిళపదాలు, సత్తనూర్ పంచనాథ అయ్యర్ దగ్గర త్యాగరాజస్వామి కీర్తనలు, తమిళపదాలు, సత్తనూర్ పంచ అయ్యర్ దగ్గర ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు నేర్చుకున్నారు. వాలాజ్ పేట బాలకృష్ణదాస్ నాయుడు అనే అంధ, ఆంధ్ర గురువు దగ్గర క్షేత్రయ్య మువ్వగోపాల పదాలను నేర్చుకున్నారు. ఈ విధంగా వివిధ సంకీర్తనాచార్యుల కీర్తనలు, సంకీర్తనలు, పదాలను అభ్యసించి కచ్చేరీలు చేసే స్థాయికి ఎదిగారు.

1895లో చెన్నపట్టణ కచేరి హాల్‌లో సంగీత కచేరీ చేసిన తొలి మహిళా సంగీత కళాకారిణిగా రికార్డు సృష్టించారు.

మద్రాసులో ఆకాశవాణి కేంద్రాన్ని ప్రారంభించక ముందు మద్రాసు మున్సిపాలిటీ కేంద్రం ఉండేది. ఈమె తన గానామృతాన్ని ఈ కేంద్రం ద్వారా శ్రోతలకి అందించారు.

చెన్నై కాంగ్రెస్ సమావేశంలో కచేరీ చేశారు. 1916లో బరోడా సంస్థానంలో అఖిల భారత సంగీత కచేరీలలో ప్రదర్శన చేసే అవకాశం లభించింది. బరోడా, మైసూరు, విజయనగరం వంటి సంస్థానాధీశులు, రాజాస్థానములలో అనేక కచ్చేరీలు ఇచ్చారు. పద్మనాభపురం రాజభవనంలో ఈమె కచేరి చేశారు.

ఈమెకు హిందుస్థానీ సంగీతం పట్ల కూడా మక్కువ ఎక్కువ. కాశీ వెళ్ళిన సమయంలో రహమద్ ఖాన్ కచేరీలను చూశారు. గౌహర్‌జాన్, నవాబ్ ఆలీఖాన్, అబ్దుల్ కరీంఖాన్ కచేరీలను విన్నారు. ఈ ముగ్గురితోను ఈమెకు సత్సంబంధాలున్నాయి.

అబ్దుల్ కరీంఖాన్, ధనమ్మాళ్ లకు ఒకరిపట్ల ఒకరికి గౌరవం, అభిమానం, ఆత్మీయతానుబంధం ఉన్నాయి. కరీంఖాన్ కచేరీల గురించిన యాత్రలలో భాగంగా ప్రయాణాలు చేశారు. ఆ సమయంలో ధనమ్మాళ్ చెన్నపట్టణంలో చేసిన కచేరీని ఆస్వాదించారు. తరువాత తన దగ్గరున్న డబ్బంతా ఆమెకి ఇచ్చేశారు.

ఈ విధంగానే కరీంఖాన్ హిందుస్థానీ కచేరీని చూసిన తరువాత వీణ ధనమ్మాళ్ తన దగ్గరున్న డబ్బంతా ఆయనకు ఇచ్చి ఋణం తీర్చుకున్నారు. కరీంఖాన్ కిరానా ఘరానాలో పేరు పొందిన గాయకులు. ఆయన కొంతకాలం కచేరీ కోసం చెన్న పట్టణంలో ఉన్నారు.

కలకత్తాకు చెందిన ప్రముఖ హిందుస్థానీ గాయనీమణి గౌహర్ జాన్, ధనమ్మాళ్ మంచి స్నేహితులు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళేటంతటి చనువు, గౌరవం ఉన్నాయి.

ఈ విధంగా తన తోటి సంగీత కళాకారులతో స్నేహంగా ఉంటూ తమలో తాము పరస్పరం సహకరించుకునేవారు.

ఈమె శుక్రవారం సాయంత్రం మద్రాసులోని తన ఇంటిలో కచేరీలు చేసేవారు. వాటికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉండేవి. సాయంత్రం 6 గంటలకు మొదలయిన కచ్చేరి రాత్రి 8 గంటలకు ముగిసేది. ఆ సమయంలో సూదిమొన నేల మీద పడితే వినపడే శబ్దాన్ని కూడా సహించేవారు కాదు. కచేరీ ఆపేసేవారు.

ఈ కచేరీని చూడడానికి వచ్చిన సంగీత ప్రియులు మధ్యలో లేచి వెళ్ళకూడదు. ఈమె ఇంటిలో ఆ సమయంలో వంటపాత్రల శబ్దంతో సహా ఎటువంటి శబ్దాలు వినబడకూడదు. ఇంటి సందులో ఇరుగు పొరుగు వారు కూడా ఈ సమయంలో ఎటువంటి పనులు చేసేవారు కాదు. వంట పాత్రల శబ్దం కచేరీలో ఏకాగ్రతకి అంతరాయం కలిగిస్తుందని ఆ సమయంలో వంట చేసేవారు కాదు. ఆ వీధిలో ఎవరూ తిరిగేవారు కూడా కాదు.

కచేరి ముగిసేసరికి ప్రయాణ వాహనాలు ఉండేవి కాదు. శ్రోతలు ఆ రాత్రికి చుట్టు ప్రక్కల ఇళ్ళలోను, ఇళ్ళ అరుగుల మీద నిద్రపోయేవారు. వారికి ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. మరునాడు ఎవరిళ్ళకు వారు వెళ్ళేవారు.

ఇది ఇపుడు మనకు వింతగా తోస్తుంది. కాని ఆ రోజుల్లో వినోదము, కాలక్షేపాలకి సినిమాల వంటివి లేవు కదా! నాటకాలు, కచేరీలే ప్రజలకు ఆనందాన్ని ఇచ్చేవి. సంగీత కళాకారిణి ఇంటికి వచ్చి నిశ్శబ్దంగా ఆమె కచ్చేరీలను ఆస్వాదించి వెళ్ళేవారంటే వీణ ధనమ్మాళ్ ఎంత గొప్ప సంగీత కళాకారిణో మనకు అర్థమవుతుంది.

కచేరి ముగిసిన తరువాత అందరూ ఆ కచేరీలో ఆమె వీణ వాయిస్తూ, ఆలపించిన కీర్తనలను గురించి చర్చించుకుంటూ మరింత ఆనందానుభూతిని పొందేవారు.

ఈమె కచేరీలు అరుదైన వర్ణాలు, కీర్తనలు, సంకీర్తనలు, తమిళపద కీర్తనలు, త్యాగరాజకృతులు, క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు, ప్రాంతీయ కంపోజిషన్లు మొదలయిన వివిధ ప్రాంతాల వాగ్గేయకారులు వెలయించిన వాటిని వీణా వాదనంకే సమ్మిళితం చేసి వినిపించేవారు. అవి సుసంపన్నమై ప్రేక్షకులను, శ్రోతలను అలరించి భక్తపరవశులను చేసేవి.

ఈమె ఒకసారి రాయల్ సెనేట్లో సంగీత కచ్చేరీ చేశారు. రెండు కీర్తనలు ఆలపించిన తరువాత అంతరాయం కలిగింది. తన పద్ధతి ప్రకారం వెంటనే కచ్చేరీ ఆపేశారు.

క్రమశిక్షణ, ప్రశాంతత, ఏకాగ్రత పాడేవారికి, వినేవారికి అవసరమే! అయినా ఆమెకు అంతరాయం కలిగితే ఎవరినీ లెక్కచేయరనడానికి ఇది ఒక ఉదాహరణ.

1000 పైగా వివిధ రకాల కీర్తనలను ఈమె ఆలపించగలిగేవారు. ఈమె ఆలపించిన గీతాలు సామాన్యులకు కొంతవరకే అర్థమయేవి. కొన్ని ప్రజ్ఞావంతులు అయిన సంగీత కళాకారులకి మాత్రమే అర్థమయేవట.

పెళ్ళిళ్ళు, ఇతర వేడుకలు, వివిధ వేదికల మీద ఈమె 60 సంవత్సరాల పాటు కచేరీలు చేసి విజయం సాధించారు. ఈమె కచేరి జరుగుతుందంటే ఆయా వేడుకలకు ప్రత్యేక సొబగులు చేకూరినట్లే!

ప్రముఖ స్వరకర్తలు కొంతమంది ఈమె వద్దకు వచ్చితమ కంపోజిషన్లను వినిపించేవారు. వాటిలో తప్పులుంటే సరిచేయమని కోరేవారు. ఆమె వాటిని విని నిశితంగా పరిశీలించి మెరుగులు దిద్ది పంపేవారు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, తిరువొత్తియార్ త్యాగయ్యర్, తెన్మాటం నరసింహాచారి వంటివారు వీరిలో ముఖ్యులు. ఇంత గొప్ప సంగీత కళాకారులు ఈమె వద్దకు వచ్చి తప్పులు సరిచేసుకున్నారంటేనే ఈమె గొప్పతనానికి ఎల్లలు లేవని అనిపిస్తుంది.

నాదస్వరచక్రవర్తిగా పేరు పొందిన టి.రాజనాథమ్ పిళ్ళె ఈమె ఇంటికి వచ్చేవారు. వీణావాదనంలో మెళకువలని నేర్చుకునేవారు.

ఈమె జావళీలను ఆలపించేవారు. జావళీలు నేర్పిన గురువు ధర్మపురి సుబ్బరాయ అయ్యర్. ఆయన ఈమెని ప్రశంసిస్తూ ఫరాజను రచించారు. ఈ జనానీ ‘స్మర సుందరమణి’గా పేరు పొందింది. కమాస్ రాగంలో జావళీని సృజించారు. ఇది ‘నారిమణి’ అని పేరు పొందింది.

మద్రాసులో ఈమె కచేరీలకు గొప్పగొప్ప సంగీత కళాకారులు, విమర్శకులు, స్వరకర్తలు, పండితులు హాజరయ్యేవారు.

సంగీత కళాకారిణులు దూకుడుగా పాడకూదని సూచించేవారు. సంగీత కళాకారులను అనుసరించకూడదని చెప్పేవారు.

ఆ రోజుల్లో సంగీత కళాకారులు తమ గీతాలను రికార్డు చేయడానికి ఇష్టపడేవారు కాదు. బహుశా రికార్డులు బయటకు వస్తే కచ్చేరీలకు ప్రేక్షకుల రాక తగ్గుతుందనే భావం కూడా ఒక కారణం కావచ్చునేమో! చాలామంది సమకాలీన సంగీత కళాకారుల లాగా ఈమె కూడా రికార్డులను ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు.

అందువల్లనే ఈమె గ్రామఫోన్ రికార్డులు 9 మాత్రమే లభ్యమవుతున్నాయి.

ఈమె వయస్సు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు తగ్గిపోతూ వచ్చింది. చివరకు అంధురాలయారు. బయట వేదికల మీద కచేరీలు చేయడం మానేశారు. అయినా కచేరీలు తగ్గించలేదు. ఇళ్ళలోనే చేసేవారు.

1938 అక్టోబర్ 15 వ తేదీన మద్రాసులో మరణించారు. శ్రీమతి ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, తిరువాన్కూర్ రాణి సేతు పార్వతీబాయి ఈమె శిష్యులు. ఈమె వంటి గొప్ప సంగీత సరస్వతి. శిష్యులైనందుకు గర్వపడేవారు.

ధనమ్మాళ్ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఈమె, మరియు ఈమె పూర్వీకుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని భారతీయ సంగీత సామ్రాజ్యాన్ని సుసంపన్నం చేశారు. తంజావూరు బాలసరస్వతి వీరిలో ఒకరు.

లక్ష్మీసుబ్రహ్మణియన్ ‘వీణ ధనమ్మాళ్: ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో ఈమె జీవిత చరిత్రను వ్రాశారు.

ఈమె జ్ఞాపకార్థం 2010 డిశంబర్ 3వ తేదీన 5 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలా శాఖ. సాంప్రదాయబద్ధంగా వీణవాదనం చేస్తూ కూర్చుని ఉన్న ధనమ్మాళ్ చిత్రం ఈ స్టాంపు మీద ఎడమవైపున కనిపిస్తుంది. కుడివైపున ఒక మూలగా వీణ చిత్రం కనువిందు చేస్తుంది.

అక్టోబరు 15వ తేదీ ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here