స్వాతంత్ర్య పోరాటంలో తొలి ఆత్మాహుతి బాంబర్ – కుయిలీ

7
9

[dropcap]అ[/dropcap]నాదిగా భారతదేశం విదేశీయుల ఆక్రమణలకు గురవుతూ వచ్చింది. తమ శక్తికి మించి వారి మీద తిరుగుబాటు చేసిన యోధులు చరిత్రలో కనిపిస్తారు. రాజులు, రాణులతో పాటు రాచరికపు వీరులే కాదు, సామాన్యులలో కూడా దేశభక్తితో పోరాటాలు, యుద్ధాలలో పాల్గొన్న త్యాగధనులు కనిపిస్తారు. దేశభక్తితో తమ రాజులు, రాణుల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన వీరులు కనిపిస్తారు.

ఝాన్సీలక్ష్మీబాయికి ఝల్కారీబాయిలా శివగంగరాణి వేలునాచియార్‌కి కుయిలీ అండగా నిలిచారు. ఝల్కారీబాయి లక్ష్మీబాయి మహిళా సైన్యానికి అధిపతిగా చేసినట్లు నాచియార్‌కి కుయిలీ సైన్యాధిపతిగా పనిచేశారు.

అసలీ కుయిలీ ఎవరు? చరిత్రలో ఈమె స్థానమేమిటి? ఆమె గొప్ప వ్యక్తిగా ఎలా నిలిచారు? ఒకసారి ఆమె చరిత్రలోకి తొంగిచూస్తే తెలుస్తుంది.

ఈమె శివగంగ రాజ్యంలో ఈదన్ బోగాడ్ గ్రామంలోని రైతుకుటుంబంలో జన్మించారు. ఈమె తల్లి రాకు చాలా ధైర్యవంతురాలు. పొలాలను నాశనం చేయడానికి వచ్చే జంతువులను వేటాడి తమ పంటలను రక్షించుకున్నంత గొప్ప నారి. ఒకసారి అడవి ఎద్దుతో పోరాడి, తను మరణించినట్లు చెపుతారు.

ఈమె తండ్రి పెరియముత్తన్. భార్య మరణించిన తరువాత ముత్తుప్పట్టి గ్రామానికి కుమార్తెతో సహా వలస వెళ్ళి జీవనం సాగించాడు. చెప్పులు కుడుతూ జీవనోపాధిని పొందాడు. కుమార్తెకు ఆమె తల్లి రాకు పొలం రక్షణలో సాధించిన విజయగాథలను వివరించి చెప్పేవాడు. తల్లిలా ధైర్యవంతురాలుగా బతకాలని ఆశపడేది కుయిలీ.

పెరియముత్తన్ రాజాస్థానంలో గూఢచారిగా నియమించబడ్డాడు. తండ్రితో ఆమె కూడా రాచరికపు పనులలో పాలుపంచుకునేవారు. యుద్ధవిద్యలను నేర్చుకున్నారు. తండ్రిని గమనిస్తూ ఉండేవారు. గూఢచారిత్వాన్ని అవగాహన చేసుకున్నారు. ఈ సమయంలో శివగంగ రాజు ముత్తువడుగనాథ ధేవర్ ఈస్టిండియా కంపెనీ సైన్యం దళపతి కల్నల్ స్మిత్‍తో జరిగిన యుద్ధంలో మరణించారు. రాణి వేలు నాచియార్ ప్రవాసంలోకి వెళ్ళారు.

ఈమెని అనుసరించి కొత్త సైన్యం వెళ్ళింది. దిండిగల్ చేరుకున్నారు. ఆ దగ్గరలోని విరుపొచ్చిలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈమెకు రక్షణ కోసం సిలంబం అని పిలువబడే మార్షల్ ఆర్ట్ గురువు వెట్రివేల్ పనిచేసేవారు. అతి నమ్మకం ఎప్పుడూ అనర్ధదాయకమే అనే నానుడి ఇక్కడ నిజమయింది.

కుయిలీ కూడా ఈ సైన్యంలో పనిచేసేవారు. వెట్రివేల్ ఒకసారి కుయిలీకి ఒక ఉత్తరం ఇచ్చి బ్రిటిష్ వారి అనుచరుడు మల్లారి రాయన్‌కి అందించమని పురమాయించాడు. కుయిలీ గూఢచారి కళ్ళకి వెట్రివేల్ మీద నమ్మకం ఉండేది కాదు. ఆమె అతనిని పరిపరివిధాల గమనిస్తూ ఉండేవారు. రాణికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని ఆమెకు గట్టి నమ్మకం.

అందువల్లనే ఉత్తరం తెరిచి చదివారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీపై రాణివేలు నాచియార్ తిరిగి దాడి చేసేటందుకు వివరాలన్నీ ఆ ఉత్తరంలో రాసి ఉన్నాయి. వెంటనే దేశ ద్రోహిని హతమార్చి రాజ్యాన్ని, రాణిని రక్షించారు. వేలు నాచియార్ కుయిలీని ఆంతరంగికురాలిగా అభిమానించి తనతో పాటే ఉండే ఏర్పాటు కల్పించారు. అలాగే మరొకసారి ఒక రాజ ద్రోహి రాణిని హత్యచేయబోతుంటే కుయిలీ రక్షించారు. ఆ రోజు నుండి వారిద్దరి అనుబంధం మరింత బలపడింది. రాణికి అంగరక్షకురాలయింది. సుమారు పది సంవత్సరాల కాలం రాణికి రక్షణ కల్పిస్తూ అనేక విద్యలను అభ్యసించారు.

ఎవరయినా ఇద్దరు వ్యక్తులు కలిసి మెలిసి ఉన్నారంటే వారు ముఖ్యంగా అత్యున్నత పదవులలోని ఉన్నవారు అయితే శత్రువులు ఎక్కువవుతారు. వారి మధ్య పొరపొచ్చాలు కల్పించి విడదీసే ప్రయత్నాలు సర్వసాధారణం. వీరిద్దరి మధ్య ఇటువంటివి జరిగాయి. కాని రాణి తనని రెండు సార్లు రక్షించిన కుయిలీని మరింత దగ్గర చేసుకున్నారు. తనని రక్షించడంలో గాయపడిన కుయిలీకి తన చీరను చింపి కట్టుకట్టిన గొప్ప మనసు ఆమెది.

ఈ సంఘటన ఫలితంగా కుయిలీని శివగంగ రాజ్య మహిళా సైన్యానికి అధిపతిగా నియమించారు.

మరొక ప్రక్క ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ సైన్యం యుద్ధంలో గెలిచిన తరువాత శివగంగ రాజభవనాన్ని తమ చేతులలోకి తెచ్చుకున్నారు. ఈ భవనంలోని నేలమాళిగలో ఆయుధాగారము ఉండేది. అంతకుముందు బ్రిటిష్ వారు కూడా ఈ నేలమాళిగనే ఆయుధాగారంగా మార్చుకున్నారు.

ఈ రాజభవనంలోనే రాజరాజేశ్వరీ దేవి ఆలయం కూడా ఉంది (ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు జరుగుతూనే ఉన్నాయి).

బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాలని, తమ రాజ్యాన్ని తిరిగి పొందాలని రాణి వేలు నాచియార్ ఆశయం. ఆమె ప్రవాసంలో ఉంటూనే ఆ పనికోసం హైదరాలీ, మొదలయిన వారి సహాయాన్ని తీసుకున్నారు. యుద్ధవ్యూహాలను పన్నారు. బ్రిటీష్ వారితో వైరమున్నా, ఫ్రెంచి వారితోనూ సంప్రదింపులు జరిపారు.

రాజరాజేశ్వరీ దేవి ఆలయంలోనికి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు బ్రిటిష్ పాలకులు. అయితే భక్తుల కోరిక మేరకు విజయదశమి పండుగ రోజున మాత్రం పూజలు చేసుకోవడానికి అనుమతిని ఇచ్చారు.

మేధావులు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోరు. కుయిలీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామని రాణికి తన ఆలోచనను వివరించారు. రాణికి ఈ ఆలోచన వచ్చింది. దానిని అమలులో పెట్టమని అనుమతించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా తమ గ్రామాల మహిళలతో కలిసి పూజలు నిర్వహించేటందుకు పక్కా ప్రణాళికను రచించారు కుయిలీ. బ్రిటీష్ వారు విజయదశమి నాడు మాత్రమే పూజలు చేసుకునేందుకు అనుమతించారు. కాబట్టి మహిళలు పూలు, పళ్ళు నిండిన బుట్టలతో రాజరాజేశ్వరి అమ్మ వారిని పూజించేందుకు బయలుదేరారు. అమాయకులయిన గ్రామాణ మహిళలే కాబట్టి వీరిని ఏవిధమైన తనిఖీ లేకుండా లోపలికి వెళ్ళేందుకు అనుమతించారు బ్రిటీష్ సైనికులు.

సైనికులు భక్తురాళ్ళు గుంపులు గుంపులుగా బయలుదేరి గుడికి వెళ్ళారు. కొంతసేపు పూజ జరిగింది. కొద్ది సేపు తరువాత వేలునాచియార్ సైన్యంతో ఈస్టిండియా కంపెనీ సైన్యం మీద దాడి చేశారు. పూలు, పళ్ళ కింద బుట్టలలో దాచిన ఆయుధాలు బయటకు తీసి మహిళా సైన్యం కూడా బ్రిటీష్ సైన్యాన్ని అడ్డుకున్నారు.

ముందుగా చేసిన ఆలోచన ప్రకారం మహిళలు అమ్మ వారి ధూపదీప నైవేద్యాల నిమిత్తం తెచ్చిన నేతిని, నూనెను కుయిలీ మీద పోశారు. ఆమె నూనె, నెయ్యి ఒడుతున్న బట్టలతో కంపెనీ వారి ఆయుధాగారంలోకి వెళ్ళింది. మంటలోకి వెళ్ళి ఆత్మాహుతి చేసుకుని బ్రిటీష్ వారి ఆయుధాగారాన్ని పేల్చివేశారు.

శివగంగా రాణి వేలునాచియార్ యుద్ధంలో గెలిచారు. కంపెనీ సైన్యాధిపతి బెంజోర్ రాణికి లొంగిపోయాడు. ఆ తరువాత శివగంగ రాజ్యాన్ని సుమారు 10 సంవత్సరాలు ఈమె పరిపాలన చేశారు.

బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఆయుధాగారాన్ని తన ఆత్మాహుతి ద్వారా పేల్చివేసి చరిత్రలో తొలి ఆత్మాహుతికి బాంబర్ గా నిలిచారు కుయిలీ. ఈ ఆత్మాహుతికి వేలునాచియార్ విలపించిన తీరు వర్ణనాతీతం.

ఈమె త్యాగ నిరతిని స్మరించుకుంటూ 13-10-2021 వ తేదీన ఒక ప్రత్యేక తపాలా కవరును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా విడుదలయిన ఈ కవర్ మీద అపర దుర్గాదేవిగా కన్పించే కుయిలీ గంభీర వదనం దర్శనమిస్తుంది.

స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here