కాజాల్లాంటి బాజాలు-31: ఎవరైనా వున్నారా!

4
6

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]వాళ మధ్యాహ్నం మా ఇంటికి ఓ కుర్రాడొచ్చేడు. ఇంటర్ చదువుతున్నాట్ట. ఇదివరకెప్పుడో అతని చిన్నప్పుడు నేను అతన్ని బాగా మెచ్చుకునేదాన్నిట. అందుకని వాళ్ళమ్మగారిని మా అడ్రస్ అడిగి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేడు.

నిజం చెప్పొద్దూ.. నాకసలు మారని మనుషుల ముఖాలే గుర్తుండవు. ఏడేళ్ళ పిల్లాడు పదిహేడేళ్ళకి యెదిగి వస్తే యెలా గుర్తుపట్టగలను. నా ఇబ్బంది అతను గ్రహించాడు. వాళ్ళ అమ్మా, నాన్నగార్ల పేర్లు చెప్పేటప్పటికి గుర్తొచ్చింది..

ఇంతకీ అతను నన్ను వెతుక్కుంటూ యెందుకొచ్చేడంటే నేను చిన్నప్పుడు అతని లోని టేలెంట్‌ని గుర్తించి, బాగా డేన్స్ చేస్తాడని మెచ్చుకున్నానుట. అందుకని నన్నువాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడి అతన్ని సినిమాల్లోకి పంపించమని వాళ్లకి నచ్చచెప్పాలిట. ఇదేమైనా బాగుందా? వాళ్ళ పిల్లాడు, వాళ్ళిష్టం. మధ్యలో నేనెవరిని?

అయినా సరే.. పాపం నామీద నమ్మకంతో వచ్చాడు కదాని అతన్ని పరీక్షగా చూసాను.

ఇప్పుడూ.. యేదైనా ఉద్యోగం యివ్వాలంటే క్వాలిఫికేషన్ యెలా చూస్తామో అలాగే సినిమాల్లో వేషం వెయ్యాలంటే కొన్ని అర్హతలుండాలి కదా! ముందు విగ్రహం ముఖ్యం. కానీ అతను అయిదడుగుల కన్న లేడు. పోనీ కనుముక్కుతీరు చూద్దామంటే అదీ అంతంత మాత్రమే. ఎవరి అందచందాలు వాళ్లవి. దానిని నేను కాదనను. కానీ నలుగురినీ మెప్పించాల్సిన సినిమాల్లో వేషం వెయ్యాలంటే కాస్తైనా బాగుండాలికదా!

ఆ మాట ఆ పిల్లాడి ముఖం మీద యెలా చెప్పనూ? నా ఇబ్బంది గ్రహించినట్టున్నాడు.. చేతిలో వున్న కవర్ లోంచి కొన్ని ఫొటోలు బైటకి తీసేడు.

“చూడండాంటీ నా ఫొటోలు. నాది ఫొటోజెనిక్ ఫేసండీ..” అన్నాడు గర్వంగా.

చూసేను. ఆ ఫొటోగ్రాఫర్ యెవరో యెన్ని రకాలుగా సరిదిద్దినా ఆ ఫొటోలు చూసి అతనికి వేషం యిస్తారని నాకనిపించలేదు.

 “కానీ” అంటున్న నన్ను చూసి ఇంకో ఫొటో యేదో చూపించి “ఇది చూడండి. ఇలాంటి వాడికే సినిమా ఛాన్స్ వస్తే నాకెందుకు రాదండీ” అన్నాడు ధీమాగా.

ఆ ఫొటో చూసేను.. నిజమే.. దానికన్న మా ఇంటికొచ్చిన కుర్రాడి ఫొటోయే బాగుంది.

“ఇతను సినిమాల్లో వేస్తున్నాడా?” అనడిగేను.

“ఎందుకు వెయ్యడండీ.. హీరోగా వేస్తున్నాడు. హీరో పక్కన వాడి ఫ్రెండ్ వేషానికి ఆ హీరో కన్న బక్కగా వుండాలీ, ఎత్తు తక్కువుండాలీ, అంతకన్న వంకరటింకరగా నడవాలీ అన్నప్పుడు మరి మాలాంటివాళ్లకే కదండీ ఛాన్సూ” అన్నాడు. అవునుకదా!

ఈ రోజుల్లో వస్తున్న హీరోలంటున్నవాళ్లలో ఒక్కరికీ నిండైన విగ్రహం లేదు. నిటారుగా నిలబడలేరు. ఒత్తులు పలుకుతూ తెలుగు సరిగ్గా మాట్లాడలేరు. అలాంటివాళ్ళు హీరోలుగా వస్తున్నప్పుడు ఈ కుర్రాడు హీరో పక్కన ఫ్రెండ్ గా ఉండలేడా అనుకున్నాను.

“కానీ.. నీ గొంతూ..” అంటున్న నన్ను ఆపి “ఇప్పుడు యెంత కీచుగా మాట్లాడితే అన్ని ఛాన్సులాంటీ సినీ ఫీల్డ్‌లో..” అన్నాడు.

అదీ నిజమే కదా అనుకున్నాను.

నేను మెత్తబడడం చూసి “ప్లీజ్ ఆంటీ.. మా పేరెంట్స్‌కి కొంచెం చెప్పండీ” అంటూంటే అతని వేషం మాట అలా ఉంచితే నా గురించి నాకు నాకు ఫ్లాష్ లాంటి అవిడియా వచ్చింది.

అవునూ.. ఈ కుర్రాడు సినిమాల్లో వేషాలకోసం ప్రయత్నిస్తున్నప్పుడు నేనెందుకు నా కథలకట్టను పట్టుకుని సినీరంగప్రవేశం చెయ్యకూడదూ అనిపించింది. మరి నాకెవరు సిఫార్సు చేస్తారూ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here