ఎవరికి వారే

0
8

[dropcap]ప[/dropcap]రంధామయ్య.. వారి అర్ధాంగి పార్వతమ్మ.. హైదారాబాద్ నుండి రాత్రి బస్సులో తమ స్వగ్రామానికి బయలుదేరారు.

ఆ ఇరువురి వదనాల్లో ఎంతో అప్రసన్నత.. మనస్సును వేధిస్తున్న జ్ఞాపకాలను మరచి నిద్రపోవాలని ఇరువురు కళ్ళు మూసుకొన్నారు. బస్సు బయలుదేరింది. క్రిందటి రోజున వారివురూ కలసి మాట్లాడుకొని వెంటనే వారి వూరికి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిన కారణంగా వారు బస్సులో పయనించవలసి వచ్చింది.

రెండు.. వారాల క్రిందట వారు హైదరాబాదులోని తమ కొడుకులు గౌతమ్.. ఆనంద్‌ల ఇంటికి.. ఆనంద్ అతని భార్య అనారోగ్య కారణంగా వచ్చారు. కోడళ్ళ అభిమాన మాధుర్యాన్ని చవిచూచారు. ఆ ఇంట్లో వారికి కలిగిన చెడు అనుభవాలు.. వారిలోని సహనాన్ని హారతి కర్పూరం లా హరించిన కారణంగా.. ఆ రాత్రి పూట బస్సులో వారు ప్రయాణం చేయవలసి వచ్చింది.

నిద్ర పట్టని పార్వతమ్మమెల్లగా కళ్ళు తెరచి భర్తవైపుకు చూచింది.

పరంధామయ్యగారు కళ్లు మూసుకొని వున్నారు. “ఏమండీ!..” తన తలను వారి చెవి దగ్గరకు చేర్చి మెల్లగా పిలిచింది పార్వతమ్మ.

ఆ పిలుపును.. ఆలకించిన పరంధామయ్య కళ్లు తెరచి.. పార్వతమ్మ ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూచాడు. “మనం ఇకపై హైదరాబాదుకు రావలసిన అవసరం వుండకూడదు కదూ!..” దీనంగా పరంధామయ్య కళ్ళ ల్లోకి చూస్తూ అడిగింది పార్వతమ్మ.

“నాకు తెలిసినంత వరకూ యికపై మనకు అలాంటి అవసరం ఏమీ వుండదు పార్వతీ.. వారికి మనతో ఏదైనా అవసరం వుంటే.. వారే మనదగ్గరకు వస్తారేమో!” చిరునవ్వుతో చెప్పాడు పరంధామయ్య.

వారి నవ్వులో విరక్తి గోచరించింది పార్వతమ్మకు. కొన్ని క్షణాలు వారి ముఖంలోకి చూచి.. కళ్ళు మూసుకొంది. చెడు అనుభవాలతో అలసి పోయిన ఆమె మనస్సుకు ఆ నిశీధి పవనం కొంత హాయిని కలిగించిన కారణంగా భర్త భుజంపై తలనుంచి.. పార్వతమ్మ నిద్రకు వుపక్రమించింది. కానీ.. పరంధామయ్యకు ఆ యోగం ప్రాప్తించలేదు. ఇరవైయేడు నెలల క్రిందట జరిగిన వారి షష్టి పూర్తి.. ఆ రోజు మనస్సున ప్రతిబింబించింది.

***

తండ్రికి షష్టిపూర్తి చేయాలని నిర్ణయించుకొన్న అన్నదమ్ములు గౌతమ్ ఆనంద్‌లు వారి సతీమణులు కాంచన.. హారతి, పిల్లలతో గ్రామానికి నాలుగు రోజులు ముందుగా వచ్చారు.

గౌతమ్ కాంచనలకు ఎనిమిదేళ్ళ కుమార్.. ఆరేళ్ళ కామిని సంతానం. ఆనంద్ హారతి లకు ఐదేళ్ల భరణి కుమారుడు.

ఇరువురు అన్నదమ్ములు చెరో ఐదువేలు ఖర్చుపెట్టి.. పరంధామయ్య షష్టిపూర్తిని ఘనంగా జరిపించి ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించారు.

యథార్ధంగా.. వారి అభిప్రాయం.. తల్లిదండ్రులకు ఆ శుభకార్యాన్ని జరిపించి.. ఆస్తి పంపకాన్ని చేయవలసిందిగా కోరడం. మరుదినం వుదయం.. టిఫిన్ తిని అందరూ హాల్లో సమావేశం అయిన సందర్భంలో.. పెద్దకుమారుడు గౌతమ్..

“నాన్నా!.. నాకు వచ్చే జీతం సరిపోవడంలేదు. వుద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ చేయాలను కొంటున్నాను. నా భాగాన్ని పంచియిస్తే.. అమ్మేసి వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకొన్నాను.” తండ్రి ప్రక్కన కూర్చొని తన నిర్ణయాన్ని తెలియజేశాడు.

“గౌతమ్!.. మనం మధ్యతరగతి మనుషులం. వున్నచోటు యితరులకు తెలియకుండా గౌరవంగా బ్రతికేవాళ్లం. నీవు పి.డబ్ల్యూ.డి. డిపార్ట్‌మెంటులో ఏ.ఈ.గా పనిచేస్తున్నావు. ఒకటి రెండు సంవత్సరాల్లో నీకు ప్రమోషన్ ఈ.ఈ.గా తప్పనిసరిగా వస్తుంది. పైగా నీ భార్య హైస్కూలు టీచర్. వచ్చే ఆదాయంతో పొదుపుగా సంసారాన్ని సాగించాలే కానీ.. వున్న ఆస్తిని అమ్మి వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు. వ్యాపారంలో నష్టం వస్తే.. నీవు చాలా బాధపడవలసి వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిపడి.. జీవితాన్ని ప్రశాంతంగా సాగించు. మనిషి ఎప్పుడూ.. మనకంటే తక్కువ స్థితిలో వున్నవారిని చూస్తూ.. వారికి ఏదైనా సాయం చేయకలిగితే వున్నంతలో చేస్తూ, ముందుకు సాగాలేకాని.. మనకంటే గొప్పవారిని చూచి, మనం వారిని మించినవారం కావాలని ఆశించకూడదు. దురాశ ధుఃఖమునకు చేటు. యీ సామెత నీకు తెలుసుగా!..” అనునయంగా తన అభిప్రాయాన్ని గౌతమ్‌కు తెలియజేశాడు పరంధామయ్య .

“నాన్నా! నేనేమీ చిన్నపిల్లవాడిని కాదు. నా బరువు బాధ్యతలు నాకు తెలుసు. బాగా ఆలోచించే నేను యీ నిర్ణయానికి వచ్చాను..” రోషం ధ్వనించింది అతని మాటల్లో.

“అంటే!..” ఆశ్చర్యంగా గౌతమ్ ముఖంలోకి చూచాడు పరంధామయ్య.

“నాన్నా!.. అన్నయ్య నిర్ణయమే నా నిర్ణయం. మీరు మా వాటాలను మాకు పంచి ఇవ్వండి..” కాస్త ఆవేశంగానే చెప్పాడు చిన్న కొడుకు ఆనంద్.

“ఎందుకురా నీకంత ఆవేశం.. మీ యోగక్షేమాలను గురించి మీ నాన్నకు నాకు సంబంధం లేదంటావా!..” ఆశ్చర్యం, ఆందోళనలతో అడిగింది పార్వతమ్మ.

“అమ్మా! నీకేం తెలుసు.. ప్రస్తుత సమాజం ఎలా ముందుకు పోతూవుందో. యీ వయస్సులో కష్టపడి సంపాదించాలి. దానికి పెట్టుబడి కావాలి. అందుకే మా వాటాలను పంచి ఇవ్వమంటున్నాము..” ఆవేశంగా అన్నాడు ఆనంద్.

“ఆరే!.. ఆనంద్..” పార్వతమ్మ పూర్తిచేయక మునుపే.. పరంధామయ్య..

“పార్వతీ! ఈ విషయంలో నీవిక మాట్లాడకు..” ఆదేశించినట్లు భార్యముఖంలోకి చూచాడు పరంధామయ్య. ఆమె విచారంగా తలను దించుకొంది.

“అత్తయ్యగారూ! మేము అడుగుతున్నది మా భాగాలను మాత్రమే!..” వ్యంగంగా అంది కాంచన.

“ఆవిడగారికి ఇప్పట్లో ఆస్తి పంపకాలు యిష్టం లేనట్లువుంది అక్కయ్యా!..” పార్వతమ్మను ముఖం చిట్లించి చూస్తూ అంది హారతి.

కోడళ్ళ ముఖాలను కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు పరంధామయ్య. వారిరువురికీ తన పట్ల.. పార్వతమ్మ పట్లవున్న అభిప్రాయాలూ వారి వదనాల్లో పరంధామయ్యకు గోచరించాయి.

“సరే! రేపు మీ వాటాల పత్రాలను మీ ఇరువురికీ యిస్తాను. మీరు ఏం చేయదలచుకొన్నారో ఆలాగే చేయండి. మొత్తం ఆస్తి నాలుగు భాగాలుగా విభజిస్తాను. మీది మీకు చెందుతుంది.” అని చెప్పి పరంధామయ్య లేచి తన గది వైపుకు నడిచాడు. పార్వతమ్మ వారిని రుసరుసలాడుతూ అనుసరించింది.

అన్నదమ్ములు ఒకరి మూఖాలు ఒకరు చూచుకొని విజయగర్వంతో నవ్వుకొన్నారు. కాంచన హారతులు వారికి వంత పాడారు.

***

అభిమానధనుడు పరంధామయ్య ఆస్తిని నాలుగు భాగాలుగా విభజించి, భార్య కొడుకులిద్దరూ, తన పేరా పత్రాలు వ్రాయించి రిజిస్టర్ చేయించి మూడు రోజుల్లో.. తనయుల పత్రాలను వారికి అందించాడు.

ఆ మూడు రోజులు కార్యార్ధులై వచ్చిన గౌతమ్ ఆనంద్‌లు వారి భార్యలు కాంచన హారతులు నిప్పుల సెగలో వున్నట్లు ఆ ఇంట్లో.. అత్త మామలు ప్రియంగా పలకరించినా ముక్తసరిగా ఆ. వూ.. అంటూ గంటలను లెక్కించారు.

పిల్లలను.. తాత నాయనమ్మల వద్దకు పోకూడదని శాసించారు.

పత్రాలు చేతికి రాగానే సూట్‌కేసులు సర్దుకొని తమ మామగారి ఇండ్లకు వెళ్ళిపోయారు ఆ రావణ కుంభకర్ణులు.

పత్రాలను మామగార్లకు చూపించి.. భూములను అమ్మి సొమ్మును తమకు చేర్చవల్సినదిగా చెప్పి ఆ ఇరువురు అన్నదమ్ములు సతీమణులతో సంతానంతో హైదారాబాద్ చేరారు.

***

నక్క వేటాడి జంతువులను చంపలేదు. అది.. ఎప్పుడూ పొంచి చూచేది.. పులి సింహం చంపిన జంతువును , వాటి కళ్లబడకుండా దొంగతనంగా ఆరగించేటందుకే.

ఆ ఇరువురి మామగార్లు.. జిత్తులమారి నక్కల మనస్తత్వం కలవారు.

ఆస్తులను అమ్మి పదిహేను పర్సెంట్ వరకు కాజేసి యిదే వచ్చిందని.. ప్రస్తుతంలో భూములకు రేట్లు బాగా లేవని.. అతికష్టం మీద విక్రయించగలిగామని.. డబ్బును అల్లుళ్ళకు అందించారు.

కోడళ్ళు ఇరువురికీ.. అత్తామామలు సమభాగం తీసుకోవడం నచ్చలేదు. ఈ విషయంలో తమ భర్తలను హేళన చేస్తూ, మీకు సామర్థ్యం లేనందువలన ఆ ముసలివాడు ఆ రకంగా చేయకలిగాడని మరో పాయిజన్ ఇంజక్షన్.. కాంచన హారతులు తమ భర్తలు గౌతమ్ ఆనంద్ లకు యెక్కించారు.

తన భాగానికి వచ్చిన యాభై లక్షలతో గౌతమ్ చేస్తున్న వుద్యోగానికి రాజీనామా చేసి కనస్ట్రక్షన్ కంపెనీని ‘కాంచన కనస్ట్రక్షన్స్’ అనే పేర ప్రాంభించాడు.

పెద్దపెద్ద కాంట్రాక్టర్స్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ పనులను తీసుకొని ప్రొప్రయిటరుగా పనులు ప్రారంభించాడు. అత్తగారు ఇచ్చిన కట్నంతో కొన్న ప్లాట్లో ఆఫీస్ పెట్టాడు.

ఆనంద్.. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సి.యఫ్.ఓ గాను అతని భార్య హారతి.. బ్యాంకి లోనూ పనిచేస్తున్నారు. హారతికి సొంతంగా ప్లాట్ కొనాలనేది చిరకాల వాంఛ. బ్యాంక్‌లో ఇరవై లక్షలు లోన్ తీసికొని సనత్‌నగర్‌లో తన ఆఫీస్‌కు దగ్గరగా ఫస్ట్ ఫ్లోర్ ను డెబ్భై లక్షలకు కొని గృహప్రవేశం చేశారు.

రేపు గృహప్రవేశం అనగా యీరోజు ఆహ్వానపత్రిక అందిన కారణంగా.. పరంధామయ్య పార్వతమ్మలు ఆ ఫంక్షనుకు వెళ్లలేక పోయారు.

యథార్ధంగా వారు రావడం ఇష్టంలేని హారతి.. ఆహ్వాన పత్రికను వారికి లేటుగా పోస్ట్ చేసింది. వారు రానందుకు.. తన వర్గం వచ్చినందుకు హారతి ఎంతగానో ఆనందించింది.

తల్లి తండ్రి రానందుకు ఆనంద్ బాధ పడ్డాడు. “మనమీద వారికి ఇంకా కోపం తీరలేదు. ఆ కారణంగా వారు రాలేదు, బాధపడకు” అన్న గౌతమ్ ఆనంద్‌ను వూరడించారు.

సంవత్సర కాలం.. ఆ రెండు కుటుంబాల మధ్యన ఎంతో ఆనందంగా సాగిపోయింది.

***

కాలం ఎపుడూ ఒకే రీతిగా సాగదు. వూసరవెల్లిలా కాలగమనంలో రంగులు మారుతాయి.

మూడేళ్ళ క్రిందట గౌతమ్ సర్వీసులో వున్నప్పుడు భారీగా తీసుకొన్న లంచం తాలూకు సి.బి.ఐ. కేసులో గౌతమ్ యిరుక్కున్నాడు.

సాక్ష్యాల రుజువులతో వ్యతిరేక పక్షం కేసు గెలిచింది. కోర్టు యిచ్చిన తీర్పు.. మూడు సంవత్సరాల జైలు శిక్ష.. లేక యిరవై లక్షల జరిమానా.. . గౌతమ్ ఆశాసౌధాలు కూలిపోయాయి. జైలు పాలైనాడు.

ఆనంద్ యిచ్చిన జామీన్ మీద బయటికి వచ్చాడు. తన ఆఫీస్ ప్లాట్‌ను అమ్మి కోర్టుకు చెల్లించాడు.

సొంత వ్యాపార విషయంలో గౌతమ్ కన్న కలలు గాలిమేడలైనాయి. పరువు పోవడమే కాకుండా.. భార్య కాంచన కూడా అతన్ని అసహ్యించుకొంది. తేలు కుట్టిన దొంగలా.. కన్నీరు కార్చుతూ నోరు మెదపలేక పోయాడు.

మంచిని గురించి చెప్పిన పెద్దల మాటలను అర్ధం చేసుకొని నడుచు కోలేని వారు.. తాత్కాలికంగా తమ పంతంతో సమస్యను తాము గెలిచామని భావించేవారు.. కొంతకాలానికి.. వారు వూహించని సమస్యలను ఎదుర్కో వలసి వస్తుంది. ఎన్నో కష్ట నష్టాలను అనుభవించ వలసి వస్తుంది. రెండు రోజులుగా గాలీవానా తెరిపిలేని వర్షం. రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో వురుములూ మెరుపులతో ఆనంద్ ఇంటిపైన పిడుగు పడింది. భవనం కూలింది.

వీరు వున్నది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ప్రాణహాని జరగకుండా, ఆనంద్ హారతులు గాయాలతో బయటపడి హాస్పిటల్ పాలైనారు.

విషయాన్ని విన్న గౌతమ్ కాంచనలు వారికి అండగా నిలబడ్డారు.

గౌతమ్.. ఆనంద్ హారతులకు జరిగిన ప్రమాదాన్ని గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఎన్ని వినరాని మాటలు విన్నా.. వ్యతిరేక వ్యవహారాలు జరిగినా.. ఎప్పటికీ, తల్లిదండ్రుల మనస్సు తమ బిడ్డల విషయంలో.. ప్రేమాభిమానాలు వుంటాయి. తమకు వున్నంతలో.. వారిని ఆదుకొని వారి ఆనందాన్ని తమ కళ్ళారా చూడాలని వారు తాపత్రయ పడుతారు.

రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసుకొని పరంధామయ్య పార్వతమ్మలు ఎంతో ఆందోళనతో హైదరాబాద్ చేరి.. గౌతమ్ ఇంటికి వెళ్లారు. హాస్పిటల్‌కు గౌతంతో కలసి వెళ్ళి ఆనంద్ హారతులను చూచి వారికి అనునయ వాక్యాలు చెప్పారు. వారం రోజులు హాస్పిటల్లో వారికి సాయంగా వుండి.. వారు డిశ్చార్జి అయిన తర్వాత అందరూ గౌతమ్ ఇంటికి చేరారు.

గౌతమ్ కాంచనలు.. తమ పిల్లలతో.. తాతయ్య నానమ్మలతో ఏమీ మాట్లాడకూడదని.. ఏ విషయాలు చెప్పకూడదని శాసించారు.

కానీ.. ఆనంద్ కొడుకు ఆరేళ్ళ భరణి, రహస్యంగా తన పెదనాన్న గౌతమ్ విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్పుకొంటున్న సమయంలో విన్నందున.. తాను గ్రహించిన విషయాన్ని తాతయ్య పరంధామయ్యకు చెప్పాడు.

కొడుక్కు పట్టిన దుస్థితికి ఆ తండ్రి ఎంతగానో విచారపడ్డాడు. రాత్రి అందరూ నిదురించే సమయంలో భార్యకు గౌతమ్ ప్రతాపాన్ని గురించి చెప్పాడు. ఆ తల్లి కన్నీరు కార్చింది.

హాస్పిటల్ బిల్.. ఇరవై వేలు పరంధామయ్య చెల్లించాడు. గౌతమ్.. భగవంతుడు తన తండ్రి రూపంలో తన్ను రక్షించాడనుకొన్నాడు. తన చేతిలో వున్న మిగతా లక్షా ఎనభై వేలల్లో పదివేలు తాను వుంచుకొని.. ఇద్దరి కొడుకులకు ఎనభై ఐదు వేలు చొప్పున ఇచ్చాడు.

***

ఒక నెల రోజులు కొడుకులు కోడళ్ళు దగ్గర వుండాలనుకొని వచ్చారు ఆ దంపతులు. పదిహేను రోజుల్లో ఇద్దరు కోడళ్ళు .. కాంచన తల్లి కనకమ్మ.. కలసి ఆ ఇరువురికీ నరకాన్ని చూపించారు.

కొడుకులు డబ్బును అందుకున్నారేగాని.. ఆపై ఎలాంటి మాటలు తల్లిదండ్రులతో వారు ప్రియంగా మాట్లాడేవారు కాదు. కనీసం.. వారితో కలసి భోజనం చేసేవారు కూడా కాదు. తమ కొడుకుల యీ స్థితికి కారణం.. వారికి అర్ధం అయింది. వారు పూర్తిగా భార్యా విధేయులుగా మారిపోయారు.

కనకమ్మ.. కాంచన.. హారతిలు ఏకమై కనీసం.. చిన్నపిల్లలను కూడా వారివద్దకు పంపేవారు కాదు.

ఆ వేకువన మేల్కొన్న పార్వతమ్మ భర్తను లేపి..

“ఏమండీ!.. యీరోజు మనం మనవూరికి వెళ్ళి పోదామండీ. గడచిన పదిహేను రోజులుగా చెరసాలలో వున్నట్లుగా వుంది. యీ స్థితిని యిక నేను భరించలేను.” దీనంగా పరంధామయ్య ముఖంలోకి చూస్తూ చెప్పింది పార్వతమ్మ. “నేనే నీకు చెప్పాలనుకొన్న మాట.. నీవు నాకు చెప్పావు. తప్పక బయలుదేరుదాం. మన వూరికి వెళ్లిపోదాం.. ఎవరికి వారే యమునా తీరే..” విరక్తిగా నవ్వాడు.

“సార్!.. యిక్కడ బస్సు పదినిముషాలు ఆగుతుంది. టీ కాఫీ త్రగాలంటే దిగండి.” డ్రైవర్ అరుపుకు పరంధామయ్య వులిక్కిపడి కళ్ళు తెరిచాడు. కిటికీ వైపు వున్న భార్య ముఖంలోకి చూచాడు. ఆమె గాఢ నిద్రలో వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here