ఎవరిళ్ళకు వారు..

0
11

[మాయా ఏంజిలో రచించిన ‘They went home’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. వేశ్యను క్షణికంగానే చూస్తారు తప్ప, ఏ మగవారు హృదయంలోను, జీవితంలోను చోటివ్వలేరు అని చెప్పే నిర్వేదభరితమైన కవిత!!]

~

[dropcap]త[/dropcap]మ జీవితకాలంలో
ఎప్పుడూ నాలాంటి అమ్మాయిని
తాము చూడలేదని
వాళ్ళంతా వారి వారి
ఇళ్ళకు వెళ్ళిపోయి
తమ భార్యలకు చెబుతారు

నా ఇల్లు అద్దంలా
తళతళలాడుతుందని
పరుషంగానో, తక్కువగానో
నేనెప్పుడూ మాట్లాడనని
నాలోను నా చుట్టూ
ఒక మార్మికమైన ఆకర్షణ ఉన్నదని

నా దగ్గరికి వచ్చే మగవారందరి నోటా
ఇవే పొగడ్తలు, ప్రశంసలు
నా నవ్వు వాళ్ళకిష్టం
నా హాస్య చతురత వాళ్ళకిష్టం
నా నడుము, నా జఘనం
అన్నీ అన్నీ వారికెంతో ఇష్టం

కొందరు నాతో
ఒక రాత్రి గడుపుతారు
మరికొందరు రెండు మూడు రాత్రుళ్ళు
కానీ.. చివరికి
వాళ్ళంతా ఎవరిళ్ళకు వారు
వెళ్ళిపోతారు!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.

ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.

బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.

రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here