ఎవరు దోషి?

0
6

[dropcap]రా[/dropcap]జ్యానికి సామంత రాసిన ఉత్తరం చూసినప్పటి నుండి చిర్రెత్తుకొస్తున్నది. ఎన్నిసార్లు విప్పి చదివినా దానిలోని అంశం తాలూకు వివరణ మరీ కోపం తెప్పిస్తోంది. ఇక లాభం లేదు.. మళ్లీ ఆ వుత్తరానికి జవాబు రాసే సమయం తనకు లేదు. ఫోను ద్వారా చెబుదామంటే అది ఫోను వాడదు. వాడో మూర్ఖపు మొగడు. చెబుతే వినడు కొడితే ఏడ్చేలా ఉంటాడు. బెడ్ రూములోకి వెళ్లి చేతికి చిక్కిన చీరలు రెండు బ్యాగులో పెట్టుకుంది. తనకు కావల్సిన వస్తువులన్నీ హ్యాండు బ్యాగులోకుక్కుకొని బయటకు వచ్చి తలపులు మూసి తాళం వెయ్యబోయ్యేంతలో వెనగ్గా భర్త కారు హారన్ వినబడి వెళ్లి గేటు తీసింది.

రాఘవకు చెబుతే తనను పంపడు. అందుకే అతను రాకముందే రాయగిరి వెళ్లాలని తాను చేసిన ప్రయత్నం. అది దెబ్బతిన్నందుకు మనసులో గుబులును కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ.. “ఏంటి? ఈరోజు తొందరగానే వచ్చినట్లున్నారు” అని రాని నవ్వును పులుముకుంటూ భర్తకు ఎదురెళ్లి పలుకరించింది.

అవేమీ పట్టని రాఘవ “ఒకసారి నీ మొఖాన్ని అద్దంలో చూసుకున్నావా?” అన్నాడు భార్యనుద్దేశించి.

ఇప్పుడు నా ముఖానికేం తక్కువైందిగానీ, నేను మీ సామంత దగ్గరికి వెళ్ళుతున్నాను. కాస్త బస్సు స్టాండులో దించుదురు బాబూ!” లోలోపల తన ముఖానికి ఏమైందబ్బా అని చేతులతో ముఖాన్ని తడుముకొని చూసుకుంది. నుదుట ఉండాల్సిన బొట్టు చేతికి తగలలేదు. ‘ఈ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే! చెట్టంత మగడు ఎదురుగా వున్నా, భార్యల నుదుటిపై తమ తలరాతలను పెట్టుకుంటారు ఎన్ని ఆదర్శ భావాలున్నా ఏం లాభం? లోపల పాతుకొని పోయిన భావాలు ఎక్కడికి పోతాయి’ విసుగ్గా అనుకుంది.

 “కాస్త నామొహాన చాయ్ అన్నా పోయి రాజీ! తర్వాత దింపుతా కానీ, అయినా సామంత దగ్గరికి వెళ్ళడానికి ఇంత అర్జంటు పనేమోచ్చిందేంటి?” ఇంట్లోకి నడుస్తూ అన్నాడు రాఘవ.

 “ఇదిగో! మీరే చూడండి మీ ముద్దుల చెల్లెలి ఉత్తరం” బ్యాగులోనుంచి తీసి ఉత్తరాన్ని భర్తచేతిలో పెట్టి వంటింట్లోకి నడిచింది.

 రాఘవ లోపలికొచ్చి, తీరిగ్గా సోఫాలో చేరిగలబడి చెల్లెలు రాసిన ఉత్తరం చదవసాగాడు. రెండుసార్లు చదివినా అందులో వున్న విషయం అర్థం కాక నుదురు పట్టుకున్నాడు.

“ఇప్పుడర్ధం అయిందా! నేను ఎందుకు ప్రయాణం అవుతున్నానో?” అంటూ భర్త చేతిలో ఓ కప్పుపెట్టి తనూ ఓ కప్పులో టీ తాగుతూ భర్త ఎదురుగా వున్న సోఫాలో కూర్చుంది.

భార్యవైపు ఏమీ అర్ధం కానివాడిలా మొహం పెట్టి.. “అసలే౦ జరిగిందని నువ్వంత హడావిడి చేస్తున్నావు? ఈ ఉత్తరంలో అంత సీరియస్ విషయం ఏముందని? నేను వాణికి ఫోన్ చేస్తాను. సంధ్యను తీసుకొని వాళ్ళనే మనింటికి రమ్మనమని చెబుతాను. నువ్వేమి కంగారు పడకు. నీకసలే ఆరోగ్యం బాగాలేదు. రేపెలాగూ ఆదివారమేకదా! అందరం స్థిమితంగా కూర్చొని మాట్లాడుకుందాం! నువ్వెళ్ళి నుదుటన బొట్టు పెట్టుకో! ఆ మొహం చూడలేకపోతున్నాను” అన్నాడు కాస్త విసుగ్గా.

సామంత రాఘవకు ఒక్కగానొక్క చెల్లెలు. తల్లీ, తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో నాన్నమ్మ, తాతయ్యలే వారిద్దరిని పెంచి పెద్దచేసారు. సామంత డిగ్రీవరకు చదువుకుంది. వున్నఊరులోనే మంచి ఆస్తిపరులైన దూరపు బంధువుల అబ్బాయి మహేందరుకిచ్చి పెండ్లి చేసారు. మహేందర్ ఏజీ బిఎస్సి చేసి ఉండటంతో ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డాడు. ఆర్గానిక్ పంటలు పండిస్తూ కాస్త చాదస్తంగా ఉంటాడు. పెళ్ళై పాతికేళ్ళలో ఎన్నోసార్లు సిటీకి వచ్చినా, ఏరోజూ కూడా వీళ్ళింటికి వచ్చిన పాపాన పోలేదు. వాళ్ళిద్దరి ఒక్కగానొక్క కూతురు వాణి. మెడిసన్ నాలుగవ సంవత్సరం హైదరాబాదులో హాస్టలులోనే వుంటూ చదువుకుంటోoది.

రాఘవ పంచాయితీ ఆఫీసులో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ హైదరాబాదులోనే స్థిరపడ్డాడు. రాజ్యం అసలు పేరు రాజేశ్వరి. రాజేశ్వరి రాఘవ ఆఫీసులో పనిచేస్తున్న అనందంగారి అమ్మాయి. ఆనందంగారితో బాగా చనువు వుండడం వలన అతని ఆహ్వానం మేరా వాళ్ళింటికి ఎక్కువగా వెళ్తూ వుండడం, అక్కడ వాళ్ళ పెద్ద అమ్మాయితో పరిచయం ప్రేమ మెట్లను ఎక్కించింది. చెల్లెలి పెండ్లి కూడా అయిపోవడంతో రాజేశ్వరిని వివాహం చేసుకోవడానికి అతనికి కులం అడ్డం రాలేదు. ఇద్దరు పెద్దల సమక్షంలో రిజిష్టర్ మారేజి చేసుకుని హాయిగావుంటున్నారు.

వాళ్లకు ఇద్దరూ కూతుర్లు. రాజేశ్వరి తల్లిదండ్రులిద్దరూ రెండు నెలల వ్యవదిలో చనిపోవడం వల్ల ఆడపిల్లకు పెళ్లి చేస్తే మంచిదని అందరూ చెప్పడంతో.. బిటెక్ చేసిన పెద్దకూతురు వింద్యకు కిందటేడాదే పెండ్లిచేసారు. అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నకూతురు సంధ్య అత్త దగ్గర ప్రశాంతంగా ఉంటుందని సివిల్స్ ప్రిపేర్ కావటానికి రెండు నెలలుగా అక్కడే వుండి ప్రిపేర్ అవుతుంది. చదువు డిష్ట్రబ్ అవుతుందని సెల్ ఫోనును కూడా ఇంట్లోనే పడేసి వెళ్ళిపోయింది.

రాఘవ వాణికి ఫోను చేసి విషయం చెబుతూ “రేపు అమ్మా, నాన్నలను తీసుకొని సంధ్యను రమ్మనమని పక్కింటి చెన్నయ్యకు కాల్ చేసి చెప్పాను. నువ్వూరా తల్లీ!” అని పిలిచాడు.

***

 తెల్లారి ఉదయం 8 గంటలు కావస్తుండగా వాణి హాస్టల్ నుండి మేనమామ ఇంటికి వచ్చింది. తను వచ్చేటప్పటికి మామ లేకపోవటంతో మెల్లగా అత్త దగ్గరికి చేరి “అసలేమైంది అత్తా..! అమ్మా, నాన్నలు మళ్లీ గోడవపడ్డారా? లేక సంధ్య ఏమైనా ప్రాబ్లమ్ చేసిందా? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? అత్తా చెప్పవూ” అంటూ రాజ్యం బుగ్గలు పట్టుకొని గారంగా అడిగింది.

 “మీ అమ్మ ఒక ఉత్తరం రాసింది వాణీ.. నేను తన నుండి అలాంటి ఉత్తరం ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించ లేదసలు. ఇంత దుఃఖాన్ని మోస్తూ కూడా తానేనాడూ బయటపడలేదు. అది చూసి నా మనసు అల్లకల్లోలోం అయింది. నువ్వుకూడా ఏరోజూ మాకా విషయాలను చెప్పనే లేదు. నీకా ఉత్తరం ఇస్తా వాణి దాన్ని చదువుతే నీకే తెలుస్తుంది” అంటూ బెడ్ రూములోకి పోయి రాత్రి బెడ్ కింద దాచిన సామంత రాసిన ఉత్తరం తీసి ఇచ్చింది రాజ్యం.

 వుత్తరం చదివిన వాణికి తల తిరిగినట్లైంది. చదివిన ఉత్తరాన్ని మడతపెట్టి తన హ్యాండ్ బ్యాగులో పెట్టుకుంటూ అనుకుంది. తల్లి ఆలోచనలో వున్న నిజం తనకు ఇన్నిరోజులూ తెలియక కాదు… తెల్సి ఏమీ చేయలేకనే తను వారికి దూరంగా వచ్చి తన చదువేదో చదువుకుంటుంది. ఇంత సడెన్‌గా నిర్ణయం చేసుకోవ్వడానికి కారణం ఏమై వుంటుందో? తల్లి పడుతున్న బాధా, వేదనా గుర్తుకు వచ్చి దుఃఖం గొంతులోకి తన్నుక వచ్చినట్లైంది.. అక్కడే వుంటే కన్నీళ్ళు తన చెక్కిళ్ళను ఎక్కడ తడిపేస్తాయోనని అత్త ముందునుండి కదిలి హాల్లోకి వెళ్ళి కూర్చుంది.

***

సామంత, సంధ్యా ఊరినుంచి వచ్చి చాలాసేపైంది. మహేందరు రాకపోవడమే మంచిదైంది. లేకుంటే అతని ముందు మనసువిప్పి మాట్లాడుకునే వీలు వుండదు మనసులో అనుకుంది రాజేశ్వరి.

 ఎవరూ ఎవరితో మాటలు కలుపలేదు. అంతా పొడిపొడిగా వుంది వాతావవరణం. రాజ్యం వంట అయిపోయినట్లుగా మౌనంగావున్న అందరినీ గమనిస్తూ డైనింగ్ టేబుల్ మీద వండిన పదార్దాలన్నింటినీ గిన్నెల్లోకి సర్దిపెట్టింది. రాఘవ అది గమనించినట్లుగా టేబుల్ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.. లోపల రూములో కూర్చొని టీవీ చూస్తున్న వాణీ, సంధ్యలను కేకేసాడు.. సామంత మాట్లాడకుండా వచ్చి అన్న పక్కన కుర్చీలో కూర్చుంది. వాణీ, సంధ్య వచ్చి సామంతకు ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.

 రాజ్యం అందరికీ వడ్డించి భర్తకు ఎదురుగా వచ్చి కూర్చుంది. మౌనాన్ని ఛేదిస్తూ రాఘవ సామంత వైపు చూస్తూ “ఈ వయసులో నీకు ఇదేo పాడు బుద్ది సామంత. పిల్ల పెండ్లీడుకు వచ్చింది. నీకసలు బుద్దు౦దా? లోకం ఏo అనుకుంటుందో ఆలోచించావా? అయినా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు నువ్వు కొత్తగా పడుతున్న కష్టాలు ఏoటో చెప్పు…” కాస్త విసుగ్గానే అడిగాడు.

 సామంత సిగ్గుతో తల దించుకుంది.. అన్నను ఎలా కన్వీన్స్ చేయాలా అని ఆలోచిస్తూ కంచంలో అన్నం కెలుకుతూ ఉంది.

 రాజ్యం భర్తను కోప్పడుతూ “భోజనాలు అయిపోయినాక మాట్లడవచ్చులేండి. ప్రశాంతంగా ముందు భోజనాలు చేయండి” విసుగ్గా అంది. రాఘవ మౌనo వహించడంతో అందరూ భోజనాలు ముగించి హాల్లోకి వచ్చి కూర్చున్నారు.

“సంధ్య నువ్వు అక్కడికి వెళ్లి రెండు నెలలు కావస్తూ ఉంది. అక్కడ జరుగుతున్న విషయాలు నాకు చెప్పాలని నీకేందుకు అనిపించలేదు” కూతురును ఉద్దేశించి కటువుగా అన్నాడు.

“నేను వాణీకి ఎప్పటి విషయాలు అప్పుడే చెబుతూనే ఉన్నాను డాడీ. నిజానికి అత్త కూడా నన్ను నీకు చెప్పొద్దని అంది. తనే ఒక నిర్ణయం తీసుకున్నాక స్వయంగా నీకు చెప్పాలని అనుకుంది. ఈ విషయాలన్నీ వాణీకి మొదటి నుంచి తెలుసు. అసలీ నిర్ణయం కూడా ఇద్దరూ కల్సే అనుకున్నారు. కాకపోతే అత్త సడన్ గా మీకు చెప్పింది అంతే!”

 రాఘవ ప్రశ్నార్ధకరంగా వాణీ వైపు చూసాడు నిజామా అన్నట్లుగా. వాణీ తలను ది౦చుకుంది సంధ్య చెబుతున్నది నిజమేనన్నట్లుగా.

 రాఘవకు కోపం తన్నుక వచ్చింది. “తల్లీ కూతుర్లిద్దరూ నిర్ణయం తీసుకున్నాక ఇక ఇప్పుడు నేను మాత్రం ఏo చేయగలనులే” అన్నాడు నిష్టూరంగా.

“అదికాదు అన్నయ్యా! మీ ఇద్దరికీ అసలే ఆరోగ్యం బాగాలేదు కదా. మా విషయాలు చెప్పి ముఖ్యంగా నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక చెప్పలేదు. నువ్వు కోపంతో మహేందర్ ను పిలిచి కోప్పడతావేమోనని భయంవేసి కూడా చెప్పలేకపోయాను.”

“అవును… మా ఆరోగ్యాలు ఆలోచించావు గానీ, నువ్వంటే నాకున్న ప్రేమను అర్ధం చేసుకోలేకపోయావు” కోపంగా అన్నడు రాఘవ.

“లేదన్నయ్యా! మహేందరులో ఇక మార్పు రాదని నిర్ణయించుకున్నాకే నేనీ నిర్ణయం తీసుకున్నాను. మనసు చంపుకుని ఎన్నిరోజులని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అందుకే ఇక నాకు అక్కడ వుండాలని అనిపించడం లేదు.. అందుకే వదినకు ఆ లేఖ రాసాను.”

“అలా ఎందుకు అనుకుంటావు సామంతా.. మేం లేమా?.. వాడిని ఊరికనే అలా ఎలా వదిలేస్తాను? ఇన్నేళ్ళ అనుబంధంలో వాడు అర్థం చేసుకుంది ఇదా? అసలు నువ్వు చాలా పొరపాటు చేసావు. వాడెప్పుడు నిన్ను వంచించడం మొదలు పెట్టాడో అప్పుడే చెబుతే ఆనాడే విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు హాయిగా బతికి వుండేవాళ్ళు.”

“నాకూ తెలియదుగా అన్నయ్యా? అతను ఏ రోజు నిజాన్ని మాట్లాడి ఎరుగడు. ఏదైనా మాట్లాడబోతే నువ్వు హైదరాబాదులోలా బతకాలంటే నాతో కుదరదు. కావాలంటే నువ్వెళ్ళి మీ అన్నయ్య వాళ్ళింట్లో వుండు అని నానోరు మూయించేవాడు. అత్తయ్యా,మామయ్యా చనిపోయెంత వరకూ ఓపిక పట్టాను. వాళ్ళను ఆ వయసులో ఇబ్బంది పెట్టొద్దని. అయినా మామయ్య చనిపోయినప్పుడు, ఆమె మా ఇంటికి వచ్చేదాకా వ్యవహారం ఇంత ముదిరిపోయిందని తెల్సుకోలేక పోయాను.”

“ఎవరామె…అంత చిన్న ఊర్లో నువ్వ తెల్సుకోవడానికి ఇంత కాలం పట్టిందంటే ఇది ఇప్పటి వ్యవహారం కాదని అనిపిస్తోంది.”

“అవునండీ.. మీకు పది సంవత్సరాల కిందటే నేను చేప్పబోయాను మహేందర్ గురించి కొన్ని విషయాలు, గుర్తుందా? మీరప్పుడు నన్నే కోప్పడ్డారు. అనవసరంగా వాళ్ళ మధ్య అనుమానాలు రేపకూ.. అలా వుంటే మా అత్తయ్యా, మామయ్యలు ఎందుకు సామంతను చేసుకుంటారు అని నానోరు మూయించారు.. అప్పుడే నామాట విని వుంటే ఇప్పుడు ఇలా ఆలోచించేవాళ్ళం కాదుగా” భర్త తన మాట ఆనాడు వినలేదన్న అక్కసుతో కూడిన కోపంతో అంది రాజ్యం.

“అవును రాజ్యం నీ మాటను ఆనాడే విని వుంటే మహేందర్ని, అత్తయ్య మామాయ్యలను ఆరోజే నిలదీసి వుండేవాడిని. వ్యవహారాలన్నీ అప్పుడే తేలిపొయ్యేవి. పెళ్లికి ముందు ఏవీ చెప్పకుండా వాళ్ళింత దుర్మార్గానికి ఒడికడతారని అనుకోలేదు” నుదురును రుద్దుకుంటూ అన్నాడు రాఘవ.

“మామయ్య మీరు అనవసరంగా ఆలోచించకండి.. మీకు అసలే ఆరోగ్యం బాగాలేదూ. హార్ట్ సర్జరీ అయి సంవత్సరం కూడా కాలేదు.. అమ్మ అందకే మీకు తెలియకుండా ఇన్నిరోజులూ జాగ్రత్త పడింది.”

“అవును నాన్నా.. అనవసరంగా హైరానా పడకండీ. డాక్టర్లు మరీమరీ చెప్పారు రిస్కు తీసుకోవద్దని” అంది తండ్రినే గమనిస్తున్న సంధ్య .

“నాకేం కాదులేరా సంధ్యా.. అత్తకు ఇన్ని కష్టాలు వున్నాయని ఏరోజూ నువ్వు కూడా చెప్పలేదు. రెండు నెలలుగా అత్త దగ్గర వుంటూ ఒక్క ఫోనును కూడా చేసి చెప్పలేకపోయావు” నిష్టూరంగా కూతురును విసుక్కున్నాడు.

***

రాఘవ తనను తాను చాలాసార్లు తిట్టుకున్నాడు. ఈ వయసులో తన చెల్లెలికి దుఃఖాన్ని కలిగించిన మహేందరును చంపాలన్నంత కోపం వచ్చినా ఆపుకుని గృహప్రవేశకార్యక్రమం అయ్యేంతవరకు మౌనంగా ఉండిపోయాడు. వచ్చిన బంధువులందరూ చాటుమాటుగా నోరు నొక్కుకోవడం చూసి సిగ్గుతో తలదించుకున్నాడు.

మూడో రోజు ఇంటికివచ్చిన చెల్లెలు, మహేందరును చూసి మౌనంగా తన రూములోకి వెళ్లి తలుపేసుకొని లోపల కూర్చున్నాడు. రాజేశ్వరి తలుపు తీయమని ఎంత మొత్తుకున్నా తలుపు తీయకుండా భీష్మించుకుని బయటకు రాలేదు.

అర్ధగంట అయినాక మహేందరే వెళ్లి తలుపు కొట్టి “బావా! నన్ను క్షమించు! నేను తెల్సి చేసినా, తెలియక చేసినా తప్పే చేసాను. నా తప్పును ఒప్పుకుంటున్నాను. అమ్మా,నాన్నలు కులాంతర పెండ్లికి ఆరోజు ఒప్పుకోలేదు. అందుకే సామంతను పెండ్లిచేసుకోవల్సి వచ్చింది. నీకైనా చెబుతానని పట్టుబట్టాను. అమ్మ ఒప్పుకోలేదు. నీకు చెబితే తను ఉరివేసుకుంటానని బెదిరించింది. తప్పని పరిస్థితిలో నేను సామంతను పెండ్లి చేసుకోక తప్పలేదు. సామంతకు ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. చెప్పి బాధపెట్టడం కన్నా చెప్పకుండా వుండటమే మేలని అవుతున్నాను.”

రాఘవ ఏమనుకున్నాడో ఏమో తలుపులు తెరచుకుని బయట హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. మహేందరు రాఘవకు ఎదురుగా కూర్చున్నాడు. రాజేశ్వరీ,సామంత వాళ్ళకెదురుగా వున్న సోఫాలో కూర్చున్నారు. అత్త ఇంటి గృహప్రవేశానికి వచ్చిన వింధ్య, సంధ్య, వాణీలు జరగబోయే ఉపద్రవాన్ని తలచుకుంటూ కూర్చున్నారు.

“మహేందర్ చాలా తెలివిగా మాట్లాడానని అనుకోకు. నేను ఆ రోజుల్లోనే కులాంత వివాహం చేసుకుని ఇద్దరు బిడ్డల్ని కని హాయిగా వున్నాను. నువ్వు ఆనాడే చెబితే నా చెల్లెల్ని అర్ధంతరంగా చదువు మాన్పించి నీకిచ్చి పెండ్లి చేసేవాడ్నికాదూ. దానికి తగ్గవాడిని అదే ఎంచుకునేది? లేకపోతే మాకు ఇష్టమైన వాడు గంతకు దగ్గ బొంత దొరకితే చేసివాడిని. ఇన్ని సంవత్సరాలు నా చెల్లెలు పడిన వేదనకు, దుఃఖానికి కారణం నువ్వు కాదా? పోనీ పెండ్లి అయ్యాక అయినా చెప్పినా దానికి విడాకులు ఇప్పించి మరో వివాహాన్నైనా చేసి వుండేవాడ్ని. అంతా అయిపోయి ఇప్పుడు నడివయసులో అది ఏమై పోవాలని అనుకున్నావు? దాని జీవితం ఇప్పుడు ఏం కావాలి? అలాంటప్పుడు వాణిని ఎందుకు కన్నావు? అందానికి ఒకరు, అందరితో పాటు ఒకరు అనుకుని నీకు నువ్వు సుఖంగానే వున్నావు. నా చెల్లెలు ఏం తప్పు చేసింది? నా చెల్లెలే ఆ తప్పు చేస్తే నువ్వు ఊరుకుంటావా? అది పరువుకో, నన్ను బాధ పెట్టవద్దనో మౌనంగా ఇన్ని రోజులుగా మౌనంగా వుండిపోయింది” రొప్పుతూ గుండె పట్టుకున్నాడు రాఘవా..

వాణీ పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్లి గ్లాసులో మంచినీళ్ళు తీసుకుని వచ్చి మామయ్యకు ఇచ్చిoది. “మీరు ఆవేశపడకండీ మామయ్యా? ఇప్పుడు అయిపోయిన వాటిని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకు? మీరు రెస్టు తీసుకోండి” అంది వాణీ.

రాఘవ కాస్త కుదుట పడ్డాక మహేందర్ లేచి నిలబడుతూ “బావా వెళ్లి వస్తాను” అన్నాడు. రాఘవ ఏమీ మాట్లడకపోయ్యే సరికి మహేందరే తిరిగి రాఘవ చేతులు పట్టుకుని, “సామంత కోరిక మీదనే నేను ఇక్కడ ఇల్లు కొని వాణీ చదువు అయిపోయేంత వరకూ ఉంటారని అన్ని ఏర్పాట్లు చేసాను. అలా అని వాళ్ళిద్దరి బాధ్యతలు మరచి పోతానని అనుకోకు. వాళ్ళిద్దరూ నావాళ్ళు. నేను బతికి ఉన్నంతవరకూ వారికి ఏమీ లోటు చేయనని నీకు మాటమాత్రం ఇవ్వగలను.” అక్కడనుండి బాధతో వెళ్ళిపోయాడు మహేందర్.

***

సామంతకు ఇప్పుడు క్షణం తీరడం లేదు. వాణీ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత తన డిగ్రీ క్లాస్‌మేట్ వనజ పనిచేసే స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా జేరింది. అప్పుడప్పుడు తన మరో స్నేహితురాలు విమలతో కల్సి పర్యావరణంపై అనేక గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో అవగాహనా పాఠాలు చెబుతూ వారిని ఎడ్యుకేట్ చేస్తుంది. తను తిరిగివచ్చిన అనేక ప్రదేశాలలోని వింతలు, విశేషాలు, ప్రజల జీవనవిధానికి సంబంధించిన అనేక పార్శ్యాలను వివరిస్తూ, అక్కడ ప్రజల ఎదుగుదలకు ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన సదుపాయాలను వివరిస్తూ వ్యాసాలు రాస్తుంది.

కాలం ఎవ్వరికోసం ఆగదు. వాణీ పీజీలో సీటు సంపాదించింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో గైనకాలజీ స్పెషలైజేషన్ చేస్తున్నది. నెలకొక సారి మహేందర్ వచ్చి ఇంట్లోకి కావాల్సిన సామాను, ఇతర విషయాలు చూసుకొని, కూతురును శ్రద్దగా చదువుకోమని చెబుతూ వెళ్తున్నాడు. సంధ్య ఎంత కష్టపడ్డా సివిల్స్ కొట్టలేక పోయింది. గ్రూప్-1 ఆఫీసర్‌గా స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాన్ని సాధించింది. నెలకు డెబ్బై వేల జీతాన్ని సంపాదిస్తోంది. ఇద్దరికీ రెండురోజులు సెలవు రావడంతో ఎన్నోరోజులుగా వాయిదా పడుతున్న గోవా ట్రిప్ ను ఈసారి ఎలాగైనా వెళ్లాల్సిందేనని పట్టుబట్టి వాణీ,సంధ్య వెళ్ళిపోయారు.

రాజేశ్వరి సామంతను చూసి వద్దాం రమ్మని రాఘవను బతిమిలాడింది. అతను రానని భీష్మించుకుని కుర్చోవడంతో ఒక్కతే బయలుదేరి సామంత ఇంటికి వచ్చింది. ఒంటరిగా వచ్చిన వదినను చూసి సామంత “అన్నయ్య కూడా వస్తే పొయ్యేది కదా వదినా..” అంది. రాజేశ్వరీ లోపలికికి వెళ్తూ హాల్లో పేపర్ చదువుతూ సోఫాలో కూర్చున్న మహేందర్‌ను చూసి “బాగున్నావా” అని పలుకరించింది. మహేందర్ లేచి నిలబడి తలవూపి మళ్ళీ పేపర్ చదవడంలో మునిగిపోయాడు.

లోపలికి వచ్చిన రాజేశ్వరీ సామంతను చూస్తూ “ఏంటి వారానికే ఒక్కరోజు వస్తున్నాడా లేక ఇక్కడే వుంటున్నాడా” అని ఆశ్చర్యంగా అడిగింది.

సామంత వదిన చేతిలో మంచినీళ్ళ గ్లాసు పెడుతూ “వాణీకి ఏదో పెళ్లి సంబంధం వచ్చిందని చెప్పడానికి వచ్చాడు వదినా. నెలకొకసారి వచ్చినప్పుడు తండ్రీ,కూతురు వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొనుక్కొని వస్తారు. పిల్లకు కావాల్సిన డబ్బేదో దాని చేతిలోపెట్టి వెళ్తున్నాడు. అతను వచ్చినప్పుడు పిల్ల ఇంట్లోనే వుంటుంది కాబట్టి, నేను వంటచేసి టేబుల్ మీదపెడితే వాళ్ళ నాన్నకు వడ్డించి అదీ తింటుంది. ఎంతైనా ఆయన కూతురే కదా.. దాని ప్రేమను కాదనే హక్కు నాకు ఎక్కడుంది” అంది.

“నీతో మాట్లాడడా? అది లేనప్పుడు వస్తే. ఎలా మరి?” రాజేశ్వరీ తన సందేహాన్ని వెలిబుచ్చింది.

“వస్తే ఏముంది వదినా? మేమేమైనా శత్రువులమా? కొట్టుకొని, పరువు తీసుకుని బజారున పడ్డామా? ఎంతైనా.. భార్యాభర్తలమే కదా! నాకతని మీద ఎలాంటి ఈర్ష్యా, ద్వేషాలు లేవు. పగలు, సాధింపులు లేవు. అతను అతనికిష్టమొచ్చినట్లుగా అతను జీవిస్తున్నాడు. నేనేలా జీవించాలని కోరుకున్నానో నేను అలాగే సంతోషంగా వున్నాను. తల్లిదండ్రులకు భయపడో, సమాజానికి వెరసో నన్ను కష్టంగా పెండ్లి చేసుకుంది అతను. నేను పూర్తి విశ్వాసంతో అతన్ని కావాలనుకున్నాను. కాకపోతే, మా మనసులు కలవకపోయింతం మాత్రాన మేము భార్యాభర్తలం కాకుండా పోలేము కదా! ఒక భర్తగా అతను నా నమ్మకాన్ని ఒమ్ము చేసి వుండవచ్చు. అంతమాత్రాన అతను సమాజంలోని అందరికీ చెడ్డవాడు కాదుగా వదినా.

నిజానికి మొదట్లో నువ్వన్నట్లుగా నేను చాలా బాధపడినమాట వాస్తవమే! ఆలోచించి ఆలోచించి కొన్నిరోజులు మనసు పాడుచేసుకున్నాను. దానివలన మనఃశాంతి కోల్పోయాను. నాలోనేనే మదనపడుతూ నన్ను నేను ప్రేమించుకోవడం మానివేసాను. నామీద నాకే కోపం వచ్చేది. మళ్ళీ నామీద నాకే జాలి వేసేది. బాగా ఆలోచించగా నా ఒంటరితనాన్ని మాయం చేసే నా నేస్తాలు మా ఊరి గ్రంథాలయంలో కనిపించాయి. అప్పటినుండి పెండ్లికి మందు వదిలేసిన సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టాను. నాలోనాకు తెలియకుండానే ఏదో మార్పు కనిపించింది. అనవసరంగా ఇన్నిరోజులు సాహిత్యాన్ని మరచిపోయినందుకు సిగ్గనిపించింది. లేని దాని గురించి ఆలోచిస్తూ నాలో వున్న లోపలి మనిషిని ఇన్గుని రోజులూ గుర్తించలేక పోయాను. కలవని మనసులను ఒక చోట బంధించడం కష్టమనిపించింది. అందుకే నా నిర్ణయాన్ని నీకా ఉత్తరంలో రాసాను.

వదినా.. అయినా నేనిప్పుడు ఏభైలోపడ్డాను. ఈ వయసులో అరచి, యాగిచేసి, గొడవ పడితే నష్టం అతనికే కాదూ.. నాక్కూడా. రేపు పిల్ల పెళ్లి చేయాలి. వచ్చినవాళ్ళు మీ నాన్న ఏడని అడిగితే అది ఏమని సమాధానం చెబుతుంది? ఇవన్నీ ఆలోచించే ఆయన ఇంటికి వచ్చిపోవడానికి ఒప్పుకున్నాను. అంతే గానీ అతనితో ఇక్కడ సంసారం చేసి ఆదర్శ దంపతులుగా నిలిచిపోవడానికి కాదూ. అతనితో మాట్లాడ కూడదని అనుకున్నానే కానీ పరువుదీసుకునే పిచ్చిపనులు చేయదలచుకోలేదు. ఏదైనా సమస్యను సామరస్యంతో పరిష్కరించుకోవాలి. రోడ్డుమీద పడి, కోర్టుల చుట్టూ, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగితే లాభనష్టాలు ఎట్లా వున్నా, కాలంతో పాటు డబ్బు, డబ్బుతో పాటు పరువు, పరువుతో పాటు మనఃశాంతి కోల్పోవడమే తప్పా లాభం ఏమీ వుండదు.. కాదంటావా వదినా?”

రాజేశ్వరీ సామంతను కౌగలించుకుని “ఎంత ఎదిగిపోయావు సామంతా? అక్కడ మీ అన్నయ్య చూడు మా సామంతకు నేను ద్రోహం చేసాను అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఒకే రక్తసంబంధం కలిగిన మీఇద్దరి మధ్య, ఇద్దరి ఆలోచనల మధ్య ఇంత వ్యత్యాసం వుంది. నవ్వు జీవితాన్ని అర్ధం చేసుకున్న విధానం చాలా బాగుంది సామంత” అంది సంతోషంతో రాజేశ్వరీ.

***

ఆరు సంవత్సరాల తర్వాత వింధ్య అమెరికా నుండి తన ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకుని మొదటిసారిగా ఇండియా రావడంతో రాఘవ సామంతను, వాణీని రమ్మని కబురు చేస్తే వచ్చారు. వింధ్య అమెరికానుండి ఎవరెవరికి ఏమేమి వస్తువులు తెచ్చిందో ఒక్కొక్కటి తీసి చూపిస్తోంది. వాణీ ఇది మహేందర్ మామయ్యకు వాచీ అంటూ ఇచ్చి ఏడీ మామయ్య రాలేదు అని అడిగింది వాణిని. అందరూ మౌనం వహించడంతో మామయ్యను పిలువండి డాడీ. మనుషులు తప్పు చేయడం సహజం. అత్తకు అన్యాయం జరిగింది కాదనను. దానికి అతను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయిందట. మామయ్య ఇప్పుడు అక్కడ ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడట. మొన్నీమధ్య మామయ్యకు కూడా హార్ట్ స్టోక్ వచ్చిందని వాణీ చెప్పింది. మనమందరం వుండి అతన్ని అలా అనాధగా అక్కడ వదిలివేయడం ఏమన్నా బాగుందా?”

“మాకు తెలియని విషయాలు నీకు బాగానే తెలిసాయే..” అన్నాడు రాఘవ కాస్త వెటకారంగా.

“ఆ విషయాలే కాదూ డాడీ మన సంధ్య, వాణీ కూడా ఇద్దరు అబ్బాయిలను ప్రేమిస్తున్నారు. వాళ్ళను పెండ్లి చేసుకోవడానికి వాళ్ళిప్పుడు సిద్దపడ్డారు. నేనసలు ఆ పనిమీదనే ఇదో వంక బెట్టుకుని వచ్చాను. మామయ్యను పిలిపిస్తే ఆ అబ్బాయిలను రమ్మనమని కబురు పంపిస్తాను” కొత్త్తగా వచ్చిన పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ అంది వింధ్య.

మరునాడు మహేందర్‌తో పాటు వాణీ, సంధ్యలు చేసుకోబోయే అబ్బాయిల కుటుంబాలు కూడా రావడం. వాళ్ళు, వీళ్ళు పరిచయాలు, తదితర మాటలు అన్నీ స్నేహపూర్వకంగా అయిపోయాక రెండు పెండ్లిళ్ళు ఒకేసారి, ఒకే స్టేజీ మీద దండలు మార్చుకోవాలన్న నిశ్చయం జరిగిపోయింది.

సమాజపరిణామ క్రమంలో మనుషులతో పాటు, వారి ఆలోచనలు మారట్లేదని ఇన్నిరోజులుగా అనుకున్న తనకి, మార్పు తనతోనే అంతం కాకుండా తన వారసులుగా ఈ రోజు వాణీ, సంధ్యలు కులాంతర వివాహాలు ఏ ఆర్బాటాలు లేకుండా స్టేజీ పెండ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు రావడం ఎంతో ఆనందగా వుంది.. కులాంతర వివాహాలు చేయాలన్న ఆశయాలను నమ్మిన తాము ఆచరణలో ఉండటమే కాదు, రేపటి కాలానికి ప్రతినిధులను తాము రెండో తరానికి నిలబెట్టబోతున్నారు. చాలా రోజుల తర్వాత ఆ రోజు రాఘవ, రాజేశ్వరీలతో పాటు మహేందర్, సామంతలు కూడా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here