[box type=’note’ fontsize=’16’] “వొక్కో కథా ఆ పాత్ర చెబుతున్నప్పుడు మనం వొక్కో అంచనా వేసుకుంటాము, వొక్కో వూహ చేసుకుంటాము. అంతలోనే సంభాషణలలో దొర్లే మరో కథాత్మక సంభాషణలు మన ఆలోచనలు తారుమారు చేస్తాయి” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ఎవరు?’ సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]అ[/dropcap]ప్పట్లో ఎవరు హాల్లో చాన్నాళ్ళే ఆడినా నాకు చూడటం వీలు పడలేదు. అంతకు ముందు అమితాభ్ నటించిన “బదలా” చూసినప్పటికీ తెలుగులో కూడా చూడాలని అనుకున్నా. వొక కారణం అడివి శేష్. అతని మొదటి చిత్రం “కర్మ” చూశాను. అది నచ్చకపోయినా కథనం బాగుందని అనిపించింది. ఆ తర్వాత “క్షణం”, “గూఢచారి” చిత్రాలు చూశాను. తన బలాలూ బలహీనతలూ తెలుసనుకుంటాను. రొమాన్స్ లో మెప్పించలేడు కానీ సస్పెన్స్ సినెమాలు బాగానే చేస్తాడు. నటనలో సగ భాగం సంభాషణా చాతుర్యం. ఇందులో అతను తనే చెప్పినట్లైతే బాగా నటించాడు అని వొప్పుకోవచ్చు. ఇక అభివ్యక్తీ, వ్యక్తీకరణలు పర్లేదు. అమితాభ్ సినెమా చూసిన తర్వాత తెలుగు సినెమా చూస్తారా, చూసినా నచ్చుతుందా అన్న సంశయం నాకైతే లేదు. రెంటినీ పోల్చే ప్రయత్నం చెయ్యకుండానే చూడాలని అనుకున్నా, అలానే చూశా. వొక మంచి చిత్రమే, అమేజాన్ ప్రైం లో వుంది, చూడని వాళ్ళు చూడండి.
కూన్నూర్ లో డీ ఎస్ పీ అశోక్ కృష్ణ (నవీన్ చంద్ర) తనను రేప్ చెయ్యబోతే సమీర (రెజీనా కసాండ్రా) స్వయం రక్షణార్థం అతన్ని కాల్చి చంపేస్తుంది. ఆమె వొక పరిశ్రమవేత్త అయిన రాహుల్ (సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్) భార్య కావడం వల్ల ఈ వార్తకు ప్రచారం బాగానే జరుగుతుంది. నిజంగా అశోక్ అపరాధా?, సమీర చెబుతున్నది నిజమా అన్న సంశయం అందరిలో. అయితే కోర్టుకు తీర్పు వినిపించడానికి కావాల్సింది సాక్ష్యాలే తప్ప మనోభావాలు, సంవేదనలు, ఉహా ప్రతిపాదనలు కాదు. ఇప్పుడు ఫోకస్ తన మీద కూడా వుంది కాబట్టి సమీరా తన తరపున బెనర్జీ అనే లాయర్ను నియమిస్తుంది. మొదట్లోనే బెనర్జీ ఫోన్ చేసి తను అత్యవసరంగా ఈ కేస్ విషయంలోనే వెళ్ళాల్సి వస్తోందని చెబుతాడు. పోలీసు సిబ్బంది కీ ఇది వొక ప్రతిష్ఠాత్మకమైన కేసు. ఆ డి ఎస్ పి నేరస్తుడు అని రుజువైతే పరువు పోతుంది. వాళ్ళు రత్నాకర్ అనే లాయర్ని నియమించుకుంటారు. అతను కేసు నెగ్గడం కోసం అవసరమైతే లేని రుజువులూ, దొంగ సాక్ష్యాలూ కనిపెట్టగల దిట్ట. సమీరకు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన సందర్భం అని తెలియబరుస్తాడు. తను మాట్లాడడానికి విక్రం (అడివి శేష్) అన్న పోలీసాఫీసర్ను పంపిస్తున్నానని చెబుతాడు. అతనూ పోలీసేగా అంటుంది. అవును కాని డబ్బు కోసం ఏమైనా చెయ్యగల అతను, ముందే అతని ఖాతాలో పాతిక లక్షలు వేశాననీ కేసు ఎటు తిరిగినా తమకు భయం లేదనీ చెబుతాడు. సినెమా సింహ భాగం వొకింట్లోనే వాళ్ళిద్దరి మధ్యా సంభాషణల రూపంలో సాగుతుంది. ఇద్దరూ పరస్పరం కథలు/సంఘటనలు వివరించేటప్పుడు కెమెరా కన్ను బయటికి వెళ్ళి వాళ్ళు చెబుతున్నవన్నీ దృశ్యాలుగా మనకు చూపుతుంది. వొక పరిశ్రమలో ఆరేళ్ళు రిసెప్షనిస్టుగా పనిచేసిన సమీర తర్వాత అదే పారిశ్రామికవేత్తను చేసుకుంటుందనీ, అతను గే కాబట్టి సంఘ మర్యాదకోసం మాత్రమే పెళ్ళి చేసుకుంటున్నానని చెప్పే చేసుకుంటాడనీ తెలుస్తుంది. ఇక నేర స్థలంలో చనిపోయిన అశోక్ ఇదివరకు ఆమెను ప్రేమించిన మనిషనీ తెలుస్తుంది. ఈ త్రికోణ కథతో ముడివేసుకున్న మరో కథ వో భార్యా-భర్తా-కొడుకుల కుటుంబానిది. ఏడాది క్రితం నుంచీ కనబడని భర్త, అతనికోసం నానా హైరానా పడుతున్న తల్లి కొడుకులు. అసలు వొక్కో కథా ఆ పాత్ర చెబుతున్నప్పుడు మనం వొక్కో అంచనా వేసుకుంటాము, వొక్కో వూహ చేసుకుంటాము. అంతలోనే సంభాషణలలో దొర్లే మరో కథాత్మక సంభాషణ మన ఆలోచనలు తారుమారు చేస్తాయి. సమీర కాసేపు వో బాధితురాలిగా, ఇంకాసేపు కపటిలా తోస్తుంది. నిజమేమిటో తెలియాలంటే సినెమా చూడాల్సిందే.
వొక స్పానిష్ చిత్రం Contratiempo చాలా చిత్రాలకు మాతృక. బదలా, ఎవరు చిత్రాలతో సహా. నేను మూలాన్ని ఇంకా చూడాల్సే వుంది. అయితే హిందీ తెలుగు చిత్రాలు చూసిన అనుభవం తో దర్శకులిద్దరూ చక్కగా మన వాతావరణానికి తగ్గట్టుగా రూపాంతరం చేశారని చెప్పక తప్పదు.
వెంకట్ రాంజి దీనికి దర్శకుడు. మొదటి చిత్రమే అయినా అతని ప్రతిభ ప్రశంసనీయంగా వుంది. వొక స్పానిష్ కథను తెలుగు వాతావరణానికీ, జీవితానికీ చాలా చక్కగా రూపాంతరం చేశాడు, అబ్బూరి రవి సాయంతో. ఇక అబ్బూరి రవి సంభాషణలు చాలా చక్కగా వున్నాయి, పాత్రలు చక్కగా పలికారు కూడా. ఈ విషయంలో చాలా తృప్తిగా అనిపించింది. పచ్చిపులుసు వంశీ చాయాగ్రహణం ఎక్కువ భాగం రాత్రిలో వుండే పల్చటి వెలుతురులో, గదిలో ఫొకుస్ లైట్లలో పాత్రల ముఖ కవళికలు పట్టుకోవడంలో, కదలికలలో అన్నిటా కథను, దాని మూడ్ నూ అనుసరించి వుంది. చాలా మెచ్చుకోతగట్టుగా వుంది. పాకాల శ్రీచరణ్ నేపథ్య సంగీతం కూడా మనల్ని సినెమాకు కట్టిపడెయ్యడంలో పెద్ద పాత్ర వహిస్తుంది. ఇక రెజినా కసాండ్రా చిత్రం చూడటం నాకు ఇది మొదటిసారి. నేను తెలుగు చిత్రాలు చూడటం తక్కువ కాబట్టి. ఒప్పుకోవాల్సిందే, ఆమె అందంగానూ వుంది, ఆమె అభినయం కూడా అందంగా వుంది. ఇప్పుడు నేనీ మాట అంటే మీరు నవ్వుతారేమో, నవ్వుకోండి; నా తెలుగు చిత్రాల జ్ఞానం అంతే!
బదలా చూసాము అనుకుంటున్న వారికి వొక మాట అదనంగా చెప్పాలి. బదలా కి ఎవరు కీ మధ్య చాలా తేడాలున్నాయి. దేని ఫ్లేవర్ దానిదే. ఇది స్పానిష్ చిత్రానికి రూపాంతరం కాకపోతే ఆ క్రెడిట్ అంతా మనం కొట్టెయ్యమా?! అయినా మన వెన్ను మనం తట్టుకోవాల్సిన సందర్భమే.