“Evening Shadows”: India coming out of the closet

0
3

[box type=’note’ fontsize=’16’] “నిజ జీవితంలోని చాలా కాంప్లెక్ష్ కథను, సినెమా కోసం కొంచెం స్వేచ్చ తీసుకుని నడిపారు” అంటూ ‘Evening Shadows’ సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]కొ[/dropcap]న్నిసార్లు ముందు రావాల్సిన చిత్రాలు తర్వాత, తర్వాత రావాల్సిన చిత్రాలు ముందూ వస్తుంటాయి. ఈ వారం నిరుడు వచ్చిన “ఈవెనింగ్ షేడోస్” అన్న హిందీ చిత్రం గురించి చూద్దాం. ఇది నెట్ఫ్లిక్స్ లో వుంది.

అది శ్రీరంగపట్టణం. ఇంట్లో యేదో పూజా కార్యక్రమానికి నాలుగేళ్ళ తర్వాత ముంబై నుంచి కొడుకు కార్తీక్ (దేవాంశ్ దోశి) వస్తున్నాడు. అయితే పూజతో పాటు అతనికోసం వో సర్ప్రైస్ వేచి వుంటుంది. అతనికోసం పెళ్ళిచూపుల యేర్పాట్లూ చేసి వుంచుతారు తల్లి వసుధ (మోనా అంబేగాఁవ్‌కర్), తండ్రి దామోదర్ (అనంత్ మహాదేవన్) లు. తండ్రి కోపిష్టి, టిపికల్ పురుషస్వామ్యం ప్రదర్శించే వ్యక్తి, అతనికి తగ్గట్టుగా తల వంచుకు పోయే తల్లి. ఇప్పుడు కార్తీక్ ఇరకాటంలో పడతాడు. రేపో యెల్లుండో సుప్రీం కోర్టు తీర్పు రావాల్సి వుంది. హై కోర్టు ఆర్టికల్ 377 ని పాక్షికంగా రద్దు చేసినతర్వాత పై కోర్టుకు అప్పీల్ చేస్తే అది తీర్పు చెప్పే దశకొచ్చింది. ముంబైలో కార్తీక్ రూం మేట్ అమన్ (అర్పిత్ చౌధరి) తో అతను ప్రేమలో వుంటాడు. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ పెళ్ళి సంబంధాన్ని యెదో చెప్పి దాటేస్తాడు కాని తల్లిదండ్రుల వత్తిడి పెరిగి పోతుంది. యేకాంతం చూసుకుని తల్లితో చెబుతాడు తను గే అని. ఆమె మొదట నిర్ఘాంత పోతుంది, యేడుస్తుంది, అలుగుతుంది, బాధపడుతుంది, వాదిస్తుంది. కాని వాస్తవాన్ని యెవరూ మార్చలేరు కదా. తండ్రి దృష్టికి కార్తీక్ లాప్టాప్ లో ఇద్దరి ఫొటో వచ్చి, కోపంతో వూగిపోతాడు. కొడుకుని ఇంటినుంచి గెంటేసి, మర్నాడే కొడుకుకు తద్దినం యేర్పాటు చేస్తాడు. అప్పటిదాకా వూగిసలాడుతున్న తల్లి వొక్కసారిగా ఈ లోకంలో వచ్చి భర్తను యెదిరిస్తుంది. “మీకేం తెలుస్తుంది తల్లి హృదయం. నవమాసాలూ మోసి, కని, పెంచి పెద్ద చేసిన నా కొడుకు బతికుండగానే క్రియాకాండలు చేస్తారా. వాడు యెలాంటివాడైనా నా వాడు, నేనున్నాను అతనితో” అంటుంది.

ఇది క్లుప్తంగా కథ. నేపథ్యం సుప్రీం కోర్టు లో నడుస్తున్న కేసు. అది గేలకు వ్యతిరేకంగా వస్తుంది. అలాంటి వ్యక్తుల సంఘర్షణ అనేక విధాలుగా వుంటుంది. ముందు తనతో తనకు, తర్వాత కుటుంబంతో, తర్వాత సంఘంతో, చట్టంతో సంఘర్షణ. ఈ సినెమా వరకూ కుటుంబంలో ఈ విషయాన్ని సభ్యులు అర్థం చేసుకుని ఆమోదం తెలిపి, చేయూతనిచ్చేలా వొక దిశను ప్రేక్షకులకు అందించప్రయత్నించాడు. అంత వరకూ బాగానే వుంది. నిజ జీవితంలో చాలా కాంప్లెక్ష్ కథను, సినెమా కోసం కొంచెం స్వేచ్చ తీసుకుని కథను నడిపాడు. కొన్ని విషయాలు తెలివిగా కథలో అల్లుకురావడం మెచ్చుకోతగ్గది. యెలాంటివంటే తల్లితో కార్తీక్ చెబుతాడు, తను చిన్నప్పటినుంచే గే అనీ, మొదట్లో అర్థంచేసుకోలేక లోలోపల చాలా మథన పడ్డాడనీ, ముందు తను వాస్తవాన్ని ఒప్పుకున్నాక కాస్త ధైర్యం చేజిక్కించుకుని చెబుతున్నాడనీ, యెంత వద్దనుకున్నా కొంత అపరాధభావన — తను కుటుంబాన్ని బాధపెట్టినందుకు — వుందనీనూ. మరో ఉదంతం చెబుతాడు, తనను చిన్నప్పుడే మేనమామ ఇది అలవాటు చేశాడనీ, అయితే బలవంత పెట్టలేదనీనూ. ఆ మేనమామ ఇప్పటికీ వద్దన్నా కార్తీక్ వెంట పడుతుంటాడు పొందు కోసం. ఇలాంటి చిన్న చిన్న అల్లికలు కథకు కొంచెం ఉపయోగించాయి.

ముగ్గురు ప్రధాన పాత్రధారులైన మోనా అంబేగాఁవ్‌కర్, దేవాంశ్ దోశి, అనంత్ మహాదేవన్ ల నటన బాగుంది. శ్రీధర్ రంగాయన్ దర్శకత్వమూ, సాగర్ గుప్తా తో కలిసి వ్రాసిన స్క్రిప్టు బాగున్నాయి. ముఖ్యంగా గే ని నిర్వచించాల్సి వచ్చినప్పుడు సెక్సు అన్న మాట వాడకుండా ప్రేమ అని వాడటం గమనించాల్సిన విషయం. యెందుకంటే వాస్తవానికి అది స్త్రీ పురుషుల మధ్య కలిగే ప్రేమ లాంటిదేనూ. సాంకేతికంగా అన్నీ బాగానే వున్నాయి, కాని ఇది చాలా ఆలస్యంగా వచ్చిన చిత్రం. యెందుకంటారా? ఒక్క ఓనిర్ యే వొంటి చేత్తో ఈ విషయంలో చిత్రాలు తీశాడు. 2005 లో వచ్చిన “మై బ్రదర్ నిఖిల్” యేక కాలంలో గే మరియు ఎయిడ్స్ కథాంశంతో నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా తీశాడు. యెలాంటివాళ్ళైనా కంటి తడిపెట్టుకోలేకుండా బయటకు రారు అది చూసి. చిత్రానికి సపోర్ట్ ఇవ్వడానికని జుహీ చావ్లా సోదరిగా, నేరేటర్ గా పాత్ర పోషించింది. అలా వాళ్ళు పూనుకోబట్టి సినెమా ప్రజలవరకూ వెళ్ళింది. ఎయిడ్స్ వచ్చిన మొదట్లో అది గేల కారణంగా వచ్చినదని వదంతులు బాగా వుండేవి. అలా వాళ్ళు రెట్టింపు కష్టాలు యెదుర్కోవాల్సి వచ్చేది. కుటుంబం, సమాజం, చట్టం అన్నీ వ్యతిరేకంగా వున్నప్పుడు ఆ జంట మధ్య నిలిచిన ప్రేమ చివరకు తల్లిదండ్రుల మనస్సులను కరిగిస్తుంది. వొక చిత్రంతో పూర్తి అయ్యే విషయం కాదు కదా ఇది. మళ్ళీ నాలుగు వేర్వేరు కథల సమాహారం అయిన “అయాం” అన్న చిత్రంలో గేలు పోలీసు వ్యవస్థ నుంచి యెలాంటి అవమానాలు, అత్యాచారాలూ సహించవలసి వస్తుందో చూపాడు. అసలు ఈ కథను మరో మూడు కథలతో పాటు వొకే చిత్రం లో చూపడం లో యెత్తుగడ బహుశా, జీవితంలో, సమాజంలో, దేశంలో పట్టించుకోవలసిన సమస్యలలో ఇది కూడా సమానమైన ప్రాధాన్యత గలది, అన్నిటితో పాటే దీని మీద కూడా యేకకాలంలో ఆలోచించాల్సి వుంది అని చెప్పకనే చెప్పడం. శకున్ బత్రా దర్శకత్వంలో ఈ మధ్య వచ్చిన “కపూర్ అండ్ సన్స్” లో కూడా వో గే జంట కథ, మిగతా కథలతో పాటు చెప్పడం చూస్తాము. గే పాత్రలు చేసే ధైర్యం యే స్టార్ చేస్తాడు? అందుకే పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ ని తీసుకున్నారు. అందులో కూడా తల్లిని వొప్పించటం జరుగుతుంది. కానీ అది చాలా మానవీయంగా జరుగుతుంది. ఈ చిత్రంలో లాగా శ్రాధ్ధ కర్మల డ్రామా లేకుండా. (బహుశా ఆ తంతు చూసి తను కొడుకు మరణించడం కంటే తనకు జీవించి వుండడమే కావాలి అని ఆమెలో మార్పు వచ్చిందని చెప్పడానికి అల్లి వుండ వచ్చు ఆ తంతు.) మధుర్ భండార్కర్ చిత్రం “ఫేషన్” లో వ్యయసాయం (industry) లో నిలదొక్కుకోవడానికి ఆ దారిన నడవాల్సి రావడం చూస్తాం. ఈ అంశాన్ని స్త్రీ దర్శకులు కూడా స్పృశించారు. రీమా కాగతి తన “హనీమూన్ ట్రావెల్స్” లో దీని మీద కథ చెబుతుంది. తనుజ్ భర్మార్ “డియర్ డేడ్”, హన్సల్ మెహతా “అలీగఢ్”, కరణ్ జోహర్ “బాంబే టాకీజ్” లాంటివి కూడా మంచి చిత్రాలే. ఇక లెస్బియన్ అంశంతో అప్పటి ” ఫైర్” నుంచి మొన్న మొన్నటి “మార్గరిటా విత్ అ స్ట్రా”, “ఎక్ లడకీ కో దేఖా తొ ఐసా లగా” దాకా బాగానే వచ్చాయి.

ఇప్పుడు నా సంజాయిషి. కష్టసాధ్యమైన చిత్రాలు మనకు ముందు వచ్చాయి. కాస్త తేలికైన చిత్రం ఇప్పుడు. అందుకే నా మొదటి వాక్యం అలా వ్రాశా. అయినా రెండు విషయాలు తలచుకుందాం. “దోస్తానా” లాని వెకిలి హాస్యం చిత్రాలతో పోలిస్తే ఇది వెయ్యి రెట్లు నయం. రెండు తెలుగులో కూడా అపహాస్యంగా తప్పిస్తే సీరియస్ గా ఈ అంశంతో సినెమా వచ్చినట్లు లేదు, నాకు తెలిసినంత వరకు. అన్నట్టు ఈ చిత్రానికి 16 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here