అంతా కుశలమే : “Everything is fine”

1
8

[dropcap]ఈ[/dropcap] వారం ఓ పదిహేడు నిముషాల లఘు చిత్రం పరిచయం చేస్తాను. మరచిపోవడం కష్టమనిపించే చిత్రం. “Everything is fine. ఇది కూడా రాయల్ స్టాగ్ బారెల్ వాళ్ళదే. నాకు నటి సీమా పహ్వా అంటే చాలా ఇష్టం. ఆమె వుండడం వల్ల ఎక్కువ జాప్యం చెయ్యకుండా చూశాను. తీరా చూస్తే ఈ చిత్రం వూరికే ఇన్ని అవార్డులు సంపాదించుకోలేదని అర్థం అయ్యింది.

వొక రచయిత అయినా, ఓ చిత్ర దర్శకుడైనా మంచి సృష్టి ఎప్పుడు చెయ్యగలడంటే జీవితాన్ని దగ్గర్నుంచీ అధ్యయనం చేసినపుడు. ఏదో సిధ్ధాంతాలు నమ్మి వాటి చుట్టూ కథలల్లడం, లేదా ఏదో చెప్పడానికి కథలల్లడం, లేదూ వో వున్న సంఘటన చుట్టూ భావజాలాన్ని అల్లడం వల్లో కాదు. అవి బాగుంటే బాగుండొచ్చు. కానీ ఏదో వెలితి వుంటుంది. జీవితంలో ప్రతి మనిషి తనను తనలాగా అర్థం చేసుకోవాలని కోరుకున్నట్టే ప్రతి సృష్టీ వుండాలి.

ముందు నాకు గుర్తొచ్చిన ఒక కార్టూన్ చెప్తాను. ఆ చతురస్రంలో వో సైకియాట్రిస్టు, ఓ భార్య, ఓ భర్తా వుంటారు. సైకియాట్రిస్ట్ అడుగుతాడు : “మీ భార్య మీ పైన బాగ డామినేట్ చేస్తుందని భావిస్తున్నారా?”. దానికి ఆ భార్యే జవాబిస్తుంది : “లేదు, అతనలా భావించట్లేదు”. ఇది చదివి మనం నవ్వుతాము. ఇది నవ్వు ఎందుకు తెప్పించింది? ఇది జోక్ ఎలా అయ్యింది? లేటిరల్ థింకింగ్ కి జోకులకీ దగ్గరి సంబంధం వుంది. మామూలుగా వూహకి అందనిది దగ్గరి దారిలో అందడం లాంటిది. ఇక్కడ జోకు ఆ భార్యా భర్తల పొజిషన్లలో వుంది. ఇలాంటి జంటలు వుంటాయి, కాని ఎక్సెప్షన్ గా. ఎక్కువగా ఇళ్ళల్లో భర్తలు చెప్పిందే చెల్లుబాటవుతుంది. ఒక స్టేజ్ వరకూ అది భరింపతగ్గదిగా అనిపించినా అది బార్డర్ దాటినతర్వాత పరిణామాలు తీవ్రంగా వుంటాయి. ఇది కేవలం భార్యా భర్తల మధ్యనే కాదు; ఏ రెండు సంబంధాల మధ్య అయినా. అయితే అక్కడ ఒక కండిషన్ వుంది. ఆ ఇద్దరిలో ఎవరికైనా మరొకరి మీద పెత్తనం చెలాయించే అవకాశం సామాజికంగానో, మరో కారణంగా నో వుండాలి. ఎందుకంటే నేనే నా భార్య మీద పెత్తనం చెలాయించగలగ వొచ్చు, సంపాదిస్తున్న నా కొడుకు మీద అలా చెయ్యలేకపోవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

సినిమా గురించి చెప్పకుండా ఇదంతా ఏమిటి అంటారా? అదేనండి, ఈ సినిమాలో కథ కంటే ఎక్కువ డీటైలింగ్ వుంది. అదే కావలసింది. మొదటి సీన్ లోనే భార్యా, భర్తా, కూతురూ లగేజిని మోసుకుని మెట్లెక్కుతూ వుంటారు. ఇది కూడా మూడు షాట్స్లో. ముందు చీకటి, కేవలం సంభాషణ వినిపిస్తుంది. తర్వాత ఆ ముగ్గురి కాళ్ళు, లగేజీ కనబడితే, సంభాషణలు వినబడతాయి. మూడోది పై అంతస్తునుంచి వీళ్ళ ముగ్గురినీ ఎక్కుతూ చూపించటం. ఇక మాటలంటారా. కూతురు అంటుంది ఇంత సామానెందుకు మోసుకొచ్చారు అనవసరం బరువు కదా. దానికి తండ్రే ఎప్పటిలా స్పందిస్తాడు :”మీ అమ్మనడుగు, వద్దన్నా అన్నీ మోసుకొస్తుంది. మాకు ట్రైన్ లో కూడా ఇబ్బంది అయ్యింది.” ఈ సారి తల్లి అంటుంది :”మీ నాన్న అలాగే అంటారు. తర్వాత భోజనం దగ్గర ఆ పచ్చడి లేదా, ఇది తేలేదా అంటూ నా ప్రాణం తీస్తారు. అన్ని గుర్తుపెట్టుకుని తెస్తాను అందుకే”. ఈ షాట్ లో వొక స్పైరల్ మూవ్మెంట్ చూపిస్తారు. జీవితం, అనుభవ పాఠాలు, తెలివిడి అన్నీ వర్తులాలు కావు, స్పైరల్సే. ఒక ఆవృతం ముందు వున్న స్థితి కి తిరిగి రాము, అదే బిందువుకి కొంచెం పై స్థాయి లో వుంటాము. ఈ వొక్క సీన్ తో కథంతా చెప్పేయడం అయిపోయింది.

భర్త ఎలాంటివాడు? చెడ్డవాడేం కాదు? అదే, భార్యను కొట్టి చిత్రహింసలు పెట్టే నర రూప రాక్షసుడు కాదు. కానీ ప్రతిదానికీ భార్యను మాట్లాడనివ్వకుండా చెయ్యడం, గేలి చెయ్యడం, ఆమె మాటకు విలువ ఇవ్వకపోవడం, ఆమె కోరికలు అవి ఎంత చిన్నవైనా లక్ష్యపెట్టకపోవడం, అసలు ఆమెకు ఓ మనసు దానికి స్పందన, ఒక మెదడు దానికి ఆలోచన, ఓ హృదయం దాని ఇష్టాఇష్టాలూ, కోరికలూ వుంటాయి అని నమ్మని మనిషి. ఈ మాత్రానికే అతను చెడ్డవాడైపోతాడా ఏం?

ఇక భార్య ఎలాంటిది. వొక ముఖ్య లక్షణం ఎవరు ఏం చెప్పినా తలాడించడం. భర్త అయినా, కూతురైనా, భర్త చెల్లెలు (వదిన అంటారా, ఏమంటారు?) అయినా. బోటింగు ఇప్పుడెందుకు, చెల్లెల్ని కలవడానికి వెళ్దాం అంటే సరే; ఈ చెప్పులు ఇప్పుడు కొనాలా, ఎప్పుడైనా కొనొచ్చులే పద అంటే సరే : బాలచందర్ సినిమాలో వో తల ఆడించే కొండపల్లి బొమ్మ లాగా అనుకోండి. అయితే ఆమె కు ఏం బాధగా లేదా? ఎందుకు లేదూ? భరిచడం కష్టమై చాటున కన్నీళ్ళు పెట్టుకోవడం, అదీ హద్దు మీరిపోతే అతన్నుంచి విడిపోవాలనుకోవడం దాకా వెళ్తుంది.

తల్లి డాబా లో అర్ధరాత్రి కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి కూతురు అడుగుతుంది, నీకొచ్చిన కష్టం ఏమిటని? ఏమని చెబుతుంది? ఇవన్ని చెప్పుకోవడానికి కష్టాల్లా వుంటాయా అసలు? అత్తవారిల్లు వొదిలేసి ఇంటికొచ్చిన అమ్మాయిని తల్లి ఏమని చెబుతుంది? ఇవన్నీ అందరి ఇళ్ళల్లో వుండేవే, నువ్వే సర్దుకుపోవాలీ అని. ఇక్కడ కూతురు అదే మాట అంటుంది. కాని ఆ తర్వాత అదే కూతురు తండ్రి తల్లితో వ్యవహరిస్తున్న తీరు చూసి కొంచెం అర్థం చేసుకుంటుంది. అత్త వారిస్తున్నా, లేదంటూ ఆ సాయంత్రం తల్లి కోరుకున్నట్టు ఆమెను బోటింగ్ కు తీసుకెళ్తుంది. అక్కడ ఆ పచ్చదనం, నీరు, బాతులను చూసి మనసారా నవ్వుతుంది తల్లి. ఎంత చిన్న చిన్న విషయానికి మొహం వాచిపోయిందో ఆమె.

అసలు ఒప్పందం కేవలం తల్లి కూతుళ్ళు కలిసి ఎంజాయ్ చెయ్యాలని. నీకు జాగ్రత్త తెలీదు, అంటూ కూడా వస్తాడు తండ్రి. ఏం, నేను చూసుకోలేనా అంటుంది కూతురు. తెల్లబోవడం తల్లి వంతయ్యింది. తనే పెంచి పెద్ద చేసిన కూతురు, ఇప్పుడు తనను చూసుకుంటే తప్ప తను మనలేదు. వాస్తవంగా అందరి గురించీ చూసుకునేది తనే; వొక్క చదువు రాకపోతే మాత్రం తను వో బరువు, వో ఆధారం అవసరమైన మనిషి అయిపోయిందా. ఇవన్నీ చిన్న చిన్న షాట్స్ లో చూపిస్తుంది దర్శకురాలు.

ఓ పగలు తండ్రి లేవగానే, మీ అమ్మ బాత్రూం కెళ్ళినట్టుంది త్వరగా టీ పెట్టు అంటాడు కూతురుతో. అతనికెప్పుడూ తన అవసరాలే అవీ అర్జంటుగా. తల్లి ఇంట్లో లేదు. కంగారు వేస్తుంది కూతురికి. తీరా చూస్తే తల్లి క్రితం రోజు చూసిన చెప్పుల షాపుకెళ్ళి తనకు నచ్చిన జత కొంటుంది. తర్వాత బస్ షేడ్ లో కూర్చుని వో సిగరెట్టు కాలుస్తుంది. తన విషయమై తాను నిర్ణయం బహుశా మొదటి సారి తీసుకుంది. అలాగే కూతురు కూడా మొదటి సారి తల్లిని ఎప్పటిలా కాకుండా వో వ్యక్తి లా, తనకూ కోరికలూ నమ్మకాలు వున్న మనిషిలా చూసి ఆమెను బోటింగుకు తీసుకెళ్తుంది.

ఇదే కథలో బోల్డంత తాత్త్వికత పేరుతో గుప్పించడానికి అవకాశం వుంది. కాని కేవలం మన రోజువారి జీవితంలోని దృశ్యాలు తప్ప మరేం లేదు. డాబా మీద రాత్రి పూట తల్లి కూతుళ్ళ సంభాషణంతా క్లోజప్పుల్లో వుంటుంది. సహజమే. కూతురు నీకు విశ్రాంతి అవసరం, రేపటికంతా బాగైపోతుంది అని వెళ్ళి పోతుంది. ఆ తర్వాత తల్లి ఏడుస్తున్న క్లోజప్పు అర నిముషం, తర్వాత ఆమె పిట్టగోడను ఆనుకుని ఎదుట బిల్డింగులూ మధ్యనుంచి పోతున్న వీధిని చూస్తుండడం మనకు వెనక కొంచెం దూరం నుంచి చూపిస్తారు. ఆమె సిలూవెట్ లో వుంది. అన్ని బిల్డింగుల మధ్య. వొక వ్యక్తిగత విషయాన్ని సామాజికం చేసే పధ్ధతుల్లో ఇదొకటి.

లఘు చిత్రాలు తీసేవాళ్ళు ముందు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నయం. మంచి శిక్షణగా పనికొస్తుంది.

సీమా పహ్వా లేకపోతే ఈ సినిమా లేదు. సాంకేతికంగా ఇంత మంచి సినిమా కూడా ఆ స్థాయి నటన లేకపోతే కూలిపోతుంది. ఆమె నటన మెలడ్రమటిక్ నటన కాదు. సహజమైనది, మినిమలిస్టిక్ నటన. ఇక భర్తగా సిద్దార్థ్ భారద్వాజ్, కూతురుగా పాలోమి ఘోష్ కూడా బాగా చేసారు. కథ, దర్శకత్వం మానసి నిర్మలా జైన్ వి. ఆమె సినిమాకి సంబంధించిన విద్యలో భాగంగా తీసిన షార్ట్ ఇది. నిస్సందేహంగా చాలా బాగా తీసింది. జిగ్మె టి టెంజింగ్ చాయాగ్రహణం బాగుంది. ఆ మెట్ల దగ్గర, ఇంటి లోపలా, ఇరుకు బజారుల్లో, డాబా మీదా అన్ని వొక సరి అయిన మూడ్ ను పట్టుకున్నాడు. ఎక్కడా ఓవర్ ఎంఫసిస్ లేదు. ఇక సంగీతం సాగర్ దేశాయిది. అది కూడా చాలా బాగుంది. మౌనాలు, కేవల సంభాషణలు, నేపథ్య సంగీతం ఇవి ఎప్పుడు ఏఏ నిష్పత్తుల్లో ఎలా వుండాలి అన్న నిర్ణయం కూడా సృజనాత్మకతను తెలుపుతుంది. డాబా మీద ఆ రాత్రి పూట నిశ్శబ్దంతో మొదలైన షాట్ కూతురు వ్యాకులత ను పట్టిస్తూ, తర్వాత తల్లీ కూతుళ్ళు మాట్లాడుకునేటప్పుడు పాత్రల, మన ఫోకస్ విషయం పై వేసి, కూతురు వెళ్ళిపోయాక మొదలయ్యే సంగీతం దర్శకురాలి భాషలో మోగుతుంది. మనకు అప్పటి దాకా గ్రహింపే వుండదు ఇప్పటి దాకా సంగీతం లేదని. జబీన్ మర్చంట్ ఎడిటింగ్ కూడా పూసలో దారంలా సినిమాని కలిపి కుట్టింది.

మనం కలిసినపుడు పలకరింపుగా “కుశలమా” అంటాం. అక్కడ “సబ్ ఠీక్?” అని అదనంగా అంటారు. జవాబు “హాఁ సబ్ ఠీక్ హై”. నిజంగా అంతా బాగానే వున్నట్టా?

ఏమో అలవాటుకు విరుధ్ధంగా చాలా వ్రాసేశాను. నాకైతే ఈ చిత్రం చాలా తృప్తినిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here