ఉమర్ ఆలీషా గారి ‘ఎక్స్ కాలేజీ గరల్’ నాటకము (1935) ఓ విశ్లేషణ-1

2
14

[కవిశేఖర డా. ఉమర్ ఆలీషా గారి ‘ఎక్స్ కాలేజీ గరల్’ అనే నాటకాన్ని విశ్లేషిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ. ఇది మొదటి భాగం.]

[dropcap]శ్రీ[/dropcap] విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం 500 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ పీఠం ఆరవ పీఠాధిపతిగా (1928 – 45) ఉమర్ ఆలీ షా వ్యవహరించారు. బాబర్ కాలంలో భారత దేశానికి వచ్చారు వీరి పూర్వీకులు. ఉమర్ ఆలీషా తాతగారికి తెలుగు భాషా సంస్కృతులంటే ఆసక్తి. ఆలీ షా తెలుగు పురాణ గ్రంథాదుల పట్ల మిక్కిలి మక్కువ. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పారు. వీరు రాయని సాహిత్య ప్రక్రియ లేదు. కవిత్వం, కథ, నవల, గేయం, పద్య కావ్యాలు, నాటకం, పద్య శతకాలు సుమారు 50కి పైగా ఉన్నాయి. అవి వారణాసిలో జంగం వారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ లోని బ్రిటిష్ మహా గ్రంథాలయం లోను భద్రపరచబడి ఉన్నాయి. వీరి ముని మనవడు డా. ఉమర్ ఆలీ షా ప్రస్తుతం నవమ పీఠాధిపతిగా ఉన్నారు‌. ముత్తాత గారి గ్రంథాలను సేకరించి ‘ఉమర్ అలీ షా గ్రంథ మండలి’ పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాక వారి సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు.

ఎక్స్ కాలేజీ గరల్:

ఈ నాటకం కొరకు భారతదేశంలోని గ్రంథాలయాలను వెదికి చివరకు బ్రిటిష్ గ్రంథాలయం నుండి కొంత రుసుము చెల్లించి తెప్పించారు సంస్థ వారు. 139 పేజీల నిడివి ఉన్న ఈ నాటకంలో ఇతివృత్తం చిన్నదే. కానీ నాటి సమాజంలో పాతుకుపోయి ఉన్న అంటరానితనం, బాల్యవివాహాలు, స్త్రీ విద్య, వితంతు వివాహాల పట్ల నిరసన, ప్రేమ, ప్రేమ వివాహం తప్పు అనే అంధ విశ్వాసాలు, పతి పాదసేవ యే పడతికి స్వర్గతుల్యమనే భావనల పై సుదీర్ఘమైన సంభాషణలు, చర్చలు మిక్కిలిగా ఉన్నాయి. టైటిల్ మాత్రమే కాక కాలేజీలో చదివే గరల్స్ పాత్రలు ఉండడం వల్ల ఆంగ్ల పదాలు అలవోకగా వాడబడ్డాయి. పద్యాలు, పాటలూ ఎక్కువే.

నాటి సమాజంలోని మూఢ విశ్వాసాలు, వాటిని ఖండించే అభ్యుదయ భావాలను చెప్పడమే రచయిత పరమోద్దేశం. దానిని గమనించక నాటకం సుదీర్ఘంగా ఉన్నదనీ, పద్యాలు ఎక్కువయ్యాయని, ఆంగ్ల పదాలు విరివిగా వాడారని నిస్సంకోచంగా ఈ నాటకాన్ని తీవ్రంగా విమర్శించారు చాలామంది. పత్రికలలో తిరస్కరిస్తూ వ్యాసాలు కూడా రాసారు. రచయిత ‘ముస్లిమ్’ అనేది ఈ నిరసనకు ప్రథాన కారణంగా కొందరు చెబుతారు.

రామప్ప పంతులు, రత్తమ్మ దంపతులకు చంద్రశేఖరుడు, సుగుణ, హేమలత సంతానం. చంద్రశేఖరుని భార్య సుందరమ్మ. అతను కలెక్టర్ కావాలన్న దీక్షతో చదువుతున్నాడు. సుగుణకు చిన్నతనంలోనే పెళ్లి చేయడం, అతను మరణించడం జరిగింది. అన్నగారి ప్రోత్సాహంతో కళాశాలలో చదివి బి.ఏ. పాసయింది. ఆమె క్లాస్‌మేట్ రామారావు. అతనికి పెళ్ళి అయినది కానీ బేధాభిప్రాయాలతో భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. రామారావు, సుగుణ పరస్పరం ప్రేమించుకుంటున్నారు. హేమలత వరుసకు బావ అయిన మోహనుడిని ప్రేమించింది. అతను ఆయుర్వేద వైద్యుడైనా ఇంగ్లీషు మందులు, చికిత్సా విధానం కొంత నేర్చుకున్నాడు. ఒకసారి హేమలతకు తీవ్రమైన జ్వరం రాగా, వైద్యం చేస్తూ కంటికి రెప్పలా కాపాడినాడు. అప్పటినుండి అతను తనకు దైవమే అన్నట్టు చూడసాగింది హేమూ.

ఒకనాడు మోహనరావు శ్రీకృష్ణ చైతన్య స్వామి (హరనాథుడు) భక్తుడిని వెంటబెట్టుకొని వారింటికి వచ్చాడు. స్వామి ప్రబోధల ప్రభావం వల్ల రత్తమ్మ, హేమలత హరనాథుని భక్తులయ్యారు.

కన్యాశుల్కం పోతూ, వరకట్నం వస్తూ ఉన్న రోజులవి. వీర్రాజు అనే తాసిల్దారు భార్య మరణించగా రెండవ వివాహానికి ప్రయత్నిస్తున్నాడు. దీక్షితులనే పెళ్ళిళ్ళ పేరయ్య హేమలత సంబంధం గురించి, ఆమె తండ్రి పిసినారితనం గురించి చెప్పాడు. హేము గుణగణాలు విన్న వీర్రాజు నాలుగు వేలు రామప్పపంతులకు ఇవ్వమని, అందులో రెండు వేలు పెళ్ళిపీటల మీద ఘనంగా తనకు చదివించమని ఇచ్చాడు. ఐదు వందల మధ్యవర్తిత్వానికి పుచ్చుకున్నాడు దీక్షితులు.

సుగుణ, హేమలత, చంద్రశేఖరరావుకి ఇష్టం లేకపోయినా సంబంధం ఖాయం చేసాడు రామప్పపంతులు.

ఈ నాటకంలో చెప్పబడిన చిత్ర విచిత్ర సంఘటనలు ఏమిటంటే – పెళ్ళిచూపులకు వస్తూనే పెళ్లికొడుకు అలంకరణ, తాళిబొట్టుతో వచ్చేస్తాడు వీర్రాజు. అక్కడే, అప్పుడే మాయో మంత్రమో చేసి పెళ్లి చేసేస్తానని దీక్షితులు హామీ ఇవ్వడంతో అలా వచ్చేసాడు. రెండో పెళ్లివాడు, వయసు మళ్ళినవాడికి కూతుర్ని ఇవ్వడం రత్తమ్మ ఇష్టం లేదు. పెద్దకూతురు బతుకు బద్దలైంది, రెండో కూతురు జీవితం నాశనం చేయొద్దని ఏడ్చింది. ప్రాధేయపడింది. చివరికి బావిలో దూకుతానని బెదిరించింది. ‘చావు, పెళ్ళి చేసి తీరతా’నన్నాడు పంతులు. దీక్షితులు ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఇంతలో రత్తమ్మ బావిలో ధభీమని దూకడం, చూసినవారి అరుపులు కేకలతో రామప్పపంతులు పెరటి లోకి పరుగెత్తాడు.

“పెళ్ళి అయిపోయింది” అని ప్రకటించాడు దీక్షితులు. ‘తాళి కట్టందే” అన్నాడు వీర్రాజు. “ఆమె బావిలో దూకింది, పోలీసులు వస్తారు, చచ్చిపోతే కేసవుతుంది. పద పద” అంటూ వీర్రాజుని తొందరపెట్టి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తర్వాత పద్ధతి అంటూ పంతులుకి నచ్చజెప్పి హేమలతను కాపురానికి పంపేలా చేసాడు.

వీర్రాజు ఇంట్లో దిక్కు తోచక పడివుంది హేమ. భార్య చనిపోయి, కొడుకు చదువు కోసం ఎక్కడో దూరంగా వుండి, ఇరుగుపొరుగు వారు తనదే తప్పంతా అనడంతో, బాధతో, పశ్చాత్తాపంతో పిచ్చివాడై పోయాడు రామప్ప పంతులు.

స్వామి బోధించిన ‘హరనాథ తత్త్వా’న్ని ఆకళింపు చేసుకున్న హేమ వీర్రాజు ఇంట్లో అదే ధ్యానంతో, భక్తి గీతాలు పాడుకుంటూ ఉండిపోయింది. తనను దగ్గరకు రానీయకపోవడంతో వీర్రాజు తిట్టాడు, విపరీతంగా కొట్టాడు.

సుగుణ, రామారావుల వ్యవహారం నచ్చని తండ్రి ఎప్పుడూ తిట్టేవాడు. ఇరుగుపొరుగు వారే కాక, ఒకసారి చెల్లెలిని చూడాలని వచ్చిన సుగుణను వీర్రాజు చాలా అసహ్యంగా మాటలు అన్నాడు.

చంద్రశేఖరరావు కలెక్టరుగా వచ్చాడు. తన చెల్లెళ్ళ దుస్థితికి బాధపడ్డాడు. వారి జీవితాలను సరిదిద్దాలని భార్యాభర్తలు అనుకున్నారు.

హేమలత నీతివంతమైన జీవనం, భక్తి పాటలు, దైవచింతన క్రమంగా వీర్రాజులో మార్పు వచ్చింది. ఈ వయసులో పెళ్లి చేసుకుని, ఆమె ఉసురు పోసుకున్నానని పశ్చాత్తాప పడ్డాడు. గతంలో ఒకసారి హేముని చూడడానికి వచ్చిన మోహనరావుని తను తిట్టిపంపిన విషయం గుర్తుకు వచ్చి, ఆమెను క్షమించమని కోరుకున్నాడు. కూతురుగా భావించి, మోహనరావుతో వివాహం చేస్తానని, ఇరువురు తనకు తోడుగా తన ఇంట్లో ఉండమని కోరాడు. అతనిలో మార్పు రావడానికి దీక్షితులు బోధనలు కూడా కొంత కారణం.

పొట్టకూటి కోసం పెళ్ళి కాని పెళ్ళి చేసి ఒక అమాయకురాలి గొంతు కో‌సానని పశ్చాత్తాపపడి, ఎప్పటికప్పుడు ఆమె విషయాలు మోహనరావుకు చెప్పేవాడు. చివరికి ఒకరోజు చంద్రశేఖరరావుతో పాటు అతన్ని తీసుకుని వీర్రాజు ఇంటికి తీసుకుని వచ్చాడు. వీర్రాజు లోని మార్పుకి అందరూ సంతోషించారు. అదే ‌సమయంలో సుగుణ, రామారావు కూడా వచ్చి తాము వివాహం చేసుకున్నామని చెప్పడంతో కథ సుఖాంతమయింది.

139 పేజీలున్న ఈ నాటకం లో స్త్రీ పురుషుల సమానత్వం గురించి సుగుణ పరంగా, కులమత బేధాలు, అంటరానితనం సమసిపోవాలని చంద్రశేఖరరావు పరంగా దీర్ఘమైన సంభాషణలు నడిపారు రచయిత.

“ఆడుదైనంత మాత్రాన దానికి హృదయము లేదా! మెదడు లేదా! అది పురుషుని నోటికి భయపడి గ్రుడ్డి బ్రదుకు బ్రదుకవలసినదేనా! ప్రకృతి సౌందర్యము జూసి యానందించుటకు, చక్కని గాలి పీల్చుకొనుటకు, ఆడుది నోచుకొనలేదా! ఈ పురుష జాతికి స్త్రీలపై నింత యవిశ్వాసమెందులకు? నీతి, జ్ఞానము, మర్యాదా మెరుగని యీ మూఢ లోకమేమో యాడిపోసుకొనునది. యాడుది చీకటి గది మూల మూల్గుచూ పడియుండునా!” పురుషుడైన చంద్రశేఖరరావు నోట రచయిత ఇటువంటి అభ్యుదయ భావాలు వెలువరించుట విశేషము.

మూర్ఖుడైన, రామప్ప పంతులు అభిప్రాయం–

“అస్పృశ్యత మహా పాపమట. మాదిగలు మన వంటి వారేనట. మనతో సమాన గౌరవము వాళ్లకు కూడా ఈయకుండుట అధర్మమట. ఈ నడుమ ఈ ఉపద్రవం ఒకటి వచ్చి పడినది”.

“కన్యాశుల్కము దోషమట. వివాహమునకు ప్రేమ ముఖ్యమట. బాల్య వివాహములు దేశానిర్ధకములట. మాన మర్యాదలు, మతాచారములు, కులగోత్ర గౌరవములు చెడిపోయినవి. వరశుల్కము పుచ్చుకొనక, కన్యాశుల్కం పుచ్చు కొనక తండ్రులు సంసారంలో గడుపుటెట్లు?”

మరో మూర్ఖుడైన వీర్రాజు మాటలు ఇట్లున్నవి —-

“కట్నము లేని పెండ్లి ఉప్పు లేని పప్పు వంటిది”

హేమలతను చూడడానికి వచ్చిన సుగుణకు వీర్రాజుకు తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. స్త్రీ పురుషులకు సమాన హక్కులు, బేధము లేకుండా ఆడ మగ స్నేహము చేయుట నవ నాగరికము అంటున్న సుగుణతో చాలా హేళనగా మాట్లాడాడు వీర్రాజు.

“కట్టు దాటిన నది కట్టుబాటు మీరిన ఆడుది లోకమును ముంచునని పెద్దనన్నారు. ఎంత చదువుకున్నను, ఎంత నాగరికతయున్నను కంటబడిన ప్రతి పడుచు మగవాని వెంటపడి యూరూరు తిరుగుట ఆడుదానికి తగదు. తగిన మగవానిని పెండ్లి ఆడి, మానాభిమానములు మర్యాద కలిగి, ఇల్లాలై, తల్లియై వర్తించుట వనితకు ధర్మం. విదేశీ వేశ భాషలతో, విజాతీ యాచారములతో, విచ్చలవిడిగా స్వాతంత్రమను పేర చెడుదారులు తొక్కుట దేశానర్థకము.”

సందర్భానుసారముగా పోతన పద్యములు, ఆంగ్ల కవి షెల్లీ వంటివారి ఆంగ్ల కవితలు పాత్రలచే పలికించారు రచయిత. అంతేకాక పద్యముల, పాటల రాగములను పుస్తకంలో నాటకానంతరం పట్టిక కూడా ఇచ్చారు.

(నాటకము, రచయిత గురించి మరిన్ని వివరాలు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here