ఉమర్ ఆలీషా గారి ‘ఎక్స్ కాలేజీ గరల్’ నాటకము (1935) ఓ విశ్లేషణ-2

2
14

[కవిశేఖర డా. ఉమర్ ఆలీషా గారి ‘ఎక్స్ కాలేజీ గరల్’ అనే నాటకాన్ని విశ్లేషిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ. ఇది రెండవ భాగం.]

నాందీ

భారతీయులమైన మనము ఏదేని ఒక మహాకార్యమును సంకల్పించినప్పుడు దాని నిర్విఘ్న పరిసమాప్తికై ఆరంభమున మంగళాచరణ పూర్వకమైన దేవతా పూజాదికమును నిర్వర్తింతుము. నాటక ప్రదర్శనమును ఒక పవిత్ర కర్మగా నించి ఆ ప్రదర్శన కార్యము నిర్విఘ్నముగా సభారంజకముగా నెరవేరవలెననెడి ఆశతో నాంది పద్యమును చదివెదరు. “నంద యతీతి నాందీ” (పింగళి లక్ష్మీకాంతం).

ఈ సిద్ధాంతము ననుసరించి ఉమర్ ఆలీషా ఈ నాటకమును నాంది పద్యముతో మొదలిడినాడు.

“శ్రీమహిళామనోహరుడశేష జనమ్ములకున్ వినిర్మల
ప్రేమ మహత్వమున్ వెలువరింప జనించిన గౌరమోహన
స్వామి, నిజావతార గుణసంపద నింప చరాచరానురా
గామృతసింధువై వెలయు నాహరనాధుడు మిమ్ము బ్రోచుతన్”

ఈ నాటకమున ప్రధాన అంశం స్త్రీలకు సంబంధించినది. ప్రేమ మహత్వమును తెలియజేసేది. మోహనుడుతో పాటు స్వామి అనే పాత్ర హేమలత ఇంటికి విచ్చేసి ‘హరనాధతత్వము’ బోధించి వెళతాడు. ఆ హరనాధుని తదేక దీక్షతో ఆరాధించడం వల్లనే హేమ తన కష్టాలను దాట గలిగింది. పై పద్యంలో అది సూచించబడింది.

ప్రస్తావన

నాంది అనంతరం సూత్రధారుడు ప్రవేశించి నాటక ప్రస్తావన చేస్తాడు. “సూత్రం ధారయతీతి సూత్రధారయః”. నటితో గానీ, విదూషకునితో గానీ ప్రస్తావన – (clue, introduction) అనగా నాటకంలోని ప్రథాన కథను సూచిస్తాడు. ఒక్కోసారి ప్రథమాంకంలో రాబోయే పాత్రను సూచించి నిష్క్రమిస్తాడు. ఋతువర్ణనకు కూడా ప్రధాన్యముంది.

ఈ నాటకం లో ఉమర్ ఆలీషా గారి ప్రస్తావన పద్యం –

నాంద్యంతమున కుశీలవుడు ప్రవేశించి –

“కులమతాచారముల దీప్తి గోలుపోని
ప్రేమజీవన యజ్ఞ వేదీమహాగ్ని
భారతీక్షీరగర్భసుధా రస మగు .
సతుల పావిత్ర్యమునకు నంజలి ఘటింతు”

కులమతాచారముల తాకిడి వల్ల తమ ప్రేమను కోల్పోకుండా నిలిచిన భారతీయ స్త్రీల పవిత్రతకు నమస్కారము అంటూ కథాంశమును సూచించినాడు.

“చైత్రసహకార పల్లవాస్వాదనమున
కోయిలల గొంతు తీయనై పోయినట్లు
ప్రేమముగ్ధుల గీత రాగామృతమున
భావుకుల యెద పులగించిపోవు గాక!”

వసంత ఋతు వర్ణన వలన ఈ నాటకమున ప్రధాన రసము శృంగారమని తెలియుచున్నది. ‘గీత రాగామృతము’ అని సూచించినట్లే ప్రధమాంకమున హేమలత తన ప్రియుడు మోహనుని పాట పాడుతూ ప్రవేశిస్తుంది.

దాదాపు పద్య నాటకమా అన్నంతగా విరివిగా పద్యాలు ఉన్నాయి. శైలి కూడా ఆద్యంతమూ గ్రాంథిక భాష లోనే సాగినది. నాటక కాలమున అప్పుడప్పుడే మూఢాచారాలను నిరసించే అభ్యుదయ భావాలతో కావ్యములు, నాటకములు రావటం మొదలెడుతున్నాయి. సమాజంలో కూడా భారతదేశ స్వాతంత్ర్యాబిలాష మాత్రమే కాక సాంఘిక సంస్కరణలు కూడా ఉధృతంగా మొలకెత్తుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు సైతము విద్య అత్యవసరమని, పురుషులతో పాటు సమాన అవకాశములు అందిపుచ్చుకోవలెననెడి భావనలు వ్యాపిస్తున్నాయి. కొందరు ఛాందసవాదులు “ఇదేమి వింత, సమాజం దేశము నాశనమగుచున్నది” అనుకుంటున్నట్లే రామప్ప పంతులు, వీర్రాజు వంటి పాత్రలచే ఆ భావములు పలికించుట జరిగినది. కానీ క్రమంగా వారిలో మార్పు వచ్చినట్లు చిత్రించి, తను ఎటువైపు మొగ్గు చూపుతున్నాడో రచయిత చెప్పకనే చెప్పినాడు.

పెద్ద కూతురికి బాల్య వివాహం చేసి ఆమె బతుకు బండలు చేయడమే కాక చిన్న కూతురికి కూడా ముసలివాడిని తీసుకొని రావటంతో రామప్ప పంతులు భార్య రత్తమ్మ తన తీవ్ర వ్యతిరేకతను తెలుపుతుంది. ఎంత వారించినా భర్త మొండి పట్టు విడవకపోవటంతో బావిలో దూకుతానని బెదిరించడమే కాక నిజంగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఆడపిల్లల జీవితాలను బాగు చేయాలని ప్రయత్నించి, చేయలేక పోవడంతో ప్రాణత్యాగం చేసిన నిస్సహాయురాలు రత్తమ్మ.

ముఖ్యంగా సుగుణ పాత్రను ‘స్వేచ్ఛకు ప్రతినిధి’గా నిలిపారు. ఆమె ఎంతగా వాదనలకు దిగినా వీర్రాజు వంటి వారు చాలా అసభ్యంగా మాటలాడడం గమనిస్తే, సంఘంలో పాతుకుపోయిన భావములు ఎంత బలంగా ఉన్నవో తెలుస్తుంది.

వీర్రాజు కూడా తన భార్య చనిపోయిన తర్వాత ఆమె గుణగణాలను తలుచుకొని బాధపడతాడు. బాధ పడడం కంటే “తనకు పనులు చేసిపెట్టిన మనిషి పోయిందే” అనడం సబబు. పైగా రెండో పెళ్లిలో కూడా అందరి ఎదుట గొప్పగా గౌరవంగా కట్నం చదివింపమని తానే రెండు వేలు రూపాయలు రామప్ప పంతులకీయమని దీక్షితులు చేతిలో పెట్టినాడు. చదువుకున్న ఆడపిల్ల సంబంధం అని దీక్షితులు చెబుతుండగానే హేళనగా అంటాడు –

“ఆ సాహిత్యము స్వయంపాకులకు గానీ మనకెందుకు? వంటా పెట్టూ, అంటూ ఆచారము, ఇటువంటి వానిలో సాహిత్యము మనకనవసరం. ఆడదానికి చదువు, అరటి చెట్టుకు గెల అనర్ధములకే!”

హేమలత మోహనరావుని ప్రేమించినది. సుగుణ రామారావును ప్రేమించినది. కానీ సుగుణను ప్రేమిస్తున్నానని వెంటబడినాడు భానుమూర్తి. ఆ సందర్భముగా వారిరువురి మధ్య జరిగిన సంభాషణలో మూర్తి షెల్లీ కవితను వల్లె వేస్తాడు..

The fountains mingle with the river
And the rivers with the Ocean
The winds of Heaven mix for ever
With a sweet emotion;
Nothing in the world is single;
All things by a law divine
In one spirit meet and mingle
Why not I with thine?

కానీ అతనిని తిరస్కరించినది సుగుణ. రామారావుకు పెళ్ళి అయినది కానీ భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారు. అతనికి సుగుణ యన్న ప్రాణాధికము. వారి స్నేహాన్ని రామప్ప పంతులు తీవ్రంగా వ్యతిరేకించగా సుగుణ తండ్రితో వాదిస్తుంది. ఈ లోకము, సంఘము సంగతి నేనెరుగక పోలేదు అంటూ..

“ఏపని చేసినన్ దొసగులెంచు, రవంతయు మంచి సైపగా
నోపదు, మెచ్చుకోదు పురుషోత్తమునైనను, లేనినిందలన్
మోపును లక్ష్య పెట్టితిమ పో యిక సౌఖ్యము మాట సున్న స్వే
చ్ఛాపరు లైన వారలకు శత్రువు పాపపు లోకమెప్పుడున్”

ఒక్కొక్కసారి రామారావు బాధతోనో, హాస్యము గానో “లవ్ ఈజ్ బ్లైండ్. లవర్స్ ఆర్ బ్లైండ్. బట్ యు మస్ట్ నో దట్ ది వరల్డ్ ఈజ్ నాట్ బ్లైండ్” అంటే సుగుణ

“పాడు ప్రపంచము. దాని లెక్క నాకేమి? ఎవరి ప్రేమను సహించినదీ పాపపు ప్రపంచము! ప్రేమకు ప్రపంచము నకు ఎదురు చుక్క. ప్రేమకు హృదయము కావలెను. ప్రపంచమునకు నోరు కావలెను. నోరు పెట్టుకొని బ్రదుకు ప్రపంచము లెక్కా! హృదయము పొదిలి తీయని యమృతముతో లోకమును మరపించి స్వర్గము నిర్మించు ప్రేమ లెక్కా?” అని నిస్సంకోచంగా పలుకుతుంది.

సుగుణకు ఉన్నంత ధైర్యము హేమకు లేదు కానీ తను ప్రేమించిన మోహన్ రావుని మనసులో తలుచుకుంటూ వీర్రాజుని దగ్గరకు రానీయక గట్టిగా నిలబడగలిగినది. మాటకు మాట అంటూ కఠినంగా దూరంగా ఉండి తనను తాను కాపాడుకోగలిగినది.

“నా మనోహరుడు మీరు కాదు. నా మెడలో తాళియే లేదు. ఒకవేళ మీరు కట్టినను అది పశుపు మెడకు కట్టిన పలుపు. అంతకన్నా మరేమియు లేదు. నా మనసు నా స్వాధీనమున నున్నది. కావుననే నేను డప్పిచ్చికొన్న మీ ఇంట పనిచేసి యింత తిని బానిస వలే సమయం వచ్చునంతవరకు, ఋణము తీరునంతవరకు ఉండుటకు తయారైతిని. లోకమును వెనక వేసుకొని మీరు దౌర్జన్యమునకు దిగితిరా యీపాటి చాకిరీ కూడా మీకు దక్కదు” అని కచ్చితంగా చెప్పగలిగినది.

హరనాధుని కీర్తనలు పాడుకొనుచు కాలము గడపసాగింది. చుట్టుపక్కల వీరమ్మ వంటి స్త్రీలు హేమ జీవన విధానమును భక్తి ని గమనించి ఆమె ఒక దైవాంశుసంభూతురాలిగా భావించారు.

హేమను చూడడానికి వచ్చిన సుగుణ పోకడ అస్సలు నచ్చలేదు వీర్రాజుకి.

“నీవంటి వారు హర్షింపకున్న నాకు లోటు లేదు. మీ వంటి వారిని ధర్మావతారులని పూల పల్లకీ నెక్కించి పూర్వాచార పరాయణులందరూ స్వస్తి వాచకములతో నూరేగింతురు. ఇంద్రుడును సుధర్మపీఠమున సగభాగము ఖాళీ చేయును. వివేకము నశించిన తరువాత, ధనమే దైవమయిన తరువాత ఏది చేసినను, ఏమన్నను భయము లేదు” అంటూ నిష్క్రమించినది.

(మరిన్ని వివరాలు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here