ఉమర్ ఆలీషా గారి ‘ఎక్స్ కాలేజీ గరల్’ నాటకము (1935) ఓ విశ్లేషణ-3

2
13

[కవిశేఖర డా. ఉమర్ ఆలీషా గారి ‘ఎక్స్ కాలేజీ గరల్’ అనే నాటకాన్ని విశ్లేషిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ. ఇది 3వ భాగం.]

[dropcap]ఈ[/dropcap] నాటకములో దీక్షితులు ఒక ముఖ్యమైన పాత్ర. కాసులకు కక్కుర్తిపడి బంగారు బొమ్మలాంటి హేమలతకు రెండో పెళ్లివాడైన వీర్రాజుతో సంబంధం కుదిరించాడు. నిజానికి పెళ్లిచూపులకు వచ్చే సమయంలోనే పెళ్లికొడుకు వేషధారణతో మంగళసూత్రంతో సహా రావటం లోకంలో ఎక్కడా లేనిది. ఎవరూ లేనప్పుడు ఏవో మంత్రాలు చదివి, వీర్రాజు హేమకి తాళి కట్టక ముందే ‘పెళ్లి అయినది’ అని ప్రకటించి, హడావిడిగా అతన్ని బెదరగొట్టి తొందరపెట్టి తీసుకుని వెళ్ళిపోయినాడు. తర్వాత హేమను కాపురానికి పంపవలసినదని రామప్ప పంతులకి చెప్పి ఒప్పించినాడు. కానీ కొన్నాళ్లకు వీర్రాజు దౌర్జన్యం, హేమలత నిర్బంధం, ఆ ఇంటిలో జరుగుతున్న సంఘటనలు గమనించి, ఆమె పట్ల సానుభూతి కలిగింది. వీర్రాజు దాష్టీకం, హేమ నిస్సహాయత చూసి, తను చేసిన దుర్మార్గపు పనికి పశ్చాత్తాపపడ్డాడు. ఆమె హరనాధుని భక్తురాలిగా – నిజానికి అది మోహనడిపై ప్రేమ అని గుర్తించినాడు. అదే సమయంలో మోహనుడు దీక్షితుడ్ని కలియడం, హేమను గురించిన అన్ని వివరాలు చెప్పి, ఆమె ఎలా ఉందో చూడవలెనని ఆతృత పడడంతో మోహనుడికి ఆ అవకాశము కల్పించినాడు. అంతేకాక ‘నీది సరైన పద్ధతి కాదు’ అని మెలమెల్లగా వీర్రాజుకి బోధ చేస్తూ, అతనిలో మార్పు రావడానికి దోహదం చేసి, తను గావించిన పాపానికి కొంత నిష్కృతి చేసుకోగలిగినాడు.

ఒకరోజు మోహనడని తీసుకొని చంద్రశేఖరుని ఇంటికి వెళ్లి అతనికి అన్ని వివరాలు తెలియజేసినాడు. పెళ్లి కాని పెళ్లి, అబద్ధపు పెళ్లి చేసినవాడైనను దానిని సరిదిద్ది అందరిని ప్రశాంతంగా బ్రతికేటట్లు చేసినవాడు దీక్షితులే.

చంద్రశేఖరుడు కలెక్టర్ అయినాడు. తన చెల్లెళ్ల పరిస్థితికి చాలా బాధపడినాడు. భార్య సుందరికి తన ఆవేదనను తెలియజేశాడు. అతని చదువు వల్లనో, జన్మసిద్ధముగా ఏర్పడిన సంస్కారం వల్లనో ఆనాడు సంఘములో అణిచివేతలకు గురి అవుతున్న స్త్రీల పట్ల, అంటరాని వారి పట్ల ఎంతగానో సానుభూతి ఉన్నవాడు.

“శుచిగా నుండరు, అసహ్య భోజనులని, అనాచారులని హరిజనుల నాక్షేపించు చున్నాము. దూరముగా నుంచుచున్నాము. ఆ దోషములు మనలో కూడా కొందరికి లేవా! అయినను మంచి దారి త్రొక్కుట కవకాశము నీయక, అంధకారముననే యనణద్రొక్కుచున్న నే జాతి యైన బాగుపడునా! చూచి నేర్చుకొనుటకు, పాటుబడి పొట్ట పోసుకొనుటకు అవకాశమీయ నక్కరలేదా! అవకాశం ఇచ్చిన గాని దేని సామర్థ్యమైనా బయటపడదు” అన్నది అతని అభిప్రాయం. హరిజనుల పట్ల జాలి గుణము కలిగివుండుటయే కాక తమ యింట పనిచేయు వీరన్నను గౌరవించడం, అతడు పాడే తత్త్వాలను మనసారా మెచ్చుకోవడం ఆతని ఔన్నత్యానికి నిదర్శనం.

స్త్రీల పట్ల, ధర్మబద్ధమైన దాంపత్యము పట్ల అతనికి స్థిరమైన అభిప్రాయములున్నవి.

కనుకనే ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ’ అని వెర్రిగా ప్రవర్తించే సుగుణను గట్టిగా మందలించాడు.

“నీ వలె ప్రవర్తించుట మాత్రం స్వేచ్ఛ కాదు. ఇట్టి స్వేచ్ఛ ఏ దేశమునైనా స్త్రీకి లేదు. స్వేచ్ఛకు కూడా మర్యాద ఉన్నది. కంటికింపైన పురుషునితో నీతిమాలి వర్తించుట వ్యభిచారముగాని స్వేచ్ఛ కాదు. పురుషుడైనను నీతిమాలి స్త్రీతో వ్యవహరించినచో లోకము సహింపదు. ప్రేమ అన్న వ్యభిచారము కాదు. కేవలం కామ ప్రవృత్తియే. ప్రేమయని ఏ దేశమైనా ఏ కాలమున చెప్పి ఉండలేదు. ప్రేమ త్యాగమును కోరును. త్యాగములేని లాలసత్వము ప్రేమ కాదు..” అంటూ కొంచెం దురుసుగానే మాట్లాడి, పెళ్లి కాకుండా రామారావుతో తిరగటం అమర్యాద అని కఠినముగా మాట్లాడి ఆమెలో పశ్చాత్తాపం కలిగేలా చేశాడు.

“ప్రేమ ఆధ్యాత్మికం. అది మృత్యువును కూడా జయించును. నరకమును నందనముగా మార్చును. ఆ ప్రేమకు మార్పు ఉండదు. దాంపత్యం పాత గుడ్డ కాదు మనకు ఇష్టం లేనప్పుడు వదిలిపెట్టుటకు. దాంపత్యం స్త్రీని కేవల దాసిగా చేయుట లేదు. గృహ యజమానురాలుగా, తల్లిగా చేయుచున్నది. స్వార్థ వాసనైనా లేని త్యాగమును నేర్పుచున్నది. దాసి యగుట, యజమానురాలుగుట వారి వారి మనసును బట్టి యున్నది, గాని పెండ్లిని బట్టి లేదు. భర్త దాసుడగుటగాని, భార్య దాసి ఎగుటగాని ఎందులకు! పరస్పర త్యాగముచే పొంగిపొరలు ప్రేమ ప్రవాహమునకు రెండు గట్లుగా నెందులకు గాకూడదు! సతీపతుల దాంపత్యమును ప్రేమ దేవతా పీఠముగా నేల చేయకూడదు! అట్లు చేసినప్పుడే సంపూర్ణ మానవత్వము కలుగును. అధికారం గోరని ఆత్మ త్యాగమే దాంపత్యం. ప్రతిఫలము కోరని సేవయే మాతృత్వం. ఈ రెండును లేని స్త్రీ జీవనము వేరు గాని కొమ్మ గాని లేని మ్రోడు. ధర్మసాధకమగు స్త్రీత్వమును, ఆత్మసాధకమగు విద్యను తెలిసి తెలియని చచ్చు సంప్రదాయములకు బలినొనర్చి వట్టి రాక్షసివైపోవుచున్నావు. ఇప్పటికైనా మించిపోలేదు. పెండ్లి చేసుకుని నీ జీవితమును నీ విద్యను ఆత్మోన్నతికి వినియోగింపుము!” అని సుగుణ తో పలికినాడు.

రామారావు కూడా భార్యకు విడాకులు ఇచ్చి సుగుణాన్ని పెళ్లి చేసుకునేటట్లు చేయగలిగాడు.

“ఈ దేశమున పురుషులకు గావలసినది జీవమున్న యాడుది కాదు. పనికి వచ్చు బానిస. స్వేచ్ఛ విషయములో కూడా మగవానిపై నాధారపడి యుండక తన వ్యక్తిత్వము తాను గాపాడుకొను కాంత భార్య అయినచో సంసార మెంత సుఖప్రదమై యుండును! జీవనం ఎంత ఆనంద దాయకమై యుండును!” అనేది అతడు మనసా కోరుకొనేది. అతని స్వభావానికి అన్ని విధాలా సరియైన అర్ధాంగి లభించడం తన అదృష్టమని భావించేవాడు.

వీర్రాజులో ఆత్మ శోధన ప్రారంభమైనది. ఒకరోజు హేమ తో –

“హేమా! నేటితో నా కష్టములు తీరిపోవచ్చినవి” అన్నాడు.

“మీకేమి కష్టములు” అని ఆమె ఆశ్చర్యపోయినది.

“వెర్రిదానా నిన్ను కష్టపెట్టుటయే నా కష్టము. కొట్టిన చేతికి కూడా దెబ్బ తగులదనుకొనుచున్నావా. తన చేత పట్టుకొని యున్నంతవరకు గోవు మెడలోని బంధము గొల్లవానికి కూడా నిర్బంధమే. ఆ బంధం నేటితో త్తెంచివేయదలచినాను. నీపై నాకు అధికారం ఉన్నదనుకున్నంత వరకు నిన్ను కష్టపెట్టుట నా కష్టముగా నేను భావింపలేనైతిని. అన్యాయం చేయుచున్నానని తలంపు కలిగినప్పటి నుండి నా మనసు మరింత బాధపడుతున్నది.. విధిగాక ఇది మరేమీ చెప్పుము. వయసు గడిచిన వాడను నేను. వయసు వికసించుచున్న నిన్ను కొనితెచ్చుకొనుట నా కష్టములను గొని తెచ్చుకొనుట గాదా! నీకు ఇప్పుడు సత్యము గోచరించినది. ధనము చూపి, యాస పెట్టి గాని స్త్రీ హృదయం అట్టివారికి ప్రేమ లభింపదు. ప్రేమ ప్రవాహమునకు కాలువ త్రవ్వ నెంచువాడు జ్ఞానహేనుడు. గంగా ప్రవాహమునకై భగీరథుడు ఎంత తపస్సు చేసినాడు! ఏతపము చేయని నాకు ప్రేమ ప్రవాహం ఎట్లు లభించును? నీ హృదయము నేటికీ తెలిసినది..

నీకు రుణపడి ఉన్నాను. పొరపాటు సర్దుకొనుటలోనే మానవత్వం ఉన్నది. కొందరు ఎండమావులకై పరుగెత్తి అలసిపోయెదరు. కొందరికి అప్రయత్నంగానే అమృత బాండము లభించును. నీ హృదయ కలశమునకై ఎవడు పెట్టి పుట్టినాడో ఆ అదృష్టవంతుని కడకు నిన్ను చేతులారా నేనే పంపదలచితిని. ఇకనుండి నిన్ను నా బిడ్డగా భావించెదను” అని పలికినాడు.

చంద్రశేఖరుడు మోహనుడు దీక్షితులు కలిసి వీర్రాజు ఇంటికి వచ్చినారు. చెల్లెలిని తీసుకొని పోవుటకు వచ్చినానని చంద్రశేఖరుడు చెప్పినాడు. ఆమెకు తనెంతో అన్యాయం చేసినానని, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆమె ఎవరిని ప్రేమించినదో అతనికి ఇచ్చి పెళ్లి చేసి, వారు ఇరువురిని తన వెంటనే ఉంచుకొన నిశ్చయించుకొనినానని వీర్రాజు పలికినాడు. మోహనడి చేతిని హేమలత చేతిలో నుంచినాడు. అంతలో సుగుణ రామారావుతో కలిసి స్వామి ప్రవేశించినాడు.

భరత వాక్యం ప్రాచీన నాటక లక్షణములలో నాటకాంతమున మంగళ శాసనముగా పలికెదరు. పాశ్చాత్య నాటక ప్రభావంతో మనకు ‘ట్రాజడీలు’ (విషాదాంతములు) వచ్చినవి కానీ పూర్వమున నాటకములు శుభాంతములే. నాటకములోని పాత్రలకు శుభములు పలుకుతూ, లోకంలోని జనులందరికీ సుఖసంతోషములు కలుగవలెనని దైవ ప్రార్థన చేయుట ఆనవాయితీ. ఇక్కడ స్వామి పాత్ర ద్వారా భరత వాక్యము పలికించినారు డా. ఉమర్ ఆలీషా.

“జీవకోటుల కెల్ల స్వస్తి యగుగాక

సమయుగాక సాంఘికదురాచార సమితి

లోకమాతలై సతులు పోల్చుదురు గాక

ఉర్వి హరనాధభక్తి పెంపొందు గాక”

(మరిన్ని వివరాలు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here