ఉమర్ ఆలీషా గారి ‘ఎక్స్ కాలేజీ గరల్’ నాటకము (1935) ఓ విశ్లేషణ-4

0
12

[కవిశేఖర డా. ఉమర్ ఆలీషా గారి ‘ఎక్స్ కాలేజీ గరల్’ అనే నాటకాన్ని విశ్లేషిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ. ఇది 4వ భాగం.]

[dropcap]సాం[/dropcap]ఘిక దురాచారములన్నీ సమసిపోవాలని, స్త్రీలను మాతృమూర్తులుగా గౌరవించాలని, హరనాధుని పై ఎల్లెడలా భక్తి వ్యాప్తి చెందాలని తద్వారా సకల జీవకోటికి శుభము కలుగు గాక అంటూ స్వామి పాత్ర ద్వారా ఈ నాటకాంతములో భరతవాక్యం పలికించారు ఉమర్ ఆలీ షా.

మరి కొన్ని నాటకములు:

‘కావ్యేషు నాటకం రమ్యమ్’ అని, ‘నాటకాంతం హి సాహిత్యమ్’ అని చెప్పబడింది. లలితకళలన్ని సమ్మళితమైన నాటకాన్ని ‘దృశ్య కావ్యం’, ‘సమాహార కళ’ అనడం కూడా సమంజసమే. ప్రాచీన నాటక లక్షణాలతో, గ్రాంధికభాషలో ఉమర్ ఆలీషా మరి కొన్ని పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలను రచించారు.

అనసూయాదేవి:

ఐదంకముల గద్య పద్యాత్మిక పౌరాణిక నాటకమిది. తన అర్ధాంగి కోరికపై 1918లో ‘పాతివ్రత్యమహిమ’ ఇతివృత్తముగా దీనిని రచించారు. ప్రపంచమంతా కీర్తించే భారతదేశంలో అనుసరింపబడుతున్న గృహస్థాశ్రమ ధర్మాలను విపులీకరిస్తూ అనసూయాదేవి వృత్తాంతమును రచించారు.

దానవ వధ:

దీనికే ‘ప్రహ్లాద’ నామాంతరము. హిరణ్యకశిపుని దురాగతాలు, దౌర్జన్యాలు, ప్రహ్లాదుని భక్తి తత్పరత, నరసింహావతారము ఘట్టములతో పద్యగద్యాత్మకంగా రచించిన నాటకము. ముఖ్యంగా హరి, హరుల ఏకత్వమును నిరూపించే ప్రయత్నం చేశారు.

మహాభారత కౌరవ రంగము:

మహాభారతము లోని ఉద్యోగ, భీష్మ పర్వముల లోని కథాంశము ఇందలి ఇతివృత్తము. వీర రస ప్రధానముగా ఏడంకముల పద్య గద్యాత్మక నాటకముగా 1916లో రచించారు. సంజయు రాయబారము, శ్రీకృష్ణ రాయబారము, సంధి ప్రయత్నములు విపులముగా వర్ణించారు. ముఖ్యంగా కర్ణుని వ్యక్తిత్వము, అచంచలమైన ప్రభుభక్తి, దానగుణము, శౌర్య పరాక్రమములకు సంబంధించిన పద్యములు సంభాషణలు చదువుతుంటే ‘డైలాగులకు చప్పట్లు, విడిగా క్యాసెట్లు’తో విజయవంతమైన ఒక తెలుగు చలన చిత్రము గుర్తుకురావడం తథ్యం. అది ఈ నాటకము ప్రభావమే అనుకోవడము సత్యదూరము కాదు.

చంద్రగుప్త:

1910 లో రచించబడిన చారిత్రక నాటకమిది. ప్రాచీన నాటక లక్షణములతో, వీర రస ప్రధానముగా పద్య గద్యాత్మక నాటకముగా రచించారు. మహాపద్మనందుడు, చంద్రగుప్తుడు, చాణక్యుడు పాత్రలతో ‘దేశభక్తి’ ప్రబోధాత్మకముగా రచించారు.

కళ:

పాతివ్రత్య మహిమ ను ప్రకటించే ఐదంకముల పద్య గద్యాత్మక, కాల్పనిక నాటకమిది.

గుణదత్తుడు – జాయ; సోమపాదుడు – కళ పాత్రలతో, దారి తప్పిన భర్తలను ‌‌సన్మార్గము వైపుకు మరలించే సాధ్వీమణుల వృత్తాంతమిది. తన పూర్వీకులు స్ధాపించిన ఆధ్యాత్మిక విజ్ఞాన పీఠము ప్రసక్తి ఇందులో ఉట్టంకించారు.

ఇంకా – తాత్త్విక ప్రవచనాలు విజ్ఞానజ్యోతి 1 & 2, తత్వమార్గము 1,2, &3 పుస్తకాలు గా వచ్చాయి.

సూఫీ వేదాంతాన్ని సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో పద్యాలు రచించారు.

‘తెలుగు సాహిత్యం – ముస్లింల సేవ’ అనే సిద్ధాంత గ్రంథంలో షేక్. మస్తాన్ ఇస్లాం సిద్ధాంతాలతో పాటు స్వాతంత్ర్యం పూర్వం, అనంతరం ముస్లింలు చేసిన సాహిత్య సేవను విశదీకరించారు.

పార్శీ కవి, తత్వవేత్త ఉమర్ ఖయ్యాం రచించిన రుబాయిలు చాలా మంది తెలుగు లోకి అనువదించినా వారందరు ఆంగ్లానువాదాలపై ఆధారపడ్డారు. పైగా రుబాయిలు అన్నిటినీ అనువదించలేదు. కానీ ఉమర్ ఆలీషా ప్రత్యక్షంగా పార్శీ భాష నుండి పూర్తిగా అన్నిటినీ అనువదించారు. తర్వాత కాలంలో వడ్డాది పాపయ్య గారు అందమైన చిత్రాలు గీసారు.

డా. ఎ. రజాహుస్సేన్ ఈనాటి పీఠ నవమ పీఠాధిపతిగా ఉన్న డా. ఉమర్ అలీ షా ను కలిసి వారి గురించి, వారి తాతగారైన (మన) ఉమర్ ఆలీషా గారి గురించి, వారి పూర్వీకుల గురించి వ్యాసాలు రచించారు.

“మొగలాయి చక్రవర్తి బాబరు కాలంలో వీరు మన దేశానికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ పీఠాధిపతులు ఆ చక్రవర్తులతో పాటు చాలా కాలం ఢిల్లీలోనే ఉన్నారు. మొగలాయి చక్రవర్తులకు ఈ పీఠాధిపతులే గురువులుగా ఉండేవారు. పీఠాధిపతి శ్రీ హుస్సేన్షా గురువర్యులు ఔరంగజేబు కుమార్తెకు సూఫీ గురువుగా ఉండేవారట. ఔరంగజేబు తర్వాత ఈ పీఠాధిపతి తానీషా కాలంలో గోల్కొండకు వచ్చారు. తానీషా ఈ పీఠానికి రెండు జాగీర్లు ఇచ్చి ప్రోత్సహించారు. అందులో ఒకటి తుని జాగీరు. రెండు కొట్టాం జాగీరు. కనుక ఈ పీఠం వారు గోల్కొండ ను వదిలి కాకినాడ సమీపంలోని పిఠాపురంలో పీఠం స్థాపించి పిఠాపురాన్ని స్థిరానువాసంగా చేసుకున్నారు..”

దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ గేయాలపై ఉమర్ అలీషా గారి ప్రభావం చాలా ఉందని రజా హుస్సేన్ సోదాహరణంగా వివరించారు.

ఇతివృత్తాన్ని బట్టి రసపోషణ నిర్వహణ, ముఖ్యంగా స్త్రీ పాత్రలను మహోన్నతంగా చిత్రించడం, సందర్భానుసారంగా జాతీయవాద ప్రేరేపితంగా, దేశభక్తి ప్రబోధకంగా రచించారు ఆలీ షా.

ఆయన ఉపయోగించిన జాతీయాలు, పలుకుబడులు, సామెతలు మీదనే ఒక పరిశోధన చేయవచ్చు. పౌరాణిక కథాంశాలలో కూడా విప్లవాత్మక ప్రయోగాలు చేసారు.

వేదాంతాన్ని, తాత్త్వికతను, దేశభక్తి ని, సాంఘిక సంస్కరణలను, స్త్రీ జన అభ్యుదయాన్ని తన రచనల్లో తెలియజేసిన దార్శనికుడు ఆయన (1885 – 1945).

‘బ్రహ్మర్షి’ బిరుదాంకితుడు ‘మహాకవి డా. ఉమర్ ఆలీ షా’ భారతదేశ స్వాతంత్ర్య సమరంలో గాంధీజీని అనుసరించారు. విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణలో పాల్గొన్నారు. మూఢ విశ్వాసాల అజ్ఞానాంధకారంలో మునిగివున్న, అంటరానితనం పెచ్చరిల్లుతున్న, స్త్రీలకు ఏ విధమైన స్వాతంత్రాన్ని ఇవ్వ నిరాకరించే సమాజాన్ని అభ్యుదయ మార్గం వైపుకు మరలించే ప్రయత్నం చేశారు. స్వరాజ్య స్థాపనకు త్యాగం అవసరమని, ధర్మస్థాపనకు స్వరాజ్యం అవసరమని ప్రజల్లో చైతన్యం కలిగించారు. సమాజంలో అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం అంటరానితనాన్ని నిరసిస్తూ విజయవాడలో మహాసభను ఏర్పాటు చేసి ముఖ్య వక్తగా పాల్గొని అంటరానితనం మూలాలను ప్రశ్నించారు. 1934వ సంవత్సరంలో ఉత్తర మద్రాస్ రిజర్వ్ స్థానం నుండి అఖిలభారత శాసనసభ్యులుగా ఎంపికై బ్రిటిష్ ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించారు. 1935 ఏప్రిల్ 5 తేదీన ఉమర్ అలీషా గారి ధర్మపత్ని అక్బర్ బీబీ పరమపదించగా ఆ రోజు ఢిల్లీ శాసనసభ మూసివేయబడింది అంటే వీరి గొప్పదనం ఎలాంటిదో తెలుస్తుంది.

నాటకాలు ఏకాంకికలు ప్రార్థనలు ఖండకావ్యములు తత్త్వ గీతములు సూఫీ వేదాంత గ్రంథాలు నవలలు కథలు అనువాదాలు మరియు ఇలా జుల్బా వైద్య గ్రంథం వంటివి రచనలు చేశారు.

ఆధ్యాత్మికవేత్తగా వీరికి వేలాదిమంది శిష్యులు ఉన్నారు. వీరి నాటకములను ప్రదర్శించుటకు నాటక సమాజం వారు ఎంతో హర్షం వెలిబుచ్చేవారు. వీరి సాహిత్య కృషికి గాను ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించారు. 1936లో కొలంబియా విశ్వవిద్యాలయం డి.లిట్. పట్టా ప్రదానం చేసారు.

బహుముఖీన ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించి, భారతదేశాన్ని ప్రేమించి, గౌరవించి, తన రచనల ద్వారా, ఉపన్యాసాలు, ప్రవచనాల ద్వారా ప్రజల చైతన్యానికి కృషి చేసిన ధన్యులు ‘బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీ షా’

భారతదేశంలోని అన్ని గ్రంథాలయాల్లో అన్వేషించి, చివరకు లండన్ మహా గ్రంథాలయం నుండి తెప్పించిన ‘ఎక్స్ కాలేజీ గరల్’ నాటకము లోని ప్రత్యేకతను తెలుపుటయే ఈ వ్యాస పరమార్థం. నిజానికి ఎన్నో పరిశోధనా గ్రంధాలు రావలసిన ‌సాహిత్య కృషి చేసారు ఆలీ షా. భారతీయ తాత్త్వికతను, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్న మహా పురుషుని, వారి రచనలను స్మరించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారి రచనలన్నింటిని ‌సేకరించి, పునర్ముద్రించి, చర్చా గో‌ష్ఠులు జరిపి నేటి తరానికి అందించే విధంగా వారి మనుమడు నేటి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారు, ట్రస్ట్ సభ్యులు కృషి చేస్తారని ఆశిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here