ఎక్స్‌కర్షన్

0
9

[‘ఎక్స్‌కర్షన్’ అనే పిల్లల కథ అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

[dropcap]“మ[/dropcap]మ్మీ!” అంటూ ప్రణయ్ బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వస్తూనే కాళ్ళకున్న షూస్ అటొకటి ఇంకోటి విసిరేశాడు. సమత పాలగ్లాసుతో ఎదురొచ్చి భుజం మీది బ్యాగును తీసుకుని పక్కన పెట్టింది. పాలగ్లాసు ప్రణయ్ కిచ్చి పక్కనే కూర్చున్నది.

“మమ్మీ వచ్చేవారం ఎక్స్‌కర్షన్‌కు తీసుకెళ్తారట ఇంట్లో చెప్పమన్నారు డైరీలో కూడా రాశారు చూడు.” అంటూ డైరీ ఇచ్చాడు ప్రణయ్. ప్రణయ్ మూడో తరగతి చదువుతున్నాడు. ఏడేళ్ళ వయసు వాడు. ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు సమత, వినయ్‌లు పెద్ద పేరు పొందిన స్కూళ్ళలో రూల్స్, డబ్బులు ఎక్కువ అని చేర్చలేదు. ఇక్కడ చదువు చెప్పటం పరవాలేదు గానీ ఏదో ఒక వంకతో నెలకోసారి డబ్బులు వసూలు చేస్తూనే ఉంటారు.

సమత డైరీ చూసింది. విశాఖపట్నం తీసుకువెళ్తున్నామనీ పిల్లల్ని పంపాలనీ రాసి ఉన్నది విశాఖపట్నం చాలా దూరం. అందులోనూ సముద్రం దగ్గరకు తీసుకువెళ్తారు. పిల్లలు ఒకచోట ఉండరు, ప్రణయ్‌ను పoపద్దులే అని మనసులో అనుకున్నది సనుత.

తెల్లవారి స్కూలుకు వెళుతున్నపుడు ప్రణయ్ అడిగాడు. “ఎక్స్‌కర్షన్‌కు పేరివ్వాలా” అన్నాడు. “వద్దు కన్నా! ఈసారి ఈసారి మనం వెళదాంలే విశాఖపట్నం. నీకు మంచి కారు బొమ్మ కొనిస్తాగా” అన్నది సమత.

“సరే మమ్మీ! కొత్త కారు బొమ్మ కొనుక్కుంటాను” అన్నాడు సంతోషంగా ప్రణయ్. బై చెప్పి స్కూలుకు వెళ్ళిపోయాడు. ఈ విషయం సమత భర్తకు చెప్పింది “ఏమొద్దులే ఖర్చయ్యే దానికన్నా ఎక్కువ డబ్బు వసూలు చేస్తారు.” అన్నాడు వినయ్ విసుగ్గా.

సాయంత్రo ప్రణయ్ ఇంటికి వస్తూనే “మమ్మీ నేను ఎక్స్‌కర్షన్‌కు వెళ్ళాల్సిoదే. ఎవరు రాకపోయినా ఊరుకోరట నేను పేరివ్వకపోతే టీచర్ కొప్పడింది” అని చెప్పాడు. “వద్దులే అనుకున్నాం కదా ప్రణయ్! నీకు కారు కూడా కొనిస్తానన్నాను కదరా!” బుజ్జగింపు ధోరణిలో అన్నది సమత.

“నాకు వెళ్ళలని ఇష్టమేం లేదమ్మా! హాయిగా ఇంట్లో ఉండి కొత్త కారుతో ఆడుకోవచ్చు కూడా కానీ మా టీచర్ ఊరుకోవడం లేదు. రాకపోతే ఎగ్జామ్స్‌లో ఫెయిల్ చేస్తారట కూడా. రేపు పేరిచ్చి డబ్బులు కట్టేయమని చెప్పింది” ప్రణయ్ భయపడుతూ చెప్పాడు.

సమతకు కోపం వచ్చింది ప్రణయ్ క్లాస్ టీచర్‌కు ఫోన్ చేసింది. ఆమె కూడా అలాగే మాట్లాడింది. “ఇది స్కూలు తరపున విహారయాత్ర. మీరు పంపాల్సిందే, బస్సు నిండా జనం రాకపోతే బస్సు వాడు ఎక్కువ డబ్బులు అడుగుతాడు. పిల్లలతో ఒక టీచర్ కూడా వస్తున్నాడు. ఒక ఆయమ్మ కూడా వస్తుంది. ఈ విహారయాత్రకు పంపకపోతే అటెండెన్స్ ఇవ్వ” అంటూ బెదిరింపు ధోరణిలో అన్నది ఆమెతో మాట్లాడి ఉపయోగం లేదనిపించింది సమతకు.

సాయంత్రం భర్త ఇంటికి వచ్చాక ఈ విషయముతా వివరించింది సమత. వినయ్‌కు కోపం వచ్చింది. “పిల్లవాణ్ణి పంపటం మనిష్టమా! వాళ్ళిష్టమా! రేపొద్దున అక్కడేమన్నా జరిగితే ఎవరు బాధ్యులు. ప్రతి నెల ఏదో ఒకటి చెప్పి డబ్బులు దోచుకుంటూనే ఉంటారు. వాళ్ళు చెప్పగానే పంపించటానికి డబ్బులు ఉoడవద్దా! అసలే నెలాఖరు రోజులు ఇంత డబ్బులు కట్టమంటే ఎక్కడ్నుంచి తేవాలి” అన్నాడు వినయ్ కస్సుబుస్సులాడుతూ!

సమత ఆలోచిస్తూ ఉన్నది. ఇంతలో ప్రణయ్ కూడా వచ్చేశాడు వస్తూనే ఏడుపు మొదులు పెట్టాడు! “మా టీచర్ ఈరోజు నన్ను బాగా తిట్టింది. క్లాసులో అందరికీ ఖచ్చితంగా ఎక్స్‌కర్షన్‌కు రావాల్సిందేనని చెప్పింది బస్సులో తినటానికి కారప్పూసలు, లడ్డూలు తెచ్చుకోమని కూడా చెప్పింది. అక్కడకు రాకపోతే పరిక్షలో మార్కులు తగ్గిస్తానని చెప్పింది” అంటూ ప్రణయ్ ఏడుపు గొంతుతో చెప్పాడు. ప్రణయ్‌కు అప్పటికేదో సర్దిచెప్పి ఊరుకోబెట్టింది సమత.

ఇదేమిటీ వీళ్ళ బలవంతం. ప్రణయ్ చిన్నవాడు ఒక చోట కుదురుగా ఉండడు. జనంలో తప్పిపోతే ఏం చేస్తారు. అరవై మంది పిల్లలకు ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉంటే ఎలా చూసుకుంటారు. ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగితే ఏం చేయాలి. అసలిదంతా పిల్లల మీద ప్రేమనా! డబ్బు మీద ప్రేమనా! సమత ఆలోచిస్తూ ఆలోచిస్తూ విసిగిపోయింది. ఆ మరునాడు స్కూలుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నది.

మర్నాడు ఇంట్లో వేరే పని ఉండటంతో స్కూలుకు వెళ్ళలేకపోయింది. సాయంత్రం ప్రణయ్ చాలా హుషారుగా వచ్చాడు. “అమ్మా! ఎక్స్‌కర్షన్లో చాలా బాగుంటుందట. అక్కడ జూపార్కుకు కూడా తీసుకెళ్తారట. ఐస్ క్రీములు కొనిస్తారట. జైంట్ వీల్ కూడా ఎక్కిస్తారట నేను వెళ్తాను అమ్మా” అంటూ ప్రణయ్ స్కూల్లో చెప్పిన విశేషాలన్నీ సంతోషంగా చెప్పసాగాడు.

“వద్దులే కన్నా! నీకు అక్కడ స్నానం ఎవరు చేయిస్తారు? అన్నo కలిపి ముద్దలెవరు పెడతారు? ఐస్ క్రీములు నేనిక్కడే కొనిస్తానులే. మనూరికి ఎగ్జిబిషన్ వచ్చినపుడు జైంట్ వీల్ కూడా ఎక్కిస్తాను. నీ కోసం ఈ రోజు గులాబ్ జామ్ చేశాను. పెడతాను ఉండు” అంటూ ప్రణయ్ ముద్దు చేస్తూ వంటింట్లో నుంచి గులాబ్ జామ్ తెచ్చిచ్చింది సమత

‘హై గులాబ్ జామ్ చేశావా అమ్మా’ అని సంతోషంగా గబగబా తింటున్నాడు. తింటూ తింటూ ప్రణయ్ “అమ్మా సముద్రం దగ్గరకు తీసుకెళ్తారట. బాగా సరదాగా ఊటుందట. నేనింత వరకూ చూడలేదు కదమ్మా” అంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు.

చిన్నపిల్లల్ని సముద్రం దగ్గరకు తీసుకెళ్ళడం ఏమిటి జరగరానిది జరిగితే ఏం చేసారు. కొద్దిగా వయసు ఎక్కువుంటే కొంచెమైనా జాగ్రతగా ఉoటారు. మరీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ప్రణయ్‌కు నచ్చచెప్పాలని చూసినా కూడా లాభం లేకుండా పోతున్నది. స్కూల్లో పిల్లల్చి రెచ్చగొట్టి పంపిస్తున్నారు. రేపు ఖచ్చితంగా స్కూలుకు వెళ్ళాలి అనుకున్నది.

వినయ్ ఆఫీసు నుంచి వస్తూనే “సమతా నీకో విషయం చెప్తా” అంటూ పిలిచాడు. “మొన్న వుడ్ స్కూలు వాళ్ళు ఇలాగే వైజాగ్ పిల్లల్ని తీసుకెళ్లారట. అక్కడ ఒక పిల్లవాడు సముద్రంలో జారి పడిపోయాడట. ఉదయం స్కూలు దగ్గర పిల్లల తల్లిదండ్రులు గొడవ పెడుతున్నారు. పాపం ఒకటో తరగతి పిల్లాడట. నీళ్ళలో నుంచి బయటకు తీసేసరికే ప్రాణం పోయిందట” అంటూ ఆవేదనతో చేప్తున్నాడు వినయ్. సమత ఈ మాటలు వింటూనే కన్నీళ్ళు పెట్టేసింది.

“ఎందుకండీ వీళ్ళు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బయట ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. బోర్ బావులు, రోడ్డు ప్రమాదాలు, మ్యాన్ హోల్స్, నీళ్ళ కుంటలు వంటివైనా ప్రాణాలు తీసున్నాయి. తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకుంటారు?” సమత బాధగా అన్నది.

“రేపు స్కూలు కెళ్ళి మాట్లాడిరా. స్కూళ్ళలో ఇలా పిల్లల్చి బెదిరించవద్దు అని గట్టిగా చెప్పు. లేదoటే సూలు మార్చేద్దాం” అన్నాడు వినయ్.

సమత స్కూల్లో ప్రిన్సిపాల్ రూమ్‌లో కూర్చుని ఉంది సమత చెప్తున్నది వింటూన్నట్లు అనిపించినా ఆమె ధోరణిలో మార్పులేదు. “పిల్లల్ని బెదిరించకపోతే తల్లిదండ్రులు ఎక్స్‌కర్షన్‌కు ఎందుకు పంపిస్తారు అందుకే అలా చెప్పాము” అని సమర్థించుకుంటున్నదే గానీ అందులో తప్పు ఆమెకి అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదు అనటం కరెక్ట్ కాదు అర్థం కానట్లు నటిస్తున్నది అంతే.

సమతకు విషయం అర్థమయింది ఈ మనుషులు, ఈ స్కూళ్లు మారరు. నేనే ఈ స్కూలు నుంచి పిల్లవాడిని మార్చటం కరెక్ట్. వేరే స్కూలులో వేయాలని నిర్ణయించుకున్నది. అర్థం చేసుకోని మూర్ఖులతో ఎంత వాదించినా వృథా అనిపించి వెనుదిరిగి వెళ్ళిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here