కాజాల్లాంటి బాజాలు-28: F2 కి ముందు F2 తర్వాత

0
11

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]పె[/dropcap]ద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళకి ఇదివరకటి రోజుల్లోలాగా ఈ మధ్య పెళ్ళిచూపులకంటూ అబ్బాయి తరఫువారు ఓ పదిమంది వరకూ అమ్మాయింటికి వెళ్ళడం తగ్గిపోయిందనే చెప్పాలి. మహా అయితే తల్లీ, తండ్రి, అక్కో, చెల్లెలో వరకే వెడుతున్నారు. అక్కడే అమ్మాయీ, అబ్బాయీ విడిగా ఒకరి అభిప్రాయాలు ఇంకోళ్ళు తెలుసుకుంటున్నారు. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఆ తర్వాత అబ్బాయీ, అమ్మాయీ బైట ఏ హోటల్లోనో కలుసుకుని ఇంకొన్ని వివరాలు కనుక్కుంటున్నారు.

ఎంత చెప్పినా ఒక మాట మనం ఒప్పుకోక తప్పదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎంచక్కా చదువుకుని, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చక్కటి వ్యక్తిత్వంతో వాళ్ళకి జీవితంలో ఏం కావాలో తెలుసుకుని సమకూర్చుకుంటున్నారు. పెళ్ళి విషయంలో కూడా వాళ్ళు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు అమ్మానాన్నల ఆప్యాయతలో మునిగి వాళ్ళకి వాళ్ళు సరయిన న్యాయం చేసుకోవటంలేదేమో ననిపిస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లల తల్లులపాత్ర ఇందులో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది నేను చెప్పిన మాట కాదు. కొన్ని మేరేజ్ బ్యూరోలు నడిపేవారూ, మేరేజ్ కౌన్సిలింగ్ చేసేవారూ ఈమధ్య చెప్పేమాటే. ఈ కాన్సెప్ట్‌నే ఈమధ్య F2 సినిమాలో కాస్త అతిశయోక్తిగా చూపించేరు. ఆ అతిశయోక్తికి ప్రేక్షకులు నవ్వులు కురిపించేరు.

కానీ మొన్నీమధ్య మా వదిన చెప్పిన ఉదంతం వింటుంటే ఆ సినిమా ప్రభావం జనాల్లోకి ఎంతగా వెళ్ళిపోయిందో అనిపించింది.

మా వదిన ఏం చెప్పిందంటే….

“స్వర్ణా, రోజులు మారుతున్నాయనీ, మారుతాయనీ తెలుసు. ఇదివరకు లేనిది ఏదైనా కొత్తగా జరిగినట్టు కనిపిస్తే కొన్నాళ్ళు దాన్ని గురించి విడ్డూరంగా చెప్పుకోవడం, కాలక్రమేణా దాన్ని ఆనవాయితీగా అనుకోవడం మామూలే. అలాంటి విడ్డూరమే ఒకటి చెప్తాను విను.

మొన్నామధ్య మా పెద్దమ్మ కొడుక్కి పెళ్ళి చెయ్యాలని చూస్తున్నారని చెప్పేను కదా. ఇవాళ ఆ పెద్దమ్మ వచ్చి కొడుకు పెళ్ళి కోసం జాతకాలు చూపించుకోవాలని నాకు తెలిసిన సిధ్ధాంతిగారి దగ్గరికి తీసికెళ్ళమంది. సరేనని తీసికెళ్ళేను. అక్కడ మా పెద్దమ్మ రెండు జాతకాల కాగితాలు ఆయన చేతిలో పెట్టి చూసి చెప్పమంది. ఆయన ఆ కాగితాలు చూసి నిర్ఘాంతపోయేరు. అవి అటు తిప్పీ ఇటు తిప్పీ ఇంకా పక్కన ఏమైనా ఉన్నాయేమోనని వాటిని దులిపి చూసేరు. ఏవీ కనపడక ‘అమ్మా, మీరు అమ్మాయి జాతకం ఇవ్వలేదమ్మా. పొరపాటున ఇంకేదో జాతకం కాగితం పట్టుకొచ్చేసి ఉంటారు.’ అన్నారు.

అప్పుడు మా పెద్దమ్మ ‘లేదండీ శాస్త్రిగారూ, ఈ రెండు జాతకాలు చూసే మీరు సరిపోయేయో లేదో చూసి చెప్పవలసింది.’ అంది.

సిధ్ధాంతిగారు ఆశ్చర్యపోతూ ‘అదికాదమ్మా, అబ్బాయి వయసుకు దాదాపు రెట్టింపు వయసుంది ఈ అమ్మాయి జాతకానికి’ అంటున్న ఆయనతో

‘అవునండీ, ఉంటుంది మరి. ఆ జాతకం పెళ్ళికూతురు తల్లిది.’ అంది పెద్దమ్మ. నేనూ, సిధ్ధాంతిగారూ కూడా తెల్లబోయేం.

మా మొహాలు చూసి పెద్దమ్మ పెద్ద నిట్టూర్పు విడుస్తూ, ‘ఏం చెప్పమంటారండీ. రోజులలా ఉన్నాయి మరి. మా అమ్మాయి పెళ్ళి చేసి పదేళ్ళైంది. అప్పుడు మగపిల్లల తల్లితండ్రులదే పైచేయిగా ఉండేది. అందుకని మా అమ్మాయికి, వాళ్ళ అత్తగారికీ తారాబలం కుదిరిందో లేదో సిధ్ధాంతిగారి దగ్గర చూపించి మరీ పెళ్ళి చేసేం. అందుకే అత్తింటి ఆరళ్ళు లేకుండా పిల్ల సుఖంగాఉంది.

ఇప్పుడు రోజులు మారిపోయేయి. ఆడపిల్లల తల్లితండ్రులదే పైమాట అయిపోయింది. చుట్టుపక్కలవారిని చూస్తుంటే మగపిల్లాడి పెళ్ళి చెయ్యాలంటే భయమేస్తోంది. అందుకే పిల్ల తల్లికీ, మా అబ్బాయికీ గొడవలు రావంటేనే ముందుకెడతాం. అందుకే ఆవిడ జాతకం తెచ్చేను’ అంది మా పెద్దమ్మ.

చూసేవా స్వర్ణా. సినిమా చూసి నవ్వుకున్నాం కానీ ఆ సినిమా ప్రభావం ఇంతమంది మీద ఇలా ఉందని తెలీలేదు.”

అని చెప్పిన వదిన మాటలకి నిజమే కదా అనిపించింది.

(ఒకప్పుడు అంటే ఆడపిల్లలు కోడంట్రికం పడుతున్నప్పుడు అమ్మాయి సుఖంగా ఉండాలంటే పెళ్ళికొడుకూ, పెళ్ళికూతుళ్ళ జాతకాల పొంతన కాకుండా అత్తాకోడళ్ళ జాతకాలు కుదరాలీ అని జోక్స్ వేసుకునేవాళ్ళం. కానీ ఈ F2 సినిమా చూసిన తర్వాత అబ్బాయి సుఖంగా ఉండాలంటే అత్తా అల్లుళ్ళ జాతకాలు కుదిరేయో లేదో చూసుకోవాలోమో.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here