ఒకరితో ఒకరుగా అల్లుకున్న ఆనంద విషాదాల కలయికే కుటుంబం అని చెప్పిన నవల FAMILY LIFE

0
10

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]కు[/dropcap]టుంబంలో ఒక వ్యక్తి శాశ్వతంగా మంచానికి పరిమితమయినప్పుడు అతన్ని ప్రేమించేవారు, ఆ వ్యక్తితో జీవితం ముడిపడి ఉన్నవారి జీవితాలపై కూడా ఈ సంఘటన చాలా ప్రభావం చూపిస్తుంది. మంచంలో ఉన్న వ్యక్తిని చూసుకోవడానికి కుటుంబం అంతా చాలా విషయాలను కోల్పోవలసి ఉంటుంది. భాద్యతలను తీర్చుకున్న పెద్దవారు ఈ స్థితిలో ఉంటి వారి పట్ల భాద్యత మాత్రమే ఉంటుంది కుటుంబానికి. అటువంటి బాధ్యతను స్వీకరించేవారు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయారు అన్నది వేరే సంగతి. కాని అలా మంచానికి పరిమితమయిన స్థితిలో ఆ ఇంటి బిడ్డ ఉండిపోతే ఆ ఇంటివారందరి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. మధ్య తరగతి జీవితాలు ఎంత కాదనుకున్నా ఒకరిపై ఒకరుగా ఆధారపడే ఉంటాయి. అప్పుడు ఆ ఇళ్ళలో జరిగే ఇలాంటి విషాద సంఘటనలు వారందరి భవిష్యత్తునే మార్చివేస్తాయి. వారి చుట్టూ ఉన్న మానవ సంబంధాలు మారిపోతాయి. ఇతర కుటుంబాలకు అర్థం కాని ఒంటరితనం, వేదన వారి వెన్నంటే ఉంటుంది. అటువంటి ఒక కుటుంబం కధే ఈ Family Life.

ఈ నవలను రాసింది అఖిల్ శర్మ. ఇతను భారతదేశంలో పుట్టి అమెరికా లో స్థిరపడిన వ్యక్తి. ఈ నవలకు ఫోలియో ప్రైజ్, ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డు లభించాయి. చాలా సరళమైన భాషలో రాసిన ఈ నవల రచయిత రెండవ రచన. దీన్ని రాయడానికి వీరు చాలా సమయం తీసుకున్నారట. కారణం ఇది వీరి కుటుంబ కథ అంటే రచయిత ఆత్మకథ. తమ కుటుంబం అనుభవించిన వేదనకు అక్షరరూపం ఇవ్వడం అంత సులువైన పని కాదు మరి.

అఖిల్ తండ్రి కుటుంబ భవిష్యత్తు కోసం అమెరికా వెళ్ళి ఉద్యోగం సంపాదించి, గ్రీన్ కార్డ్ వచ్చాక తన ఇద్దరు పిల్లలను భార్యను అమెరికాకు రప్పించుకుంటాడు. ఎమర్జెన్సీ టైమ్‌లో మన దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి అక్కడ ఉండడం తమకు క్షేమం కాదనే నిర్ణయానికి ఆ కుటుంబం వస్తుంది. అజయ్ బిర్జు అన్న దమ్ములు. అజయ్ చిన్నవాడు. మనకు ఈ నవలలో కథ అంతా అజయ్ చెబుతూ ఉంటాడు. బిర్జూ మొదటి నుండి చదువులో చాలా తెలివైనవాడు. చురుకైన కుర్రాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందని కుటుంబం అంతా నమ్ముతుంది. అమెరికా వచ్చాక మొదట ఒక మామూలు స్కూలులో చేరినా దేశంలోనే ఒక పెద్ద స్కూల్‌లో చేరడానికి ఎంట్రెన్స్ రాస్తాడు బిర్జు. అతనికి సీటు వచ్చినప్పుడు తల్లి తండ్రులు ఇద్దరూ కూడా చాలా సంతోషిస్తారు. అక్కడి భారతీయ కుటుంబాల మధ్య బిర్జు ఒక హీరో అయిపోతాడు. చాలా మంది వీరితో పరిచయం పెంచుకోవడం తమ అదృష్టం అన్నట్లు ప్రవర్తిస్తారు. బిర్జు తల్లి కూడా అక్కడి పరిస్థితులకు అలవాటు పడుతుంది. భారతదేశంలో ఉన్నప్పుడు ఒక స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమె అమెరికాలో స్టోర్‌లో పని చేయడానికి తనను తాను తయారు చేసుకుంటూ ఉంటుంది. భార్యా భర్తలిద్దరూ సంపాదిస్తే కుటుంబం చక్కగా బ్రతకవచ్చని నిర్ణయించుకుంటారు.

స్కూల్‌లో చేరడానికి సమయం ఉందని బిర్జు ఈత కొలనులో ప్రాక్టీసు చేస్తూ ఉంటాడు. అక్కడే అతనికి ఒక ఆక్సిడెంట్ అవుతుంది. పై నుండి డైవ్ చేస్తున్నప్పుడు అదుపు తప్పి అతని తల నేలను గుద్దుకుని  ఒక మూడు నిముషాలు ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండిపోతాడు బిర్జు. ఆ మూడు నిముషాలే అతని జీవితాన్ని మార్చేస్తాయి. అతను శాశ్వతంగా బ్రెయిన్ డేడ్ అవుతాడు. ఇక ఎప్పటికీ మంచానికే పరిమితమవుతాడు అతను. ఆ విషాదం కుటుంబాన్ని కుదిపేస్తుంది. అప్పుడు అజయ్ వయసు ఎనిమిది సంవత్సరాలు. బిర్జు పదిహేనేళ్ళ వాడు. ముందు హస్పిటల్‌లో చేర్చిన తరువాత ఇన్సురెన్సు లేని కారణంగా అతన్ని నర్సింగ్ హోమ్‌కు తరలిస్తారు. అక్కడి నుండి ఇంటికి చేరతాడు బిర్జు.

కళ్ళు తెరుచుకుని ఉన్నా అతను ఎవరినీ గుర్తుపట్టలేడు. మంచంపై అతన్ని చూసుకోవలసిన బాధ్యత తల్లిది అవుతుంది. ఆమె ఉద్యోగం చేసే పయత్నాలు మానుకుంటుంది. చెట్టంత కొడుకుని ఆ స్థితిలో చూసి తండ్రి విలవిలలాడిపోతాడు. అతను ఆ బాధలను మర్చిపోవడానికి తాగుడికి అలవాటు పడతాడు. జీవితంపై ఇద్దరికీ ఆశ చచ్చిపోతుంది. ఏ మంత్రాలతో బిడ్డ మామూలు స్థితికి వస్తాడో అని తల్లి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అజయ్‌కి క్రమంగా తల్లి దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది. అతను చదువులో ముందుకు వెళుతున్నా ఆ ఆనందాన్ని ఆస్వాదించే స్థితిలో ఇంట్లో తల్లి తండ్రులిద్దరూ ఉందరు. మంచంపై పడి ఉన్న బిడ్డపై తన ప్రేమ అంతా కురిపిస్తూ ఆ బిడ్డ సేవకే తన జీవితాని అంకితం చేసే ఆ తల్లి మరో బిడ్డకు మానసికంగా దూరం అవుతున్నానని అర్థం చేసుకోలేకపోతుంది. తండ్రి తాగుబోతుగా మారి ఆర్థిక సమస్యలతో సమాజంలో అతని వ్యసనం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు.

ఇక ఇన్సురెన్స్ కంపెనీలతో ఆ కుటుంబం పెద్ద యుద్ధమే చేస్తుంది. అన్నను అలా మంచం మీద చూస్తున్న ప్రతి సారి అజయ్ ఒక గిల్ట్‌తో బాధపడుతూ ఉంటాడు. ఒక సాధారణ విద్యార్ధి అయిన తానేం చేస్తే ఆరోగ్యంగా ఉన్నాను, అసాధారణమైన తెలివి తేటలున్న అన్న అలా మంచానికి అంటుకుని పోయి ఉండడం వెనుక కారణం ఏంటీ అని నిరంతరం బాధపడుతూ తన జీవితంలోని ఆనందకరమైన సంఘటనలను కూడా ఆస్వాదించలేని స్థితిలో ఉంటాడు. ఇక చుట్టూ పక్కల వారి వ్యవహారం చాలా నాటకీయంగా ఉంటుంది. అజయ్ తల్లిని ఒక మహా ఇల్లాలుగా చూస్తూ వారి పిల్లలను తీసుకుని వచ్చి మంచంపై ఉన్న బిర్జూని చూపించి తల్లి తండ్రులు ఎంత త్యాగం పిల్లల కోసం చేస్తారో చూడమని చెప్తారు. మ్యూజియం సందర్శించడానికి వెళ్తున్నట్ళు వచ్చే ఆ పరిచయస్తుల తాకిడి కూడా కొన్ని సార్లు కష్టం అనిపిస్తుంది. కాని వారిపట్ల పరుషంగా మాట్లాడితే తమ ఇంటికి ఎవరూ రారేమో అనే చింత కారణంగా మౌనంగా ఉండిపోతారు వాళ్ళు. చివరకు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుని అజయ్ తన భవిష్యత్తు వైపుకి నడిచి వెళ్ళిపోతాడు. కాని అన్నను దాటుకుని వెళ్ళిపోయానన్న భావం అతన్ని ఎప్పటికీ వదలదు.

బుర్జూ స్థితి వలన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆనందానికి దూరం అవుతారు. ఇది అనుభవిస్తే కాని అర్థం కాని బాధ. నిత్యం వెంటాడే వేదనతో జీవించడం ఎంత కష్టమో జీవితం ఎలా అతలాకుతలం అవుతుందో చాలా సెన్సిటివ్‌గా చెప్పిన నవల ఇది. రచయిత ఎక్కడా బాలెన్స్ తప్పకుండా తమ కుటుంబ వేదనను మనతో పంచుకోవడానికి చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. ఇటువంటి స్థితిలో ఉన్న కుటుంబాలలో పైకి కనిపించని ఒంటరితనాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఆ  కుటుంబంలో ప్రతి ఒక్కరు జీవితాన్ని చూసే విధానంలో చాలా మార్పు వస్తుంది. అందుకే అజయ్ కూడా ఎవరితో కలవలేని ఒంటరి జీవిగానే మిగిలిపోతాడు. చాలా సంవత్సరాల తరువాత కాని తాను ఇతరులలా ఎందుకు ఉండలేకపోతున్నడన్న సంగతి అతనికే అర్థం కాదు. సున్నితమైన విషయాన్ని అంతే సున్నితంగా తమ అనుభవాల సారం ఆధారంగా రచయిత వ్యక్తీకరించిన విధానం చాలా బావుంటుంది.

సహజంగా లభించే ఎన్నో ఆనందాల విలువ తెలీయకుండా జీవిస్తున్న మనకు ఇలాంటి కుటుంబ కథలు, కుటుంబ దుఖాలు జీవితాన్ని మరో కోణంలోంచి చూడడం నేర్పుతాయి. కల్పన నుండి కన్నా జీవితం నుండి ఉద్భవించిన రచనల స్థాయి ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది. ఆ స్థాయిలో వచ్చిన  రచనే ఈ FAMILY LIFE.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here