ఫేర్‌వెల్ గిఫ్ట్

0
9

[dropcap]ఒ[/dropcap]క ప్రఖ్యాత కంపెనీలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి, అదే చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన వివేక్, తన ముందు అదే బాధ్యత నిర్వర్తించిన కుమారి అపురూప వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నాడు.

“మన కంపెనీ చాలా దురదృష్టవంతమైనది. అక్షరాలా ఏడు జన్మలు తలకిందులుగా తపస్సు చేస్తే గాని దొరకని ఇలాంటి ‘అపురూప’మైన ఆఫీసర్‌ని కోల్పోతోంది కాబట్టి. నేను కూడా అదృష్టహీనుణ్ణే!

ఆవిడ అడుగుజాడల్లో నడవాల్సింది పోయి, ఆవిడ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చోబోతున్నాను కాబట్టి. కానీ మేడమ్ ఎక్కడికి వెళ్తే అక్కడ లాభాలే లాభాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతాయి. ఆవిడకి నా శుభాకాంక్షలు”, అని ముగించాడు.

తరువాత సిఈఓ మాట్లాడుతూ అపురూపకి శుభాభినందనలు చెప్పి, కంపెనీ తరఫున అందరి సమక్షంలోనూ ఆమెకు ఒక ఫేర్‌వెల్ గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని ముభావంగా స్వీకరించి, “అందరికీ నమస్కారం. సన్మాన సభ, సంతాప సభ, ఫేర్‌వెల్ మీటింగ్ – ఈ మూడింటికీ ఒక సారూప్యత ఉంది.

వాటిని ఎవరి గౌరవార్థం ఏర్పాటు చేశారో, వారిని అందరూ తెగ మెచ్చుకుంటారు. లేని మంచితనం, మంచి లక్షణాలు వాళ్ళ మీద ఆపాదిస్తారు. మన కంపెనీని డెబ్భైయవ దశకంలో స్థాపించారు. నేను ఇక్కడ పని చేసిన మొత్తం సమయం పదహారేళ్ళు.

నేను చేరే ముందూ మన కంపెనీ లాభాల్లో నడిచింది, భవిష్యత్తులో కూడా నడుస్తుంది. అందుకని తపస్సులు గట్రా చేయనక్కర లేదు. ఈ కొద్ది కాలమూ ఈ కంపెనీలో పని చేసే అవకాశం దొరకడం నా అదృష్టం.

వివేక్ గారు నష్టాల్లో ఉండే కంపెనీలను సైతం అతి తక్కువ సమయంలో లాభాలలోకి తెచ్చారు. ఇంక మన కంపెనీ లాభాలు ఆకాశాన్ని అంటాల్సిందే! ఆయనకి నా శుభాకాంక్షలు. సిఈఓ గారికి ఒక చిన్న విన్నపం. నేను ఇక్కడకి ఉత్తి చేతులతో వచ్చాను, అలాగే వెళ్తాను.

ఎవరి మనసులో అయినా ఇంత చోటు సంపాదించుకుంటే అదే చాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. అందుకని, ఈ ఫేర్‌వెల్ గిఫ్ట్‌ని వెల్‌కమ్ గిఫ్ట్‌గా వివేక్ గారికి శుభాభినందనలతో అందజేస్తున్నాను”, అంటూ సిఈఓ ఈ విషయాన్ని అవగాహన చేసుకునే లోపలే అయోమయంగా చూస్తున్న వివేక్‌కి ఇచ్చేసింది.

ఈ వింత చూసి కొందరు ఉద్యోగస్థులు ఆశ్చర్యంతో మొహామొహాలు చూసుకున్నారు. మీటింగ్ ముగిశాక కొందరు ఉద్యోగులు ఆమెతో మాట్లాడుతూ ఉండగా, ఆమెకు మళ్ళీ విషెస్ చెప్పి, సిఈఓ ఛాంబర్ లోకి వెళ్లారు సిఈఓ, వివేక్. కాస్సేపు వ్యాపార విషయాలు మాట్లాడుకున్నాక, వివేక్, “ఇదేమిటి, ఈవిడ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది?” అన్నాడు.

“అదే కదా నాకూ ఆశ్చర్యం వేసింది”, అంటూ సిఈఓ, “ఆవిడకి చాలా పాపులారిటీ ఉందని విన్నాను. ఇన్‌ఫాక్ట్, నిన్ను ఆవిడ పోస్ట్‌లో తేవడానికి చాలా వ్యతిరేకత ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అనూహ్యంగా అన్నీ సజావుగా సాగిపోయాయి.

అందరూ ఆవిడ గురించి మాట్లాడాలని ఎగబడతారని అనుకున్నా! ఆశ్చర్యం- అలాంటిదేదీ జరుగలేదు! అంటే ఇక్కడి ఉద్యోగులు, ఏ ఎండకా గొడుగు పట్టే రకాలన్న మాట! ఎనీవే, ‘ఆలీస్ వెల్ దట్ ఎండ్స్ వెల్’”, అని నవ్వేశాడు సిఈఓ.

“ఇంత బరువుగా ఉంది, ఆ గిఫ్ట్ ఏమయ్యుంటుందో! మీతో చనువు కొద్దీ అడుగుతున్నా, మరోలా అనుకోకండి”, కుతూహలాన్ని చంపుకోలేక అడిగేశాడు వివేక్. “ఆవిడంటే నాకస్సలు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా!

ఆపరేషన్స్ లాంటి ‘మ్యాన్లీ’ పనుల్లో ఈ ఆడ లేడీసుకి పనేమిటి చెప్పు? అందుకే, ఆఫీసు వాళ్ళని ఎప్పటి లాగే వీడ్కోలు చెప్పే ఎంప్లాయీ స్థాయికి తగ్గ గిఫ్ట్ కొనమని పురమాయించాను!” అన్నాడు సిఈఓ.

***

గిఫ్ట్‌తో ఇంటికి వచ్చిన భర్తకి నీళ్లందిస్తూ, “ఏమిటీ, జాయిన్ అయిన రోజే ‘బై బై’ అని సాగనంపారా?” అని జోక్ చేసింది హిమజ. ఎందుకో తెలియదు గాని, ‘గుమ్మడికాయల దొంగ’ లాంటి అనుభూతి కలిగింది వివేక్‌కి. చుట్టుపక్కల పిల్లలు లేరు కదా అని చూసి, “హిమూ డార్లింగ్, ఏమిటా తప్పుడు మాటలు, శుభమా అని కొత్త పోస్ట్‌లో, అందులోనూ పె.. ద్ద పోస్ట్‌లో చేరితే?” అని, కూసింత కటువుగానే అన్నాడు వివేక్.

ఆమె పేపర్ నైఫ్ తెచ్చి ఇచ్చింది. పాకేజ్ తెరవగానే బోలెడంత బబుల్ రాప్ వచ్చింది. అంటే, లోపల ఏదో సున్నితమైన వస్తువు ఉండి ఉంటుందన్న మాట! పొరలు పొరలుగా ఉన్న బబుల్ రాప్ తీసి చూస్తే, ఉత్తమమైన నాణ్యత ఉన్న స్ఫటికతో చేయబడిన ఒక అందమైన బాతు దర్శనమిచ్చింది. పాకెట్‌లో మరో బాతు కూడా ఉంది.

రెంటినీ పక్కన పెట్టి, చూసి, తెగ మురిసిపోయింది హిమజ. వాటిని డ్రాయింగ్ రూమ్‌లో పెట్టడానికి కార్నర్ టీపాయ్ వద్దకు తీసుకుని వెళ్ళింది. వాటి కింద అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్, స్వారోవ్‌స్కీ, వారి వారంటీ కార్డు కూడా ఉంది. “వారంటీ కార్డ్ లోపల పెట్టవోయ్”, అన్నాడు వివేక్. “ఓకే, వివ్”, అని దాన్ని అందుకుని, లోపలికి వెళ్ళిపోయింది హిమజ.

ఇంకా ఏమైనా ఉందేమో అని చెక్ చేసిన వివేక్ చేతులకి కొంత గరుకుదనం తగిలింది. ఆ వారంటీ కార్డ్ అంత సైజ్ లోనే ఉన్న మంచి క్వాలిటి హ్యాండ్ మేడ్ పేపర్ కార్డ్స్ అవి. ‘విష్ రాస్తే మడిచి పెట్టాలి కదా’, అని ఆలోచిస్తూ ఆ కార్డులని బయటకి తీశాడు.

“మేడమ్, మీకు పొగడ్తలు ఇష్టం లేదని తెలుసు. కానీ మా మనసులోని భావాలని మేము ఈ కార్డుల రూపంలో పంచుకుంటున్నాం, దయచేసి చదవండి”, అని మొదటి కార్డులో ఉంది. ‘ఏమిటో ఆ గొప్ప మనోభావాలు’, అని వెటకారంగా గొణిగి, మిగిలినవి ఒకక్కటిగా చదవసాగాడు వివేక్..

***

భోజనాల వేళ, “ఆ బాతులు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా, వివ్?” అని హిమజ మురిసిపోయింది. అన్నాన్ని కెలుకుతున్న వివేక్‌కి, తాను గిఫ్ట్‌తో ఇంటికి వచ్చినప్పుడు భార్య అన్న మాట గుర్తు వచ్చి, ఆమెకేసి కోపంగా చూసి, “నీది నోరా, డ్రైనేజా?” అనే సినిమా డైలాగ్ కొట్టాడు. “ఛీ, అన్నం తింటూ ఆ పాడు మాటలేమిటి, వివ్?” అంది హిమజ, విషయం అర్థం కాక. విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు వివేక్.

***

ఓ వారం రోజుల తరువాత.. పనిలో బిజీగా ఉన్న అపురూప, ఫోన్ మోగేసరికి ఆశ్చర్యపోయింది. వృత్తి ధర్మం ప్రకారం జవాబిచ్చింది. అవతలి వ్యక్తి, “మేడమ్, నన్ను మీ శిష్యుడిగా చేసుకోండి, ప్లీజ్”, అని వేడుకోలుగా అన్నాడు. ఆమె నివ్వెరపోయింది.

అతను, “కాస్త ఓపికగా వినండి మేడమ్. అందరి లాగే నేనూ ఆపరేషన్స్ అంటే మగవారికే సాధ్యమనుకునే అహంకారిని. ఒక ప్రఖ్యాత కంపెనీలో మీరు ఆ స్థానంలో ఉండేసరికి నా కడుపు మండింది. నిజమే.. మిమ్మల్ని నేనే రిప్లేస్ చేయడం నాకు గర్వ కారణమయ్యింది. ఇవన్నీ ఆ రోజు వరకూ..

మీకు ఒక పెద్ద శిష్యగణం ఉంది. వాళ్ళ వల్ల అనుకోకుండా పరోక్షంగా మీ వ్యక్తిత్వం, నాయకత్వం, ఔన్నత్యాల గురించి తెలుసుకున్నాను. అవి లేని నాకు అంత ఉన్నత స్థానాన్ని అలంకరించే స్థాయి లేదని అర్థమయ్యింది. ఆ రోజు పెదవి చివరి మాటైతే అన్నాను గాని, అది అక్షరాలా నిజం – మిమ్మల్ని, మీ స్థాయిని అందుకోవడానికి ఏడు జన్మల తపస్సు అవసరం.

అందుకని, మీ శిష్యుణ్ణి అయ్యి, మీ మంచి లక్షణాలన్నీ ఇముడ్చుకుని, మీ కుర్చీలో కూర్చొనే అర్హత సంపాదిస్తాను. మేడమ్, నా మాటని మాన్నిస్తారు కదూ!” అని ముగించాడు వివేక్.

“అంటే, వాళ్ళు ఇన్నాళ్లుగా.. పనిచేయకుండా.. మీతో ఈ కబుర్లు.. తప్పు కదూ!” ఆశ్చర్యపోతూ అంది అపురూప. “నో, నో, మేడమ్, అలాంటిదేమీ లేదు. మీరు నాకిచ్చిన ఫేర్‌వెల్ గిఫ్ట్‌లో చాలామంది తమ మనోభావాలను పంచుకున్నారు. వాటి వల్ల మీ గొప్పదనం, నా పనికిమాలినతనం – రెండూ అర్థమయ్యాయి.

త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు నా చేతులతో మీకు ఆ కార్డులు ఇస్తాను. థాంక్స్ టు ద ఫేర్‌వెల్ గిఫ్ట్, నా కళ్ళు తెరుచుకున్నాయి. ఉంటాను మేడమ్”, అని సెలవు తీసుకున్నాడు వివేక్.

***

మళ్ళీ ఆ కార్డ్‌లు చదవడం మొదలుపెట్టాడు వివేక్. ఇంతకీ, ఆ కార్డ్స్‌లో ఏముందంటే..

‘ఇదేం ట్రెండు మేడమ్? సిఈఓ మారిపోతే సిఓఓ కూడా మారిపోవాలా? మీ పనిలో పిసరంత కూడా తప్పు పట్టడానికి ఉండదు కదా! మరి, మిమ్మల్ని వేరే ఉద్యోగం వెతుక్కోమంటే ఎందుకొప్పుకున్నారు?’ అని ఒకరు బాధ పడ్డారు.

‘మీ సీట్‌లోకి రాబోయే దుష్టద్యుమ్నుడు పైరవీలు చేసి వస్తున్నాడు. మన సిఈఓని పటాయించాడట! అలాంటి వాడు వృత్తి ధర్మాన్ని మరచిపోయి, కింద వాళ్ళందరూ కాకా పట్టాలని ఆశిస్తాడు కదా!’ అని మరొకరు నెత్తి బాదుకున్నారు. ‘అరే, వీడికి నా విషయం ఎలా తెలిసిపోయింది?’ అని మొదటి సారి చదివినప్పుడే మనసులో బాధ పడ్డాడు వివేక్. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టుంది!

‘నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ, అని వెనుకటికి ఒక కవి అన్నారు కదండీ. నలుగురి పొట్టలు కొట్టి పైకొచ్చినవాడు, తాను తీసుకున్న గోతిలో తానే పడే సమయం రాకపోదు’ అని ఇంకొకరు దూషించారు.

అప్పుడు ఇంక వివేక్‌కి కడుపులో దేవినట్టయ్యింది. అధికారులకి, కార్మికులకి జీతాలలో విపరీతమైన తేడా ఉండే ప్రైవేటు కంపెనీలో లాభాలు రావాలంటే, పై అధికారులు కొంచెం జీతం తగ్గించుకోమని సలహా ఇవ్వకుండా, స్టాఫ్‌కాస్ట్ తగ్గించాలి అని ఆపరేషన్స్ అన్నీ కంప్యూటరైజ్ చేసి పడేసేవాడు తను. దాన్ని వీళ్ళు ఈ విధంగా అర్థం చేసుకున్నారా, అని మథన పడసాగాడు.

మళ్ళీ చదవడం మొదలు పెట్టాడు. ‘మేమిక్కడ ఉండిపోయామని, దాని వల్ల మేము ప్లేటు ఫిరాయించామని అనుకోకండి మేడమ్, మేము చెయ్యగలిగే ఉద్యోగం మీ వద్ద ఉంటే కాకితో కబురు చేయండి, రెక్కలు కట్టుకు వాలిపోతాం’, అని కొందరు విజ్ఞప్తి చేసుకున్నారు.

‘మేడమ్, కుర్చీ అంటే హోదా అనుకుంటున్నట్టున్నాడు ఆ అల్పుడు; అదే బాధ్యత, నాయకత్వం అని ఆ మనిషికేం తెలుసు? మీరు వచ్చిన కొత్తల్లో ఒకసారి ఎవరో చేసిన తప్పు వల్ల ఆపరేషన్స్ జామ్ అయిపోయాయి గుర్తుందాండీ? అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు దానికి బాధ్యులైన వాళ్ళని ఉద్యోగం నుండి తీసేయమని అన్నారు కదా!

‘మీరు అప్పుడు బాధ్యత మీదేనని చెప్పి, మిమ్మల్ని పదవిలోంచి తీసేయమన్నారు! మెచ్చుకోలు మాకిచ్చి, మా తప్పులు మీ నెత్తిన వేసుకునే మీ బోటి ఆఫీసర్ న భూతో న భవిష్యతి మేడమ్! మీకు నా శుభాకాంక్షలు! మీ కుర్చీలో కూర్చోబోయే వాడికి ఈ అర్హత లేదని కూపీ, లాగితే తెలిసింది’, గుండెల్లోని అగ్ని పర్వతం బద్దలుకొట్టారు మరొకరు.

‘మేడమ్, మీ కుర్చీ మీద ఆయన కూర్చొంటే, ‘కనకపు సింహాసనంబుపై..’ అనే సామెత నిజమవుతుంది’, అని ఒక అభిమాని తన అభిమానాన్ని వెలిబుచ్చాడు.

ఇంక ఆ కార్డులు చదవడం ఆపేశాడు వివేక్. తనెపుడూ అన్నీ తానే సాధించినట్టు తన టీమ్‌ని కొంచెం కూడా మెచ్చుకునేవాడు కాదు. అదే ఏదైనా తప్పు జరిగితే మాత్రం, ఎవరో ఒకరిని బకరాని చేసేవాడు.

తన జీవితం తన ముందు సాక్షాత్కరించి, తనని ఇలా వెక్కిరిస్తుందని వివేక్ ఊహించలేదు. అదే అతనిలో ఇంత మార్పు తెస్తుందని కూడా!

ఏమైతేనేం, ఇప్పుడు మేడమ్‌ని కలిసే రోజు ఎప్పుడొస్తుందా, అని ఆలోచించాడు వివేక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here